చిత్తూరు: మైనర్ బాలిక మృతి మిస్టరీ ఏమిటి? రేప్ చేసి, చంపేశారనేది నిజమేనా? పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తమ బిడ్డను అత్యాచారం చేసి హత్యచేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే, అలాంటిదేమీ జరగలేదని పోలీసులు అంటున్నారు.
నోట్: ఈ కథనంలో కలచి వేసే అంశాలు ఉన్నాయి.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన సుబ్బయ్య (పేరు మార్చాం) 16 ఏళ్ల మైనర్ కుమార్తె అనుమానాస్పద రీతిలో చనిపోయారు.
బాలిక మృతిపై తల్లిదండ్రులు, బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం జుట్టు ఊడిపోయి ఉండటం, ప్యాంటు, లోదుస్తులు లేకపోవడంతో వారు అనుమానిస్తున్నారు.
బాలిక కులానికి చెందిన వడ్డెర సంఘం నాయకులు కూడా ఇది ముమ్మాటికీ హత్యేనని అంటున్నారు.
ఈ కేసుకు సంబంధించి చిత్తూరు పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు.
అయితే, పోలీసులు మాత్రం పోస్టుమార్టం రిపోర్టులో ఎటువంటి గాయాలు లేవని తేలిందని చెప్పారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉందని చిత్తూరు ఏఎస్పీ శ్రీలక్షి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీడియా సమావేశంలో చెప్పారు.
ఈ కేసులో టెక్నికల్, సైంటిఫిక్ ఆధారాలు సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏఎస్పీ శ్రీలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం చెప్పారు.

లైంగిక దాడి జరిగిందా?
“పెనుమూరు పోలీస్ స్టేషన్‌లో 18వ తేదీన తమ అమ్మాయి కనిపించలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. వారి బంధువులు, చుట్టుపక్కల వారితో విచారణ ప్రారంభించాం. ఆ అమ్మాయి వివరాలు సేకరిస్తున్న సమయంలోనే 20వ తేదీన రాత్రి ఆ ఊరికి కొంతదూరంలో ఉన్న బావిలో ఒక అమ్మాయి శవం కనిపించిందని కొందరు సమాచారం ఇచ్చారు. దీంతో అంబులెన్సు కూడా తీసుకెళ్లి మృతదేహాన్ని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి ప్రిజర్వ్ చేశాం. ఇదంతా వీడియోగ్రఫీ కూడా చేశాం. మధ్యవర్తులు, ప్రజల సమక్షంలోనే ఇదంతా జరిగింది. ఆ రోజు చీకటి పడటంతో తర్వాత రోజు అంటే 21న ఉదయం మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో పోస్టుమార్టం జరిగింది’’ అని శ్రీలక్ష్మి వివరించారు.
బాలిక మృతిపై వస్తున్న అనుమానాలపై కూడా పోలీసులు వివరణ ఇచ్చారు. ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
‘‘ఆ అమ్మాయికి గుండు కొట్టారు అని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది మా తదుపరి దర్యాప్తులో తేలుతుంది. బావిలో నుంచి దాదాపు 15 అడుగుల నీళ్లను బయటకు తోడించి, అడుగున ఉన్న జుట్టు కూడా బయటకు తీయించాం. ఒక మంచానికి తాళ్లు కట్టి దించి మృతదేహాన్ని ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్తగా బయటకు తీశాం. సోషల్ మీడియాలో చెబుతున్నట్లు ఆమెను రేప్ చేశారా, ఆమెను ఉరి వేశారా అనే విషయాలు మా తదుపరి దర్యాప్తులో తేలుతాయి’’ అని శ్రీలక్ష్మి చెప్పారు. ఆమెపై రేప్ జరిగిందా లేదా అనేది ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత తేలుతుందన్నారు.

జుట్టు ఎందుకు లేదు?
మూడు రోజులపాటు శవం నీళ్లలో ఉన్నప్పుడు జుట్టు, చర్మం పొరలుగా ఊడటం సర్వ సాధారణమేనని పోలీసులు అన్నారు. దీనికి మరో కేసును కూడా ఉదాహరణగా చెప్పారు.
‘‘బావిలో నుంచి నీళ్లు తోడేసి బాలిక వెంట్రుకలు బయటకు తీశారు. వాటిని కూడా డీఎన్ఏ టెస్టుకు పంపిస్తాం. ఇక్కడ మనం సైంటిఫిక్‌గా గమనిస్తే ఒక శవం నీళ్లలో ఉన్నప్పుడు కొంత చర్మం, జుట్టు లాంటివి ఊడిపోతాయి. ఉదాహరణకు ఇటీవల జరిగిన ఒక నేరానికి సంబంధించిన ఫోటోలు చూసినా వాటిలో జుట్టు ఊడిపోయింది. నీళ్లలో బాడీ మూడు రోజులు పైగా ఉంటే జుట్టు పోతుంది. ముఖంపైన, మిగతా చర్మం.. అంతా పొరలు పొరలుగా ఊడిపోతుంది. నీళ్లలో ఎక్కువ సేపు ఉండటం వల్ల అలా జరుగుతుంది. ఈత కొట్టిన వారికి చూసినా వేళ్లపై నానడం మనం చూడచ్చు. అప్పుడు స్పర్శ కూడా తెలీదు’’ అని ఏఎస్పీ శ్రీలక్ష్మి చెప్పారు.
బాలిక మృతదేహంపై ఎక్కడా గాయాలు లేవని ఆమె చెప్పారు.
తల్లిదండ్రులు ఏమంటున్నారు?
ఆదివారం పని నుంచి వచ్చేసరికి కూతురు కనిపించలేదని బాలిక తండ్రి చెప్పారు. చివరకు బావిలో దొరికిన మృతదేహానికి జుట్టు లేకపోవడం, ప్యాంట్ లేకపోవడం బట్టి రేప్ జరిగినట్లు అనిపిస్తోందన్నారు. తమకు అనుమానం ఉన్న వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
వర్షంలో తడిచి వచ్చిన తన కూతుర్ని బట్టలు మార్చుకోమని చెబితే మార్చుకుందని, తర్వాత ఊళ్లోకి వెళ్తున్నానని చెప్పిన ఆమె మళ్లీ తిరిగి రాలేదని బాలిక తల్లి తెలిపారు.
“ఆదివారం సాయంత్రం 5 గంటలకు వెళ్లింది. తర్వాత తిరిగి రాలేదు. మా పాప కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాం. బుధవారం సాయంత్రం చుట్టుపక్కల పల్లెలంతా వెదికిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం వాళ్లు మీ పాప బావిలో ఉంది అని మాకు చెప్పారు. మాకంటే ముందే పోలీసులు వెళ్లి చూస్తున్నారు. పాప ఘోరంగా ఉంది. గుండు కొట్టేసి, నాలుక బయటికి వచ్చేసి, లెగ్గిన్ లేకుండా దారుణంగా ఉంది. నన్ను తీసుకెళ్లి గుర్తుపట్టమని చెప్పారు. పాప ఉంగరం, గొలుసులు, కమ్మలు, బట్టలు చూసి మా కూతురే అని గుర్తు పట్టాం’’ అని ఆమె వివరించారు.
తమ బిడ్డకు ఈత కూడా వచ్చని, నీళ్లలో దూకి ఎలా చనిపోతుందని తల్లి ప్రశ్నించారు.
“మా పాపను అంత దారుణంగా చంపిన వాళ్లను వదలకూడదు. ఆమె ఆత్మశాంతికైనా మాకు న్యాయం చేయాలి. మా పాపకు ఈత వచ్చు. ఏమీ జరుగకుండా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది. మేం అదే బావిలో ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కూడా వెదికాం. అప్పుడు కనిపించలేదు. బుధవారం రాత్రి అందులో ఎలా శవంగా మారింది. మరో ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరగకూడదు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుని వారిని శిక్షించాలి” అని ఆమె అన్నారు.
అమ్మాయిని బస్టాండులో కొందరు వేధించారని, వాళ్ల వివరాలు పోలీసులకు చెప్పామని ఆమె తెలిపారు.
‘‘కాలేజీ వాళ్లు కాదు, ఊళ్లో పిల్లలూ కాదు, బస్ స్టాండ్‌లో ఉండే పోకిరీల వల్ల ఇంత పని జరిగింది. మా అమ్మాయితో మంచిగా మాట్లాడి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దానికి ఒప్పుకోకపోయే సరికి వాళ్లందరూ కలిసి హింసించి చంపేశారు. గుండు కొట్టి, ఉరి వేసి చంపి, బాయిలో పడేశారని నేను బలంగా నమ్ముతున్నా. చంపేయకపోతే ఈత వచ్చిన పిల్ల బావిలో పడి ఎలా చనిపోతుంది. ఇంట్లో ఏ ఒత్తిడీ లేదు, కాలేజీలో కూడా బాగా చదివే అమ్మాయి. కారణం లేకుండా ఎందుకు చనిపోతుంది” అని అన్నారు.

‘‘చెల్లిని అలా చూస్తానని అనుకోలేదు’’
బీబీసీతో మాట్లాడిన మృతురాలి సోదరుడు కూడా తాము ఎంత వెతికినా చెల్లి కనిపించకపోవడంతో ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
“మా చెల్లి ఆదివారం సాయంత్రం నుంచి కనబడట్లేదు. మొత్తం వెదికాం. సోమవారం కూడా వెదికిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. అప్పటి నుంచి వాళ్లు వెదుకుతున్నామని చెప్పారు. మాకు అనుమానం వచ్చి తన ఫ్రెండ్సును అడిగితే అయిదుగురి పేర్లు చెప్పారు. వారి గురించి పోలీసులకు చెప్పాం. సరే మేం చూసుకుంటాం, కాల్ లిస్ట్ పరిశీలిస్తాం అని చెప్పారు. ఈలోపు 20న రాత్రి బావిలో మృతదేహం తేలిందని చెప్పారు. అది మా చెల్లెలేనా అని మాకు కచ్చితంగా తెలీదు. ఉంగరం, వేసుకున్న బట్టలను బట్టి తనే అని అనుకుంటున్నాం. అలాంటి స్థితిలో మా చెల్లిని చూస్తానని అనుకోలేదు. తనకు జుట్టు లేకపోవడంతో మాకు చాలా అనుమానం వచ్చింది. నాలుక, కనుగుడ్లు బయటికి వచ్చాయి. ప్యాంట్ కూడా లేదు. అందుకే మాకు అనుమానం ఉన్న వారిని కఠినంగా విచారించాలని పోలీసులకు చెప్పాం” అని తెలిపారు.

ఈత వచ్చిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుందా?
బాలికను హత్య చేసి బావిలో పడేసి ఉంటారనే అనుమానాలనే గ్రామస్థులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పారు.
“కేసు దర్యాప్తు చేసిన తర్వాత చెబుతామని మాతో అన్నారు. పోలీసులు జుట్టు కూడా బయటకు తీశారు. తర్వాత ఇప్పటివరకూ మాకు ఏం సమాచారం లేదు. బాలిక మృతదేహానికి జుట్టు ఊడటం, కళ్లు బయటికి వచ్చినట్లు ఉండటం వల్ల అది హత్యేనని మాకు సందేహం ఉంది. ఆ అమ్మాయికి ఈత కూడా వచ్చు. పది అడుగులు కూడా లేని నీళ్లలో ఎలా ఆత్మహత్య చేసుకుంటుంది. వినాయకుడి నిమజ్జనం చేయబోయిన కొందరు మృతదేహాన్ని చూసి మాకు చెప్పారు” అని గ్రామస్థులు అన్నారు.

‘‘ఫోరెన్సిక్ ఆధారాలను బట్టి చర్యలు’’
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితులు మైనర్ అయినప్పుడు వారి పేర్లు, వివరాలు బయటపెట్టకూడదని ఏఎస్పీ శ్రీలక్ష్మి చెప్పారు. దానిని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
‘‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 18 ఏళ్ల లోపు బాలికల పేర్లు ఎక్కడా రాకూడదు. కానీ, వాటిని ఉల్లంఘించి ఆ అమ్మాయి పేరు బయటకు చెబుతున్నారు. వారిపై చర్యలు తీసుకుంటాం. దయచేసి పోలీసుల దర్యాప్తు సాఫీగా జరగనివ్వండి. సోషల్ మీడియాలో కొందరు మేం ఒత్తిళ్లకు తలొగ్గి ఈ కేసులో న్యాయం చేయడం లేదని అంటున్నారు. అలాంటిదేం లేదు. ఇక్కడ ప్రతి దానికీ టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. ఫోరెన్సిక్ నుంచి టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, దీని వెనుక అనుమానితుల పాత్ర కూడా ఉంది అని తేలితే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని శ్రీలక్షి మంగళవారం మధ్యాహ్నం అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మహిళా రిజర్వేషన్ : 'ఒక స్త్రీ ఎదుగుతుంటే ఏ పురుషుడూ సహించడు'
- తెలంగాణ: '10 నెలలుగా మాకు జీతాల్లేవ్, నాన్న వికలాంగ పెన్షనే మాకు దిక్కు’ అంటున్న ఉత్తమ ఉద్యోగి..
- పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకొని కాలి నడకన భారత్ చేరిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ కథ..
- రైలు ప్రమాదాలు: బాధితులకు పరిహారాన్ని 10 రెట్లు పెంచిన రైల్వే బోర్డు.. నిబంధనలు ఇవీ
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















