తెలంగాణ: '10 నెలలుగా మాకు జీతాల్లేవ్, నాన్న వికలాంగ పెన్షనే మాకు దిక్కు’ అంటున్న ఉత్తమ ఉద్యోగి.. వీఆర్‌వో వ్యవస్థ రద్దు తర్వాత వారి పరిస్థితి ఇదీ

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘నాకు పది నెలలుగా జీతం రావడం లేదు. మా నాన్నకు వస్తున్న వికలాంగ పెన్షనే మాకు దిక్కు. ఒక్కోసారి ఛార్జీల కోసం నాన్నను డబ్బులు అడగాల్సి వస్తోంది. ఆయన్ను చూసుకోవాల్సిన వయసులో, ఆయన దగ్గర డబ్బులు తీసుకోవాల్సి రావడం ఎంతో బాధగా ఉంటోంది’’ అని వాపోయారు మట్టా వెంకటమ్మ.
వెంకటమ్మ గతంలో విలేజ్ రెవెన్యూ అధికారి(వీఆర్వో)గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేశారు.
రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది.
ఉద్యోగుల సర్దుబాటులో భాగంగా, భద్రాద్రి కొత్తగూడెం ఐటీడీఏకు అనుబంధంగా ఉన్న గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ వరి కొనుగోలు కేంద్రంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఆమెకు నిరుడు పోస్టింగ్ వచ్చింది.
అక్కడ చేరిన తర్వాత, నవంబర్ నుంచి జీతం రాలేదని వెంకటమ్మ బీబీసీతో చెప్పారు.
‘‘మొత్తం 16 మందికి కొత్తగూడెం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్‌లో పోస్టింగ్ దక్కింది. మరో ఇద్దరికి ఏటూరు నాగారం ఐటీడీఏ పోస్టింగ్ వచ్చింది. గతంలో వీఆర్వోగా పనిచేసినప్పుడు ఉన్న బెనిఫిట్స్ ఇప్పుడు కోల్పోయాం. పీఎఫ్, జీవిత బీమా, పింఛను, కారుణ్య నియామకాలు.. ఇలా ఏ ప్రయోజనమూ లేదు.
2022 ఆగస్టులో కొత్త పోస్టుల్లో చేరాం. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు మాత్రమే జీతం ఇచ్చారు. అది కూడా ఈ ఏడాది మార్చిలో పే-అడ్వాన్స్ కింద చెల్లించారు.
మాలో 9 మందికి పది నెలల జీతాలు రావాలి. మిగిలిన వారికి ఆరు నెలలు, ఎనిమిది నెలల జీతాలు బాకీ ఉన్నాయి’’ అని ఆమె చెప్పారు.
వెంకటమ్మ 2006, 2012, 2016 సంవత్సరాల్లో సహా ఐదు సార్లు ఉత్తమ ఉద్యోగినిగా జిల్లా అధికారుల నుంచి అవార్డులు, నగదు ప్రోత్సాహాకాలు అందుకున్నారు.

ఎందుకీ పరిస్థితి?
తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు చేస్తూ 2020లో ప్రభుత్వం ‘‘ది తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్స్ బిల్-2020’’ తీసుకువచ్చింది.
అలాగే ‘‘ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ది పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్లు-2020’’కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ బిల్లులకు 2020 సెప్టెంబరు 9న తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
అప్పటి నుంచి గ్రామస్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ (వీఆర్వో) వ్యవస్థ రద్దయింది.
ఇది జరిగిన రెండేళ్ల తర్వాత 2022 జులై 27న వీఆర్వోలను 37 ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తూ జీవో నం.121ను ప్రభుత్వం విడుదల చేసింది.
మొత్తం 5,138 మంది వీఆర్వోలను వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ హోదాలో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.
అనుబంధ శాఖల్లో సర్దుబాటు
దాదాపు 1,500 మందిని ప్రభుత్వ విభాగాల్లో కాకుండా అనుబంధ సంస్థల్లో సర్దుబాటు చేసింది ప్రభుత్వం.
సొసైటీలు, కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో వారికి పోస్టింగులు ఇచ్చారు.
అక్కడ ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు రావు. సొసైటీల్లో వారు విక్రయించే ఉత్పత్తుల ద్వారా లాభాలు వస్తేనే జీతాలు చెల్లించే వీలుంటుంది.
అలా పోస్టింగులు వచ్చిన వారంతా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వీఆర్వోగా ఉన్నప్పుడు కొన్ని ప్రయోజనాలు ఉండేవి. జీవిత బీమా, పింఛను, హెచ్ఆర్ఏ, పీఎఫ్ వంటి ప్రయోజనాలను కోల్పోయారు.
‘‘మా వద్ద ఒక ఉద్యోగి చనిపోయారు. అతని స్థానంలో కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదు. గతంలో వీఆర్వో అనేది జిల్లా పరిధిలోని పోస్టు. ఇప్పుడు రాష్ట్ర క్యాడర్‌లో కలిపారు. దీనివల్ల బదిలీల విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది’’ అని వెంకటమ్మ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, KCR/FACEBOOK
కేసీఆర్ ఏం చెప్పారు?
వీఆర్వో వ్యవస్థ రద్దు సమయంలో 2020 సెప్టెంబరు 7న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో మాట్లాడారు.
‘‘వీఆర్వోలకు ఆప్షన్లు ఇవ్వడంతోపాటు కౌన్సిలింగ్ ద్వారా వేరే డిపార్టుమెంట్లలోకి సర్దుబాటు చేస్తాం’’ అని కేసీఆర్ చెప్పారు.
నిరుడు సర్దుబాటు చేసే సమయంలో ఆప్షన్లు, కౌన్సిలింగ్ లేకుండా లాటరీ పద్ధతిలో ప్రభుత్వం పోస్టింగులు కేటాయించింది.
ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ది పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్లు-2020 సబ్ సెక్షన్ 4(1) ప్రకారం, వీఆర్వోలకు ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు ఇవ్వాలి.
కానీ, ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే సొసైటీలు, కార్పొరేషన్లు, స్వతంత్ర వ్యవస్థల్లో పోస్టింగులు కేటాయించారు.
ఈ విషయంపై ఖమ్మం జిల్లాకు చెందిన పూర్వ వీఆర్వో రాజవర్ధన్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘గతంలో వీఆర్వోలుగా ఉన్నప్పుడు 010 పద్దు, ఐఎఫ్ఎంఎస్ కింద వేతనాలు ఇచ్చేవారు. సొసైటీలు, కార్పొరేషన్లలో అలా ఇవ్వడం లేదు.
కార్పొరేషన్లలో సర్దుబాటు చేసినప్పుడు వారికి జీతాలు రెండు విధాలుగా వస్తుంటాయి. ప్రభుత్వం నుంచి 60 శాతం, కార్పొరేషన్ లేదా సొసైటీ నుంచి 40 శాతం వస్తుంటుంది. సొసైటీలలో ఉత్పత్తులు అమ్మి వచ్చిన లాభాల్లోంచే జీతాలు తీసుకునే వీలుంది. ఉత్పత్తులు అమ్ముడు కాకపోతే జీతాలకు కష్టమవుతోంది.
వీఆర్వోగా పనిచేసినప్పుడు రెవెన్యూ శాఖ తరఫున జీతాలు వచ్చేవి. ఇప్పుడు జీతాలకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి’’ అని ఆయన చెప్పారు.

సర్వీసు విషయంలోనూ వివాదం
సర్వీసు కొనసాగింపు విషయంలోనూ ఇబ్బందులు పడుతున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పూర్వ వీఆర్వో రామ్ కుమార్ బీబీసీకి చెప్పారు.
‘‘రీడిప్లాయిమెంట్ తర్వాత మా సర్వీస్ పరిగణనలోకి తీసుకోవడం లేదు. వీఆర్వోలుగా 2012, 2014, 2019 నోటిఫకేషన్లలో భర్తీ చేశారు.
కొత్తగా వెళ్లిన డిపార్టుమెంట్లలో సీనియార్టీ కోల్పోతున్నాం. మమ్మల్ని సర్దుబాటు చేసినప్పుడు సర్వీసును కూడా కొనసాగిస్తామని చెప్పారు. కానీ, ఇప్పుడు సర్వీసు కొనసాగించే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు’’ అని రామ్ కుమార్ చెప్పారు.
ఈ విషయంపై ఇప్పటికే ఉన్నత విద్య, వైద్యారోగ్య శాఖలో వివాదం నెలకొంది. ఈ రెండు శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విషయంలో తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని పూర్వ వీఆర్వోలు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే ఎన్నో ఏళ్లుగా అదే డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్న మాకు ఇబ్బంది అవుతుందని అక్కడి వారు చెబుతున్నారు.
తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని పూర్వ వీఆర్వోలు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. దీనిపై న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని పూర్వ వీఆర్వోలు చెబుతున్నారు.
పూర్వ వీఆర్వోల సమస్యలపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది. ఈ కథనం పబ్లిష్ చేసే సమయానికి అక్కడి నుంచి స్పందన రాలేదు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ ‘మిస్సింగ్’ మహిళ మిస్టరీ: మతం మార్చుకుని, రెండో పెళ్లి చేసుకొని గోవాలో జీవనం.. ఐదేళ్ల తర్వాత ఎలా గుర్తించారు?
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- టాలీవుడ్ డ్రగ్స్ కేసు: నటుడు నవదీప్ పరారీలో ఉన్నారా... ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














