గుడ్ సమారిటన్: రోడ్డు ప్రమాదంలో బాధితులను కాపాడితే 5 వేలు, ఉత్తమ ప్రాణదాతకు లక్ష.. ఏమిటీ కేంద్ర ప్రభుత్వ పథకం?

రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్య అనితను బండి మీద ఎక్కించుకుని స్కూల్ వద్ద దింపేందుకు ఎప్పటిలాగే బయలుదేరిన ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ బండి అదుపు తప్పడంతో కిందపడిపోయారు. అటుగా వస్తున్న వాహనం వీరిపై నుంచి వెళ్లిపోయింది.

ఈ ప్రమాదంలో కిరణ్ కుమార్ రెండు కాళ్లు నుజ్జునుజ్జైపోయాయి. అనిత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తపోవనం సర్కిల్ రోడ్డులో 2023 ఆగస్టు 10వ తేదీన జరిగింది.

“సర్, కాపాడండి సర్... నాకు ఇద్దరు పిల్లలున్నారు సర్” అంటూ రక్తపు మడుగులో ఉన్న కానిస్టేబుల్ కిరణ్ అక్కడున్న వారిని వేడుకున్నారు. వెంటనే కొందరు 108కి ఫోన్ చేశారు. కానీ ఎవరూ ప్రమాదానికి గురైన దంపతులను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అంబులెన్స్ కూడా 20 నిముషాలకుగానీ రాలేదు. ఆ తర్వాత కిరణ్ కుమార్‌ని ఆసుపత్రికి తీసుకెళ్లినా సమయం మించిపోయింది, చనిపోయాడంటూ వైద్యులు చెప్పారు.

‘గోల్డెన్ అవర్’ అంటే?

సమయానికి తీసుకొచ్చి ఉంటే ప్రాణాలు కాపాడి ఉండేవాళ్లమని వైద్యులు చెప్పారు.

సమయానికి అంటే ‘గోల్డెన్ అవర్’ లో అని అర్థం.

సాధారణంగా ప్రమాదం జరిగిన తర్వాత గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అని వైద్యులు చెబుతారు. అలాంటి గోల్డెన్ అవర్‌లో బాధితులకు సరైన వైద్య సహాయం అందక ప్రమాద స్థలంలోనే ఉంటారు.

ఎంతో ముఖ్యమైన ఆ సమయంలో ఘటనా స్థలంలో ప్రమాదాన్ని సెల్‌ఫోన్లలో షూట్ చేసేవారు ఎక్కువవుతున్నారు కానీ, ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసే వాళ్లు అరుదుగా ఉంటున్నారు.

దీంతో అనేక ప్రాణాలు కాపాడే అవకాశమున్నా, ఆ పని చేయలేకపోతున్నామని వైద్యులు అంటున్నారు.

పోలీసులు కేసులు పెడతారేమో, స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనన్న భయం వల్లేనని పీజీ విద్యార్థిని పి. స్వప్న బీబీసీతో చెప్పారు. తనకూ ఆ భయం ఉందని ఆమె చెప్పారు.

ఆ తర్వాత రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం తమ కళాశాలలో నిర్వహించినప్పుడు ప్రమాద స్థలంలో గాయపడిన వారిని, అత్యవసర వైద్య సహాయం కావలసిన వారికి సహాయం చేస్తే గుర్తింపుతోపాటు ప్రోత్సాహక బహుమతులు కూడా వస్తాయని తెలిసిందని స్వప్న చెప్పారు.

గుడ్ సమారిటాన్

ఫొటో సోర్స్, UGC

గుడ్ సమారిటన్‌కు రూ.5 వేలు, సర్టిఫికెట్

భయాలను పక్కన పెట్టి క్షతగాత్రులను కాపాడే ప్రయత్న చేసిన వారికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ గుర్తిస్తుంది. వారికి రూ. 5 వేల నగదు ప్రోత్సాహంతో పాటు ‘ప్రాణదాత’ (Good Samaritan) అని పోలీసు శాఖ నుంచి సర్టిఫికెట్ కూడా ఇస్తుంది.

దేశవ్యాప్తంగా ప్రాణాలు కాపాడిన వారి జాబితా నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.లక్ష చొప్పున రివార్డునూ ఇస్తారు. ఒక వ్యక్తి, ప్రమాద స్థలం నుంచి ఎంత మంది బాధితులను అసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడితే ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ప్రజల్లో ప్రమాద బాధితులకు సాయం చేయాలనే స్పృహ పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 21న ఈ స్కీం తీసుకొచ్చింది. ఇది 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీనికి అవసరమయ్యే నిధులను కేంద్రమే ఇస్తుంది. ఈ పథకం ఆయా జిల్లాల్లోని పోలీసులు, కలెక్టర్ కార్యాలయాలు, రవాణాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.

ఈ స్కీం అమల్లోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్న సందర్భంగా ప్రజలకు దీనిపై ఎంత అవగాహన ఉంది? ఈ స్కీంపై పోలీసులు ఏం చెప్తున్నారు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలను శాంపిల్‌గా తీసుకుని, ఈ జిల్లాల్లో ఇప్పటి వరకు ఎంత మంది ‘గుడ్ సమారిటన్’ సర్టిపికెట్ పొందారనే వివరాలను బీబీసీ సేకరించింది.

“అనంతపురంలో కానిస్టేబుల్ కిరణ్‌కు జరిగినట్లే అనేక మందికి జరుగుతూనే ఉంది. ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తపు మడుగు మధ్య పడి ఉంటారు. 108కి ఫోన్ చేస్తారు కానీ, స్పాట్ లోనే ఉన్నా కూడా వారి సొంత వాహనంలో ఎక్కించుకుని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సాహసించరు.

అలా తీసుకెళ్తే పోలీస్ కేసుల్లో చిక్కుకుంటామేమోనని, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనన్న భయం. కానీ, ఆ భయాలను పక్కన పెట్టి ప్రమాద బాధితులను త్వరగా దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం ద్వారా వారి ప్రాణాన్ని కాపాడొచ్చు” అని అనకాపల్లి జిల్లా డీఎస్పీ పి. శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు. ఆయన జిల్లా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ ఇన్‌ఛార్జి కూడా.

రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

గుడ్ సమారిటన్స్ ఎంత మంది?

“అనకాపల్లి జిల్లాలో ‘గుడ్ సమారిటన్’ కార్యక్రమంపై పలు కార్యక్రమాలు నిర్వహించాం. ప్రమాద స్థలం నుంచి గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్తే పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అవగాహన తరగతులు పెట్టాం.

‘గుడ్ సమారిటన్’ కార్యక్రమంపై కరపత్రాలు ముద్రించి పంచాం. కార్యక్రమం విజయవంతమైంది. కానీ ఇప్పటి వరకూ అనకాపల్లి జిల్లాలో ఏ ఒక్కరూ ఈ సర్టిఫికెట్ మాత్రం పొందలేదు.

అనకాపల్లి జిల్లాలో ఎక్కువ భాగం నేషనల్ హైవే ఉంది. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. కానీ, ప్రజలు వారంతట వారే క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లిన సంఘటన ఒక్కటీ నమోదు కాలేదు” అని డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు.

అనకాపల్లి జిల్లాలో 2021-22 నడుమ ఏడాది కాలంలో 748 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 347 మంది చనిపోయారు.

2022-23 సంవత్సరంలో ఇప్పటి వరకూ 696 ప్రమాదాలు జరగ్గా 311 మంది చనిపోయారు. మరెంతోమంది గాయపడ్డారు. వెళ్తున్న దారిలో కళ్ల ముందు ప్రమాదం జరిగినా చాలా మంది ఏమైందని ఆరా తీసి వెళ్లిపోతుంటారు. కానీ, క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చడానికి ముందుకొస్తున్న వారు దాదాపుగా లేరనే పోలీస్ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

108కి ఫోన్ చేయండి, కానీ..

ప్రమాదం జరిగినప్పుడు ఎంత త్వరగా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిచగలిగితే క్షతగాత్రులను చాలా వరకూ కాపాడగలమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 108 వాహనం రావడం ఒక్కోసారి ఆలస్యం కావొచ్చు. అందుకే 108 కోసం ఎదురు చూడకుండా, వెంటనే అక్కడున్న వారు సొంత వాహనమో, మరెవరి వాహనంపైనైనా వైద్యం అవసరమైన బాధితులను ఆసుపత్రిలో చేర్చడానికి ముందుకు రావాలని కోరుతున్నారు.

''వెంటనే స్పందిస్తే... బాధితుల ప్రాణాలు కాపాడగలిగిన వారవుతారు. ఘటనా స్థలంలో ఉండి కూడా మనం ఏ విధమైన సహాయం చేయకుండా ఉండిపోవడమంటే, ఆ నిర్లక్ష్యం ఖరీదు ఒక్కొక్కసారి బాధితుల ప్రాణాలు కావొచ్చు.

అందుకే ఆసుపత్రికి తీసుకెళ్లడంలో వెంటనే స్పందించండి. దాని వలన వారికి ప్రాణాపాయం తప్పడంతో పాటు ఆపరేషన్లు, అవయవాలు తొలగింపు వంటి పరిస్థితులను నివారించవచ్చు'' అని విశాఖకు చెందిన డాక్టర్ ఉమేష్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఇలా చేసిన వారిలో ఒక్కొక్కరికి రూ.లక్ష వరకూ కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం ఇస్తుంది

‘మీరు కాపాడే ఆ ప్రాణం విలువైనది’

ప్రమాద స్థలాల్లో తక్షణం స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకుని వెళ్లేవారికి ప్రభుత్వం తరఫున 'గుడ్ సమారిటన్' ప్రోత్సాహక నగదు బహుమతి అందిస్తున్న విషయంపై చాలా మందికి అవగాహన లేదని అధికారులు గుర్తించారు.

అందుకే మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువతకు అవగాహన కల్పించేలా రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని విశాఖ పోలీసులు తెలిపారు. అయితే, విశాఖలో కూడా గుడ్ సమారిటన్ సర్టిఫికెట్ అందుకున్న వారు లేరని పోలీసు అధికారులు తెలిపారు.

''ప్రభుత్వం ఇచ్చే డబ్బు, పోలీసులు ఇచ్చే సర్టిఫికెట్ కాదు ముఖ్యం. మీ వల్ల నిలబడిన ప్రాణం ఎంత విలువైనదంటే... అది ఆ కుటుంబ యాజమానిది కావచ్చు. అంటే, మీరు ఆ కుటుంబంలో ఉన్న నలుగురైదుగురి ప్రాణాలు కాపాడినట్లే లెక్క.

ఆ కుటుంబంలోని వారందరికి మీరే హీరో అవుతారు. పైగా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఎందరికి వస్తుంది? అలాంటి అవకాశం ఉన్నప్పుడు లేనిపోని అపోహలతో బాధితుల ప్రాణాలను రిస్క్‌లో పడేయకండి. ముందుకు అడుగేయండి, మంచి పౌరులనిపించుకోండి” అని అనకాపల్లి జిల్లా డీఎస్పీ శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

బాధితులను ప్రమాద స్థలం నుంచి తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత ఇక పోలీసులు, ఆసుపత్రులే మిగతా పనిని చూసుకుంటాయి. కాపాడిన వారిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టరు’’ అని శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.

రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో హైదరాబాద్- బెంగళూరు రహదారిపై జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు.

కాపాడేవారికి ఇబ్బందులు ఉండవు: కలెక్టర్ మల్లికార్జున

పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు సాయం చేద్దామంటే భయంగా ఉంటుందని ఐటీ ఉద్యోగి వినయ్ కుమార్ చెప్పారు.

రుషికొండ ఐటీ సెజ్‌లో పని చేసే తాను తరుచూ బీచ్ రోడ్డులో ప్రమాదాలు చూస్తుంటానని, బాధితులకు సహాయం చేస్తే తనకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయోననే భయంతో అయ్యో పాపం అనుకుని వెళ్లిపోతుంటానని చెప్పారు.

“ప్రమాద స్థలంలో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేరిస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయనే అపోహల్లో చాలా మంది ఉంటారు. అలాంటివేమి ఉండవు. క్షతగాత్రులను తమ వాహనాలపై తీసుకెళ్లి ఆసుపత్రుల్లో జాయిన్ చేసిన వారిపై ఎటువంటి కేసులు పెట్టరు.

పైగా, ఆసుపత్రిలో సకాలంలో చేర్చి ప్రాణాలను నిలిపేవారిని ‘గుడ్ సమారిటన్’ గా గుర్తించి రూ.5 వేల నగదు బహుమతిని అందిస్తాం. వారి వివరాలు గోప్యంగా ఉంచాలని కోరితే అలానే చేస్తాం. ప్రతి నెలా రహదారి భద్రత సమావేశం జరుగుతుంది. దాంట్లో గుడ్ సమారిటన్ కార్యక్రమం గురించి ప్రచారం చేస్తున్నాం” అని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)