గ్రహాంతరవాసులు హిరోషిమా, నగాసాకీలపై అణుబాంబు దాడులను చూశారా?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, ICTOR HABBICK VISIONS/SPL

అమెరికా నేవీ యుద్ధ విమానాల కెమెరాలతో ఆకాశంలో రికార్డ్ చేసిన మూడు వీడియోలను 2023 జూలైలో ఆ దేశ పార్లమెంటరీలో కమిటీ సభ్యులకు చూపించారు.

ఈ వీడియోలలోని చిత్రాలు కొంచెం అస్పష్టంగా ఉన్నాయి. ఒకదానిలో మెరిసే వస్తువొకటి ఆకాశంలో వేగంగా తిరుగుతూ కనిపించింది.

దాన్ని చూస్తున్న నేవీ పైలట్ల రియాక్షన్ కూడా వీడియోలో రికార్డయింది. వేర్వేరు సమయాల్లో రికార్డ్ చేసిన రెండు వీడియోలలో ఇదే రకమైన రహస్య వస్తువు ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపించింది.

ఈ వీడియో ఫుటేజీ చాలాకాలం క్రితమే లీక్ అయింది. కానీ, అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని అధికారికంగా 2020లో విడుదల చేసింది. యూట్యూబ్‌లో ఈ వీడియోలను లక్షల మంది వీక్షించారు.

అయితే, వాస్తవాలను లోతుగా తెలుసుకోవడమే తమ లక్ష్యమని అమెరికా పార్లమెంట్‌‌లోని కమిటీ సభ్యులు చెప్పారు.

దీంతో భూమిపై కాకుండా మరే ఇతర గ్రహంపైన జీవులు ఉన్నాయా? అనే ఊహాగానాలు పెరిగాయి. దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

యూఎఫ్వో, ఏలియన్స్ ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

యూఎఫ్‌వో వార్తలు ఎప్పుడు మొదలయ్యాయి?

గ్రెగ్ అఘిగియన్ అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్శిటీలో హిస్టరీ, బయోఎథిక్స్ ప్రొఫెసర్.

ప్రజలు దశాబ్దాలుగా ఆకాశంలో అంతుచిక్కని విషయాలను చూస్తున్నారని గ్రెగ్ చెప్పారు.

మిస్టీరియస్‌గా ఎగిరే ఈ వస్తువులను యూఎఫ్‌వో (Unidentified Flying Object) అని పిలుస్తున్నారు, అంటే గుర్తింపులేని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్.

“1947లో కెన్నెత్ ఆర్నాల్డ్ అనే ప్రైవేట్ పైలట్ అమెరికా పశ్చిమ తీరానికి సమీపంలో ఎగురుతున్నారు. ఆ సమయంలో కొన్ని వస్తువులు ఆకాశంలో ఒక ప్రత్యేక నిర్మాణంలో వేగంగా ఎగురుతున్నట్లు కనిపించింది. దీంతో యూఎఫ్‌వోల గురించి మొదటిసారి చర్చ మొదలైంది. వారు ఈ విషయం వింతగా భావించారు. వెంటనే ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఒక జర్నలిస్ట్ దానికి ఫ్లయింగ్ సాసర్ అని పేరు పెట్టాడు. తరువాత అలాంటి వాటిని UFOs అని పిలిచేవారు. అవి వేరే గ్రహం నుంచి వచ్చి ఉండవచ్చని నమ్మడం ప్రారంభమైంది " అని అన్నారు గ్రెగ్.

ఆ తర్వాత యూఎఫ్‌వో చూశామంటూ చెప్పిన వార్తలు ఎక్కువయ్యాయి.

గ్రెగ్ అజిగియన్ ప్రకారం 1950లలో యూఎఫ్‌వో చూశామంటూ చాలామంది చెప్పారు. UFO వార్తలు అమెరికాలోని వాషింగ్టన్, ఇటలీ, స్పెయిన్, లాటిన్ అమెరికా నుంచి రావడం ప్రారంభించాయి.

1954లో ఫ్రాన్స్‌లో కొందరు యూఎఫ్‌వో లోపల కూర్చున్న వ్యక్తులను కూడా చూశామని పేర్కొన్నారు. దీని తర్వాత 70, 80, 90లలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి.

అమెరికా, దాని మిత్రదేశాలు, సోవియట్ యూనియన్ మధ్య దాదాపు 45 ఏళ్లుగా కొనసాగిన ప్రచ్ఛన్నయుద్ధం కొంతవరకు ఈ వార్తలకు కారణమని గ్రెగ్ అజిగియన్ అంటున్నారు.

'1950లలో చంద్రుడిని చేరుకోవడానికి లేదా దానిని దాటి వెళ్లడానికి అనేక దేశాల మధ్య మొదలైన రేసు కూడా యూఎఫ్‌వో వార్తలకు మరో కారణం' అని గ్రెగ్ తెలిపారు.

ఆ సమయంలో రెండు కూటములు ఒకదానికొకటి గూఢచారాన్ని సేకరించేందుకు వివిధ పద్ధతులను అవలంబించాయి.

అదే సమయంలో, ఇతర గ్రహాలపై నివసించేవారు హిరోషిమా, నగాసాకీలపై అణు దాడులను చూసి ఉంటారని, ఉత్సుకత లేదా భయంతో వారు తెలుసుకోవడానికి భూమి చుట్టూ తిరుగుతున్నారని ప్రజలు అనుకున్నారు కూడా.

"యూఎఫ్‌వోలకు సంబంధించిన నమ్మకాలు సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు, చిత్రాల ద్వారా కూడా బలపడ్డాయి. సాంకేతిక సామర్థ్యాలు పెరుగుతుండటంతో చంద్రుడు లేదా అంగారక గ్రహంపై మానవులు స్థిరపడటం గురించి చర్చించారు. సహజంగానే మనం ఈ సామర్థ్యాన్ని కలిగి ఉంటే, మనకంటే అభివృద్ధి చెందిన నాగరికతలు ఖచ్చితంగా చాలా గొప్ప సామర్థ్యాన్ని, సాంకేతికతను కలిగి ఉంటాయని ప్రజలు అనుకోవడం ప్రారంభించారు. బహుశా 2010 నుంచి ఈ అంశంపై మీడియా ఆసక్తి గణనీయంగా పెరిగింది'' అని గ్రెగ్ అజిగియన్ అంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, SPL

అమెరికా యూఏపీ చీఫ్ చెప్పిన రహస్యాలేంటి?

యూఎఫ్‌వో సంబంధించిన వార్తలను గత 23 ఏళ్లుగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లెస్లీ కీన్ నివేదిస్తున్నారు.

యూఎఫ్‌వోల గురించి సమాచారాన్ని సేకరించేందుకు అమెరికా డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ 2010 నుంచి ఒక రహస్య ప్రాజెక్టు నిర్వహిస్తోందని లెస్లీ అంటున్నారు.

దానిని ఇప్పుడు యూఎఫ్‌వోను యూఏపీ (Unidentified Anomalous Phenomena) అని పిలుస్తున్నారని ఆయన చెప్పారు. యూఏపీ అంటే 'అర్థం కాని రహస్యమైన విషయాలు లేదా సంఘటనలు'.

"యూఎఫ్‌వో భావనలు ఎగతాళికి గురయ్యాయి. ఇప్పుడు నీటి అడుగున కూడా విచిత్రమైన, నిగూఢమైన విషయాలు కనిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి. అందుకే ఈ మర్మమైన సంఘటనలను విస్తృత పద్ధతిలో నిర్వచించడానికి వాటిని యూఏపీ అని పిలుస్తున్నారు'' అని చెప్పారు లెస్లీ.

2017లో యూఎస్ యూఏపీ టాస్క్‌ఫోర్స్ చీఫ్ ఈ రహస్య ప్రాజెక్ట్‌కు నిధులు లేకపోవడంతో విసుగు చెంది, రాజీనామా చేసి, ఈ విషయాన్ని బహిరంగపరిచారని లెస్లీ అన్నారు.

యూఏపీ టాస్క్‌ఫోర్స్ చీఫ్ సహోద్యోగులను పిలిచి వివిధ రకాల పత్రాలు, వీడియోలు, సమాచారాన్ని పంచుకున్నారని లెస్లీ కీన్ చెప్పారు.

దీని ఆధారంగా లెస్లీ తన బృందంతో కలిసి న్యూయార్క్ టైమ్స్‌లో ఒక వార్తను ప్రచురించారు. ఆ తర్వాత ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

దీంతో ఈ ప్రాజెక్టు నిధులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

అమెరికా నేవీ అధికారులు విడుదల చేసిన వీడియోలలోని చిత్రం

ఫొటో సోర్స్, US NAVY

ఫొటో క్యాప్షన్, 'గాలిలో కనిపించే వివరించలేని వస్తువులు' గల మూడు వీడియోలను అమెరికా నేవీ విడుదల చేసింది.

అమెరికాలో పార్లమెంట్‌లో చర్చ

2023 జూన్‌లో విజిల్‌బ్లోయర్ అయిన మాజీ సీనియర్ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్‌తో ఇంటర్వ్యూ ఆధారంగా లెస్లీ కీన్ మరొక కథనాన్ని ప్రచురించారు.

డేవిడ్ గ్రష్ ఆఫ్గానిస్తాన్‌లో అమెరికా సైనికులతో కూడా పనిచేశారు. యుఎస్ చాలా ఏళ్లుగా ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌ నడుపుతోందన్నారు. యూఏపీలు క్యాప్చర్ అవుతాయని, వాటి కంటెంట్‌, పైలట్ల అవశేషాలు రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా అధ్యయనం చేస్తారని డేవిడ్ తెలిపారు.

''అమెరికా పార్లమెంటులో ఆయన ఈ సమాచారాన్ని పంచుకున్నారు. డేవిడ్ గ్రష్ యూఏపీ అవశేషాలను స్వయంగా చూడలేదని లేదా తాకలేదని చాలామంది చెప్పారు. అయితే యూఏపీ ఏ రోజు?, ఏ ప్రదేశంలో పడిపోయింది? దానిని ఎవరు స్వాధీనం చేసుకున్నారో డేవిడ్ చెప్పారు. దాన్ని పబ్లిక్‌గా చెప్పలేమని కూడా తెలిపారు. అమెరికా పార్లమెంట్ దీనిని విచారించాలి'' అని లెస్లీ అన్నారు.

అమెరికా పార్లమెంటు విచారణలో డేవిడ్ గ్రుష్‌తో పాటు మాజీ సైనికాధికారులు కూడా తమ ప్రత్యక్ష అనుభవాలను వివరించారు. అయితే, అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ యూఎఫ్‌వో వార్తలను ఖండించింది.

''ఇది ఎయిర్ ట్రాఫిక్, జాతీయ భద్రతకు సంబంధించిన సమస్య అని నేను 17 ఏళ్లుగా చెబుతున్నా. నేను చెప్పదలుచుకున్నది యూఎఫ్వోలు నిజంగా ఉన్నాయని. అది వేరే ప్రపంచం. పార్లమెంటు సభ్యులు దానిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అయితే విశ్వంలో భూమిపైనే కాకుండా బయట కూడా జీవం ఉందని తెలుసుకునే హక్కు ప్రపంచంలోని సామాన్యులకు ఉంది. దీనికి సంబంధించిన రుజువు మన దగ్గర ఉంది'' అని లెస్టీ అంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఏలియన్స్‌ను అక్కడే కనుగొనాలి: ఆడం ఫ్రాంక్

యూఎఫ్‌ఓ, యూఏపీల గురించి మాట్లాడుతూ సైన్స్ ఊహాజనిత కథనాలపై పని చేయదు. దృఢమైన సాక్ష్యాలపై పని చేస్తుందని రోచెస్టర్ విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ ఆడం ఫ్రాంక్ అన్నారు.

"సైన్స్ దీని గురించి ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే చాలా సమాచారం ప్రజల ఊహలు, కథనాలపై ఆధారపడి ఉంటుంది. దీనిపై పని చేయడానికి శాస్త్రవేత్తలకు అవసరమైన సమాచారం లేదు" అని తెలిపారు. ఇతర గ్రహాలపై జీవనం లేదా అధునాతన సాంకేతికత శోధనకు అమెరికన్ అంతరిక్ష సంస్థ (నాసా) ప్రారంభించిన ప్రాజెక్ట్‌లో ఆడం ఫ్రాంక్ ప్రధాన పరిశోధకుడు.

అయితే, ఈ శోధన ఎక్కడ చేయాలనేదే ముఖ్యమైన ప్రశ్న అని అంటున్నారాయన.

“ఉదాహరణకు మీరు నెబ్రాస్కాలో నివసిస్తున్న వ్యక్తిని కనుగొనాలనుకుంటే, మీరు ఎక్కడపడితే అక్కడ వారిని కనుగొనలేరు. అదే విషయం గ్రహాంతరవాసులకీ వర్తిస్తుంది. సౌర వ్యవస్థలో 400 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. భూమి సౌరవ్యవస్థలో ఒక చిన్న గ్రామం లాంటిది. ఏలియన్స్‌ను వారు నివసించే గ్రహాలపై కనుగొనాల్సి ఉంటుంది'' అని ఫ్రాంక్ అన్నారు.

యూఎస్ పార్లమెంటరీ కమిటీ ఎదుట నేవీ పైలట్ల వాంగ్మూలం గురించి ఆడమ్ ఫ్రాంక్ స్పందించారు. పారదర్శకంగా చర్చించి దర్యాప్తు చేస్తే బాగుంటుందని అంటున్నారు.

కానీ UAPని కనుగొనడంపై డేవిడ్ గ్రష్ వాదనలు సందేహాస్పదంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఇదంతా X-ఫైల్స్ ఎపిసోడ్ మాదిరి ఉంది. గత డెబ్బై ఏళ్లలో గ్రహాంతరవాసుల ఛాయాచిత్రాలు లేదా UAP అవశేషాలను కనుగొనలేకపోయామని చెప్పడం, నమ్మేలా లేదు. మరొక విషయం ఏంటంటే ఏదైనా జీవి లేదా నాగరికత అంత అధునాతన సాంకేతికతను కలిగి ఉంటే, అవి చాలాదూరం ప్రయాణించగలవు, అప్పుడు వారి అంతరిక్ష నౌక ఇక్కడకు వచ్చి కూలిపోయిందని చెప్పడం నమ్మశక్యంగా లేదు'' అని అన్నారు ఫ్రాంక్.

నాసా శాస్త్రవేత్తలు ఆ వీడియోను విశ్లేషించారని ఆయన తెలిపారు. అందులో ఏదో ఎగురుతున్నట్లు కనిపించిందని, అయితే దాని వేగం గంటకు 40 మైళ్లు మాత్రమేనని, ఇది గ్రహాంతర వేగం కాదని ఆడమ్ ఫ్రాంక్ చెప్పారు.

“మన వద్ద జేమ్స్ వెబ్ వంటి శక్తివంతమైన టెలిస్కోప్‌లు ఉన్నాయి, ఇవి చాలా కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఇతర గ్రహాలను చూసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అక్కడ ఆక్సిజన్ ఉంటే, ఈ టెలిస్కోప్ దానిని గుర్తించగలదు. అక్కడ ఎలాంటి జీవవైవిధ్యం ఉందో మనకు తెలియజేస్తుంది'' అన్నారు ఫ్రాంక్.

ఏలియన్స్ పేరుతో వచ్చిన చిత్రంలోని దృశ్యం

ఫొటో సోర్స్, ALAMY

భూమి వెలుపల జీవం ఉంటే ఏం జరుగుతుంది?

చెల్సియా హెరెమియా బ్రిటన్‌కు చెందిన SETI సంస్థ పోస్ట్-డిటెక్షన్ హబ్‌లో మెంబర్.

SETI అంటే సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. గ్రహాంతరవాసులను గుర్తిస్తే వారి సాంకేతికతను ఎదుర్కోవడానికి మానవులను సిద్ధం చేయడం దీని పని.

“గ్రహాంతరవాసులను గుర్తిస్తే ఏం చేయాలో మా వద్ద ఎటువంటి ప్లాన్ లేదు. అప్పటి పరిస్థితిపై అది ఆధారపడి ఉంటుంది. మనం న్యాయం, దోపిడీ వంటి అంశాల గురించి ఆలోచించవలసి ఉంటుంది. అధికారంలో ఉన్నవారు తరచూ ఇలాంటివి ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారని మనకు తెలుసు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని గ్రహాంతరవాసులని పిలుస్తున్నాం. వారిని మనుషుల మాదిరి మనం చూడలేం. గ్రహాంతరవాసులను గుర్తించిన తర్వాత వారిని ఎలా సంప్రదించాలి అనేది కూడా ఒక ప్రశ్న'' అని అన్నారు చెల్సియా.

“ఏం జరుగుతుందంటే కొన్ని దేశాలు నైతికంగా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మరికొన్ని అలా చేయవు. కొంతమందికి ఇది అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశంగా భావిస్తారు. కొన్ని ప్రభుత్వాలు గ్రహాంతరవాసులతో సంబంధాన్ని గుత్తాధిపత్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కొందరు వ్యక్తులు వారి గురించిన సమాచారాన్ని పంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు'' అంటున్నారు చెల్సియా.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)