చంద్రముఖి సినిమాతో చంద్రముఖి 2 పోటీ పడగలిగిందా?

ఫొటో సోర్స్, Insta/Raghava Lawrence
- రచయిత, భవానీ ఫణి
- హోదా, బీబీసీ కోసం
2005లో రజనీకాంత్ హీరోగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా చంద్రముఖి. ఇప్పుడు దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆ సినిమా డైరక్టర్ పి. వాసు దర్శకత్వంలోనే, రాఘవ లారెన్స్ హీరోగా సీక్వెల్ 'చంద్రముఖి 2' విడుదలైంది.
రజనీకాంత్ చంద్రముఖిలో జ్యోతిక, నయనతారలు ఫీమేల్ లీడ్స్ కాగా ఈ సినిమాలో కంగనా రనౌత్ ముఖ్య పాత్రని పోషించింది.
రాధిక, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీ మేనన్, రావు రమేష్ తదితరులు మిగతా ముఖ్య పాత్రల్లో నటించారు.
ఒరిజినల్‌గా తమిళంలో నిర్మించిన ఈ సినిమా, తెలుగు, హిందీలలో కూడా ఒకేసారి రిలీజైంది.
దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత కీరవాణి సంగీతం అందించిన తమిళ సినిమా ఇది. సినిమాటోగ్రాఫర్ ఆర్‌డీ రాజశేఖర్, ఎడిటర్‌గా ఆంథోనీ పని చేశారు.

ఫొటో సోర్స్, Insta/Raghava Lawrence
కథ ఏమిటి?
రజనీకాంత్ చంద్రముఖి సినిమా కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. గంగ అనే అమ్మాయి డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధ పడుతూ చంద్రముఖి అనే నర్తకిలాగా తనని తాను ఊహించుకుంటుంది.
చంద్రముఖినీ, ఆమె ప్రేమించిన నర్తకుడు గుణ శేఖరుడినీ చంపిన రాజు వేటయ్యలాగా నటించి, ఆమెకు పగ తీర్చుకునే అవకాశం ఇచ్చి గంగని బాగు చేస్తాడు శరవణన్ .
గంగని ఆవహించింది చంద్రముఖి ఆత్మ అనుకుంటే అందుకు తగ్గ పూజలు కూడా జరుగుతాయి.
ఈ కథ జరిగిన 17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే భవంతిలో జరిగే కథగా ఈ 'చంద్రముఖి 2' సినిమా మొదలవుతుంది.
తమ సొంత ఊరికి దూరంగా ఎక్కడో సిటీలో నివసిస్తున్న ఒక కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఎదురుకావడంతో ఊరికి వెళ్లి వారి కుల దైవానికి పూజలు చేస్తే సమస్యలు తీరతాయని వాళ్ల గురువు వాళ్లకి చెబుతాడు.
ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలకి తోడుగా మదన్ పాత్రలో లారెన్స్ కూడా ఆ ఊరికి వస్తాడు. 17 ఏళ్ల క్రితం శాంతించిందనుకున్న చంద్రముఖి మళ్లీ వీళ్ల ఈ ప్రయత్నాల వల్ల మేలుకోవడంతో ఊరిలో మరణాలు సంభవించడం వంటి ఆపదలు ఎదురవుతాయి.
ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. మళ్లీ చంద్రముఖి రాకకి కారణం ఏమిటి, మదన్‌కు చంద్రముఖితో ఉన్న సంబంధం ఏమిటి, ఈ సమస్యలన్నీ ఎలా తీరుతాయి అన్నది మిగతా కథ.

ఫొటో సోర్స్, Insta/Raghava Lawrence
కథ కొత్తగా ఉందా?
చంద్రముఖి సినిమాని ఇష్టపడిన జనరేషన్ వాళ్లకు నాస్టాల్జిక్ ఫీల్ తెప్పించడానికే ఈ సినిమా డిజైన్ చేసినట్టుగా ఉంది.
కానీ దాని దరిదాపుల్లోకి కూడా ఈ సినిమా ఏ విధంగానూ వెళ్ళలేదు. కథంతా ముక్కలు ముక్కలుగా అతికించినట్టుగా ఉంది. కామెడీ చాలా రొటీన్‌గా ఉంది. క్యారెక్టర్ల పరిచయమే సరిగా కాకపోవడం వల్ల మొదటి నుంచీ కూడా ఎమోషనల్‌గా ఎటువంటి కనెక్షన్ ఏర్పడదు. చాలా లేజీ రైటింగ్.
డైలాగ్స్‌లో ఎటువంటి కొత్తదనం లేదు సరి కదా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. వడివేలు, లారెన్స్‌ల మధ్య కామెడీ అయితే మరీ పేలవంగా ఉంది.
లారెన్స్‌తో సహా అందరి నటనా చాలా లౌడ్‌గా ఉంది. టీవీ సీరియల్ వైబ్స్ తీసుకొచ్చే స్థాయిలో ఈ సినిమా డైరెక్షన్ ఎందుకుందో అర్థం కాదు.
చంద్రముఖి సినిమా స్క్రీన్‌ప్లేను, సీన్ టు సీన్ దించినా, ఆ రిఫరెన్స్ పాయింట్‌ను పట్టుకునైనా, సినిమాని సరిగా నడిపించలేదు.
ఏ క్యారెక్టర్‌కూ వ్యక్తిత్వం లేకపోవడం, కేవలం అందరినీ కామెడీకి మాత్రమే వాడుకోవడం మరో పెద్ద లోపం. మళ్ళీ చంద్రముఖి కథని మరోసారి చూపించడానికి కారణం ఆ సినిమా చూడని వారికి కథ జేయాలన్న ఉద్దేశం కావచ్చు.
కానీ ఆ పార్ట్ అంతా మరింత కృత్రిమంగా ఉంది. కథలో ఏమైనా కొత్తదనం ఉంటే ఆ సమయంలో వచ్చే ఒక చిన్న ట్విస్ట్ మాత్రమే.

ఫొటో సోర్స్, Insta/Raghava Lawrence
ఈ సినిమా భయపెడుతుందా?
ఏ కొంచెం కూడా ఈ సినిమా భయపెట్టదు. ఎక్కడ ఏం జరగబోతోందో ముందే తెలిసిపోతుంటుంది. చాలా సేపటి వరకూ చంద్రముఖిగా కంగనా కూడా ఎంటర్ కాదు.
ఆ తర్వాత కూడా ఆమె పాత్రని, చంద్రముఖిలోని జ్యోతిక పాత్రతో పోల్చడానికి ఏ విధంగానూ వీలులేదు. ఇక్కడ కూడా సమస్య రైటింగ్, స్క్రీన్ ప్లేలలోనే ప్రధానంగా ఉంది.
ఎవరెవరు ఎలా నటించారు?
లారెన్స్ రెండు పాత్రలలోనూ అంతంత మాత్రంగానే అనిపించాడు. కంగనా, రాధిక, వడివేలు, రావు రమేష్ ఇలా అందరి నటనా చాలా సాధారణంగా, ఎమోషన్ లెస్‌గా ఉంది. దివ్యగా నటించిన లక్ష్మీ మీనన్ నటన మాత్రం బావుంది.

ఫొటో సోర్స్, insta/Raghava Lawrence
టెక్నికల్ గా ఎలా ఉంది?
సీన్స్ మధ్య ఎటువంటి కనెక్షన్ లేదు. కెమెరా మూమెంట్స్ అన్నీ చాలా స్టాటిక్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ ఎక్కడి నుంచో ఎక్కడికో పోయింది.
సెట్టింగ్స్ మొదలుకొని అక్కడక్కడా వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ వరకూ అన్నీ తేలిపోయాయి. యాక్షన్ సీన్స్‌లో కూడా ఎటువంటి మెరుపూ లేదు.
ఇందులో మొత్తం 10 పాటలుండగా, 5 పాటలు - తమిళ వెర్షన్‌లో తెలుగులో, తెలుగు వెర్షన్‌లో తమిళంలో వినిపిస్తాయి. పాటలు వినడానికి బావున్నాయి. ముఖ్యంగా తమిళ వెర్షన్‌లో, తెలుగులో వినిపించే స్వాగతాంజలి పాటకి చైతన్య ప్రసాద్ గారు రాసిన సాహిత్యం అందంగా అమరింది.
చంద్రముఖిలో చాలా పాపులర్ అయిన రారా... పాటను పోలి ఉండే మూడు పాటలకీ రమ్య బెహరా గొంతు మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం రొటీన్ గా ఉంది.
చంద్రముఖితో పోలిస్తే ఎలా ఉంది?
ఇది కేవలం చంద్రముఖి సినిమాకి పేలవమైన అనుకరణ మాత్రమే. ఆ సినిమా కథ రిఫరెన్స్ లు ఈ సినిమా మొత్తం కనిపిస్తూనే ఉన్నా, పూర్తిగా దానితో పాటుగానూ వెళ్లకుండా, అలా అని కొత్తదనమూ లేకుండానూ ఉంటుంది ఈ చంద్రముఖి 2 సినిమా.
కథ రాసుకోవడంలోనూ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్‌ల మీదా మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి ఎంతో కొంత న్యాయం జరిగి ఉండేది.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి
- ఖమ్మం రాజకీయాలు: పాలేరు మీదే అందరి చూపు ఎందుకు?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















