ఏఐతో టీనేజ్ అమ్మాయిల నగ్న చిత్రాలను తయారుచేసి, సోషల్ మీడియాలో పెట్టారు.. షాక్ అయిన పట్టణ ప్రజలు

బాధిత బాలిక తల్లి మరియా బ్లాంకో రేయో
ఫొటో క్యాప్షన్, బాధిత బాలిక తల్లి మరియా బ్లాంకో రేయో
    • రచయిత, గయ్ హెడ్జెకో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ స్పెయిన్‌లో ఓ చిన్న పట్టణంలో కొంత మంది యువతులు, బాలికల నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన ఈ ఫోటోలను చూసి పట్టణం అంతా షాక్ తింది.

తాము డ్రస్ వేసుకుని తీయించుకున్న ఫోటోలను ఇలా మార్చారని అమ్మాయిలు చెబుతున్నారు. ఆ ఫోటోల్లో చాలా వరకూ వారు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ప్రొఫైల్‌గా పెట్టుకున్నవే.

ప్రొఫైల్ పిక్చర్స్ తీసుకుని ఓ యాప్ ద్వారా ఫోటోల్లోని యువతులు బట్టలు లేకుండా ఉంటే ఎలా ఉంటారో ఊహించి అలాంటి చిత్రాలను తయారు చేశారు.

అల్మెండ్రలోజో పట్టణం దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పటి వరకు 11 నుంచి 17 ఏళ్ల వయసున్న 20 మంది బాలికలు, యువతుల ఫోటోలను నగ్నంగా మార్చినట్లు తేలింది.

AI

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, Artificail intelligence

“ ఒక రోజు మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత” అమ్మా, నేను నగ్నంగా ఉన్న ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయని తనతో చెప్పినట్లు” 14 ఏళ్ల బాలిక తల్లి మరియా బ్లాంకో రాయో చెప్పారు.

“నువ్వు బట్టలు లేకుండా అలాంటి ఫోటోలు తీసుకున్నావా” అని నేను మా అమ్మాయిని అడిగాను. దానికామె “లేదమ్మా, ఇలాంటి ఫేక్ ఫోటోలు ఇంకా చాలా సృష్టించారు. మా క్లాసులో చాలా మంది అమ్మాయిల ఫోటోలు కూడా ఇలాగే సర్క్యులేట్ అవుతున్నాయి” అని చెప్పింది.

పట్టణంలోని 28 మంది బాలికల తల్లిదండ్రులు ఓ గ్రూపుగా ఏర్పడ్డారు.

స్పెయిన్ పోలీసులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఈ కేసులో విచారణ ప్రారంభించిన స్పెయిన్ పోలీసుులు

తప్పు మీది కాదు

నగ్న చిత్రాలను సృష్టించి, వాటిని వాట్సాప్, టెలిగ్రామ్‌లో సర్క్యులేట్ చేస్తున్న 11 మంది అనుమానిత యువకుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

నగ్నంగా ఉన్న ఫోటోలు చూపించి ఓ యువతిని బెదిరించారన్న ఫిర్యాదుపైనా దర్యాప్తు చేస్తున్నారు.

తమ ఫోటోలు నగ్నంగా ఆన్‌లైన్‌లో కనిపించడం చూసిన యువతుల్లో కొంత మంది షాక్ తిన్నారు. తన కుమార్తె ఈ వ్యవహారాన్ని ధైర్యంగా ఎదుర్కొంటోందని బ్లాంకో రేయో చెప్పారు. అయితే కొంతమంది మాత్రం ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు.

అల్మెండ్రాలెజో 30 వేల మంది జనాభాతో ఉన్న అందమైన పట్టణం. ఈ పట్టణంలో ఆలివ్, రెడ్ వైన్ ఉత్పత్తి ఎక్కువ. దేశంలో పెద్దగా ఎవరూ పట్టించుకోని ఈ పట్టణం ఇప్పుడు జాతీయ స్థాయిలో పతాక శీర్షికల్లో నిలిచింది.

అది కూడా ఓ బాలిక తల్లి మిరియం అల్ అడిబ్ చేస్తున్న పోరాటం వల్ల. గైనకాలజిస్టుగా పని చేస్తున్న ఆమె సోషల్ మీడియాలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్నారు. యువతుల నగ్న చిత్రాల వ్యవహారాన్ని ఆమె స్పెయిన్ ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చారు.

డాక్టర్ మిరియం అల్ అడిబ్
ఫొటో క్యాప్షన్, "తప్పు మీది కాదు" అనే సందేశంతో వీడియో పోస్ట్ చేసిన డాక్టర్ మిరియం అల్ అడిబ్

ఏఐ ద్వారా ఈ చిత్రాలను ఈ ఏడాది వేసవిలో సృష్టించినట్లు భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఇటీవలే బయటపడింది. అది కూడా డాక్టర్ అల్ అడిబ్ బాధిత బాలికలకు మద్దతుగా వీడియో పోస్ట్ చేసిన తర్వాత.

“ఎంత మంది అమ్మాయిల ఫోటోలు ఉన్నాయో మనకు తెలియదు. వాటిని పోర్నోగ్రఫిక్ సైట్లలో అప్‌లోడ్ చేశారో లేదో కూడా తెలియదు. ఇలాంటి భయాలు అన్నీ ఉన్నాయి” అని ఆమె అన్నారు.

“ ఒక నేరంలో మీరు బాధితులైతే, మీ వస్తువుల్ని దొంగిలించినప్పుడు మీరు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. దాక్కోరు. ఎందుకంటే మీరెలాంటి తప్పు చెయ్యలేదు. అయితే లైంగిక నేరాల విషయంలో బాధితులే భయంతో, సిగ్గుతో దాక్కుంటున్నారు. అందుకే ఆమె ‘ఇది మీ తప్పు కాదు’ అనే సందేశం పంపాలని అనుకున్నారు”.

ఈ కేసులో అనుమానిత నిందితుల వయసు 12 నుంచి 14 మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు.

పెద్దవాళ్ల ఫోటోలను నగ్నంగా మార్చడం గురించి స్పానిష్ చట్టాలు పెద్దగా పట్టించుకోవు. కానీ మైనర్ల ఫోటోలను ఇలా మార్చడం చైల్డ్ ఫోర్నోగ్రఫీ కింద నేరమే.

ఇందులో మరో అంశం వ్యక్తిగత గోప్యత చట్టాల ఉల్లంఘన. స్పెయిన్‌లో 14 ఏళ్లు దాటిన వారి మీద మాత్రమే నేరాభియోగాలు నమోదు చేస్తారు.

ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్లలోనూ ఈ కేసు ఆసక్తిని రేపుతోంది.

“పిల్లలున్న వాళ్లు దీని గురించి చాలా ఆందోళన చెందుతున్నారు” అని గెమా లొరెంజో చెప్పారు. ఆమెకు 16 ఏళ్ల కొడుకు, 12 ఏళ్ల కూతురు ఉన్నారు.

“మీరు రెండు విషయాల గురించి ఆందోళన చెందాల్సి ఉంటుంది. ఒకటి మీకొక కొడుకు ఉంటే వాడు ఏ తప్పుడు పనుల్లో ఇరుక్కున్నాడో అనే భయం. మీకు అమ్మాయి ఉంటే మరింత ఆందోళన తప్పదు. ఎందుకంటే ఇది వారికి భరించలేని హింస లాంటిది” అని ఆమె చెప్పారు.

అల్మెండ్రలొజో పట్టణం
ఫొటో క్యాప్షన్, అల్మెండ్రలొజో పట్టణ జనాభా 30వేలు

తప్పంతా ఇలాంటి పనులు చేస్తున్న యువకుల తల్లిదండ్రులదే అంటున్నారు స్థానిక పెయింటర్ ఫ్రాన్సిస్ జేవియర్ గుయెర్రా. “వాళ్లు ముందే ఏదైనా చేసి ఉండాల్సి ఉంది. పిల్లల ఫోన్లు తీసుకుని అందులో ఏవైనా యాప్స్ ఇన్‌స్టాల్ చేసి పిల్లలు తమ ఫోన్లతో ఏం చేస్తున్నారో తాము గమనిస్తున్నామని చెప్పాలి.

స్పెయిన్‌లో ఇలాంటి వార్తలు పతాక శీర్షికలకెక్కడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో సింగర్ రొసాలియా నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

“ దేశ, విదేశాల నుంచి అనేక మంది మహిళలు నాకు లేఖలు రాస్తున్నారు. తమకు కూడా ఇలా జరిగిందని ఏం చేయాలో అర్థం కావడం లేదని అడుగుతున్నారని” మిరియన్ అల్ అడిబ్ చెప్పారు.

“ ఇలాంటివి ఇప్పుడు ప్రపంచం అంతటా జరుగుతున్నాయి. కాకుంటే అల్మండ్రలోజో పట్టణంలో మనం దీనినొక స్కామ్ లాగా గుర్తించాం” అని ఆమె ఆన్నారు.

బాలికలు, యువతుల ఫోటోలను నగ్నంగా మార్చేందుకు ఉపయోగించే అప్లికేషన్ వాడకం రోజు రోజుకీ పెరుగుతోంది.

“ఈ రకమైన నేరాలు ఇకపైనా పెరుగుతాయి. ఇవి ఆన్‌లైన్‌లో సెక్స్‌ను ప్రమోట్ చేసే ఛానల్స్, డార్క్ వెబ్ నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ అప్‌లోడ్ చేసే వాటికి మాత్రమే పరిమితం కాదని” స్పెయిన్ జాతీయ పోలీసు సైబర్ క్రైమ్ విభాగంలో చైల్డ్ ప్రొటెక్షన్ డైరెక్టర్ జేవియర్ ఇజ్క్విర్డో చెప్పారు.

"మైనర్లకు ఇంత చిన్న వయసులోనే ఇలాంటి సాంకేతికత అందుబాటులోకి రావడం ఆందోళన కలిగించే అంశం” అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)