మహిళా రిజర్వేషన్ : 'ఒక స్త్రీ ఎదుగుతుంటే ఏ పురుషుడూ సహించడు'

మహిళా రిజర్వేషన్ బిల్లు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

మహిళా రిజర్వేషన్ల చట్టం. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ మాటే వినిపిస్తోంది. ఈ బిల్లు వల్ల మహిళలకు కొత్తగా ఒనగూరే ప్రయోజనాలేంటనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో, రిజర్వేషన్ల వల్ల ఇప్పటివరకూ మహిళాభివృద్ధి దిశగా ఏం జరిగిందనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

రిజర్వేషన్లు ఉపయోగించుకుని మహిళలు రాజకీయాల్లో ముందడుగు వేయగలరా? అనే సందేహాలూ ఉన్నాయి.

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ కోటాలో జెడ్పీటీసీ అయిన మహిళతో బీబీసీ మాట్లాడింది.

మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలాంటి మార్పులు రావొచ్చని ఆశిస్తున్నారు? అందుకు ఈ బిల్లు ఎలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు? వంటి అంశాలపై తిరుపతి జిల్లా పాకాల మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికైన పద్మావతి అలియాస్ పద్మజా రెడ్డి బీబీసీతో మాట్లాడారు.

పోటీ లేకుండా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె, పురుషాధిక్య రాజకీయాల్లో ఎలా రాణిస్తున్నారో చెప్పారు.

''నేను బీసీ కులానికి చెందిన మహిళను. 1993లో ప్రేమ వివాహం చేసుకున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పాకాల మండలం పంటపల్లెకు చెందిన పురుషోత్తం రెడ్డి(బాబు రెడ్డి)ని వివాహం చేసుకున్నా. కర్నూల్లో చదువుకుంటున్నప్పుడు అయిన పరిచయం మా పెళ్లికి దారితీసింది.

నేను అత్తింటికి రాగానే నాపేరు పద్మావతి కాస్త పద్మజారెడ్డిగా మార్చారు. నా భర్తది రాజకీయ కుటుంబం. నేను 2006లో ఎంపీటీసీగా ఎన్నికయ్యాను'' అని పద్మావతి చెప్పారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు

మహిళా రిజర్వేషన్‌తోనే ఈ స్థాయికి..

''మాది ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం. నా స్టడీస్ అంతా అక్కడే జరిగాయి. ఇంటర్మీడియెట్ వరకూ ధర్మవరంలో, డిగ్రీ, అనంతపూర్‌, పీజీ కర్నూల్‌లో చేశాను. మొదటి నుంచీ నాకు రాజకీయాలు అంటే ఆసక్తి. కాలేజీ రోజుల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేసి కాలేజీ చైర్మన్‌గా గెలిచాను'' అని పద్మావతి తెలిపారు.

మహిళా రిజర్వేషన్ వల్లనే ఈరోజు ఈ గౌరవప్రదమైన జెడ్పీటీసీ స్థానంలో కూర్చోగలిగానని ఆమె చెప్పారు.

''పార్టీకి పనిచేసిన వాళ్లం మేము ఇంతమంది ఉండగా మహిళకే ఎందుకు ఇవ్వాలి అని పురుషులు పోటీ పడుతుంటారు. పురుషాధిపత్యం ఉన్న దేశంలో ఉంటున్న మనం నిజానికి లింగ వివక్ష ఎదుర్కొంటున్నాం.

ఇంతమంది పోటీదారుల మధ్య మహిళకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మహిళలకే ఇస్తారు. మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ వాళ్లు విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది'' అని పద్మావతి అన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు

'ఇంటి నుంచే మొదలవ్వొచ్చు..'

మూడు దశాబ్దాల నుంచీ మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ ఉంటే ఇప్పటికి ఆమోదించారు. దీనిపై ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 2019లోనే వైసీపీ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఆ రిజర్వేషన్ల వల్లే నాకు జడ్పీటీసీ స్థానం లభించింది. కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్‌లో మాత్రం ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చింది.

ఇది పురుషాధిక్య సమాజం అనేది బహిరంగ రహస్యం. ఒక మహిళ ఎదుగుతుంది అంటే ఏ పురుషుడూ సహించడు. అది ఆమె ఇంటి నుంచే మొదలవ్వొచ్చు. సమాజంలో కావొచ్చు. వేరే ఎక్కడైనా కావొచ్చు.

మేము ఇంతమంది ఉన్నప్పుడు, ఒక మహిళకు ఎందుకు ఇస్తారు? అనే దిశగా పురుషులు ప్రశ్నిస్తే మహిళలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సవాళ్లు తట్టుకోని నిలబడగాలంటే ఈ రిజర్వేషన్లు మాకు ఒక హక్కులా, ఒక ఆయుధంలా పనిచేస్తాయి.

మహిళలకు కచ్చితంగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. ఎందుకంటే, ఒక కుటుంబం బాగుండాలంటే తన పిల్లలు, భర్త సరైన మార్గంలో వెళ్లాలంటే మహిళ పాత్ర చాలా కీలకం అనేది అందరికి తెలిసిన విషయం.

కుటుంబం తరహాలోనే సామాజికంగా కూడా బ్యాలెన్స్ చేసి మహిళ పరిపాలన అందించగలదని నేను గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ వల్ల 33 శాతం రిజర్వేషన్లు వస్తే, ప్రతి ముగ్గురిలో ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉంటారు. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన అంశం. మహిళలందరూ గర్వించదగినది.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ప్రజాప్రతినిధి అయితే మహిళలకు మేలు

నేను ఇప్పుడు సాధారణ గృహిణిగా ఉంటే నాకు అవకాశాలు రాకపోవచ్చు. కానీ, నేను ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రయోజనం అందించాలన్నా చేయొచ్చు.

ఉదాహరణకు , పాలగుట్టపల్లి మండలంలో ఒక పేద గ్రామం ఉంది. ఎలాంటి అభివృద్ధి లేని చోట 9 మంది మహిళలు బట్టలతో సంచులు తయారు చేస్తున్నారు. వారు ఉపాధి పొందడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వాటిని అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తున్నారు.

నేను వారి గురించి జెడ్పీ సమావేశంలో ప్రస్తావించి, వారిని కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వారిని ప్రోత్సహించాను.

మహిళలు రాజకీయాల్లోకి రావడానికి మొదట ఇంటి నుంచే ప్రోత్సాహం రావాలి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు వస్తే, రాజకీయాల్లో వారికి మరిన్ని అవకాశాలు వస్తాయి. అలా మరింత మంది మహిళలు రాజకీయల్లోకి రాగలరని, ఎంతోమంది మహిళల సమస్యలు దూరం చేయగలరని నేను భావిస్తున్నాను. అందుకే మొదట ఆయా మహిళల కుటుంబాల్లోనే మార్పు రావాలి.

ఆడదానివి నువ్వేం చేయగలవు, గడప దాటకు అనే అడ్డంకులు ఉండకూడదు. మొదట అలాంటి అడ్డంకులు అధిగమించినపుడే, మహిళ ధైర్యంగా ముందడుగు వేయగలదు. నా భర్త విషయానికే వస్తే, ఆయన ఎందులోనూ కల్పించుకోరు. నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. ఎక్కడా ఆధిపత్యం చూపించరు.

చాలా మంది మహిళా ప్రజా ప్రతినిధుల విషయంలో వాళ్ల భర్తలు జోక్యం చేసుకోవడం చూశాను. అలాంటివి లేనప్పుడే మనం పురుషాధిక్యత లేని సమాజం చూడచ్చు.

మహిళా రిజర్వేషన్ బిల్లు

పాలనలో పారదర్శకత..

గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు మహిళల్లో అక్షరాస్యత శాతం చాలా పెరిగింది. ఇలాంటి సమయంలో మహిళకు అధికారం అప్పగిస్తే, వారికి వేరే వ్యాపకాలూ ఉండవు కాబట్టి, తన ఇల్లు చూసుకోవడం, తన అధికారాన్ని ఉపయోగించి మంచి చేయడమే జరుగుతుంది. అలా అవినీతికి అవకాశం ఉండదు.

మహిళ సౌమ్యంగా అన్నీ చక్కబెట్టగలదు. అందరినీ కలుపుకుని పోగలదు. కాబట్టి, చక్కటి పరిపాలన కూడా అందించగలుగుతుంది. వార్డు మెంబర్ నుంచి సర్పంచుల వరకూ చూసినా మహిళా ప్రజా ప్రతినిధుల వల్ల ఇప్పుడు సమాజానికి ఎక్కువ మేలు జరుగుతోంది.

మహిళ రాజకీయాల్లో ఉంటే ఎక్కువగా సేవ చేయగలరు. అలా ఈ రిజర్వేషన్లు ఇప్పుడు మహిళలకు మరిన్ని రాజకీయ అవకాశాలు అందిస్తాయి.

మా పాకాల మండలాన్ని తుడా పరిధిలో కలిపారు. 30 ఏళ్ల నుంచీ ఉన్న బస్టాండ్ సమస్యను తుడా నిధులతోనే పరిష్కరించాం. ఫ్లోరింగ్ సరిగా లేక వృద్ధులు, పిల్లలు జారి పడేవారు. ఆ సమస్యను కూడా పరిష్కరించాను. నా రాజకీయ జీవితంలో ఆత్మ సంతృప్తి కలిగించిన పని ఆ బస్టాండును బాగు చేయడమే.

నేను క్రమం తప్పకుండా వారం వారం ఆస్పత్రులు, అంగన్‌వాడీ సెంటర్లు, స్కూళ్లు తనిఖీ చేస్తుంటాను. మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతుంతో చూస్తుంటాను.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఎలాంటి సమస్యలతో మహిళలు వస్తారంటే..

మా ప్రాంతంలో బాల్య వివాహాల సమస్య ఉంది. వడ్డేపల్లి పంచాయతీలో చెంచులక్ష్మి కాలనీ అని ఉంది. అక్కడ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని మాకు ఫిర్యాదులు వచ్చాయి. అక్కడకు వెళ్లి మేం ఎంతోమంది బాలికలకు కౌన్సెలింగ్ చేసి పెళ్లిళ్లు చాలా ఆపగలిగాం.

ఎవరైనా బాల్య వివాహాల గురించి మాకు సమాచారం ఇస్తే వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి వాటిని ఆపి తగిన చర్యలు తీసుకుంటాం. ఒంటరి మహిళలకు సాయం చేయడం, వారి భర్తలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఆ కుటుంబాలను కలపడం చేస్తుంటాం. కుదరకపోతే వివిధ పథకాల ద్వారా వారికి ఆర్థిక ప్రయోజనం అందించడానికి ప్రయత్నిస్తుంటాం.

నా దగ్గరికి వచ్చే మహిళలంతా వాళ్ల వ్యక్తిగత సమస్యలు కూడా నా నోటీసుకి తీసుకొస్తారు. నేను అంత చనువు కూడా ఇస్తాను. ఎలాంటి సమస్యలైనా నా దగ్గర నిస్సంకోచంగా చెప్పుకుంటారు.

ఒక్కోసారి లైంగిక వేధింపులకు గురైన మహిళలు పురుష ప్రజాప్రతినిది దగ్గరకు వెళ్లి తమకు ఏం జరిగిందో చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ బాధలు ఒక మహిళే అర్థం చేసుకోగలదు.

ఎవరికైనా అలాంటివి జరిగితే వచ్చి నాతో చెప్పుకుంటారు. ఉద్యోగపరంగా, వేరే ఏ విధంగా అయినా లైంగిక వేధింపులకు గురైతే వారు సులభంగా నా దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు

మహిళా ప్రజాప్రతినిధుల దగ్గరికే ఎందుకు?

మహిళా ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఉంటేనే మహిళల సమస్యలు చెప్పుకోగలమని పాకాల మండలానికి చెందిన మహిళలు అంటున్నారు. ''ఇప్పుడొచ్చిన జెడ్పీటీసీ మేడం ఒక మహిళ కాబట్టి మాకు ఏ సమస్య వచ్చినా మేడంతో ఈజీగా చెప్పుకోగలం'' అని పాకాల మండలానికి చెందిన చంద్రకళ చెప్పారు.

‘‘మా సమస్య చెబితే కాల్ చేయడం, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఒక లేడీ లేడీస్‌తో మాట్లాడడం ఈజీ. అదే జెంట్స్‌తో మాట్లాడడం అనేది వేరుగా ఉంటుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేడంతో డిస్కస్ చేస్తాం.

లేడీస్ అయితే వాళ్ల సమస్యలు తెలుస్తాయి కాబట్టి ఎక్కువ మంది మహిళలు అధికారంలోకి రావాలని కోరుకుంటాం. మహిళ ఇంట్లో సమస్యలే కాకుండా, బయట సమస్యలు కూడా తొందరగా పరిష్కరించగలుగుతారు. కాబట్టి రాజకీయాల్లోకి మహిళలు రావాలని కోరుకుంటున్నాం’’ అని చంద్రకళ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)