‘‘ఈ చిన్ని టర్బైన్‌తో మీ కరెంట్ బిల్లు జీరో....20 ఏళ్ల వరకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రూపేశ్ సొన్వానె
- హోదా, బీబీసీ కోసం
“ఈ చిన్న విండ్ ఫామ్ (పవన విద్యుత్ పరికరం)ను ఇన్‌స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు, స్మార్ట్‌ఫోన్ కొనడానికి అయ్యే ఖర్చు ఒకటే. అయితే, దీని వల్ల 20 ఏళ్ల వరకూ ఎలాంటి కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు’’ అని దివ్యరాజ్ సింగ్ సిసోడియా అనే యువకుడు చెబుతున్నారు.
"మూడు కిలోవాట్ల సామర్థ్యమున్న ఈ సౌర విద్యుత్ వ్యవస్థ (సోలార్ పవర్ సిస్టమ్) రెండు నుంచి నాలుగు గంటలు పని చేస్తే, 12 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు.
కానీ, మేం ఏర్పాటు చేసిన విండ్ స్ట్రక్చర్ (పవన విద్యుత్ వ్యవస్థ) రోజుకు 21 యూనిట్ల వరకూ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు" అని దివ్యరాజ్ సింగ్ సహ భాగస్వామి దుంగర్‌సింగ్ సోదా చెప్పారు.
అండర్ గ్రాడ్యుయేట్లు అయిన దుంకర్‌సింగ్ సోదా, దివ్యరాజ్ సింగ్ సిసోడియా ఎలాంటి శిక్షణ లేకుండానే విండ్ పవర్ (పవన విద్యుత్) ఉత్పత్తికి అవసరమైన పరికరాన్ని రూపొందించారు.

ఇద్దరూ కలిసి..
రాజస్థాన్‌కి చెందిన దుంకర్‌సింగ్, గుజరాత్‌లోని జునాగఢ్‌కి చెందిన దివ్యరాజ్ సింగ్ సిసోడియా కలిసి 'సన్ విండ్' అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు.
సన్ విండ్' సహ వ్యవస్థాపకుడు దివ్యరాజ్ సింగ్ బీఏ చదువుతున్నారు.
విద్యుత్ బిల్లులతో ప్రతినెలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులు ఈ విండ్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా, ఆ బాధల నుంచి గట్టెక్కొచ్చని దుంకర్‌సింగ్ సోదా చెబుతున్నారు.
ఈ పరికరం అతి తక్కువ ఖర్చుతో పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా ఏసీ, ఫ్రిజ్, టీవీ వంటి గృహోపకరణాలకు అవసరమయ్యేంత విద్యుత్‌ను తయారు చేయొచ్చని వారు చెబుతున్నారు.
బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలు రోజురోజుకీ తగ్గిపోతుండటంతో, చాలా మంది పునరుత్పాదక (రెన్యూవబుల్ ఎనర్జీ) ఇంధనాలైన పవన విద్యుత్, సౌర విద్యుత్ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఈ నేపథ్యంలో, సన్ విండ్ వంటి స్టార్టప్‌లు పునరుత్పాదక ఇంధన వనరులను (రెన్యువబుల్ ఎనర్జీ రిసోర్సెస్) అందుబాటు ధరల్లో అందించేందుకు ముందుకొస్తున్నాయి. సామాన్యులు నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో ఇలాంటి స్టార్టప్ కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
తక్కువ ఖర్చుతో, చిన్న సైజులో రూపొందించిన ఈ పరికరం నిజంగా పనిచేస్తుందా? కరెంట్ బిల్లును సున్నాకి ఎలా తగ్గిస్తుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు బీబీసీ గుజరాతీ ఈ సన్ విండ్ వ్యవస్థాపకులతో మాట్లాడింది.

ఉద్యోగం వదిలేశాను..
విండ్ పవర్ పరికరం ఎలా తయారు చేశారో దుంకర్‌సింగ్ సోదా వివరించారు.
''మాది రాజస్థాన్. అక్కడ నీటి సమస్య, విద్యుత్ సమస్య ఎక్కువ. తుపాన్లు లాంటివి వస్తే రోజుల తరబడి కరెంట్ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మా గ్రామస్తులు, రైతులు, పట్టణ ప్రాంత ప్రజల కోసం ఏదైనా చేయాలనిపించింది'' అని దుంకర్‌సింగ్ చెప్పారు.
దాని నుంచి గాలిమర ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు జర్నలిస్టు ఉద్యోగాన్ని వదిలేశారు సోదా.
ఏడాదిన్నరగా సామాన్యుల కోసం తక్కువ ధరకే విండ్ టర్బైన్లను రూపొందిస్తున్నారు. దీని కోసం దాదాపు 10 లక్షల రూపాయలు వెచ్చించినట్లు సోదా చెప్పారు.
విండ్ టర్బైన్ల తయారీలో శిక్షణ కూడా తీసుకోలేదని, అంతా సోషల్ మీడియా, ఇంటర్నెట్, పుస్తకాలు చదివి నేర్చుకున్నట్లు చెప్పారు.
ఏదైనా చేయాలనే తపన ఉంటే ఏదీ అడ్డుకోలేదనేందుకు దుంకర్‌సింగ్ ఉదాహరణగా నిలుస్తున్నారు.
“ఇంటి అవసరాలకు ఉపయోగపడేలా విండ్ టర్బైన్లను తయారుచేశాం. వాటిలో ఒక కిలోవాట్ సామర్థ్యమున్న విండ్ ఫామ్ కూడా ఉంది. వాటిలో నిలువుగా ఉండే విండ్ టర్బైన్ మీ కరెంటు బిల్లును సున్నాకి తగ్గిస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో ఈ విండ్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు'' అని ఆయన చెప్పారు.

విండ్ టర్బైన్ ఎలా పనిచేస్తుంది?
దుంకర్‌సింగ్ సోదా తాము తయారు చేసిన విండ్ టర్బైన్‌ల ప్రయోజనాలను వివరించారు.
వెంటిలేషన్ బాగా ఉన్న ప్రదేశంలో, లేదంటే ఇంటి పైన ఈ విండ్ టర్బైన్లను ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని సోదా చెప్పారు.
విండ్ టర్బైన్ల ద్వారా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి పవర్ గ్రిడ్‌కి కూడా పంపించొచ్చని అన్నారు. ఈ విండ్ ఫామ్‌ని అభివృద్ధి చేసేందుకు చాలా కష్టపడ్డానని ఆయన చెప్పారు.
''బయట విడివిడిగా పరికరాలు కొనుగోలు చేయడానికి బదులు, పరికరాలను మేమే తయారు చేసి విండ్ ఫామ్‌ను రూపొందించాం. ఈ డిజైన్‌ను రూపొందించేందుకు చాలా నెలల సమయం పట్టింది'' అని ఆయన చెప్పారు.
ఒక చిన్న విండ్ టర్బైన్, గాలి వేగం 15 కిలోమీటర్లు ఉన్నప్పుడు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని, పెద్ద విండ్ టర్బైన్ గాలి వేగం 5 కిలోమీటర్లు ఉన్నప్పుడు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదని సోదా తెలిపారు.
ఈ విండ్ ఫామ్‌లను ఇళ్లలో, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు.
దీనిని మడతపెట్టి సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చని ఆయన చెబుతున్నారు.
విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లోనూ ఫ్యాన్లు పనిచేసేందుకు, మొబైల్ ఫోన్లు ఛార్జి చేసుకునేందుకు వీటిని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. పర్యాటక ప్రదేశాలు, మారుమూల ప్రాంతాల్లోనూ వీటిని వాడుకోవచ్చని దుంకర్‌సింగ్ సోదా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రూ.5 వేలు బిల్లు తగ్గించుకోవచ్చు..
''ఇంటి అవసరాలకు మాత్రమే కాకుండా రక్షణ రంగంలోనూ ఈ విండ్ టర్బైన్లను వినియోగించొచ్చు. కేవలం పది నిమిషాల్లోనే దీన్ని బిగించుకుని, ఉపయోగంలోకి తీసుకురావొచ్చు. మారుమూల ప్రాంతాల్లో, ఎలాంటి సౌకర్యాలు లేనిచోట భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. వీటి ద్వారా వారు సులభంగా విద్యుత్ సౌకర్యం పొందవచ్చు'' అని సన్ విండ్ సహ వ్యవస్థాపకులు దివ్యరాజ్ సింగ్ అన్నారు.
ఇళ్లలో చిన్న సైజు విండ్ టర్బైన్ బిగించుకోవచ్చని, దాని ద్వారా విద్యుత్ బిల్లు 5 వేల రూపాయల వరకూ తగ్గించుకోవచ్చని ఆయన చెప్పారు.
2022 డిసెంబర్ 31 నాటికి గుజరాత్‌లో 6,835 మెగావాట్ల విండ్ టర్బైన్లు, 6,325 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యంలో తమిళనాడును వెనక్కి నెట్టి గుజరాత్ మొదటి స్థానంలో నిలిచిందని 2023 జులైలో కేంద్ర పునరుత్పాదక ఇంధన (రెన్యువబుల్ ఎనర్జీ) తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














