చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల మీద ఆశ వదులుకోవాల్సిందేనా? అవి మేల్కొనే అవకాశం లేదా?

ఫొటో సోర్స్, ISRO
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై మళ్లీ నిద్రలేచే అవకాశాలు ప్రతీ గంట గడిచినకొద్దీ మసకబారుతున్నాయని బీబీసీతో అంతరిక్ష శాస్త్రవేత్తలు చెప్పారు.
లునార్ డే (చంద్రుని మీద ఒక రోజు) ముగిసేంతవరకు ల్యాండర్‌తో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని వారు తెలిపారు.
లునార్ డే అంటే భూమిపై సుమారు 28 రోజులతో సమానం. అంటే చంద్రుని మీద సుమారు 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది.
చంద్రుని మీద కొత్త లునార్ డే మొదలైనప్పటి నుంచి ల్యాండర్, రోవర్‌ను కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని, కానీ వాటి నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందలేదని శుక్రవారం ఇస్రో చెప్పింది.
ప్రజ్ఞాన్ రోవర్‌ను తీసుకెళ్లిన విక్రమ్ ల్యాండర్, ఆగస్టులో చంద్రుని దక్షిణ ధ్రువం మీద దిగింది.

ఫొటో సోర్స్, ISRO
చంద్రుని మీద ఫోటోలు తీస్తూ సమాచారం సేకరిస్తూ రెండు వారాలు ల్యాండర్, రోవర్ అక్కడే గడిపాయి.
ఈ రెండు వారాల తర్వాత, చంద్రుని మీద రాత్రి సమయం ఏర్పడటంతో వాటిని స్లీప్ మోడ్‌లో ఉంచారు.
సెప్టెంబర్ 22న చంద్రుని మీద మళ్లీ పగలు ప్రారంభం కానుండటంతో వాటి బ్యాటరీలు రీచార్జ్ అవుతాయని, మాడ్యుల్స్ తిరిగి పని చేస్తాయని భావించినట్లు ఇస్రో గతంలోనే చెప్పింది.
‘‘విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కమ్యూనికేషన్‌ను నిర్మించే ప్రయత్నాలు కొనసాగుతాయి’’ అని శుక్రవారం ఇస్రో ట్వీట్ చేసింది.
అప్పటినుంచి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు.
రోజులు, గంటలు గడిచినకొద్దీ వాటిని నిద్రలేపే అవకాశాలు మసకబారుతున్నాయని శుక్రవారం బీబీసీతో ఇస్రో మాజీ చీఫ్ ఏఎస్ కిరణ్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, ISRO
‘‘చంద్రుని మీద ఉండే కఠిన శీతల ఉష్ణోగ్రతలకు ల్యాండర్, రోవర్‌లోని చాలా భాగాలు పని చేయడం మానేసి ఉండొచ్చు’’ అని కిరణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. లునార్ దక్షిణ ధ్రువం దగ్గర రాత్రిపూట -200 సెల్సియస్ నుంచి -250 సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు ఉంటాయని అన్నారు.
‘‘ల్యాండర్‌లోని ట్రాన్స్‌మిటర్ ఆన్ అయితే తప్ప కనెక్టివిటీ కుదరదు. అది సజీవంగా ఉన్నట్లు మాకు సిగ్నల్ పంపాలి. వేరే ఉప వ్యవస్థలు పనిచేసినప్పటికీ, వాటి గురించి మేం తెలుసుకునే మార్గం లేదు’’ అని ఆయన చెప్పారు.
ఇస్రో అధికార ప్రతినిధి కూడా దీనిపై మాట్లాడారు. ల్యాండర్, రోవర్‌లను కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో అంతరిక్ష నౌకను క్షేమంగా ల్యాండ్ చేసిన తొలి దేశంగా చంద్రయాన్-3 మిషన్‌తో భారత్ చరిత్ర సృష్టించింది.

ఫొటో సోర్స్, NASA'S GODDARD SPACE FLIGHT CENTER
అమెరికా, సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైన ఎలైట్ దేశాల క్లబ్‌లో భారత్ కూడా చేరింది.
చంద్రుని మీద పగలు ఉన్న సమయంలోనే చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యేలా పక్కా ప్రణాళికలు చేశారు. చంద్రుని మీద సూర్యకాంతిలో రెండు వారాల పాటు విక్రమ్, ప్రజ్ఞాన్‌లు పని చేసేందుకు వీలుగా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.
విక్రమ్ ల్యాండర్, రోవర్‌ల కదలికలు, అన్వేషణలు, ఫోటోలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్రో అందరితో పంచుకుంది.
వాటిని స్లీప్ మోడ్‌లో పెట్టే ముందు ఒక ప్రకటన చేసిన ఇస్రో...ల్యాండర్, రోవర్‌లు తమకు నిర్దేశించిన పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాయని చెప్పింది.
తర్వాతి లునార్ డే వచ్చాక ఆ రెండూ మేల్కొంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
చైనాకు చెందిన చాంగ్ ఈ-4 ల్యాండర్, యుటు-2 రోవర్లు సూర్యకాంతిలో చాలాసార్లు మేల్కొన్న ఘటనలను ఇందుకు ఉదాహరణగా నిపుణులు సూచించారు.
ఒకవేళ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు నిద్ర లేవకపోతే చంద్రుని మీద భారత రాయబారులుగా అలాగే ఉండిపోతాయని ఇస్రో చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- చిత్తూరు: ‘టమోటా సాగుతో కోట్ల రూపాయలు వచ్చాయంటే మేం కూడా పంట వేశాం. తీరా చూస్తే..’
- డిజిటల్ చెల్లింపులతో డబ్బును వృథాగా ఖర్చు చేయడం పెరుగుతోందా?
- మెక్సికో: 'ఏలియన్స్'కు ల్యాబ్‌లో పరీక్షలు, ఫోరెన్సిక్ నిపుణులు ఏం తేల్చారు?
- చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
- జర్మనీ: హిట్లర్ ప్రైవేట్ లైఫ్ గురించి ఆశ్చర్యానికి గురిచేసే నిజాలను బయటపెట్టిన 'వీడియో'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















