వనమా రాఘవ: ఏపీ వైపు పారిపోతుండగా అర్ధరాత్రి అరెస్ట్ - ప్రెస్ రివ్యూ

వనమా రాఘవేంద్ర

ఫొటో సోర్స్, facebook/vanamaraghavendra

భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన వనమా రాఘవేంద్రరావు(రాఘవ)ను పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ఓ వాహనంలో భద్రాద్రి జిల్లా దమ్మపేట మీదుగా ఏపీ వైపు పరారవుతుండగా.. కొత్తగూడెం పోలీసులు చింతలపూడి వద్ద నిఘా పెట్టి పట్టుకున్నట్లు భద్రాద్రి ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.

అయితే విచారణ నిమిత్తం రాఘవను ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తారని, విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది.

ఘటన జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉండడంతో ఎక్కడ ఉన్నాడన్నది మిస్టరీగా మారిన విషయం తెలిసిందే.

పాల్వంచ పోలీసులు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అరెస్టు చేశారని, కాదు.. కొత్తగూడెంలోనే అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. కానీ, రాఘవను అరెస్టు చేయలేదని, అతని కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని, ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని పేర్కొంటూ భద్రాద్రి ఎస్పీ గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఒక ప్రకటన విడుదల చేశారు.

రాఘవ ముఖ్య అనుచరులిద్దరిని పాల్వంచ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మరోవైపు పాల్వంచ ఫైనాన్స్‌ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో విచారణ కోసం శుక్రవారం మణుగూరు ఏఎస్సీ ఎదుట హాజరు కావాలంటూ గురువారం అర్ధరాత్రి పాత పాల్వంచలోని రాఘవ తండ్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసానికి పోలీసులు నోటీస్‌ అంటించారు. కానీ, విచారణకు రాఘవ హాజరు కాలేదు.

మరోవైపు వనమా రాఘవేంద్రను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఇందుకు సంబంధించి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌ నూకల నరే్‌షరెడ్డి ప్రకటన చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు’’ అని ఆ కథనంలో రాశారు.

హైదరాబాద్ నగరం

ఫొటో సోర్స్, Twitter/KTR

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ నగరం

ఆర్‌ఆర్‌ఆర్‌.. 4,400 ఎకరాలు

హైదరాబాద్ రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోందని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘ఉత్తర భాగానికి సమీకరించాల్సిన 158.6 కి.మీ. భూమి ఏయే సర్వే నంబర్లలో ఎంతెంత ఉందన్న వివరాల నమోదు పూర్తయింది.

గెజిట్‌ జారీకి వీలుగా దీన్ని ఈ నెల 15న ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కేంద్రంలో అందజేయనున్నారు. భూసేకరణలో ఇదే తొలి ప్రక్రియ.

ఆ వివరాలను పరిశీలించి, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్నాక గెజిట్‌ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత భూసేకరణ వివరాలు ప్రజల ముంగిటికి అధికారికంగా రానున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి కేంద్రం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో, ఇటీవలే దాని అలైన్‌మెంట్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ రోడ్డుకు దాదాపు 4,400 ఎకరాల భూమి అవసరమవుతుందని గుర్తించారు. అలైన్‌మెంట్‌ ఆధారంగా ఈ భూమి ఏయే గ్రామాల పరిధిలో ఎంత అవసరమో ఆ వివరాలతో ఓ నివేదికను తాజాగా సిద్ధం చేశారు.

గెజిట్‌ విడుదల తర్వాత పత్రికా ముఖంగా ప్రచురించి ప్రజల ముంగిట ఉంచుతారు. ఈ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రజలకు 21 రోజుల గడువు ఇవ్వనున్నారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా విలయం.. ఒక్క భారత్‌లో 32 లక్షల మంది చనిపోయారా?

గత ఏడాది సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయానికి దేశవ్యాప్తంగా 2021 సెప్టెంబర్‌ నాటికే దేశంలో దాదాపు 32లక్షల కొవిడ్‌ మరణాలు సంభవించి ఉండవచ్చని తాజా అధ్యయనం అంచనా వేసిందని ‘ఈనాడు’ కథనం తెలిపింది.

‘‘ఇందుకు సంబంధించిన తాజా అధ్యయనం జర్నల్‌ సైన్స్‌లో ప్రచురితమైంది. డెల్టా వేరియంట్‌ ప్రభావానికి గతేడాది భారత్‌ వణికిపోయింది. రోజూవారి కేసుల సంఖ్య గరిష్ఠంగా 4లక్షలకు చేరింది. దీంతో లక్షల మంది కొవిడ్‌ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడాయి. ముఖ్యంగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరతతో కొవిడ్‌ బాధితులు అల్లాడిపోయారు.

అదే సమయంలో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటోకు చెందిన ప్రొఫెసర్‌ ప్రభాత్‌ ఝా నేతృత్వంలో ఓ సర్వే జరిగింది.

అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 2020 నుంచి జులై 2021 మధ్యకాలంలో చేపట్టిన ఆ సర్వేలో.. లక్షా 37వేల మంది నుంచి వివరాలు సేకరించారు. ఆ సమయంలో చోటుచేసుకున్న మొత్తం మరణాల్లో దాదాపు 29శాతం అనగా.. 32లక్షల కొవిడ్‌ మరణాలు కొవిడ్‌ కారణంగానే జరిగినట్లు అంచనా వేశారు. కేవలం ఏప్రిల్‌-జులై 2021 మధ్యకాలంలోనే 27లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కగట్టారు’’ అని ఆ కథనంలో తెలిపారు.

హరీశ్ రావు

ఫొటో సోర్స్, TRSHARISH/FACEBOOK

తెలంగాణ పీహెచ్‌సీలలో కోవిడ్ టెస్టింగ్ కిట్‌లు

కరోనా థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారని ‘వెలుగు’ పత్రిక పేర్కొంది.

‘‘అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో డోసు వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేసి.. వైద్యసేవల్లో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలన్నారు.

15 నుంచి 18 ఏండ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని ఆదేశించారు. అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్ సీల్లో ఐసోలేషన్ కిట్లు, పరీక్ష కిట్లు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

లక్షణాలు ఉంటే పరీక్ష చేసి, వెంటనే కిట్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని రోజువారీగా పరిశీలించాలన్నారు.

ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి అప్పులపాలు కావొద్దని.. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందన్నారు.కరోనాపై పోరులో వివిధ శాఖలతో పాటు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్న హరీశ్ రావు.. వ్యాక్సినేషన్ పట్ల ప్రజలను చైతన్య పరచాలన్నారు. నాన్ కరోనా సేవలకు ఎలాంటి అంతరాయం కలగొద్దని సూచించారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)