‘‘నాకు మా అమ్మ బాయ్‌ఫ్రెండ్ అంటే ఇష్టం, అందుకే ఆమెను చంపేశా’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భార్గవ పారిఖ్
- హోదా, బీబీసీ కోసం
“మా అమ్మ బాయ్‌ఫ్రెండ్ వయస్సు నా వయస్సు కంటే రెండింతలు ఉంటుంది. కానీ, నేను అతన్ని ఇష్టపడ్డాను. అతనితో ప్రేమలో పడ్డాను. ఒక రోజు మా అమ్మకు మేం దొరికిపోయాం.
అందుకే నేను మా అమ్మను చంపాను. ఆమె మా ప్రేమకు అడ్డంకిగా మారింది. ఆ రోజు మా కారు బీచ్‌లోని ఇసుకలో చిక్కుకుపోయి ఉండకపోతే, ఈ రోజు నేను అతనితో ఉండేదాన్ని."
పోలీసులకు పట్టుబడిన తర్వాత టీనా (పేరు మార్చాం) చెప్పిన మాటలివి. టీనా మైనర్. ఆమె ఇప్పుడు బాలల నిర్బంధ కేంద్రంలో ఉన్నారు.
ఒక కౌన్సెలర్ సహాయంతో ఆమెతో బీబీసీ మాట్లాడింది. ఆమె గుర్తింపు బయటపడకుండా వివరాలను గోప్యంగా ఉంచుతున్నాం.
టీనా, ఆమె ప్రియుడు యోగేష్ జోతియాను ముద్ర సాగరి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిపై 38 ఏళ్ల గీత (పేరు మార్చాం)ను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గీతను హత్య చేసి ఆమె మృతదేహాన్ని కచ్ దగ్గర్లోని హమీర్ మోర్ గ్రామ సమీపంలో ఉన్న సముద్రంలో విసిరేశారు.
ఈ కేసులో గీత మైనర్ కుమార్తె టీనా, యోగేష్ జోతియాలతో పాటు నరేన్ జోగీ అనే మరో వ్యక్తిని సీఆర్‌పీసీ సెక్షన్ 154, ఐపీసీ సెక్షన్లు 302, 120 (బీ) కింద అరెస్ట్ చేశారు.
గీతకు యోగేష్ జోతియాతో వివాహేతర సంబంధం ఉందని కేసు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కానీ, ఆమె కూతురు టీనా కూడా యోగేష్ పట్ల ఆకర్షితురాలైంది.
టీనా, యోగేష్‌ల అఫైర్ గురించి గీతకు తెలియడంతో ఇద్దరు కలిసి గీతను హత్య చేయాలని కుట్ర పన్నారు. కానీ, ఒక పొరపాటు కారణంగా వారిద్దరూ పోలీసులకు దొరికిపోయారు.

ఫొటో సోర్స్, KACHCHH MITRA
గీత ఎవరు?
గీత, అహ్మదాబాద్‌లో పుట్టి పెరిగారు. ఆమె ఇంటికి సమీపంలో నివసించే ఓ మహిళ ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి బీబీసీకి చెప్పారు.
గీత ఒక పేద కుటుంబంలో పుట్టారు. కమ్మరి పని చేసేవారు. పేదరికం కారణంగా చిన్నతనం నుంచే ఆమె పని చేయాల్సి వచ్చింది.
‘‘గీతకు లేబర్ కాంట్రాక్టర్ అయిన కిశోర్ వెకారియాతో పెళ్లయింది. వీరికి నలుగురు పిల్లలు. అందులో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పిల్లలు పుట్టాక వారు విడాకులు తీసుకున్నారు. తర్వాత కచ్‌లో ఉంటున్న తన సోదరి వద్దకు గీత వెళ్లిపోయారు’’ అని ఆ మహిళ చెప్పారు.
కచ్‌కు చేరుకున్న గీతకు కూలీ పని చేసే ఒక వ్యక్తితో ప్రేమ ఏర్పడింది. ఆయన పేరు జితేంద్ర భట్. ఇద్దరూ ఒకే నిర్మాణ స్థలంలో పని చేసేవారు. తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు.
ఆ సమయంలో గీతతో ఇద్దరు పిల్లలు ఉండేవారు. అందులో ఒకరు ఆరేళ్ల బాలుడు కాగా, మరొకరు ఎనిమిదేళ్ల బాలిక.
ఈ ఇద్దరు పిల్లలను కలిసి పెంచాలని గీత, జితేంద్ర నిర్ణయించుకున్నారు. వీరిద్దరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. అయితే వారి జీవితం అనుకోని మలుపు తిరిగింది.
తన జీవితంలో బాధాకరమైన రోజుల గురించి బీబీసీతో జితేంద్ర భట్ మాట్లాడారు.
‘‘మేం మాదాపర్‌లో డై వర్క్ చేసేటప్పుడు మాకు అక్కడ యోగేష్ జోతియా పరిచయం అయ్యాడు. నేను పనికి వెళ్ళినప్పుడు యోగేష్, నా భార్య రహస్యంగా కలుసుకునేవారు. టీనా కూడా ఈ విషయాన్ని నా నుంచి దాచిపెట్టింది’’ అని జితేంద్ర చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘శరీరంపై ఉన్న దుస్తులను బట్టి మృతదేహం గుర్తింపు’’
ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని జితేంద్ర వివరించారు.
‘‘గీత, యోగేష్‌ల ప్రేమాయణం మొదలైనప్పుడే టీనాను కూడా వలలోకి లాగడం మొదలుపెట్టాడు. టీనా కూడా యోగేష్‌తో ప్రేమలో పడింది. అతనికి తల్లీ కూతురుతో అఫైర్ మొదలైంది.
ఈ విషయంపై గీత, టీనాల మధ్య గొడవ జరిగింది.
నేను జులై 10వ తేదీన పని నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు గీత అంజర్ పట్టణానికి వెళ్లిందని నాకు టీనా చెప్పింది. మరుసటి రోజు తన పిన్నిని కలిసేందుకు టీనా వెళ్లింది. 20 రోజులు గడిచినా గీత ఫోన్ స్విచ్ఛాప్ అని వస్తూనే ఉంది. ఆమె తిరిగి రాకపోవడంతో మాదాపర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశాను’’ అని జితేంద్ర చెప్పారు.
ఒకరోజు ముంద్రా రేవు సమీపంలో దొరికిన ఒక శవం ఫోటోను మాదాపర్ పోలీస్ స్టేషన్‌కు పంపించారు. అప్పుడు గీత చనిపోయినట్లు వారికి తెలిసింది. ఆమె దుస్తులను బట్టి గీత మృతదేహాన్ని గుర్తించినట్లు జితేంద్ర చెప్పారు.
“నేను గీతా వేసుకున్న నల్లటి దుస్తుల్ని చూసి ఆమెను గుర్తు పట్టాను. ఆమె మెడలోని చైన్, నెక్లెస్, లాకెట్ చూడగానే అది గీత అని నాకు అర్థమైపోయింది’’ అని జితేంద్ర తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సముద్రంలో విసిరేసి..
ఈ కేసు వివరాలను ముంద్రా రేపు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ జడేజా వెల్లడించారు.
‘‘జులై 13న, హమీర్ మోరా గ్రామ సమీపంలో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరికింది. మృతదేహాన్ని గుర్తించేందుకు మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత కచ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆ మృతదేహం ఫోటోలను పంపించాం. ఎట్టకేలకు 17 రోజుల తర్వాత మృతదేహానికి సంబంధించిన వివరాలు లభించాయి’’ అని జడేజా చెప్పారు.
మృతదేహం లభించిన ప్రదేశానికి మత్స్యకారులు, పశువుల కాపరులు మాత్రమే తరచుగా వస్తుంటారు. దీంతో పోలీసులు పెద్దగా ఏమీ చేయలేకపోయారు. అయితే, అక్కడున్న మొబైల్ టవర్ల డేటాను వెలికితీయడంతో కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.
‘‘కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతం నుంచి మధ్యాహ్నం 3:18 గంటలకు నరేన్ జోగి అనే ఒక వ్యక్తికి ఫోన్ వెళ్లినట్లు మాకు తెలిసింది’’ అని జడేజా చెప్పారు.
‘‘మాదాపర్ నుంచి యోగేష్ ఒక వ్యాగన్-ఆర్ కారులో ఇక్కడికి వచ్చాడు. అయితే, కారు ఇసుకలో ఇరుక్కుపోవడంతో యోగేష్ రాత్రి నాకు ఫోన్ చేశాడు. అతనికి సహాయం చేస్తున్నప్పుడు, అతని కారులో ఒక మైనర్ బాలిక ఉన్నట్లు నేను చూశాను’’ అని పోలీసులతో నరేన్ జోగి చెప్పారు.
నరేన్ జోగి ఫోన్ కాల్స్ వివరాలను పోలీసులు సేకరించగా, అతనికి జులై 10వ తేదీన యోగేష్ జోతియా కాల్ చేసినట్లు తెలిసింది.
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నరేన్ ఇలా చెప్పారు. ‘‘యోగేష్ తన ప్రియురాలు గీత, ఆమె కూతురు టీనాను షికారు కోసం ఈ ప్రాంతానికి తీసుకువచ్చాడు. నేను కూడా వాళ్ళతో వెళ్ళాను. అక్కడ గీత, యోగేష్‌లు గొడవ పడ్డారు. టీనాను వదిలేయాలని ఆమె యోగేష్‌కు చెప్పింది.
తర్వాత వారు మరింత ఏకాంత ప్రదేశానికి వెళ్లారు. అక్కడ గీతను హత్య చేసి సముద్రంలో పడేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, వారి కారు ఇసుకలో కూరుకుపోయింది. దీంతో రాత్రి మళ్లీ నాకు ఫోన్ చేశారు. నేను కారును బయటకు తీయడంలో వారికి సహాయం చేశాను. అక్కడ నుంచి టీనాను వేరే చోట వదిలిపెట్టి, మేం మాదాపర్‌కు వెళ్లాం’’ అని నరేన్ వివరించారు.
యోగేష్ రాత్రిపూట నరేన్‌కు చేసిన ఫోన్ కాల్‌తో పోలీసులకు ఈ హత్యకు సంబంధించిన క్లూ దొరికింది. దీని సహాయంతో నిందితులను పట్టుకున్నారు.
టీనా, యోగేష్‌లను అరెస్టు అయిన వెంటనే తాము హత్య చేసిన విషయాన్ని అంగీకరించారు.
పీఎస్‌ఐ జడేజా మాట్లాడుతూ, “యోగేష్‌తో సంబంధాన్ని ముగించాలని టీనాపై గీత ఒత్తిడి తెస్తోందని వాంగ్మూలంలో యోగేష్ చెప్పాడు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి షికారుకు వెళ్లినట్లు టీనా చెప్పింది. ఇద్దరూ కలిసి గీతను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేయాలని ప్లాన్ చేశారు. నాలుగు గంటల ప్రయాణం తర్వాత మాదాపర్ నుంచి హమీర్ మోరాకు వెళ్లారు. కానీ, గీతను చంపి ఆమె మృతదేహాన్ని సముద్రంలో విసిరే సమయంలో, వారి కారు ఇసుకలో ఇరుక్కుపోయింది. నరేన్‌కి ఫోన్ చేయాల్సి వచ్చింది. ఆ ఫోన్ వల్ల ఈ నేరం బయటపడింది. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉంచారు’’ అని అన్నారు.
అహ్మదాబాద్‌లో నివసిస్తున్న గీత సోదరుడిని సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. అయితే ఆయన దీనిపై మాట్లాడటానికి నిరాకరించారు.
ఇవి కూడా చదవండి:
- చిత్తూరు: ‘టమోటా సాగుతో కోట్ల రూపాయలు వచ్చాయంటే మేం కూడా పంట వేశాం. తీరా చూస్తే..’
- డిజిటల్ చెల్లింపులతో డబ్బును వృథాగా ఖర్చు చేయడం పెరుగుతోందా?
- మెక్సికో: 'ఏలియన్స్'కు ల్యాబ్‌లో పరీక్షలు, ఫోరెన్సిక్ నిపుణులు ఏం తేల్చారు?
- చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
- జర్మనీ: హిట్లర్ ప్రైవేట్ లైఫ్ గురించి ఆశ్చర్యానికి గురిచేసే నిజాలను బయటపెట్టిన 'వీడియో'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














