భారత్-కెనడా: 38 ఏళ్ల కిందటి ‘కనిష్క’ విమానంపై దాడి భారతీయులను ఎలా వెంటాడుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శరణ్య హృషికేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కెనడా భారత్‌ల మధ్య వివాదం నేపథ్యంలో గతంలో జరిగిన సంఘటనలు కూడా తెరపైకి వస్తున్నాయి. 1985లో ఎయిరిండియా విమానం ‘కనిష్క’పై ఉగ్రదాడి ఘటన గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
బ్రిటీష్ కొలంబియాలో సిక్కుల నాయకుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ పాత్ర ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఇటీవల ఆరోపించారు. అయితే భారత ప్రభుత్వం ఆ ఆరోపణలు కొట్టిపారేసింది.
ఈ వ్యవహారంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 1985లో ఎయిరిండియా విమానంపై జరిగిన ఉగ్రదాడి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
1985లో ఏం జరిగింది?
23 జూన్ 1985లో లండన్ మీదుగా కెనడా నుంచి భారత్‌కు వస్తున్న ఎయిరిండియా విమానం ‘కనిష్క’ ఐరిష్ కోస్ట్ వద్ద గాలిలోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 329 మంది చనిపోయారు. వీరిలో 268 మంది కెనడా పౌరులు, 24 మంది భారతీయులు ఉన్నారు.
కూలిపోయిన ఈ విమానం కోసం చాలాకాలం అన్వేషణ సాగగా, 131 మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారు. మిగిలినవి ఇంకా దొరకలేదు.
చనిపోయిన కెనడా పౌరులలో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారు. భారతీయుల బంధువులు ఉండటంతో ఈ ప్రమాద ఘటన భారతదేశంలో కూడా విషాదం నింపింది.

ఫొటో సోర్స్, Getty Images
దాడుల వెనుక ఎవరున్నారు?
కనిష్క ఉగ్రదాడి సమయంలోనే, జపాన్‌లోని టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో మరో పేలుడు జరిగింది. ఈ ఘటనలో లగేజ్ హ్యాండిల్ చేసే ఇద్దరు జపాన్ దేశస్తులు మృతిచెందారు. అయితే ఈ పేలుడికీ కనిష్క ఉగ్రదాడికి సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది.
బ్యాంకాక్ కు వెళ్తున్న మరో ఎయిరిండియా విమానాన్ని పేల్చడమే లక్ష్యంగా కుట్ర పన్నారని, అయితే ఈ బాంబు ముందుగానే పేలిందని దర్యాప్తుతో తేలింది.
కెనడా దర్యాప్తు అధికారులు ఈ ఉగ్రదాడి వెనుక సిక్కుల వేర్పాటు వాదులే ఉన్నారని 1984లో అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో జరిగిన సిక్కుల ఊచకోత ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ దాడులు చేశారని తేల్చారు.
ఉగ్రదాడి జరిగిన కొన్ని నెలల తర్వాత నిషేధిత తీవ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా సంస్థ నాయకుడు తల్వీందర్ సింగ్ పర్మార్, ఎలక్ట్రీషియన్ ఇంద్రజీత్ సింగ్ రియాత్‌లను రాయల్ కెనడియన్ మౌంటనెడ్ పోలీస్ (RCMP) డిపార్ట్‌మెంట్ అరెస్ట్ చేసింది.
పర్మార్‌పై భారత్‌లో అప్పటికే హత్యకేసులు ఉన్నాయి. కెనడాలోనే తలదాచుకుంటున్న పర్మార్‌ను దేశానికి రప్పించాలని 1980ల సమయంలో కెనడా ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం కోరుతూనే ఉంది. కానీ ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
ఉగ్రదాడి తరువాత అరెస్టైన పర్మార్, నాటకీయ పరిణామాల మధ్య విడుదల విడుదలయ్యారు. ఆ తరువాత భారత్‌కు వచ్చారు. 1992లో భారత పోలీసులు ఆయన్ను చంపారు.
2000 సంవత్సరంలో ఈ బాంబు దాడితో సంబంధం ఉందని పేర్కొంటూ కెనడాలోని సిక్కుల వేర్పాటు వాది, వ్యాపారవేత్త అయిన రిపుదమన్ సింగ్ మాలిక్, బ్రిటిష్ కొలంబియాకు చెందిన మిల్ వర్కర్ అజైబ్ సింగ్ బగ్రిలను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కానీ 2005లో ఇద్దరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. వీరిద్దరికీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారి విశ్వసనీయతపై అనుమానాలు ఉన్నాయని తీర్పు ఇచ్చిన సమయంలో న్యాయమూర్తి అన్నారు.
ఘోరమైన విమానయాన ఉగ్రదాడిగా పేర్కొన్న ‘కనిష్క’ విమాన పేలుడులో ఒక్క రియాత్‌ను మాత్రమే దోషిగా గుర్తించారు. జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన బాంబు పేలుడులోనూ రియాత్‌కు ప్రమేయం ఉందని పేర్కొంటూ 1991లో పదేళ్ల జైలు శిక్ష విధించారు.
కనిష్క విమానంపై దాడి కేసులో రియాత్‌ను 2003లో కెనడా న్యాయస్ధానం దోషిగా తేల్చి మరో ఐదేళ్లు శిక్ష విధించింది. 2000లో కెనడా అధికారులు అరెస్ట్ చేసిన మాలిక్, బగ్రీలపై విచారణ జరిగిన సందర్భంలో రియాత్ వారికి సంబంధించి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు అదనంగా జైలు శిక్ష అనుభవించాడు.

ఫొటో సోర్స్, getty
కెనడా దర్యాప్తుపై విమర్శలు ఎందుకు వచ్చాయి?
ఉగ్రదాడిని ముందే పసిగట్టడంలోనూ, దాడి జరిగాక చేపట్టిన దర్యాప్తులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కెనడా అధికార యంత్రాంగంపై విమర్శలు ఉన్నాయి.
ఉగ్రదాడి కేసులో అరెస్టైన మాలిక్, బగ్రీలను నిర్దోషులుగా విడుదల చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు పోరాటం మొదలుపెట్టారు.
దీనిపై స్పందించిన కెనడా ప్రభుత్వం 2006లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో పబ్లిక్ ఎంక్వైరీకి ఆదేశించింది.
2010 వరకు సాగిన దర్యాప్తులో ఈ విమాన దాడికి సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదికలో చాలా విషయాలు అందరిలోనూ అనుమానాలు రేకెత్తించాయి.
ఎయిరిండియా విమానంపై దాడికి కుట్ర జరుగుతోందని కొన్ని నెలల ముందే కొన్ని వర్గాల నుంచి పోలీసులకు సమాచారం కూడా వచ్చిందని నివేదికలో ఉంది.
కెనడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వాంకోవర్‌లో ఉండే పర్మార్, రియాత్‌ల కదలికలపై నిఘా ఉంచారని, దాడికి కొన్ని వారాల ముందు వారిద్దరూ అడవిలోకి వెళ్లిన సమయంలో వారిని వెంబడించిన ఏజెంట్‌కు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని పేర్కొన్నారు. అయితే అది అంత ముఖ్యం కాదని భావించినట్లు ఏజెంట్లు పేర్కొన్నారని నివేదికలో ఉంది.
1990లో దర్యాప్తులో కీలకంగా ఉన్న ఇద్దరు సిక్కు జర్నలిస్టులు లండన్, కెనడాల్లో హత్యకు గురయ్యారు.
2000లో మాజీ కెనడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. కెనడా పోలీసులకు ఇవ్వాల్సిన 150 గంటల నిడివి ఉన్న అనుమానితుల కాల్ డేటా టేపులను తానే నాశనం చేసినట్లు తెలిపారు. ఇన్‌ఫార్మర్‌ల గుర్తింపుని బహిర్గతం చేయకుండా ఉండటానికి ఈ పని చేసినట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, getty
ఆ తరువాత ఏం జరిగింది?
2010లో దర్యాప్తు నివేదిక బయటకు వచ్చాక, అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ బాధిత కుటుంబ సభ్యులకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
2016లో కెనడా జైలు నుంచి రియాత్ విడుదలయ్యారు. ఏడాది తర్వాత స్వేచ్ఛగా, నచ్చినచోట జీవించేందుకు అనుమతి పొందారు. రియాత్‌కు ఈ స్వేచ్ఛను కల్పించడాన్ని ఆ సమయంలో కొంత మంది విమర్శించారు.
2022లో రిపుదమన్ సింగ్ మాలిక్‌ను బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పోలీసుల విచారణలో ఇది కుట్రపూరిత హత్యగా తేలింది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే వారు ఏ కారణంతో మాలిక్‌ను హత్య చేశారో స్పష్టత రాలేదు.
కనిష్క ఉగ్రదాడి ఘటన జరిగి 38 ఏళ్లు అయిన సందర్భంలో అంగస్ రీడ్ ఇన్‌స్టిట్యూట్ ఒక రీసెర్చ్ రిపోర్టును విడుదల చేసింది. కెనడా చరిత్రలో కనిష్క ఘటన ఘోరమైన దాడిగా నిలిచిపోతుందని పేర్కొంది.
కెనడాలోని ప్రతి పదిమందిలో 9 మందికి ఈ దాడి గురించి అంతంతమాత్రమే తెలుసునని, కొంతమందికి అసలు దాడి సంగతే తెలియదని పేర్కొంది.
భారత్ స్పందన ఎలా ఉంది?
కనిష్క ఉగ్రదాడి ఘటన భారత్ కు విషాదాన్నే మిగిల్చింది. దాడిలో చనిపోయింది కెనడా పౌరులే అయినా, వారిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వాళ్లు, వారి బంధువులు ఉన్నారు. కానీ బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు.
2006లో బాధితుల బంధువులను కలుసుకునేందుకు కెనడా లాయర్ రిచర్డ్ క్వాన్స్ భారత్‌కు వచ్చారు. రిపుదమన్ సింగ్ మాలిక్, బగ్రీలను నిర్దోషులుగా ప్రకటించడంపై భారతీయులకు అనుమానాలు ఉన్నాయని, ఈ ఉగ్రదాడి కేసు న్యాయ ప్రక్రియ నుంచి పక్కకు తప్పించినట్లుగా వారు భావిస్తున్నారన అప్పట్లో బీబీసీతో అన్నారు.
కేంద్ర మంత్రి ట్వీట్..
తాజాగా ఇరుదేశాల మధ్య మళ్లీ వివాదం చెలరేగడంతో ఈ కనిష్క ఉగ్రదాడి ఘటన మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఇటీవలే కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు. కనిష్క ఉగ్రదాడిని భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన ఘోరమైన దాడిగా పేర్కొన్నారు. ఈ చర్యకు మద్దతు తెలిపిన వారి మనస్తత్వాలను కూడా విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఉగ్రదాడిపై జరిగిన దర్యాప్తులో కెనడా అధికారులు చేసిన పొరపాట్లు, దర్యాప్తు తీరుపై అనేక కథనాలు, విమర్శలు వచ్చాయి.
ఈ దాడిలో తన తల్లిని కోల్పోయిన సుశీల్ గుప్తా ప్రింట్ పత్రికతో మాట్లాడారు. “ నా పన్నెండేళ్ల వయసులో నా తల్లి విమానం పేలుడు ఘటనలో చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఘటన వలన ఏదో విధంగా ప్రభావితం అయిన వారిని కలుస్తూనే ఉన్నాను. నా కూతురు చదువుతోన్న స్కూల్ టీచర్ కూడా ఆ ఘటనకు సంబంధించిన బాధితురాలి స్కూల్‌మెట్. ఈ విషాద ఘటన చాలా మంది కెనడా దేశస్తులను ప్రభావితం చేసింది” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చిత్తూరు: మైనర్ బాలిక మృతి మిస్టరీ ఏమిటి? రేప్ చేసి, చంపేశారనేది నిజమేనా? పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది?
- గురుద్వారాలో LGBTQ జంట ‘వివాహం’.. ఇది ఉల్లంఘనే అంటున్న సిక్కు పెద్దలు
- ఆసియా క్రీడలు: గుర్రపు స్వారీలో 41 ఏళ్ల తర్వాత భారత్‌కు గోల్డ్ మెడల్, ప్రశంసించిన మోదీ
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- అర్మేనియాకు భారత్ ఆయుధాలు ఎందుకు అమ్ముతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
End of సంబంధిత కథనాలు










