ఖమ్మం రాజకీయాలు: పాలేరు మీదే అందరి చూపు ఎందుకు?

ఫొటో సోర్స్, Ponguletisrinivasareddy/Sharmila/Tummala/FB
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాలేరు - తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న నియోజకవర్గం ఇది.
ఖమ్మం జిల్లా పరిధిలోని ఈ సీటు కోసం హేమాహేమీలు, దిగ్గజాల్లాంటి వాళ్లు కూడా ఆరాటపడిపోతారు. అంతగా ఏముందక్కడ?
తుమ్మల, పొంగులేటి, షర్మిల.. ఇలా పెద్దలంతా పాలేరు వైపే ఎందుకు చూస్తున్నారు?
ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి.. ఈ నాలుగు మండలాలతో కలిపి ఉండే పాలేరు నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణ వచ్చాక ఇక్కడ మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండు సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక.
రెండు సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ గెలిచింది. ఉప ఎన్నికలో మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. రెడ్ల ప్రాబల్యం ఎక్కువ ఉండే ఈ నియోజకవర్గంలో బీసీ, లంబాడీల జనాభా కూడా ఎక్కువే.
పాత వరంగల్, పాత నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉండే పాలేరు నియోజకవర్గంలో రెండుసార్లూ కాంగ్రెస్ నుంచి రెడ్డి నాయకులే గెలిచారు.
అంతేకాదు, మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కేవలం మూడంటే మూడే అసెంబ్లీ స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. మిగతా అన్నీ రిజర్వ్‌డ్ స్థానాలే కావడంతో, ఈ మూడు జనరల్ సీట్ల కోసం పోటీ పెరిగింది.

ఖమ్మం జిల్లాలో 2014 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ చాలా దారుణ పరిస్థితుల్లో ఉండేది. ఆ ఏడాది పాలేరులో టీఆర్ఎస్ పార్టీ రెండు, మూడు కాదు కదా అయిదవ స్థానంలో ఉండేది. 2014 ఎన్నికల్లో కేవలం 2.28 శాతం ఓట్లు వచ్చాయి.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, టీడీపీ రెండవ స్థానంలో, సీపీఎం మూడవ స్థానంలో ఉండేది. స్వతంత్ర అభ్యర్థి తర్వాత టీఆర్ఎస్ వచ్చింది ఆ ఎన్నికల్లో.
అప్పట్లో కాంగ్రెస్‌కు 70 వేల ఓట్లు రాగా, టీడీపీకి 47 వేలు, సీపీఎంకి 44 వేల ఓట్లు వచ్చాయి. నరేశ్ రెడ్డి అనే స్వతంత్ర అభ్యర్థికి 5,500 ఓట్లు, టీఆర్ఎస్‌కి 4 వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి రామిరెడ్డి వెంకట రెడ్డి గెలిచారు. అంతకు ముందు 2009లో కూడా ఈ స్థానం కాంగ్రెస్ చేతిలోనే ఉండేది.
కానీ, ఎన్నికలైన కొద్దికాలానికే వెంకటరెడ్డి మరణించడంతో 2016లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అకస్మాత్తుగా బలం పుంజుకుని గెలిచింది. దానికి కారణం అక్కడ పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర రావు.
పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో ఆ ఎన్నికల్లో తుమ్మల గెలిచారు. ఆయనకు 95 వేల ఓట్లు వచ్చాయి. 55 శాతం ఓట్లన్నమాట. రెండవ స్థానంలో వెంకట రెడ్డి భార్య రామిరెడ్డి సుచరితకు కాంగ్రెస్ తరపున 50 వేల ఓట్లు వచ్చాయి. సీపీఎం అభ్యర్థికి 15 వేలు వచ్చాయి.
‘‘అప్పుడు తుమ్మల గెలిచింది ఉప ఎన్నిక కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టగా తీసుకుంది. అందునా టీఆర్ఎస్ పార్టీ తన బలగాన్నంతా మొహరించి తుమ్మలను గెలిపించుకుంది’’ అని బీబీసీతో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఆవుల శ్రీనివాస్ అన్నారు.
కానీ, మళ్లీ 2018 సాధారణ ఎన్నికలకు పరిస్థితి మారింది. మళ్లీ కాంగ్రెస్ గెలిచింది. కందాల ఉపేందర్ రెడ్డి 89 వేల ఓట్లు తెచ్చుకున్నారు.
టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర రావు 81 వేల ఓట్లు తెచ్చుకుని గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ కి 46 శాతం, టీఆర్ఎస్ కి 42 శాతం ఓట్లు పడ్డాయి. సీపీఎం దారుణంగా దెబ్బతిని మూడున్నర శాతానికి అంటే 6,700 ఓట్లకు పడిపోయింది.
2004 వరకూ పాలేరు రిజర్వుడు నియోజకవర్గంగా ఉండేది. 2009లో జనరల్ అయింది. 2014 కి ముందు మూడుసార్లు సీపీఎం తప్ప మిగిలిన అన్నిసార్లూ కాంగ్రెస్సే అక్కడ గెలిచింది.

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN
ఖమ్మం జిల్లా – ఆల్ మిక్స్ ప్లస్ ఆంధ్రా
మిగిలిన తెలంగాణతో పోలిస్తే పాత ఖమ్మం జిల్లా రాజకీయాలు కాస్త చిత్రంగా కనిపిస్తాయి. రాష్ట్ర విభజన తరువాత కూడా టీడీపీ, వైయస్సార్సీపీలు బలం చూపించిన ప్రాంతం ఇది.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు బలంగా ఉన్న ప్రాంతం ఇది. బీఆర్ఎస్‌ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తోన్న ప్రాంతం ఇది. 2014 నాటికి ఖమ్మం జిల్లా అన్ని పార్టీల సమ్మేళనంలా కనిపించేది.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు, వైయస్సార్ కాంగ్రెస్ మూడు, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఎం ఒక్కొక్క స్థానం చొప్పున గెలుచుకున్నాయి.
2014లో తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ అత్యంత బలాన్ని చాటుకున్నది ఖమ్మంలోనే. ఖమ్మం లోక్ సభ స్థానం కూడా ఆ పార్టీయే గెలుచుకుంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి గెలిచారు.
2018 నాటికి వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణను వదిలేసుకుంది. దీంతో వారంతా టీఆర్ఎస్ వైపు చేరిపోయారు. టీఆర్ఎస్ ఇలా ఎందర్నో చేర్చుకుని విస్తరించడానికి ప్రయత్నించింది.
2018 కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీకి అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 6, టీడీపీ 2, ఇండిపెండెంట్ ఒకటి, టీఆర్ఎస్ ఒకటి గెలుచుకుంది.
2014లో కొత్తగూడెం టీఆర్ఎస్‌కి వస్తే, 2018లో ఖమ్మం పట్టణం టీఆర్ఎస్‌కి వచ్చింది. రెండు ఎన్నికల్లో జిల్లాలో పది సీట్లలో కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది అధికార పార్టీ.
ఇక ఖమ్మం జిల్లాలో ఆంధ్ర ప్రాంత ప్రభావం చూపే ఓట్లు కూడా ఎక్కువే. ‘‘ఖమ్మం మీద ఆంధ్ర ప్రభావం అని పైకి అన్నప్పటికీ కమ్మ కుల ప్రభావం ఎక్కువ’’ అని బీబీసీతో సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీందర్ అన్నారు.
ఇక వైయస్సార్సీపీ బలం కూడా ఉంది ఇక్కడ. షర్మిల పార్టీ ప్రకటించిన వెంటనే మొట్టమొదటి బహిరంగ సభ, పార్టీ ప్రారంభ సభ ఖమ్మంలోనే నిర్వహించారు.
తన అత్తగారి ఊరు అనేది పైకి చెప్పిన కారణం అయినా, 2014 ఎన్నికల్లో వైయస్సార్సీపీ అక్కడ గెలిచిన సీట్లు అసలు కారణం అని అందరికీ తెలుసు. అప్పటి నుంచీ పాలేరులో షర్మిల పోటీ చేస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, @TRSPARTYONLINE
పాత జిల్లాల వారీగా చూసినప్పుడు తెలంగాణ ఏర్పడేనాటికి టీఆర్ఎస్‌కి బలం లేనివి మూడు జిల్లాలు. ఒకటి రంగారెడ్డి, రెండు హైదరాబాద్, మూడు ఖమ్మం.
అందులో హైదరాబాద్‌లో తమ చిరకాల మిత్రుడు ఒవైసీ కోసం బలం పెంచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు టీఆర్ఎస్. హైదరాబాద్ జిల్లా ఎంఐఎందే. ఇక రంగారెడ్డిలో తెలుగుదేశం ఆధిపత్యాన్ని 2018 నాటికి తగ్గించేసి, తాను పాగా వేసింది.
కానీ, ఖమ్మం మాత్రం ఇంకా ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. ఈ దశలో జిల్లా నుంచి కులం పరంగా, డబ్బు పరంగా బలమైన పొంగులేటి, తుమ్మల ఇద్దరూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి దూరమయ్యారు.
షర్మిల సొంతంగా పోటీ చేస్తే పాలేరు నుంచే చేయాలని ఎప్పటి నుంచో ప్రణాళిక. ఒకవేళ ఆమె కాంగ్రెస్‌లో చేరినా పాలేరు నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు ఆమె అనుచరవర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో పాలేరులో 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లోకి చేరడంతో ఆ పార్టీ టికెట్ మళ్లీ ఆయనకే ఇచ్చారు. ఆయన చేతిలో ఓడిపోయిన, ఖమ్మం జిల్లాలో పేరొందిన సీనియర్‌గా ఉన్న తుమ్మల నాగేశ్వర రావు, కోపగించుకుని కాంగ్రెస్ వైపు వెళ్లిపోతున్నారు.
ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ తరపున అదే పాలేరు టికెట్ ఆశిస్తున్నారు. వీళ్లిద్దరూ కాకుండా గతంలో ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా బీఆర్ఎస్‌ని వదలి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కూడా అదే పాలేరు అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, FB/IMSHARMILAREDDY
ఇక్కడ మరో చిత్రం ఏంటంటే, ఈ నియోజకవర్గం టికెట్ ఆశిస్తోన్న అందరికీ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆంధ్రతో మంచి సంబంధాలు ఉన్నాయి. షర్మిల ఆంధ్ర మూలాల గురించి తెలిసిందే. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వైయస్ కుటుంబానికి సన్నిహితుడు.
ఇప్పుడు కూడా ఆయన కంపెనీలు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కాంట్రాక్టు పనులు చేస్తున్నాయి. ఆ నిమిత్తం ఆయన జగన్‌ని కలుస్తుంటారు కూడా. ఒక దశలో ఆయన్ను షర్మిల పార్టీలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయాన్ని వైయస్ విజయలక్ష్మి బహిరంగంగానే చెప్పేశారు.
‘‘వైయస్ కుటుంబానికి సన్నిహితుడు కాబట్టి, మా వైపు నిలబడమని అడిగాం. మాట నిలబెట్టుకుంటాడనే అనుకుంటున్నాం’’ అంటూ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు విజయమ్మ.
ఆ పార్టీలో బలం లేదు కాబట్టి వెళ్లడం లేదని మరో ఇంటర్వ్యూలో పొంగులేటి చెప్పేశారు. ఆయన అటు జగన్‌కి సన్నిహితంగా ఉంటూనే, షర్మిలతో దూరం మెయింటెన్ చేస్తున్నారు.
ఇక ఆంధ్రలో అత్యంత బలమైన, ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువ జనాభా, మంచి బలమూ ఉన్న కమ్మ కులానికి చెందిన వ్యక్తి తుమ్మల నాగేశ్వర రావు.
కమ్మ కులానికి సంబంధించి పెద్ద మనిషిగా, తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్‌లో చేరిన వ్యక్తి ఆయన. ఇలా పాలేరు, ఖమ్మం రాజకీయాలపై పరోక్షంగా ఆంధ్ర ప్రభావం తీవ్రంగా ఉంది. కందాళ ఉపేందర్ రెడ్డి, రామసహాయం రఘుమా రెడ్డి మాత్రం పెద్దగా ఆంధ్ర సంబంధాలు లేనివారు.
మా అత్తగారి ఊరు ఖమ్మమే అని షర్మిల అంటే, ఆమె అత్తగారి ఊరు గుంటూరు అంటూ కొత్త వాదన తెచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి. ఇక పొంగులేటి సోదరుడు ప్రసాద రెడ్డి కూడా ఇప్పటికే పాలేరు కేంద్రంగా పని చేయడం మొదలుపెట్టారు.
ఇక నాన్న ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటూ తుమ్మల నాగేశ్వర రావు కుమారుడు యుగంధర్ ప్రకటించారు. మరోవైపు రామసహాయం రఘుమా రెడ్డి ఇదే టికెట్ కోసం తన పని తాను చేసుకుపోతున్నాడు.
‘‘పాలేరు గెలవడం సులభం అని అందరూ అనుకుంటున్నారు. కానీ అదంత తేలిక కాదు. ముఖ్యంగా షర్మిలకు తాను ఊహించనంత తేలిక కాదు ఈ సీటు గెలవడం. అక్కడ కాంగ్రెస్, సీపీఎం చాలా బలంగా ఉండేవి.
ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చాలా బలంగా ఉన్నాయి. అక్కడ అభ్యర్థి ఎన్నికలను ఎదుర్కొనే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. 2018లో కాంగ్రెస్ బీఆర్ఎస్‌ల మధ్యా నువ్వా నేనా అనే బలమైన ఎన్నిక జరిగింది.
పైగా ఇప్పుడు తుమ్మల కసిమీద, అవమానం మీద ఉన్నాడు. సీటు ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ గ్రౌండ్లో ఎవరు ఎంత కష్టపడతారు అనేదానిపై ఇక్కడ ఫలితం ఆధారపడి ఉంటుంది. షర్మిలకు అయితే మాత్రం చాలా కష్టం’’ అని దుర్గం రవీందర్ అన్నారు.

ఫొటో సోర్స్, FaceBook/Tummala Nageswara rao
రెడ్డి, కమ్మ, కాపు – మూడు సీట్ల కోసం మూడు కులాల పోటీ:
ఖమ్మంలోని మూడు జనరల్ స్థానాల కోసం మూడు కులాల నుంచి పెద్ద పోటీ ఉంది. పాలేరులో రెడ్లకు బలం ఉన్నట్టుగానే ఖమ్మం పట్టణంలో కమ్మలకు బలం ఉంది. ఇక కొత్తగూడెం సీటు ప్రస్తుతం మున్నూరు కాపు (బీసీ) చేతిలో ఉంది. ఈ మూడు జనరల్ సీట్ల కోసం పోటీ పడుతున్న వారిలో మూడు కులాల వారూ ఉన్నారు.
‘‘పాలేరులో రెడ్లకు సహజంగా బలం ఉంది. రామసహాయం సురేందర్ రెడ్డి ప్రాబల్యం ఇక్కడ బలంగా ఉండేది. ఆయన కొడుకు రఘుమా రెడ్డి కూడా పాలేరు నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.
అక్కడ ఆయనకు పోటీగా రెడ్డి కులానికే చెందిన ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. తుమ్మలను పాలేరు వెళ్లవద్దనీ ఖమ్మం నుంచే పోటీ చేయాలనీ ఆయన కులానికి చెందిన కమ్మ పెద్దలూ, అటు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమూ కోరుతోంది.
అక్కడ ఆయనకు పోటీగా కమ్మ కులానికి చెందిన పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. అటు కొత్తగూడెం స్థానం కాంగ్రెస్ నుంచి మున్నూరు కాపు కులానికి చెందిన యడవల్లి కృష్ణ ఆశిస్తున్నారు. ఆయన మున్నూరు కాపు బీసీ కులం.
అక్కడ ఆయనకు పోటీగా మున్నూరు కాపు కులానికే చెందిన వనమా వేంకటేశ్వర రావు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఇక పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ మూడు స్థానాల్లో అసెంబ్లీ సీటు కోసమూ దరఖాస్తు చేసుకున్నారు.
పొంగులేటిని కొత్తగూడెం పంపి, పాలేరు రఘుమారెడ్డికి ఇస్తే అప్పుడు జిల్లాలో మూడు అగ్రకులాలకే ఇచ్చి, ఒక్క బీసీకీ టికెట్ ఇవ్వలేదన్న చెడ్డపేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి లేదా రామసహాయం రఘుమారెడ్డిలలో ఒకరికి టికెట్ నిరాకరించి వేరే చోట సర్దుబాటు చేయాలి.
రఘుమారెడ్డికి తండ్రి వల్ల ఆ ప్రాంతంలో బలం ఉంది. ఇక షర్మిల ఇక్కడ టికెట్ ఆశించినా, ఆవిడకు క్షేత్ర స్థాయిలో అంత బలం కాదు అసలు బలమే లేదు.
అప్పట్లో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అంశం వచ్చినప్పుడు షర్మిల రచనా స్టీల్స్ ఇక్కడే పెట్టాలనుకున్నారు. అలా కొంత కనెక్షన్ ఉండొచ్చు. కానీ, కోర్ తెలంగాణ వాదులకు ఆవిడ ప్రమేయం నచ్చదు’’ అంటూ వివరించారు ఆవుల శ్రీనివాస్.

ఫొటో సోర్స్, Getty Images
ఖమ్మం కాంగ్రెస్ నాయకులు, షర్మిల రాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ ప్రకటన చేశారు. తుమ్మలకు అక్కడ బలం ఉంది కాబట్టే ఆయనే ఆ సీటుకు సరైన వ్యక్తి అని బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
ఇప్పటికే రేణుకా చౌదరి షర్మిలపై బహిరంగ విమర్శలు ప్రారంభించారు. షర్మిల తెలంగాణ కోడలు అయితే తాను ఖమ్మం కూతుర్ని అని గుర్తు చేశారు.
‘‘పాలేరులో పోటీ చేస్తానని చెప్పడానికి షర్మిల ఎవరు? అడగడానికి అర్హత ఉండాలి కదా. మా అధిష్టానం చెప్పాలి. ఆమెకు ఇప్పుడు తెలంగాణ గుర్తొచ్చిందా?’’ అని రేణుక ప్రశ్నించారు.
షర్మిల ఒకవైపు పాలేరులో ఆఫీసు కూడా పెట్టుకున్నారు. అసలు సీటు విషయంలో పొంగులేటి రాజీ పడతారా లేక పట్టుబడతారా అన్నది స్పష్టత లేదు. తుమ్మల తన పని తాను చేసుకుపోతున్నారు.
‘‘ఖమ్మం అసెంబ్లీ సీట్ల విషయంలో తెలంగాణలో ఏ సీటుకూ జరగనంత ఎక్కువ ఖర్చు అవుతుందనేది మాత్రం వాస్తవం. 2018లోనే ఇక్కడ సీటు కోసం పదుల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈసారి ఇంకా పెరుగుతుంది.’’ అన్నారు ఆవుల శ్రీనివాస్.
ఇవి కూడా చదవండి:
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














