టార్గెట్ కిల్లింగ్స్ మీద అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?

టార్గెట్ కిల్లింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ కెనడాల మధ్య దౌత్య యుద్ధం తారాస్థాయికి చేరింది.

ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెన్సీల హస్తం ఉండొచ్చని ఇటీవలే కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించారు.

తీవ్రమైన ఈ ఆరోపణ తర్వాత భారత్, కెనడా దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారడం మొదలయ్యాయి. ఈ ఆరోపణలను బలపరిచే ఎలాంటి సాక్ష్యాధారాలను ఇంకా కెనడా బయటపెట్టలేదు. అయితే, ఈ అంశంపై మాత్రం అంతటా చర్చ మొదలైంది.

కెనడా ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.

అమెరికా, ఇజ్రాయెల్ వంటి అనేక దేశాలు గతంలో ఇతర దేశాల్లో ‘‘టార్గెట్ కిల్లింగ్’’ నిర్వహించి, తర్వాత నేరుగా ఈ విషయాన్ని అంగీకరించాయి.

ఉదాహరణకు, పాకిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్ హత్య కూడా ‘టార్గెట్ కిల్లింగ్’ కేటగిరీ కిందికే వస్తుంది.

ఇలా చేయడమంటే అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, అమెరికాకు వ్యతిరేకంగా ఎవరూ ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తలేదు.

ఇలాంటి కేసుల్లో అంతర్జాతీయ చట్టం ఏం చెబుతుంది? ఇది తెలుసుకోవడాని కంటే ముందు భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు, వాటికి భారత్‌ స్పందన గురించి చూద్దాం.

హర్దీప్ సింగ్ నిజ్జర్

ఫొటో సోర్స్, FB/VIRSA SINGH VALTOHA

ఫొటో క్యాప్షన్, హర్దీప్ సింగ్ నిజ్జర్

కెనడా ఆరోపణలు

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, సెప్టెంబర్ 18న కెనడా పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఇలా అన్నారు.

"కెనడా గడ్డ మీద ఒక కెనడా పౌరుడిని హత్య చేయడంలో ఏదైనా విదేశీ ప్రభుత్వం ఏ పాత్ర పోషించినా అది మన సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.

ఈ విషయంలో కెనడాకు ఉన్న ఆందోళనలను భారతదేశ అత్యున్నత నిఘా, భద్రతా అధికారులకు తెలియజేశాం.

గత వారం దిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేనే స్వయంగా ఈ విషయం గురించి నేరుగా మాట్లాడాను’’ అని అన్నారు.

ట్రూడో ఆరోపణల తర్వాత భారత్, కెనడాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. మొదటగా కెనడా ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది. భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది .

కెనడాకు వెళ్లే తమ పౌరులకు భారత్ ఒక హెచ్చరికను కూడా జారీ చేసింది. కెనడా పౌరులకు వీసాల జారీని నిలిపివేయలని కూడా భారత్ నిర్ణయించింది.

నిజ్జర్ హత్యలో భారత ఏజెన్సీల హస్తం ఉందని భయాందోళన వ్యక్తం చేసిన తర్వాత, ఈ హత్యకు సంబంధించిన దర్యాప్తులో తమకు సహకరించాలని భారత్‌కు ట్రూడో విజ్ఞప్తి చేశారు.

ఈ దర్యాప్తులో నిజానిజాలు వెలికి తీసేందుకు భారత్ సహకరించాలని ఆయన అన్నారు.

అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కూడా కెనడా ఆరోపణలను తీవ్రమైనవిగా అభివర్ణించాయి. దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను కోరాయి.

మరోవైపు, నిజ్జర్ హత్యకు సంబంధించి తమ ఏజెన్సీలపై వచ్చిన ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం ఈ విషయంపై స్పందించారు. ‘‘ఈ ఆరోపణలకు ముందుగానీ, ఆ ఆరోపణల తర్వాత గానీ కెనడా నుంచి ఎలాంటి ఇంటెలిజెన్స్ సమాచారం అందలేదు. ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉంటే దాన్ని పరిశీలించాలని అనుకుంటున్నాం. కానీ, ఇంకా మాకు ఏ సమాచారం అందలేదు’’ అని అన్నారు.

బిన్ లాడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా వార్తా పత్రికల్లో లాడెన్ మరణ వార్త

'టార్గెట్ కిల్లింగ్'పై మొదలైన చర్చ

నిజ్జర్ హత్యలో తమ ఏజన్సీల ప్రమేయం ఉందనే అంశాన్ని భారత్ ఖండించి ఉండొచ్చు. కానీ, ఈ కేసు తర్వాత విదేశాల్లో జరుగుతున్న హత్యలపై చర్చ మొదలైంది.

అమెరికా, ఇజ్రాయెల్, రష్యా వంటి దేశాలు తమ శత్రువులను విదేశీ గడ్డపై చంపిన సంఘటనల తర్వాత...అంతర్జాతీయ చట్టాలు ఇటువంటి హత్యలకు అనుమతిస్తాయా? అనే చర్చ జరుగుతోంది.

ఏదైనా ఒక దేశం, తమకు శత్రువుగా భావించే వ్యక్తిని విదేశీ గడ్డపై చంపగలదా?

ఒక దేశంలో విదేశీ ఏజెన్సీ 'టార్గెట్ కిల్లింగ్' నిర్వహిస్తే ఆ దేశపు సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందా?

అంతర్జాతీయ చట్టం దీన్ని అనుమతిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.

హర్దీప్ సింగ్ నిజ్జర్

ఫొటో సోర్స్, Getty Images

సార్వభౌమాధికార ధిక్కారం

అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ఒక దేశంలో విదేశీ ఏజెన్సీలు చేసే 'టార్గెట్ కిల్లింగ్' ఆ దేశపు సార్వభౌమాధికారాన్ని ధిక్కారించడంగా పరిగణిస్తారు.

అంతేకాకుండా ఒక దేశం, మరొక దేశపు ప్రాదేశిక సమగ్రతను గౌరవించడానికి కట్టుబడి ఉండాలనే ప్రాథమిక చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తారు.

యూఎన్ చార్టర్‌కు కూడా ఈ చర్య వ్యతిరేకం. సభ్య దేశాలేవీ కూడా ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్యానికి వ్యతిరేకంగా బెదిరింపులు, బలాన్ని ప్రయోగించకూడదని యూఎన్ చార్టర్ పేర్కొంటుంది.

అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా 2011లో పాకిస్తాన్‌లో హతమార్చింది.

ఇది జరిగిన పదేళ్ల తర్వాత ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమానీని ఇరాక్‌లో అమెరికా ఒక డ్రోన్ దాడిలో చంపేసింది.

'టార్గెట్ కిల్లింగ్' కింద చాలా మంది 'పాలస్తీనా తీవ్రవాదులను' చంపినట్లు ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది.

ఇరాన్‌కు చెందిన కొంతమంది అణు శాస్త్రవేత్తలను హత్య చేసినట్లు ఇజ్రాయెల్ మీద ఆరోపణలు ఉన్నాయి.

తమ శత్రువులును లేదా తీవ్రవాదులను చంపే హక్కు ఏ దేశానికైనా ఉందని చెప్పడం ద్వారా ఇలాంటి హత్యలను సమర్థించవచ్చా?

భారత్, కెనడా

ఫొటో సోర్స్, Getty Images

టార్గెట్ కిల్లింగ్స్‌కు అనుకూల, వ్యతిరేక వాదనలు

సాయుధ పోరాట సమయంలో 'శత్రువు'ని చంపే హక్కు తమకు ఉందని ప్రపంచంలోని చాలా దేశాలు అంగీకరించాయి. లాడెన్, సులేమానీ లాంటి వారి హత్యల సమయంలో అమెరికా 'తమ దేశానికి వారు పెను ముప్పు' అని వాదించింది.

ఆత్మరక్షణ కోసం చంపామని చెప్పింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ వాదన చెల్లుతుంది.

కానీ, అలాంటి హత్యలను వ్యతిరేకించేవారు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు మాత్రం ఈ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఎందుకంటే ఈ హత్యలలో టార్గెట్ అయిన వ్యక్తులకు తమ వాదనను వినిపించే అవకాశం ఉండదు.

అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వెబ్‌సైట్ ప్రకారం, సాయుధ సంఘర్షణ జరిగే ప్రాంతం వెలుపల ఒక నిర్దిష్టమైన, తీవ్రమైన, ముప్పు అతి సమీపంలో ఉంటే తప్ప వారిపై బలప్రయోగం చేయరాదని అమెరికా రాజ్యాంగంతోపాటు అంతర్జాతీయ చట్టం కూడా చెబుతోంది.

సాయుధ గ్రూపులకు వ్యతిరేకంగా సైనిక చర్యలు తీసుకునే సమయంలో శత్రువు అమెరికాకు నేరుగా ముప్పుగా మారతాడనుకుంటేనే ప్రాణాలు తీసే స్థాయి చర్యలను చేపట్టాలని నిబంధనలలో ఉందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది.

"ప్రభుత్వం ప్రాణాలు తీసేంత బలప్రయోగానికి దిగినప్పుడు సమీపంలోని పౌరులకు హాని జరగకుండా చూసుకోవాలి. కానీ అమెరికాలో, కార్యనిర్వాహక వర్గ అనుమతితో అలాంటి చర్యలు తీసుకున్నప్పుడు ఈ ప్రమాణాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు" అని పేర్కొంది.

పాకిస్తాన్, సోమాలియా, యెమెన్ తదితర ప్రాంతాల్లో అమెరికా ఇలాంటి ‘టార్గెట్ కిల్లింగ్స్‌’ను అక్రమంగా నిర్వహించిందని అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆరోపించింది. దేశ రాజ్యాంగం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటే అప్పుడు ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ సంస్థ వెబ్‌సైట్ పేర్కొంది.

జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జస్టిన్ ట్రూడో

ఆప్షన్లు ఏమున్నాయి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కెనడా భారతదేశంపై ఆరోపణలు చేసిందే తప్ప ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. అటువంటి పరిస్థితిలో, వారికి ఉన్న ఆప్షన్లు చాలా పరిమితం.

కెనడా ఈ విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్లవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ, అక్కడ వారికి అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెన్సీల ప్రమేయం ఉన్నట్లు రుజువులు ఉంటే, అది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా పరిగణించవచ్చని ఇంటర్నేషనల్ లా ప్రొఫెసర్ మార్కో మిలనోవిక్ చెప్పినట్లు అల్ జజీరా న్యూస్ చానల్ వెల్లడించింది.

అయితే ఈ కేసు అంతర్జాతీయ కోర్టుకు వెళ్లే అవకాశాలు చాలా స్వల్పం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో ఇలాంటి వివాదాలకు సంబంధించిన కేసులు చాలా తక్కువని కూడా ఆయన చెప్పారు.

వాస్తవానికి అంతర్జాతీయ న్యాయస్థానం ఏ కేసునైనా విచారించగలదు. ఒక దేశం వ్యక్తిని, మరొక దేశం హత్య చేసే కేసులు కూడా ఇక్కడ విచారణార్హమే.

అయితే, కామన్వెల్త్‌లోని సభ్య దేశాల మధ్య ఈ కోర్టు అధికార పరిధి చెల్లుబాటు కాదని భారత్, కెనడా రెండూ ప్రకటించాయి.

ఖలిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫైవ్ ఐస్ అలయన్స్

కెనడా కూడా ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్‌లో సభ్య దేశం. ఈ కూటమిలో కెనడాతోపాటు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలున్నాయి.

ఖలిస్తానీ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18న హత్యకు గురయ్యారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇంతకు ముందే హెచ్చరించినట్లు సమాచారం.

ఈ హత్య ఘటనపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి హాజరైన తర్వాత న్యూయార్క్‌లో మాట్లాడుతూ కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యానించారు.

కెనడా నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సలహాదారు జోడీ థామస్ ఆగస్టులో నాలుగు రోజులు, సెప్టెంబర్‌లో ఐదు రోజులు భారతదేశంలో పర్యటించారు.

ప్రస్తుతం తమ ప్రభుత్వం ఈ హత్యకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టలేదని, న్యాయ ప్రక్రియలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ట్రూడో వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, Canada India Tensions: వీసా సేవలు నిలిపివేయడంతో భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)