ఇండియా-కెనడా వివాదం: భారత్‌కు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఆ మాటలకు అర్థం ఏమిటి?

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

దౌత్యపరంగా తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించాయి.

తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ (ఇరుదేశాల మధ్య ప్రయాణాలకు సంబంధించిన జాగ్రత్తలు) జారీ చేశాయి. కెనడాలోని భారత హైకమిషన్ వీసా సేవలను నిలిపివేసింది.

భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న వ్యక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని భారత్ చెబుతోంది. అలాంటి నేరస్థులపై చర్యలు తీసుకోవడానికి, లేదా వారిని అప్పగించేందుకు కూడా కెనడా సహకరించలేదని అంటోంది.

రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారుతున్న నేపథ్యంలో ఈ విషయంలో అమెరికా ఎలాంటి వైఖరి అవలంబించనుందనే ఉత్కంఠ నెలకొంది.

దశాబ్దాలుగా అమెరికా, కెనడా మధ్య మంచి సంబంధాలున్నాయి. ఫైవ్ ఐస్ అలయెన్స్‌ అనే వ్యూహాత్మక ఒప్పందంలోనూ ఈ రెండు దేశాలూ భాగస్వాములుగా ఉన్నాయి.

కొన్నేళ్లుగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్నది సుస్పష్టం.

బైడెన్, ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

'భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఉండదు'

ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్‌లో కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేశారు. ''హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనే విషయం వెలుగులోకి వచ్చింది. అందుకు బలమైన ఆధారాలు ఉన్నాయి'' అన్నారు.

కెనడా భూభాగంపై, కెనడా పౌరుడిని హత్య చేయడాన్ని సహించేది లేదని, అది తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని ట్రూడో అన్నారు.

ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. అసంబద్ధమైన, ప్రేరేపిత ఆరోపణలని పేర్కొంది.

ఇటీవల అమెరికా ఉన్నతాధికారుల ప్రకటనలను చూసినట్టయితే, నిజ్జర్ హత్య విషయంలో భారత్‌కు ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపు ఇచ్చే పరిస్థితిలో అమెరికా లేదని స్పష్టమవుతోంది.

ఈ విషయంలో భారత్‌కు అమెరికా ప్రత్యేక మినహాయింపు ఇవ్వబోదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సల్లీవన్ గురువారం అన్నారు. ఇది రెండు దేశాల మధ్య బలోపేతం అవుతున్న సంబంధాలపై ప్రభావం చూపనుందా అనే ప్రశ్నకు జాక్ స్పందిస్తూ.. ''ఎవరికి ఇబ్బంది కలిగినా అమెరికా తన సిద్ధాంతాల కోసం నిలబడుతుంది'' అని చెప్పారు.

''ఇది మాకు ఆందోళన కలిగించే అంశం. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. మేం దీనిపై పనిచేస్తాం. ఇందులో ఏ దేశం అనేది చూడాల్సిన పనిలేదు'' అని జాక్ మీడియాతో చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

''ఇలాంటి పనులకు ప్రత్యేక మినహాయింపు పొందలేరు'' అని ఆయన అన్నారు. ''ఏ దేశమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, మా ప్రాథమిక సిద్ధాంతాలను కాపాడుకుంటాం. ఈ కేసులో దర్యాప్తు, దౌత్యప్రక్రియకు కెనడా నేతృత్వం వహిస్తున్నందున, కెనడా వంటి మిత్రదేశాలతో కలిసి పనిచేస్తాం'' అన్నారు.

కెనడా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు జాక్ చెప్పారు.

‘‘ఈ కేసును సునిశితంగా పరిశీలిస్తున్నాం. దర్యాప్తులో సహకారం అందిస్తాం. అలాగే, భారత ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం'' అని ఆయన తెలిపారు.

ఈ అంశంలో అమెరికా, కెనడా మధ్య చీలిక తెచ్చేందుకు పత్రికల్లో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని జాక్ అన్నారు.

''అమెరికా, కెనడా మధ్య చీలికలు ఉన్నాయనే వాదనలను తిరస్కరిస్తున్నా. కెనడా చేసిన ఆరోపణలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. దర్యాప్తు ముందుకు సాగి నేరస్థులను న్యాయవ్యవస్థ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం'' అని జాక్ అన్నారు.

ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా స్పందన కెనడాకు మద్దతిచ్చేలా ఉందా?

ఇటీవల వైట్‌హౌస్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ చీఫ్ జాన్ కిర్బీ సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ, ''కెనడా చేసిన తీవ్ర ఆరోపణల గురించి అధ్యక్షుడు జో బైడెన్‌‌కు కచ్చితమైన సమాచారం ఉంది. అవి చాలా తీవ్రమైనవి. కేసు దర్యాప్తులో కెనడాకు సహకరిస్తాం'' అన్నారు.

''పారదర్శకంగా, లోతుగా దర్యాప్తు చేయడమే సరైన విధానమని భావిస్తున్నాం. తద్వారా అసలేం జరిగిందో తెలుసుకోగలం. దర్యాప్తుకు సహకరించాలని మేము భారత్‌ను కోరుతున్నాం'' అని కిర్బీ అన్నారు.

అమెరికన్ న్యూస్ పేపర్ 'వాషింగ్టన్ పోస్ట్' ప్రచురించిన కథనంపై వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి అడ్రియెన్నె వాట్సన్ స్పందిస్తూ ''కెనడాని మందలించినట్లుగా వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం'' అని ట్వీట్ చేశారు.

''మేం కెనడాతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాం. దర్యాప్తును సునిశితంగా పరిశీలిస్తున్నాం. ఈ విషయం చాలా తీవ్రమైనది. చట్టాన్ని అమలు చేసేందుకు కెనడా ప్రయత్నాలకు మా మద్దతు ఉంటుంది. భారత్‌తోనూ చర్చలు జరుపుతున్నాం'' అని వాట్సన్ రాశారు.

ఈ విషయంపై యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ మహిళా ప్రతినిధి మార్గరెట్ మెక్‌లియోడ్ బీబీసీతో మాట్లాడారు.

''కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఇందులో నిందితులు ఎవరైనా న్యాయవ్యవస్థ ముందుకు వారిని తీసుకురావడమే అత్యంత ప్రధానం. కెనడా దర్యాప్తుకు భారత్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. భారత్, కెనడా ఇద్దరి వాదనలనూ వింటున్నాం. వాళ్లిద్దరూ మాకు మంచి మిత్రులు. ప్రతి దేశంతోనూ మాకు వేర్వేరుగా సంబంధాలుంటాయి. కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి అంతకుమించి మాట్లాడలేం. దర్యాప్తు సక్రమంగా జరిగి నిందితులను న్యాయవ్యవస్థ ముందుకు తీసుకురావడమే ముఖ్యం'' అని ఆమె అన్నారు.

హర్దీప్ సింగ్ నిజ్జర్

ఫొటో సోర్స్, Getty Images

'అమెరికాకు కష్టమే'

అమెరికా చేస్తున్న బహిరంగ ప్రకటనలు మినహాయిస్తే, అంతకుమించి చెప్పేందుకు అమెరికా వద్ద ఏమీ లేదని వ్యూహాత్మక విషయాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రకటనలను బట్టి భారత్‌కు అమెరికా మద్దతు ఇవ్వడం లేదని అనిపించొచ్చు. కానీ, దీని కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెబుతున్నారు.

''అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ఇది కాస్త ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే భారత్‌తో సంబంధాల బలోపేతం కోసం బైడెన్ చాలా కృషి చేశారు'' అని దిల్లీలోని అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్‌లో స్టడీస్ అండ్ ఫారన్ పాలసీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్, ప్రొఫెసర్ హర్ష్ వీ పంత్ అభిప్రాయపడ్డారు.

''అలాగే, అమెరికాకు కెనడా దీర్ఘకాల భాగస్వామి. దానితో పాటు బైడెన్ డెమోక్రాట్లకు, ట్రూడో లిబరల్స్‌కు సిద్ధాంతపరంగానూ సారూప్యాలున్నాయి. అమెరికాతో సుదీర్ఘ కాలంగా కెనడా‌కు మంచి సంబంధాలున్నాయి. బైడెన్‌‌కు కోపం రాకుండా భారత్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి'' అని ఆయన అన్నారు.

''ఇది ఉగ్రవాదానికి సంబంధించిన సమస్య అని భారత్ బలంగా చెప్పగలదు. బైడెన్ అధికార యంత్రాంగం కానీ, కెనడా మిత్రదేశాలు కానీ కెనడా మరిన్ని ఆధారాలతో వస్తుందని ఆశించడం మినహా, ఏం చేయగలవో ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికైతే పరిస్థితి చాలా అస్పష్టంగా ఉంది'' అని హర్ష్ పంత్ అభిప్రాయపడ్డారు.

కెనడాలో వీసా సేవలను భారత్ నిలిపివేయడంపై పంత్ మాట్లాడారు.

''అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేసేందుకు భారత్ ఎంచుకున్న విధానం ఇది. ఇప్పటికే రెండు దేశాల మధ్య అగాథం పెరిగిపోయింది. జస్టిన్ ట్రూడో పార్లమెంట్‌లో బాహాటంగా ఆరోపణలు చేయడమే అందుకు కారణం. వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు భారత్ కూడా స్పష్టం చేయాలి'' అని ఆయన అన్నారు.

''బైడెన్ ప్రభుత్వం కెనడాకు బహిరంగంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం కొంతవరకూ ఉన్నప్పటికీ, ఇప్పుడు ఉద్రిక్తతలను తగ్గించాల్సి ఉందని కెనడాకు ప్రైవేట్‌గా చెప్పే అవకాశం ఉంది. బహుశా బైడెన్ ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే కావొచ్చు. కానీ, బయటికి అలానే ఉంటుంది.

ఇది బైడెన్ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నీ ఇలా ఉంటే, గణతంత్ర దినోత్సవానికి భారత్ బైడెన్‌ను ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది'' అని పంత్ చెప్పారు.

కొన్నివిధాలుగా చూస్తే కెనడా ప్రధాని ట్రూడో ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారని అనిపిస్తోందని హర్ష్ పంత్ అభిప్రాయపడ్డారు.

''ఇది వ్యక్తిగత కక్షలా ఉంది'' అని ఆయన అన్నారు.

''ఇలాంటి ఘటన జరిగి, వారి వద్ద ఆధారాలు ఉండి, ఈ సమస్యను నిజంగా పరిష్కరించాలనే ఉద్దేశం కెనడాకు ఉంటే, అందుకు దౌత్యపరమైన మార్గాలతో పాటు ఇంకా చాలా మార్గాలున్నాయి. పార్లమెంట్‌లో ఆయన చేసిన ఆరోపణలు భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో చేసినట్లే కనిపిస్తున్నాయి'' అని పంత్ చెప్పారు.

''ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీసే బలహీనమైన ప్రకటనల్లో ఒకటి'' అని ఆయన అన్నారు.

ట్రూడో, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

'కెనడా ఆధారాలు చూపించాలి'

మాజీ రాయబారి అనిల్ త్రిగుణాయత్ అమెరికా సహా చాలా దేశాల్లో భారత్ తరఫున పనిచేశారు.

''ప్రపంచ రాజకీయాల పరంగా చూస్తే ఈ విషయంలో కెనడా అంత బలమైనది కాదు'' అని బీబీసీతో అనిల్ చెప్పారు.

''ఆధారాలు లేకుండా, కేవలం ఊహాగానాలను బట్టి మిత్ర దేశాలను మీరు ఒప్పించలేరు. ఆ విషయాలను దాచిపెట్టలేరు. మరోవైపు 13, 14 కేసుల్లో భారత్ ఆధారాలను అందించింది. ఈ కేసులోనూ ఆధారాలు ఉంటే అందించాలని ట్రూడోతో జరిగిన భేటీలో ప్రధాని మోదీ అడిగారు. మేం సహకరించబోమని భారత్ ఎప్పుడూ చెప్పలేదు'' అని ఆయన అన్నారు.

అయితే, భారత్‌కు ఆధారాలు అందించినట్లు జస్టిన్ ట్రూడో ఇప్పుడు చెబుతున్నారు.

భారత్ నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదంతో బాధపడుతున్న దేశమని ఇతర దేశాలు కూడా అర్థం చేసుకున్నాయని అనిల్ అన్నారు. ''మీరు మీ దేశం నుంచి వేర్పాటువాద కార్యకలాపాలను అనుమతించలేరు. అప్పుడు మాత్రమే మరే దేశం ఎలాంటి చర్య తీసుకోకూడదని ఆశించండి'' అని ఆయన అన్నారు.

పరపతి తగ్గిపోవడం, రాజకీయ ఒత్తిళ్లే ట్రూడో ఈ విషయాన్ని బయటపెట్టడానికి కారణమని అనిల్ అభిప్రాయపడ్డారు.

''ట్రూడో ప్రస్తుతం తన రాజకీయ మనుగడ కోసం కష్టపడుతున్నారు. అందుకోసం ఆయన ఏం చేసేందుకైనా వెనకాడరు. కానీ, ఆయన తప్పుడు వ్యూహం ఎంచుకున్నారు'' అని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఏమైనా ఉందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ''భారత్, అమెరికా సంబంధాలపై నేరుగా ప్రభావం చూపే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. కెనడా, భారత్ మధ్య ఏర్పడిన అగాథాన్ని పూడ్చే ప్రయత్నాల్లో అమెరికా, యూకే వంటి జీ7 దేశాలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే, ఇప్పటివరకూ అలాంటి పరిస్థితి కనిపించలేదు'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)