కెనడాలో వీసా సేవలు నిలిపివేయడం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

జస్టిన్ ట్రూడో, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కెనడా పౌరులకు వీసా సేవలను భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో, భారత్ నిర్ణయం కెనడాలో నివసిస్తున్న భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అనే ప్రశ్న తలెత్తుతోంది.

భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కెనడాలోని ఇండియన్ ఎంబసీ (భారత రాయబార కార్యాలయం) వీసా సేవలను నిలిపేసింది. ఆపరేషన్స్‌లో తలెత్తిన కొన్ని కారణాల వల్ల ఈ సేవలను నిలిపివేసినట్లు చెబుతున్నారు.

కెనడాలోని ఇండియన్ ఎంబసీ, బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సహకారంతో భారత్ వీసా సేవలను అందిస్తోంది.

''కొన్ని ఆపరేషనల్ కారణాల వల్ల 2023 సెప్టెంబర్ 21 నుంచి భారత వీసా సేవలు నిలిపివేశాం. తదుపరి ప్రకటన వచ్చే వరకూ వీసా సేవలు అందుబాటులో ఉండవు. మరింత సమాచారం కోసం బీఎల్‌ఎస్ వెబ్‌సైట్‌‌ను సంప్రదించండి'' అని కెనడియన్లకు వీసా సేవలు అందించే ఇండియా వీసా అప్లికేషన్ సెంటర్ తెలిపింది.

ఖలిస్థాన్ అనుకూల సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా చేసిన ఆరోపణలతో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించాయి.

ఈ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి, వీసా సేవల నిలిపివేతకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ వీసాలు ఎన్ని రకాలు?

కెనడాలోని ఇండియన్ ఎంబసీ పలు రకాల వీసాలను అందిస్తోంది.

ఎంట్రీ వీసా: ఇది భారత సంతతి ప్రజలకు ఇస్తారు. ఈ వీసా ద్వారా కెనడాకు చెందిన భారత సంతతి ప్రజలు ఒకసారి భారత్‌ను సందర్శించేందుకు వీలుంటుంది.

బిజినెస్ వీసా: కెనడా పౌరులు, లేదా కెనడాలో నివాసం ఉండేందుకు దీర్ఘకాలిక అనుమతులు ఉన్న విదేశీయులు వ్యాపార, వాణిజ్య పనులపై భారత్‌ రావాలనుకునే వారికి బిజినెస్ వీసా మంజూరు చేస్తారు.

టూరిస్ట్ వీసా: భారత్‌ను సందర్శించాలనుకునే కెనడా పౌరులకు ఈ వీసా జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ వీసాతో కొన్నేళ్ల పాటు భారత్‌లో ఉండే వెసులుబాటు ఉంది.

ఎంప్లాయ్‌మెంట్ వీసా: భారత్‌లో పని చేయాలనుకుంటున్న వారికి ఈ వీసా ఇస్తారు. కెనడా పౌరులు, కెనడాలో నివాసం ఉండేందుకు దీర్ఘకాలిక అనుమతులు ఇతర జాతీయులకు ఈ వీసా మంజూరు చేస్తారు.

మెడికల్ వీసా: భారత్‌లో చికిత్స కోసం వచ్చేవారికి ఈ వీసా జారీ చేస్తారు. ఇది రోగులు, వారి సహాయకులకు ఇస్తారు. ఈ వీసాతో భారత్‌లో మూడు నెలలు ఉండే అవకాశం ఉంది.

ఫిల్మ్ వీసా: భారత్‌లో రీసెర్చ్ (పరిశోధన) చేయాలనుకునే వారికి ఫిల్మ్ వీసా జారీ చేస్తారు.

స్టూడెంట్ వీసా: భారత్‌లో గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుకోవాలనుకునే వారికి స్టూడెంట్ వీసా ఇస్తారు. ఇది మల్టిపుల్ ఎంట్రీ వీసా, ఇక్కడ చదువుకునే విద్యార్థులు తమ చదువు పూర్తయ్యే వరకు అనేకసార్లు భారత్‌ను సందర్శించవచ్చు

కాన్ఫరెన్స్ వీసా: భారత్‌లో జరిగే కాన్ఫరెన్సులు, సెమినార్లలో పాల్గొనేందుకు ఈ వీసా జారీ చేస్తారు. కాన్ఫరెన్స్ జరిగే సమయంలో ఒకసారి వచ్చి వెళ్లేందుకు వీలుగా ఈ వీసా మంజూరు చేస్తారు.

కెనడా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

భారతీయుల సమస్యలు..

వీసా సేవలను నిలిపివేయడంతో ఉద్యోగాలు, వ్యాపారం, వాణిజ్య అవసరాల కోసం భారత్‌కు రావాలనుకుంటున్న వారు రాలేని పరిస్థితి నెలకొంది. భారత్ నుంచి కెనడాకు వెళ్లి స్థిరపడి, అక్కడి పౌరసత్వం పొందిన వారు, భారత్ రావాలంటే వీసా తప్పనిసరి కావడమే అందుకు కారణం.

తరచూ భారత్‌కు వచ్చి వెళ్లే విదేశీ పౌరులకు భారత్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) కార్డును జారీ చేస్తుంది.

విదేశీ పౌరసత్వం పొందిన భారతీయులు ఈ కార్డు పొందేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డు వారు ఎన్నిసార్లైనా భారత్ వచ్చి వెళ్లేందుకు వీలుంటుంది.

అయితే, ఈ కార్డు లేని వారు భారత్‌కు రావాలంటే తప్పనిసరిగా వీసా పొందాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు సమస్య.

ఇప్పుడొచ్చిన సమస్యేంటి?

కెనడాలో భారత్ వీసా సేవల నిలిపివేతతో వ్యాపార, వాణిజ్య అవసరాలు, భారత్‌లో పర్యటించేందుకు, భారత్‌లోని సమీప బంధువుల కోసం ఇక్కడికి రావాలనుకునే వారిపై ప్రభావం పడుతుంది.

అలాగే, ఓసీఐ కార్డు లేని భారతీయులు స్వదేశానికి వచ్చి, వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్య కేవలం కెనడియన్లకు మాత్రమే కాదు. కెనడా పౌరసత్వం పొందిన భారతీయులపై కూడా ఆ ప్రభావం పడుతుంది.

భారత సంతతి వ్యక్తులు ఓసీఐ కార్డును పొందాలనుకున్నా, వెంటనే వాటిని పొందలేరు.

కెనడా పౌరసత్వం పొందిన భారతీయులు మూడు నెలల్లోగా తమ పాస్‌పోర్టును ఇండియన్ ఎంబసీలో సరెండర్ చేసి, భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే వారు ఓసీఐ కార్డుకి దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే, దరఖాస్తు చేసుకున్న 5 నుంచి 7 నెలల తర్వాత ఈ కార్డు జారీ చేస్తారు. ఈలోపు భారత్‌కు రావాలనుకుంటే ఎంట్రీ వీసా పొందాల్సి ఉంటుంది.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

'దౌత్య అసంతృప్తికి సంకేతం'

''రెండు దేశాల మధ్య వివాదం తలెత్తినప్పుడు అనేక రకాలుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తాయి'' అని చెన్నై లయోలా కళాశాల ప్రొఫెసర్ గ్లాడ్సన్ జేవియర్ చెప్పారు.

“మొదట రాయబారిని వెనక్కి పంపుతారు. ఆ తర్వాత వీసాల జారీని నిలిపివేస్తారు. ఇది ఎయిర్ ట్రాఫిక్‌ పూర్తిగా తగ్గిపోయే తీవ్ర స్థాయికి దారితీస్తుంది. కెనడాతో సంబంధాల్లో ఉద్రిక్తత కారణంగా ప్రస్తుతం వీసాల జారీని నిలిపివేశారు.

ఇది వివిధ కారణాలతో భారత్ రావాలనుకునే కెనడా పౌరులు, కెనడా పౌరసత్వం పొందిన భారతీయులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కొందరికి ఇవాళ, రేపు లేదా వచ్చే వారం వీసా షెడ్యూల్‌ ఉండి ఉంటుంది. ఇలా అనూహ్యంగా వీసాలను రద్దు చేయడం వారికి పెద్ద షాక్'' అన్నారు.

“ఇప్పటికే వీసాలు పొందిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని భారత్ అసంతృప్తికి ప్రతీకగా అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు'' అని జేవియర్ చెప్పారు.

ఓసీఐ కార్డులు ఉన్నా సమస్యలొస్తాయా?

వీసా సేవలను నిలిపివేయడమే కాకుండా, ఓసీఐ కార్డు ఉన్నవారిని కూడా కెనడా నుంచి భారత్ రాకుండా అడ్డుకోవాలని కొందరు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

''ఓసీఐ కార్డులను కూడా నిషేధించాలని కొందరు అంటున్నారు. ప్రస్తుత సమస్యతో వారికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈ డిమాండ్ సమర్థనీయం కాదు, అలాంటి వారిని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదు'' అని జేవియర్ అన్నారు.

చాలా మంది భారతీయులు కెనడాలో స్థిరపడ్డారు. 2021 జనాభా లెక్కల ప్రకారం, కెనడా వెళ్లి అక్కడ స్థిరపడిన భారతీయులు, వారి వారసులు దాదాపు 18 లక్షల మంది ఉన్నారు. ఇది కెనడా జనాభాలో 5.11 శాతం.

కెనడా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

వీసాకు ప్రత్యామ్నాయం లేదు

వీసా సేవల నిలిపివేత ప్రభావం, కెనడాలో ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు కెనడాకి చెందిన మీడియా అనలిస్ట్ రామనన్ చంద్రశేఖర మూర్తితో బీబీసీ తమిళ్ మాట్లాడింది.

''చాలా కంపెనీలు ఔట్‌సోర్సింగ్ కంపెనీల ద్వారా వీసా సేవలు అందిస్తున్నాయి. కెనడాపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో కెనడియన్లకు భారత్ వీసా సేవలను నిలిపివేసింది'' అని చంద్రశేఖర మూర్తి అన్నారు.

''భారత్‌కు చెందిన టీసీఎస్ లాంటి ఎన్నో కంపెనీలు కెనడాలో వ్యాపారం చేస్తున్నాయి. కెనడా నుంచి చాలా మంది వ్యాపారం, టూరిజం కోసం భారత్ వస్తుంటారు. భారత్ రావాలనుకుంటున్న కెనడియన్లపై ఆ ప్రభావం పడుతుంది. దీని వల్ల భారత సంతతి వ్యక్తులు, కెనడా పౌరులు వీసా పొందేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం లేదు'' అని ఆయన చెప్పారు.

భారతీయులు సురక్షితం

ఇండియా - కెనడా మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కెనడాలో భారతీయుల భద్రతపై రామనన్ చంద్రశేఖర మూర్తి మాట్లాడారు. కెనడా ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రి వంటి శక్తివంతమైన స్థానాల్లో సిక్కులు ఉన్నారని, కెనడా రాజకీయాలను ప్రభావితం చేయగల స్థానాల్లో వారు ఉన్నారని ఆయన అన్నారు.

''ఇది రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ సమస్యే కానీ ప్రజలపై ఎలాంటి ప్రభావం లేదు. కెనడాలోని సిక్కులు భారత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. కానీ, ఇక్కడి భారతీయులపై వారికి కోపం లేదు. ఇక్కడ భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారు'' అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, Canada India Tensions: వీసా సేవలు నిలిపివేయడంతో భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)