జవాన్: షారుఖ్ ఖాన్ 'పఠాన్' సక్సెస్ రిపీట్ చేశారా?

ఫొటో సోర్స్, @VijaySethuOffl
- రచయిత, భవానీ ఫణి
- హోదా, బీబీసీ కోసం
జవాన్.. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ది డబల్ రోల్ అని.. మెట్రో హైజాక్, గన్ మాఫియా లాంటి ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయనీ ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది.
పేరు జవాన్ కావడంతో దేశభక్తికి చెందిన సినిమా అన్న అంచనాకు కూడా ముందే వచ్చి ఉంటాం.
దేశభక్తి కంటే కూడా సోషల్ మెసేజ్‌లు ఇచ్చే వైపు ఎక్కువగా నడిపిస్తూ, పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా షారుఖ్‌కు చూపించడానికి తనదైన కమర్షియల్ పద్ధతిలో అట్లీ చేసిన ప్రయత్నమే ఈ జవాన్.

ఫొటో సోర్స్, @jawanfilm
ఎవరెవరు ఏం చేశారు?
తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమాతో, ఫీమేల్ లీడ్‌గా నయన తార బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు.
కమర్షియల్‌గా మంచి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజైన ఈ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్స్‌ను సౌత్, నార్త్ రెండు ప్రాంతాల నుంచీ తీసుకున్నారు.
సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తే, ఎడిటింగ్ వర్క్ రూబెన్ చూసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ గా జి. కే. విష్ణు పనిచేసారు.
రూ. 300 కోట్ల బడ్జెట్‌తో, భారీ విజువల్స్‌తో ఈ సినిమాని నిర్మించారు.
పుణె, ముంబయి, హైదరాబాద్, చెన్నై, ఔరంగాబాద్, రాజస్థాన్ లాంటి ప్రాంతాలలో ఈ సినిమా చిత్రీకరించారు.

ఫొటో సోర్స్, @jawanfilm
కథ ఏమిటి?
షారుఖ్ ఇంకా ఆరుగురు అమ్మాయిల గ్యాంగ్ కలిసి కొన్ని కొన్ని నేరాలు చేస్తూ ఉంటారు.
వాళ్ళలా ఎందుకు చేస్తున్నారు, అసలు వాళ్లందరికీ ఉన్న కనెక్షన్ ఏమిటి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏమిటి, షారుఖ్ ఖాన్‌ను తండ్రీ కొడుకులుగా చూపించే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లైన్ ఏమిటి, విలన్ కాళీ వల్ల వీళ్ళు ఎదుర్కొన్న ప్రమాదాలు ఏమిటి, విలన్ల బారినుంచి హీరో సమాజాన్ని ఎలా కాపాడాడు అన్నది సినిమా కథ.
కథ నడిచిన విధానం ఎలా ఉంది?
చాలా గ్రాండ్‌గా, సినిమా మీద ఎన్నో ఆశల్ని కల్పిస్తూ మొదలవుతుంది ఈ జవాన్.
అద్భుతమైన కలర్ గ్రేడింగ్‌తో, ముఖాల మీద కదలాడే ఇంటెన్స్ కెమెరా మూమెంట్స్‌తో, డిఫరెంట్ గా అనిపించే యాక్షన్ సీక్వెన్స్ తో సినిమాని కమర్షియల్ గానే కాక, క్రిటికల్‌గా కూడా సక్సెస్ చెయ్యాలని దర్శకుడు ప్రయత్నించాడా అనిపించే విధంగా మొదలయ్యే ఈ సినిమా, ఇంటర్వెల్ వరకూ కూడా అదే ఇంటెన్సిటీని మోసుకెళ్తుంది.
అరగంటకే సినిమా సోషల్ మెసేజింగ్ దిశగా వెళ్తోందనీ, ఇక మీదట అదే దారిలో నడవబోతోందనీ అర్థమవుతూ ఉన్నా, మంచి సినిమాటోగ్రఫీ, ఇంటెన్స్ కలర్ ప్యాలెట్‌లు, డిఫరెంట్ గా ఉండే యాక్షన్ సనివేశాలు సినిమా చాలా వేగంగా, ఇంట్రస్టింగ్ గా నడుస్తోన్న ఫీల్ ని కలుగజేస్తాయి.

ఫొటో సోర్స్, @jawanfilm
సమాజానికి పట్టిన అనేక రకాల చీడల్ని వదిలించడమే పనిగా హీరో చేసే ప్రయత్నాలను యాక్షన్ తో కలిపి చూపిస్తూ, ఎక్కడా ప్రేక్షకుడికి ఆసక్తి తగ్గకూడని విధంగా ఉండాలని చేసిన ప్రయత్నంలో, ఇక కాసేపటికి స్క్రీన్ ప్లే దారి తప్పిపోతుంది.
ఇటువంటి యాక్షన్ సినిమాని పూర్తిగా అదే ట్రాక్ లో నడిపి ఉన్నా బాగుండేది.
ఎమోషనల్ సీన్స్ కూడా ఉండటం వల్ల సినిమా మరింత బలంగా ఉంటుందని దర్శకుడి నమ్మకం కాబోలు, ఎక్కడ దొరికితే అక్కడ వాటినీ వాడాడు. కానీ ఇన్ని స్టోరీ లైన్ల మధ్యన సరిగా కనెక్షన్ కుదరకపోవడం వలన, ఏ పార్ట్ కి ఆ పార్ట్ గా అక్కడివరకూ మాత్రమే ఇంపాక్ట్ ఇస్తూ, పూర్తిగా ఒక ఫీల్ ని క్యారీ చెయ్యడంలో ఫెయిల్ కావడంతో సినిమా సెకండ్ హాఫ్ డొల్లగా మారిపోతుంది.
అప్పటికి కథేమిటో, ఇక మీదట ఏం జరగబోతోందో పూర్తిగా అర్థం అయిపోవడంతో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మాత్రమే మిగులుతాయి.
మొదటి సగంలో కెమెరా వర్క్ మీదా, కలర్ గ్రేడింగ్ మీదా కనిపించిన శ్రద్ధ కూడా మాయమై పోయి కేవలం బలమైన యాక్షన్ సీక్వెన్స్ ల మీదకీ, షారుఖ్ స్క్రీన్ ప్రెజెన్స్ మీదకీ ఫోకస్ పూర్తిగా వెళ్ళిపోతుంది.
పైగా ఇక నించీ ఇది యాక్షన్ కామెడీ గా కూడా మారిపోతుంది.
మొత్తంగా చూస్తే కథ పరంగా ఒకటి కాక అనేక తెలిసిన కథల్ని కలిపి, వాటిని యాక్షన్ అనే కాగితంతో చుట్ట చుట్టి పొట్లం కట్టి అందివ్వాలని అట్లీ చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా ఈ సినిమాని కమర్షియల్ సినిమాగా మారుస్తుంది.
విలన్ పాత్రకు ఏ మాత్రం వెయిట్ లేకపోవడం, కేవలం హీరోకి, అతను కాపాడాలనుకునే సమాజానికీ ఇబ్బందులు కలిగించడానికి మాత్రమే ఉండటం కూడా ఇంకో డ్రా బ్యాక్.

ఫొటో సోర్స్, @VijaySethuOffl
షారుఖ్, నయనతార, విజయ్ సేతుపతి కాంబినేషన్ ఎలా ఉంది?
ఇది పూర్తిగా షారుఖ్ సినిమా. అతని కోసమే డిజైన్ చేసినట్టుగా ఉండటం వల్ల అతనికి నటించే స్కోప్ ఎక్కువగా ఉంది.
తన న్యాచురల్ ఈజ్‌తో బాగా చేశాడు కూడా.
విజయ్ సేతుపతి కూడా విలన్‌గా తనకిచ్చిన పాత్ర పరిధిలో బాగా నటించాడు.
నయనతారకి పెద్దగా నటనకి అవకాశం లేదు. చూడటానికి బావుంది.
దీపికా పదుకోణ్, సంజయ్ దత్‌ల పాత్రలు మాత్రం ఓవర్ గ్లామరస్‌గా ఉన్నాయి.
టెక్నికల్ గా ఎలా ఉంది?
ముందుగా అనుకున్నట్టుగానే కెమెరా వర్క్, వరల్డ్ బిల్డింగ్, కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ కలిపి మొదటి సగం సినిమా వరకూ చాలా బావున్నాయి.
తర్వాత కూడా అంత గొప్పగా కాకపోయినా పర్వాలేదనిపించేలానే ఉన్నాయి.
యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం - ఫస్ట్ హాఫ్ లో డిఫరెంట్ గా, ఎగ్జైటింగ్ గా ఉంటే, సెకండ్ హాఫ్‌లో కూల్‌గా, గ్రాండ్‌గా ఉన్నాయి.
పాటల విషయానికి వస్తే చలే ఆ, జిందా బందా పాటలు, సినిమా రిలీజ్ కి ముందే బాగా హిట్ అయ్యాయి.
అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హెవీ గా, యాక్షన్ సీక్వెన్స్ లని ఎలివేట్ చేసే విధంగా ఉంది.

ఫొటో సోర్స్, @VijaySethuOffl
ఓవరాల్ గా ఎలా ఉంది?
యాక్షన్ సినిమాలని ఇష్టపడేవారు, షారుఖ్ అభిమానులూ తప్పక చూడాల్సిన సినిమా.
అవేమీ అవసరం లేదనుకునే ప్రేక్షకుడు కూడా ఓసారి చూడచ్చు.
పెద్దగా బోర్ కొట్టకుండా - గ్రాండ్ విజువల్స్ కాసేపూ, షారుఖ్ కాసేపూ సినిమాని మోసుకెళ్తారు.
అన్నిరకాల స్టోరీ ఆర్క్స్ లేకుండా ఉండి, ఏదో ఒక పాయింట్ మీద ఇంకాస్త బలంగా కథ రాసుకుని ఉంటే, టెక్నికల్ ఎలిమెంట్స్ లోని రిచ్‌నెస్‌ను సినిమా చివరివరకూ క్యారీ చేసి ఉంటే, ఇది ఇంకాస్త మంచి సినిమా అయి ఉండేది.
(అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా రివ్యూ: అనుష్క గ్లామర్, నవీన్ కామెడీ మిక్చర్ వర్కవుట్ అయిందా?
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














