గురుద్వారాలో స్వలింగ సంపర్క జంట ‘వివాహం’...ఇది సంప్రదాయ విరుద్ధమన్న సిక్కు పెద్దలు

- రచయిత, గగన్‌దీప్ సింగ్ జస్సోవాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో స్వలింగ సంపర్కుల వివాహం చట్టబద్దతపై సుప్రీంకోర్టు విచారణ చేస్తుండగా పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఓ ‘స్వలింగ సంపర్క’ జంట వివాహం చర్చనీయాంశమైంది.
27 ఏళ్ల డింపుల్, 21 ఏళ్ల మనీషా ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో సెప్టెంబర్ 18న బటిండాలో పెళ్లి చేసుకున్నారు.
దేశంలో ఇటువంటి వివాహాలు చాలా అరుదు. అంతేకాదు ఈ జంట సంప్రదాయ ఆచారాలతో గురుద్వారాలో వివాహం చేసుకుంది.
ఈ వివాహాన్ని సిక్కు మత పెద్దలు తప్పుబడుతున్నారు.
దీనిని ‘అకాల్ తఖ్త్’ జత్తేదార్ గ్యానీ రఘ్‌బీర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్వలింగ సంపర్కుల వివాహం అసహజమైనదని, సిక్కు మత సూత్రాలకు విరుద్ధమని ఆయన ప్రకటించారు.
'వాళ్లు మహిళలని నాకు తెలియదు'
పవిత్ర గురుగ్రంథ సాహిబ్ సమక్షంలో ఇద్దరు మహిళలు వివాహం చేసుకోవడం నైతిక, మతపరమైన విలువలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని గియానీ అంటున్నారు.
వివాహం జరిపించిన మత గురువు హర్దేవ్ సింగ్, మరో ముగ్గురిని తదుపరి నోటీసు వచ్చే వరకు సస్పెండ్ చేయాలని బటిండా గురుద్వారా కమిటీకి సూచించారు గియానీ.
దీంతో హర్దేవ్ సింగ్‌ను బాధ్యతల నుంచి తొలగించారు. వధూవరులిద్దరూ మహిళలేనని తనకు తెలియదని హర్దేవ్ సింగ్ అంటున్నారు. వారిలో ఒకరు తలపాగా ధరించడంతో గుర్తుపట్టలేదని తెలిపారు.
తన గుర్తింపు కార్డు కాపీలను గురుద్వారాలో సమర్పించానని, అందువల్ల ఎలాంటి గందరగోళానికి ఆస్కారం లేదని డింపుల్ చెప్పారు. డింపుల్ మాన్సా జిల్లా, మనీషా భటిండా ప్రాంతాలకు చెందిన వారు.

'అబ్బాయిల మీద ఆసక్తి లేదు'
డింపుల్ ఒక జాట్ సిక్కు, వారిది అగ్ర కులంగా పరిగణిస్తారు. మనీషా దళిత కులానికి చెందిన హిందువు.
పంజాబ్ రాజధాని చండీగఢ్ సమీపంలో జిరాక్‌పూర్‌లోని ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు.
పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత బీబీసీ ప్రతినిధి వారిని కలిశారు. ఆ సమయంలో ఇరువురు మిగతా పెళ్లైన జంటల మాదిరిగానే ఆనందంగా కనిపించారు.
తన ఆనంద్ కరాజ్ (సిక్కు వివాహ వేడుక)కి దాదాపు 70 మంది బంధువులు వచ్చారని బీబీసీతో చెప్పారు ఆ జంట.
వివాహ ఫోటోలు, వీడియోలు పరిశీలిస్తే డింపుల్ సంప్రదాయ సిక్కు వరుడి దుస్తులను ధరించారు.
మెరూన్ రంగు తలపాగాకు సంప్రదాయ పూల దండ (సెహ్రా) కట్టారు.
వధువు మనీషా మెరూన్, గోల్డెన్ కలర్ కుర్తీ, సల్వార్, సిల్క్ దుపట్టా, చేతుల్లో ఎరుపు రంగు గాజులు ధరించి కనిపించారు.
డింపుల్ తరచుగా ప్యాంటు-షర్ట్ ధరించడానికి ఇష్టపడతారు. తన జుట్టును చిన్నగా ఉంచుకుంటారు.
"నాకు అబ్బాయిల పట్ల ఆసక్తి లేదని నా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు, అర్థం చేసుకున్నారు. మద్దతుగా నిలిచారు. నా సంతోషంలో వారి సంతోషాన్ని చూసుకున్నారు" అని డింపుల్ తెలిపారు.
తన తల్లిదండ్రుల ఏకైక సంతానం అయిన డింపుల్ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించారు.
ఈ విషయంలో వైద్యుల సలహా కూడా తీసుకున్నారు. అయితే ఈ సర్జరీ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమోనని తల్లిదండ్రులు భయపడి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఫొటో సోర్స్, PROVIDED BY DIMPLE'S FAMILY
‘యూట్యూబ్ నుంచి చాలా తెలుసుకున్నా’
2017లో డింపుల్ పని కోసం జిరాక్‌పూర్ వెళ్లినపుడు, LGBTQకి సంబంధించిన సమస్యల గురించి తెలుసుకున్నారు.
“అక్కడ నా పరిస్థితిని అర్థం చేసుకునే, నాలాంటి ఆలోచనలున్న స్నేహితులను కలుసుకున్నా. యూట్యూబ్ నుంచి కూడా చాలా తెలుసుకున్నా. మనీషా నా ఫస్ట్ లవర్ కాదు. నేను ఐదేళ్లు ఒకమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా, కానీ ఈ ఏడాది ప్రారంభంలో విడిపోయాం. ఆ తర్వాత మరో అమ్మాయితో 4 నెలలు డేటింగ్ చేశా. కానీ ముందుకు సాగలేదు. ఈ సమయంలో మనీషాతో స్నేహం ఏర్పడింది'' అని డింపుల్ వివరించారు.
“మనీషా నాకు మంచి భాగస్వామి అని అనిపించింది. ఆమె కూడా నాతో ఉండటానికి ఇష్టపడేది. చాలాసేపు మాట్లాడుకునే వాళ్లం” అని తెలిపారు డింపుల్.
'అమ్మాయితో పెళ్లంటే అమ్మ ఒప్పుకోలేదు'
కలిసిన మూడు-నాలుగు రోజుల్లోనే డింపుల్ ఫోన్‌లో ప్రపోజ్ చేశారని, వెంటనే అంగీకరించానని మనీషా చెప్పారు.
"స్త్రీకి ఆమెను అర్థం చేసుకుని, గౌరవించి, ప్రేమించి, చిన్నపిల్లలా చూసుకునే జీవిత భాగస్వామి కావాలి" అని మనీషా అంటున్నారు.
అయితే డింపుల్‌తో పెళ్లికి తల్లిదండ్రులను ఒప్పించడం మనీషాకు అంత సులువు కాలేదు.
“అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదని అమ్మ చెప్పింది. నన్ను సంతోషంగా చూడాలనుకుంటే, ఒప్పుకోవాలని బతిమిలాడాను. తను సరేనని, నాన్నను కూడా ఒప్పించింది'' అని అన్నారు మనీషా.

ఫొటో సోర్స్, Getty Images
వివాహానికి చట్టబద్ధత ఉంటుందా?
డింపుల్, మనీషా పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో, కుటుంబ పెద్దలు పెళ్లి తేదీని నిర్ణయించారు.
డింపుల్ తల్లిదండ్రులు సిక్కు మతాన్ని అనుసరిస్తారు. డింపుల్‌ను సిక్కు ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. దీంతో గురుద్వారాలో పెళ్లి చేసుకున్నారు.
డింపుల్, మనీషా తమ గుర్తింపును దాయలేదని చెబుతున్నారు. భటిండా గురుద్వారా కమిటీ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా వారు చూపించారు.
అయితే, స్వలింగ సంపర్కుల వివాహాన్ని భారత్ ఇంకా చట్టబద్ధంగా గుర్తించలేదు.
వివాహాలకు సంబంధించిన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల విచారించింది. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడనుంది.
ఇప్పటివరకైతే డింపుల్, మనీషాలకు ఇతర లింగ జంటలకు (పురుషులు, స్త్రీలు) ఉన్న హక్కులు చట్టబద్దంగా లభించవు.
మరోవైపు డింపుల్, మనీషా పెళ్లి చేసుకోవడం తీవ్రమైన నేరంగా పరిగణించలేమని కూడా నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ విషయంలో మతపరమైన నిబంధనలను ఉల్లంఘించారా అనే దానిపై విచారణ చేస్తున్నామని సిక్కుల మత సంస్థ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అంటోంది.
ఇవి కూడా చదవండి:
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














