ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు: నాలుగేళ్లలో రెండు సార్లు కొత్త సిలబస్, ఇప్పుడు ‘ఐబీ’.. మరి టీచర్ల సంగతేంటి?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో గడచిన నాలుగేళ్లలో రెండుసార్లు కొత్త సిలబస్ తెచ్చారు. ఇప్పుడు మళ్లీ ఐబీ పేరుతో కొత్త సిలబస్ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
2019 వరకూ పూర్తిగా స్టేట్ సిలబస్‌తో నడిచిన ప్రభుత్వ స్కూళ్లలో ఆ తర్వాత సీబీఎస్ఈ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందించిన పాఠ్యాంశాలు బోధించడం మొదలైంది. దానికి తోడుగా బైజూస్ కంటెంట్ కూడా జత చేశారు.
సీబీఎస్ఈ, బైజూస్‌కు తోడుగా ఇప్పుడు ఐబీ(ఇంటర్నేషనల్ బకాల్యురేట్) పేరుతో అంతర్జాతీయ సిలబస్ ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా ఐబీ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
ఈ నేపథ్యంలో ఏపీ విద్యారంగంలో వస్తున్న మార్పులేంటి, అవి దేనికి సంకేతం అనేవి చర్చనీయమయ్యాయి.

2020-21 నుంచి సీబీఎస్‌ఈ సిలబస్
2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 41 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని ప్రభుత్వం చెబుతోంది.
తెలుగు మాధ్యమం కూడా కొనసాగించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఇందులోనూ బోధిస్తున్నప్పటికీ, తెలుగు మీడియాన్ని ఎంచుకున్న వారు కనిపించడం లేదు.
ఇంగ్లిష్ మీడియం కోసమంటూ స్టేట్ సిలబస్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం తగ్గించేసింది. వాస్తవానికి దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో రూపొందించిన సిలబస్ మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రైవేటు స్కూళ్లలో ఆయా యాజమాన్యాలు వివిధ రకాల సిలబస్‌లు అనుసరించినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం స్టేట్ సిలబస్ చదవాల్సి ఉండేది.
ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం 2020-21లో సీబీఎస్ఈలోకి మారింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను క్రమంగా సీబీఎస్ఈ అనుబంధంగా మారుస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఏటా కొన్ని స్కూళ్లకు సీబీఎస్ఈ అనుమతి సాధిస్తోంది.

ఫొటో సోర్స్, BYJU'S
2021-22 నుంచి బైజూస్ కంటెంట్
సీబీఎస్ఈతో పాటుగా అప్పటికే ఉన్న సిలబస్‌ని బైలింగ్వల్ పేరుతో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండేలా మార్పు చేశారు. 2020-21 నుంచే తెలుగుతోపాటు అవే పాఠ్యాంశాలు ఇంగ్లిష్‌లో కూడా అందుబాటులో ఉంచుతూ, విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు కూడా పంచారు.
రెండు భాషల్లో పక్క పక్క పేజీల్లో అదే సిలబస్ అందుబాటులో ఉంచడం ద్వారా పిల్లల్లో ఇంగ్లిష్ జ్ఞానం పెంచే ప్రయత్నం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది.
2021-22 నుంచి బైజూస్ కంటెంట్ తోడయ్యింది.
8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధించే టీచర్లకు కలిపి మొత్తం 5.18 లక్షల వరకూ ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఆ ట్యాబ్స్‌లో బైజూస్ సంస్థ అందించిన కంటెంట్ విద్యార్థులకు అందించారు. అయితే, వాటి వల్ల జరిగిన ప్రయోజనం ఎంతనేదానిపై సందేహాలున్నాయి.
బైజూస్ కంటెంట్ బోధించేందుకు తగ్గట్టుగా ఉపాధ్యాయులకు శిక్షణ లేకుండా ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వం మాత్రం బైజూస్ కంటెంట్ పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల మేలు కలుగుతుందని చెబుతోంది.
ఇప్పుడు వాటికి తోడుగా కొత్తగా ఐబీతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఐబీ (ఇంటర్నేషనల్ బకాల్యురేట్) సిలబస్‌తో ఇక అంతర్జాతీయ ప్రమాణాలు అందుబాటులోకి వచ్చేస్తున్నట్టు చెబుతోంది.
ఐబీతో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కోసం పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాధికారులతో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు.
జీవో నంబరు 81 విడుదల చేసిన ప్రభుత్వం రెండు వర్కింగ్ కమిటీలతోపాటు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సారథ్యంలో స్క్రీనింగ్ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీల నివేదికను అనుసరించి ఏపీ విద్యారంగంలో ఐబీ సిలబస్ అమలు ఉంటుందని చెబుతోంది.

ఫొటో సోర్స్, UGC
ఐబీ వస్తే ఏమవుతుంది?
ఇటీవల ఉన్నత విద్యాభ్యాసంతోపాటు ఉపాధి అవకాశాల కోసం వివిధ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరిగింది. అందులో తెలుగువారు అత్యధికంగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 2022లో అమెరికా వంటి దేశాల నుంచి వీసాలు పొందిన వారి సంఖ్యను పరిశీలిస్తే, టాప్ 10 నగరాల్లో ఏపీ, తెలంగాణకు చెందిన నగరాలు ఆరు ఉండడం దానికి సంకేతం.
ఇప్పుడు ఐబీ సిలబస్ ద్వారా అంతర్జాతీయ ఉపాధి వేటలో ఏపీకి చెందిన విద్యార్థులు ముందంజ వేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
"ఇప్పటికే టోఫెల్ కోసం విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. దాని వల్ల సత్ఫలితాలు వస్తాయి. ఐబీ కూడా తోడైతే ఇంటర్నేషల్ మార్కెట్లో ఏపీ విద్యార్థులు మరింత రాణిస్తారు. ముఖ్యంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, వీఆర్ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగంలో ముందంజ వేసేందుకు దోహదపడుతుంది. అందుకు తగ్గట్టుగానే మార్పులు తెస్తున్నాం.
ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ ఒప్పందాన్ని అనుసరించి విద్యార్థులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. దాని అమలు విషయాన్ని పరిశీలించి కార్యాచరణ రూపొందించే కమిటీలు ఏర్పడ్డాయి" అంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బీబీసీకి తెలిపారు.
ఇప్పటికే హైస్కూళ్లలో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్పీ)లతోపాటు ప్రైమరీ స్కూళ్లలో 10,038 స్మార్ట్ టీవీల ఏర్పాటు కూడా పూర్తవుతోందని ఆయన చెప్పారు.

ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య ఎందుకు తగ్గింది?
విద్యారంగంలో మార్పులను అందరూ ఆహ్వానిస్తారని, కానీ మితిమీరిన ప్రయోగాలతో మేలు కన్నా కీడు ఎక్కువగా జరుగుతుందేమోననే అభిప్రాయం వ్యక్తం చేశారు విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం.
"ప్రభుత్వ విద్యారంగంలో సంస్కరణలు ఆహ్వానించాలి. కానీ అవి సత్ఫలితాన్నిచ్చేలా ఉండాలి. బైజూస్ కంటెంట్ పేరుతో ట్యాబ్ ఇచ్చి ఏడాది గడుస్తోంది. దాని వల్ల ఏం మేలు కలుగుతుందన్నది పరిశీలించారా? డిక్షనరీలు పంచడం బాగుంది. కానీ దాని వినియోగం మీద ఎంత శ్రద్ధ పెట్టగలిగారు? నాడు-నేడుతో స్కూళ్లను బాగు చేసినప్పటికీ ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య ఎందుకు తగ్గిందన్నది ఆలోచించాలి కదా" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం 2021-22 నాటితో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరం 2023-24 జూన్ ఆఖరు నాటికి నాలుగు లక్షల మంది పైబడి విద్యార్థులు తగ్గిపోయారు.
విద్యారంగం ప్రయోగశాల కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
సీబీఎస్ఈ తీసుకొచ్చి రెండేళ్లు తిరగకముందే మళ్లీ బైజూస్, ఇప్పుడు ఐబీ అంటూ చేస్తున్న ప్రయత్నాల వల్ల ప్రయోజనం దక్కాలంటే తొలుత బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు జరగాలని ఆయన చెప్పారు
ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా సిలబస్ మార్చితే ఏం ఉపయోగమని బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు.
టీచర్లను సిద్ధం చేశారా?
గతంతో పోలిస్తే ప్రభుత్వ విద్యారంగంలో వస్తున్న మార్పులు ఆశాజనకంగా ఉన్నాయని, కానీ ఫలితాల కోసం వేచిచూడకుండా పదేపదే సిలబస్ మార్చడం మాత్రం తగదని రిటైర్డ్ విద్యాశాఖాధికారి పి.రామలింగేశ్వర రావు అన్నారు.
"స్కూల్ బాగుపడింది. ఫర్నీచర్ అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ పేరుతో ఐఎఫ్పీ ప్యానెళ్లు వంటివి కూడా స్కూళ్లలో వినియోగిస్తున్నారు. ట్యాబ్స్ పంపిణీ కూడా ఉపయోగకరమే. కానీ, వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే టెక్నాలజీ ద్వారా ప్రయోజనం దక్కుతుంది.
ఇప్పుడు కొత్తగా మరో సిలబస్ ప్రవేశపెట్టడానికి కారణాలు ఏమిటన్నది అంతుబట్టడం లేదు. సిలబస్ మారుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా టీచర్లను సిద్ధం చేయడం కోసం అవసరమైనంత కృషి జరగడం లేదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
కొన్నేళ్ల పాటు సీబీఎస్ఈ సిలబస్ కొనసాగించడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే బైజూస్, ఐబీ వంటి వాటితో కొంత గందరగోళం ఏర్పడడమే తప్ప కొత్తగా కలిసొచ్చేది ఏమిటనేది అర్థం కావడం లేదని రామలింగేశ్వర రావు వ్యాఖ్యానించారు.
విద్యారంగంలో అనుభవమున్న పలువురి నుంచి భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఐబీతో ఒప్పందాన్ని ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ : జగన్ చెప్పినట్టు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- చిత్తూరు: మైనర్ బాలిక మృతి మిస్టరీ ఏమిటి? రేప్ చేసి, చంపేశారనేది నిజమేనా? పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది?
- గుడ్ సమారిటన్: రోడ్డు ప్రమాదంలో బాధితులను కాపాడితే 5 వేలు, ఉత్తమ ప్రాణదాతకు లక్ష.. ఏమిటీ కేంద్ర ప్రభుత్వ పథకం?
- వైసీపీ వారికి సర్వీస్ అందించబోమన్న జెనెక్స్: కులాల వారీగా గూగుల్ రేటింగ్స్?
- రాజమండ్రి సెంట్రల్ జైల్: ముగ్గురు మాజీ సీఎంలు ఖైదీలుగా గడిపిన ఈ జైలు ప్రత్యేకతలు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














