‘విరాట్ కోహ్లీ నా అల్లుడు‌ లాంటోడు’ అని షారుఖ్‌ ఖాన్ ఎప్పుడు అన్నారు?

అనుష్క శర్మ, షారుఖ్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాలో భలే మాట్లాడుతుంటారు. ఆయన ఇచ్చే సమాధానాలు, చెప్పే సంగతులు తరచూ వైరల్ అవుతుంటాయి.

బుధవారం సాయంత్రం కూడా ఇలానే ఎక్స్(ట్విటర్) వేదికగా #AskSrk సెషన్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన అభిమానులు చాలా ప్రశ్నలు అడిగారు.

విరాట్ కోహ్లీతో మొదలుపెట్టి, జవాన్ సినిమా వసూళ్ల వరకూ ఆయన అభిమానులు చాలా ప్రశ్నలు వేశారు. వీటిపై షారుఖ్ కూడా అంతే ఉత్సాహంగా స్పందించారు.

జవాన్ స్టైల్‌లో విరాట్ కోహ్లీ గురించి ఏమైనా చెప్పండని మొదట ఓ అభిమాని షారుఖ్‌ను అడిగారు. దీనికి సమాధానంగా ‘‘విరాట్ అంటే నాకు చాలా ఇష్టం. తను మా ఇంట్లో వ్యక్తి లాంటివాడు. అతడి కోసం నేను ఎప్పుడూ దేవుడిని ప్రార్థిస్తుంటాను. తను నాకు అల్లుడు లాంటివాడు’’ అని షారుఖ్ సమాధానం ఇచ్చారు.

అనుష్క శర్మ, షారుఖ్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

షారుఖ్, అనుష్క శర్మ ఎన్ని సినిమాల్లో కలిసి నటించారు?

అనుష్క శర్మ తన కెరియర్‌ను 2008నాటి షారుఖ్ సినిమా ‘రబ్ నే బనా దీ జోడీ’తో మొదలుపెట్టారు.

షారుఖ్, అనుష్క‌లు నాలుగు సినిమాల్లో కలిసి నటించారు.

  • జబ్ తక్ హై జాన్
  • జబ్ హ్యారీ మీట్ సెజల్
  • జీరో
  • రబ్‌ నే బనా దీ జోడీ

అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ల సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్’లోనూ ఒక సీన్‌లో షారుఖ్ కనిపిస్తారు.

జీరో, హ్యారీ మెట్ సెజల్‌లను పక్కన పెడితే మిగతా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలతో అనుబంధం

షారుఖ్, విరాట్‌ల మధ్య ‘దిల్లీ కనెక్షన్’ ఉంది. అంటే వీరిద్దరూ దిల్లీకి చెందినవారే.

దిల్లీ గురించి ఒక ఇంటర్వ్యూలో అనుష్క శర్మ కూడా మాట్లాడారు.

‘‘అందరూ నన్ను దిల్లీ అమ్మాయినని అనుకుంటారు. ఎందుకంటే ‘బ్యాండ్ బాజా బారాత్’లో నేను పశ్చిమ దిల్లీలోని జనక్‌పురీ ప్రాంతంలో జీవించే అమ్మాయి పాత్ర పోషించాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. విరాట్ కోహ్లీ బాల్యం మొత్తం పశ్చిమ దిల్లీలోనే గడిచింది’’ అని ఆమె చెప్పారు.

ఇదివరకు కూడా కొన్ని సందర్భాల్లో కోహ్లీ, అనుష్క, షారుఖ్‌ల మధ్య సాన్నిహిత్యం కనిపించింది.

ఈ ఏడాది జనవరి 25న షారుఖ్ సినిమా పఠాన్ విడుదలైంది. ఆ తర్వాత కొన్నాళ్లకే ఐపీఎల్ టోర్నమెంటు నిర్వహించారు. అప్పుడు గ్రౌండ్‌లో షారుఖ్ ‘ఝూమే జో పఠాన్’ పాటకు విరాట్ కోహ్లీ డ్యాన్స్ వేస్తూ కనిపించాడు.

కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. కలకత్తా నైట్ రైడర్స్ టీమ్‌కు షారుఖ్ యజమాని.

అయితే, ఏప్రిల్‌లో కోహ్లీని షారుక్ ఆలింగనం చేసుకుంటున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాడీవేడీ చర్చలు పెడుతున్న సమయంలో ఈ ఫోటో షేర్ చేశారు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

ఫొటో సోర్స్, Getty Images

షారుఖ్ గురించి అనుష్క ఏం చెబుతారు?

అనుష్క శర్మ, షారుఖ్ ఖాన్‌ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. చాలాసార్లు వీరిద్దరూ ఒకరి గురించి మరికొరు ప్రేమగా మాట్లాడుతూ కనిపించారు.

ఏడాది క్రితం ఒక టీవీ షోలో షారుఖ్ ఉన్నప్పుడు అనుష్కను డైరెక్టర్ సాజిద్ ఖాన్ ఒక ప్రశ్న అడిగారు. ‘‘షారుఖ్ నుంచి ఒక వస్తువును దొంగలించే అవకాశం వస్తే.. దేన్ని ఎంచుకుంటావు?’’ అని ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా ‘‘చాలా వస్తువులు ఉన్నాయి. షారుఖ్ వాచ్ కలెక్షన్ దొంగతనం చేసి అమ్మేయాలి. ఆయన ఇల్లు మన్నత్‌ను కూడా దొంగలించాలి’’ అని ఆమె అన్నారు.

దీనిపై షారుఖ్ మాట్లాడుతూ.. ‘‘కనీసం నా వ్యాన్ అయినా వదిలిపెట్టు. లేకపోతే నేనెక్కడ ఉంటాను?’’ అని అన్నారు. వెంటనే అనుష్క మాట్లాడుతూ.. ‘హా.. ఆ వ్యాన్ కూడా నాకు కావాలి’’ అని అన్నారు.

మరో ఇంటర్వ్యూలోనూ షారుఖ్ గురించి అనుష్క శర్మ మాట్లాడారు.

‘‘షారుఖ్ నా జీవితంలో చాలా ముఖ్యమైనవారు. మొదటి సినిమా నుంచీ ఆయన నాతో చాలా బావున్నారు. ఒక వ్యక్తిగా ఆయన చాలా మారారు. అలానే షారుఖ్‌తో నా బంధం కూడా మారింది. ఏ విషయం గురించైనా ఆయనతో మాట్లాడే చనువు నాకుంది’’ అని ఆమె చెప్పారు.

షారుఖ్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

షారుఖ్‌తో మొదటి సినిమా గురించి అనుష్క మాట్లాడుతూ.. ‘‘మొదట్లో షారుఖ్‌తో మాట్లాడాలంటే భయంగా అనిపించేది. అసలు నేను ఏదైనా మాట్లాడితే ఆయన ఏం అనుకుంటారోనని ఆలోచించేదాన్ని. కానీ, ఇప్పుడలా కాదు’’ అని ఆమె అన్నారు.

‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ ప్రమోషన్‌లో భాగంగా 2017లో ఒక టీవీ చానెల్‌కు షారుఖ్, అనుష్క ఇంటర్వ్యూ ఇచ్చారు.

అప్పుడు అనుష్క గురించి షారుఖ్ మాట్లాడారు. ‘‘టైమ్ పాటించడమంటే అనుష్క కొంచెం పిచ్చి. షూటింగ్ తొమ్మిది కంటే తను 8.45కే వచ్చేస్తుంది. మేం మొదటి సినిమా తీసినప్పుడైతే తనకు కొత్త, పైగా ఉత్సాహంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఆమెకు అలవాటు పడ్డాయి. అయినా కూడా అలానే ముందుగా వచ్చి కూర్చుంటే ఎలా? నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది’’ అని షారుఖ్ అన్నారు.

వెంటనే అనుష్క గట్టిగా నవ్వుతూ.. ‘ఇది నాన్‌సెన్స్’ అని అన్నారు.

మరో ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. ‘‘నేను ఎక్కువగా మాట్లాడను. కానీ, షారుఖ్ ప్రత్యేకమైనవారు. ఏదైనా మాట్లాడితే ఆయన ఏమైనా అనుకుంటారేమోనని భయపడాల్సిన పనిలేదు’’ అని ఆమె చెప్పారు.

షారుఖ్ కూడా అనుష్క గురించి మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరూ కలిసి కూర్చొని స్నేహితులం అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, మాట్లాడటం మొదలుపెడితే అలానే మాట్లాడుతూ ఉంటాం. ఇతరుల ప్రైవసీని అనుష్క గౌరవిస్తుంది. అది నాకు బాగా నచ్చుతుంది’’ అని ఆయన అన్నారు.

షారుఖ్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

షారుఖ్ సమాధానాలు

తాజా ‘ఆస్క్ ఎస్ఆర్‌కే’ సెషన్‌లో మరికొన్ని ప్రశ్నలకూ షారుఖ్ సరదాగా సమాధానాలు చెప్పారు.

మీరు తలకు రంగు వేసుకుంటారా? అని ఒక వ్యక్తి షారుఖ్‌ను అడిగారు. దీనిపై స్పందిస్తూ ‘‘అవును.. కొంచెం వెసుకుంటాను’’ అని సమాధానం చెప్పారు.

‘‘సర్ జవాన్ విడుదలైన తర్వాతే కోటికి ఏడు జీరోలు ఉంటాయని నాకు తెలిసింది’’ అని వ్యాఖ్యలు చేయగా.. ‘‘బాబు.. ఆ జీరోను మళ్లీ ఇప్పుడు నాకు గుర్తుచేయకు’’ అని అన్నారు. షారుఖ్ నటించిన జీరో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

క్రిస్మస్‌ను పురస్కరించుకొని షారుఖ్ తర్వాత సినిమా డంకీ విడుదల అవుతోంది. దీనికి రాజ్‌కుమర్ హిరానీ దర్శకుడు. ఇంకా మీరు ఈ సినిమా ట్రైలర్ ఎందుకు విడుదల చేయలేదు? అని ఒక యూజర్ ప్రశ్నించారు.

‘‘వస్తున్నాం సర్. ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ బిజీగా ఉండిపోయాను. వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. త్వరలోనే మళ్లీ థియేటర్లలో కలుద్దాం’’ అని షారుఖ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, జాన్వీ కపూర్ ఇంటర్వ్యూ: ‘...అలాంటి కామెంట్ల వల్ల సినిమాలే మానేద్దామనుకున్నా’

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)