ఏషియన్ గేమ్స్: అరుణాచల్‌ప్రదేశ్‌ అథ్లెట్లకు చైనా వేరే వీసాలు ఎందుకు ఇచ్చింది? వివాదమేంటి?

భారత్, చైనా సరిహద్దు వివాదం

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, కాత్రిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఏళ్లుగా కొనసాగుతున్న భారత్-చైనా సరిహద్దు వివాదంలో ముగ్గురు భారత మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు అనుకోకుండా చిక్కుకున్నారు.

ఆ ముగ్గురు మహిళా క్రీడాకారులు భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది.

చైనాలోని హాంగ్‌ఝౌ నగరంలో శనివారం నుంచి జరిగే ఏషియన్ గేమ్స్‌లో పోటీ పడాల్సిన టీమ్‌లో ఈ ముగ్గురు మహిళా అథ్లెట్లు కూడా ఉన్నారు.

అయితే, వారు ఏషియన్ గేమ్స్‌‌లో పాల్గొనకుండా చైనా అడ్డుకుందని, వారికి సరైన పత్రాలు ఇవ్వలేదని భారత్ ఆరోపించింది.

ఈ ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. సరైన పత్రాలు ఉంటే అథ్లెట్లు నిరభ్యంతరంగా రావొచ్చని చైనా చెబుతోంది.

వుషూ క్రీడాకారులైన నైమాన్ వాంగ్సు, ఒనిలు తెగా, మేపుంగ్ లంగుకి అనుమతి పత్రాలు అందకపోవడం వల్ల ఏషియన్ గేమ్స్‌కు వెళ్లలేకపోయారని భారత మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇతర జట్లు, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఈ కథనాలు పేర్కొన్నాయి.

ఏషియన్ గేమ్స్

ఫొటో సోర్స్, Getty Images

చైనా ఉద్దేశపూర్వకంగానే కొందరు అథ్లెట్లపై వివక్ష చూపిందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వారి నివాసం లేదా జాతి ఆధారంగా భారత పౌరులను వేర్వేరు దృష్టితో చూడడాన్ని భారత్ గట్టిగా వ్యతిరేకిస్తుందని అందులో పేర్కొంది.

అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని, ఎప్పటికీ విడదీయరాని భాగమేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ నిరసనను బలంగా తెలియజేస్తామని భారత్ తెలిపింది.

కేంద్ర క్రీడా మంత్రి తన ఏషియన్ గేమ్స్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ఆ ముగ్గురు మహిళా క్రీడాకారులకు చైనా వీసాలు మంజూరు చేసిందన్నారు. అయితే, భారత్ నుంచి పాల్గొంటున్న ఇతర క్రీడాకారులకు ఇచ్చిన వీసాలు, వారికి జారీ చేసిన వీసాలు వేరుగా ఉండడంతో వాటిని తిరస్కరించారని చెప్పారు.

''నిబంధనల ప్రకారం, వారికి ఇతర వీసాలు ఇచ్చే అధికారం చైనా ప్రభుత్వానికి ఉంది'' అని వీ జిఝాంగ్ చెప్పారు.

సదరు క్రీడాకారుల విషయంలో పరిష్కారం కనుగొనేందుకు ఏషియన్ గేమ్స్ నిర్వాహక కమిటీ ప్రయత్నిస్తోందని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి చెందిన మరో అధికారి చెప్పారు.

పత్రాల విషయంలో వివాదం తలెత్తడం ఇదేమీ తొలిసారి కాదు.

చైనాలోని చెంగ్డు నగరంలో జులైలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ ఈ ముగ్గురు అథ్లెట్లు పోటీ పడలేకపోయారు.

స్టేపుల్డ్ వీసాల (స్టాంపింగ్ చేయని వీసాలు) కారణంగా వారు ఆ పోటీల్లో పాల్గొనలేకపోయారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ భూభాగంలో అంతర్భాగమని భారత్ చేస్తున్న వాదనలను చైనా అంగీకరించడం లేదనడానికి నిదర్శనంగా ఈ వీసాలు పరిగణిస్తున్నారు.

భారత్, చైనా సరిహద్దు వివాదం

ఫొటో సోర్స్, Getty Images

ఆ ప్రాంతాన్ని చైనా సౌత్ టిబెట్‌గా చెబుతోంది. అయితే, చైనా వాదనలను భారత్ గట్టిగా తిరస్కరిస్తోంది. అలాగే, చైనా ఆధీనంలో ఉన్న హిమాలయాల్లోని ఆక్సాయ్ చిన్ పీఠభూమి తమదేనని భారత్ వాదిస్తోంది.

''సరైన ధ్రువపత్రాలు ఉన్న క్రీడాకారులు ఎవరైనా హాంగ్ఝౌ నగరంలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనవచ్చు, వారికి చైనా స్వాగతం చెబుతోంది'' అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు.

''అరుణాచల్ ప్రదేశ్ అని పిలుస్తున్న ప్రాంతాన్ని చైనా ఎప్పుడూ గుర్తించలేదు. సౌత్ టిబెట్ ప్రాంతం చైనా భూభాగంలో భాగం'' అని తెలిపారు.

దాదాపు 3,440 కిలోమీటర్ల పొడవైన వాస్తవ సరిహద్దు రేఖపై ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం నెలకొని ఉంది. దీనినే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ - ఎల్‌ఏసీగా వ్యవహరిస్తారు. హిమాలయాల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎల్ఏసీ వెంబడి నదులు, సరస్సులు, మంచుతో నిండిన ప్రాంతాలు ఉన్నాయి.

చైనా ఆధీనంలో ఉన్న హిమాలయాల్లోని ఆక్సాయ్ చిన్ పీఠభూమి ప్రాంతం తమ భూభాగమని భారత్ వాదిస్తోంది.

సరిహద్దు వెంబడి చాలా ప్రదేశాల్లో ఇరుదేశాల సైనికులు పరస్సరం ఎదురుపడినప్పుడు ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి.

గత డిసెంబర్‌లో తవాంగ్ పట్టణం సమీపంలో సరిహద్దు వెంబడి భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి.

ఆసియా ఖండంలో నిర్వహించే అతిపెద్ద క్రీడాసంబరం ఏషియన్ గేమ్స్. ప్రతి నాలుగేళ్లకు ఏషియన్ గేమ్స్ నిర్వహిస్తారు.

2022లో జరగాల్సిన ఏషియన్ గేమ్స్‌ను కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)