కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు

కేసీఆర్, అనంతుల మదన్ మోహన్

ఫొటో సోర్స్, CMO Telangana / UGC

ఫొటో క్యాప్షన్, కేసీఆర్, అనంతుల మదన్ మోహన్
    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1983వ సంవత్సరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అందులో సిద్దిపేట నియోజకవర్గం కూడా ఒకటి.

అప్పటికి మెదక్ జిల్లాలో ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనంతుల మదన్ మోహన్‌ను ఆ పార్టీ మళ్లీ బరిలో దించింది.

బీజేపీ నుంచి ఆయనపై నిమ్మ నర్సింహరెడ్డి పోటీ చేశారు.

అప్పటికి కొద్ది నెలల కిందటే నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా సిద్దిపేట నుంచి తన అభ్యర్థిని పోటీలో నిలిపింది.

ఆ టీడీపీ అభ్యర్థి కూడా కొత్తవారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు అదే తొలిసారి. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్).

అనంతుల మదన్ మోహన్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి అప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 ఎన్నికలు ఆయనకు నాలుగో అసెంబ్లీ ఎన్నికలు.

అప్పటికి మొత్తం 1,12,576 మంది ఓటర్లు ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలో 65.01 శాతం పోలింగ్ జరిగింది. 73,189 ఓట్లు పోలయ్యాయి.

అందులో కాంగ్రెస్ అభ్యర్థి అనంతుల మదన్ మోహన్‌కు 28,766 ఓట్లు వచ్చాయి.

టీడీపీ నుంచి పోటీ చేసిన కేసీఆర్‌ 27,889 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి నిమ్మ నర్సింహరెడ్డికి 13,358 ఓట్లు వచ్చాయి.

దాంతో అనంతుల మదన్ మోహన్ తన సమీప అభ్యర్థి కేసీఆర్‌పై 887 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

KCR

ఫొటో సోర్స్, Getty Images

మదన్ మోహన్‌ను రెండుసార్లు ఓడించిన కేసీఆర్

కేసీఆర్‌కు అవే తొలి ఎన్నికలు. తొలి ఎన్నికలలో ఆయనకు పరాజయం ఎదురైంది. అయితే, ఆ తరువాత కేసీఆర్‌ మళ్లీ ఓడిపోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు వరుసగా ఆయన చట్టసభలకు ఎన్నికవుతూనే ఉన్నారు.

ఈ 13 సార్లలో 8 సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికవగా 5 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

తన తొలి ఎన్నికలలో ఓటమి రుచి చూపించిన అనంతుల మదన్ మోహన్‌ను కేసీఆర్ తరువాత కాలంలో రెండు సార్లు ఓడించారు.

1989, 1994 అసెంబ్లీ ఎన్నికలలో అనంతుల మదన్ మోహన్‌పై సిద్దిపేట నియోజకవర్గంలో కేసీఆర్ గెలిచారు.

కేసీఆర్ 1985 నుంచి క్రమంగా ఎదుగుతూ, రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.

anantula madan mohan

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అనంతుల మదన్ మోహన్

ఎవరీ అనంతుల మదన్ మోహన్?

అనంతుల మదన్ మోహన్‌ను కేసీఆర్‌కు రాజకీయ గురువుగా చెప్తారు.

న్యాయవాద వృత్తిలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో, రాజకీయాలలో మదన్ మోహన్ చురుగ్గా ఉండేవారు.

కేసీఆర్ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో, కాంగ్రెస్‌లో ఉన్న కాలంలో మదన్ మోహన్‌ ఆయన్ను ప్రోత్సహించారు.

అనంతరం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో కేసీఆర్ అందులో చేరి సిద్దిపేటలో అనంతులపై పోటీ చేశారు.

అనంతుల మదన్ మోహన్ 1969 సిద్దిపేట ఉప ఎన్నికలతో తన అసెంబ్లీ ప్రస్థానం ప్రారంభించారని ఆయన సోదరుడు అనంతుల శ్యామ్ మోహన్ ‘బీబీసీ’తో చెప్పారు.

అనంతుల శ్యామ్ మోహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ‘ఇంటలెక్చ్చువల్ సెల్’ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

అప్పటి రాజకీయ పరిణామాలను ఆయన ‘బీబీసీ’కి వివరించారు.

విద్యార్థి దశ నుంచే తన అన్నగారు మదన్ మోహన్‌కు దేశం, సమాజం పట్ల ఆలోచన ఉండేదని చెప్పారు.

అందుకు ఉదాహరణగా ఆయన తన చిన్నతనంలో జరిగిన ఓ ఘటనను ‘బీబీసీ’తో చెప్పారు.

‘స్వాతంత్ర్యం రావడానికి కొంతకాలం ముందు విద్యార్థిగా ఉన్నప్పుడు అన్నయ్య ఓ లేఖ రాశారు. దేశమంతా స్వాతంత్ర్య పోరాటం ఉద్ధృతంగా సాగుతున్నా సిద్దిపేటలో అలాంటి వాతావరణం లేకపోవడంతో ఆవేదన చెందిన ఆయన ఆ వివరాలతో సియాసత్ పత్రికకు లేఖ రాసి పోస్ట్ చేశారు.

అయితే, అప్పటికి రాజకీయ వాతావరణం చాలా సెన్సిటివ్‌గా ఉండడంతో ఆ లేఖ పత్రికలో వస్తే అన్నయ్యను అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అప్పటికి పోస్ట్ మాస్టర్‌గా ఉన్న అతను దాన్ని పంపించకుండా మా తండ్రికి తెచ్చి ఇచ్చారు. విద్యార్థి దశ నుంచి అన్నగారికి దేశభక్తి, రాజకీయ చైతన్యం, భావజాలం ఉన్నాయనడానికి ఆ ఘటన ఉదాహరణ’’ అని శ్యామ్ మోహన్ చెప్పారు.

నిజాం కాలేజ్‌లో చదువుతున్నప్పుడు అక్కడ ఉర్దూ సంఘం అధ్యక్షుడిగా ఉంటూ తన మార్క్ చూపించుకున్నారని, ఆ తరువాత జనగామలో ఉంటూ లా ప్రాక్టీస్ చేశారని, అక్కడ యువకులు, మేధావులు, నాయకులతో సోషలిస్ట్ ఫోరం ఏర్పాటు చేశారని చెప్పారు.

‘సోషల్, పొలిటికల్ కన్సెర్న్ ఆయనకు మొదటి నుంచి ఉండేది’ అని శ్యామ్ మోహన్ చెప్పారు.

అనంతరం వరంగల్ కేంద్రంగా రాజకీయాలలో చురుగ్గా మారారని, రాజకీయంగా అందరితో సత్సంబంధాలు పెంచుకున్నారని చెప్పారు.

రాజీవ్ గాంధీతో అనంతుల మదన్ మోహన్

ఫొటో సోర్స్, Anantula Shyam Mohan

ఫొటో క్యాప్షన్, రాజీవ్ గాంధీతో అనంతుల మదన్ మోహన్

అయిదుగురి సీఎంల కేబినెట్లలో పనిచేసిన మంత్రి

1967లో సిద్దిపేట నుంచి గెలిచిన వల్లూరి బసవరాజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.

దాంతో 1969లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలలో అనంతుల మదన్ మోహన్ తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి పీవీ రాజేశ్వరరావు పోటీ చేశారు.

31,633 ఓట్లు సాధించిన అనంతుల ఆ ఎన్నికలలో గెలిచారు. అనంతరం 1972, 1979 ఎన్నికలలోనూ అనంతుల మదన్ మోహన్ విజయం సాధించారు. 1983లో ఆయన కేసీఆర్‌పై గెలిచారు.

పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, టంగుటూరి అంజయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డిల మంత్రివర్గాలలో ఆయన పనిచేశారు.

రెవెన్యూ, ఆరోగ్యం, విద్యా శాఖ వంటి కీలక శాఖలకు ఆయన మంత్రిగా పనిచేశారు.

1983 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 200కిపైగా సీట్లు గెలుచుకుని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అనంతుల మదన్ మోహన్ వ్యవహరించారు.

1985లో ఆయన ఎన్నికలలో పోటీ చేయలేదు. 1989, 1994 ఎన్నికలలో సిద్దిపేటలోనే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండు సార్లూ కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు.

2004లో ఆయన మరణించారు.

మదన్ మోహన్ ముఖ్యమంత్రి కావాలని చెన్నారెడ్డి వంటి నేతలు కోరుకున్నారని శ్యామ్ మోహన్ చెప్పారు.

అనంతుల మదన్ మోహన్, కేసీఆర్

ఫొటో సోర్స్, Anantula Shyam Mohan

ఫొటో క్యాప్షన్, అనంతుల మదన్ మోహన్, కేసీఆర్

కేసీఆర్‌ను అన్నయ్య ప్రోత్సహించారు: మదన్ మోహన్ సోదరుడు శ్యామ్ మోహన్

కేసీఆర్‌ను అనంతుల మదన్ మోహన్ రాజకీయంగా ప్రోత్సహించారని, సొంత తమ్ముడిలా చూసుకున్నారని అనంతుల శ్యామ్ మోహన్ చెప్పారు.

1969లో సిద్దిపేటల ఉప ఎన్నికలో మదన్ మోహన్ పోటీ చేసినప్పటికి కేసీఆర్ స్టూడెంట్ అని.. కేసీఆర్ అన్న కల్వకుంట్ల రంగారావు తన సోదరుడు అనంతుల మదన్ మోహన్‌కు సన్నిహితులని శ్యామ్ మోహన్ చెప్పారు.

కల్వకుంట్ల రంగారావు ద్వారా చంద్రశేఖర్ రావు తన సోదరుడు మదన్ మోహన్‌కు పరిచయం అయ్యారని చెప్పారు.

అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పనిచేస్తూ మదన్ మోహన్ వెంట కేసీఆర్ సాగారని చెప్పారు.

మదన్ మోహన్ అంటే కేసీఆర్‌కు మంచి గౌరవం ఉండేదని, కేసీఆర్ అంటే మదన్ మోహన్‌కు అభిమానం ఉండేదని చెప్పారు.

‘ఇందిరగాంధీ, చెన్నారెడ్డి వంటివారు ప్రచారానికి వచ్చినప్పుడు ఆ బహిరంగ సభలలో తనతో పాటు కేసీఆర్‌ను కూడా మాట్లాడమని అన్న చెప్పేవారు’ అన్నారు శ్యామ్ మోహన్.

‘‘శేఖర్ పోయి మాట్లాడు’’ అంటూ ప్రోత్సహించేవారని.. మదన్ మోహన్ లాగే కేసీఆర్‌ కూడా వక్తగా గుర్తింపు పొందారని అన్నారు.

anantula shyam mohan

ఫొటో సోర్స్, anantula shyam mohan

ఫొటో క్యాప్షన్, అనంతుల శ్యామ్ మోహన్

తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటులో..

1969లో కేశవరావు జాదవ్ వంటి వారితో కలిసి తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేశారు అనంతుల మదన్ మోహన్. ఆ ఉద్యమ సంస్థకు ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు.

అయితే, అక్కడికి కొద్ది నెలల్లోనే ఆయన్ను పీడీ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆ తరువాత నాయకత్వం మారింది. 1969 చివర్లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితిని తన చేతుల్లోకి తీసుకున్నారు.

1971లో పార్లమెంటు మధ్యంతర ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి నుంచి 10 మంది అభ్యర్థులు విజయం సాధించారు.

నాగర్‌కర్నూల్(ఎస్‌సీ), మహబూబ్ నగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట(ఎస్‌సీ), మెదక్, పెద్దపల్లి(ఎస్‌సీ), కరీంనగర్, వరంగల్, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గాలలో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు విజయం సాధించారు.

Marri Chenna Reddy

ఫొటో సోర్స్, Rajasthan Raj Bhavan

ఫొటో క్యాప్షన్, మర్రి చెన్నారెడ్డి

ఆ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి నుంచి ఎంపీలుగా గెలిచిన జి.వెంకటస్వామి, ఎం.సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్) వంటివారు అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషించారు.

అయితే, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ సంఖ్యలో సీట్లు రావడం, ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ 28 సీట్లు సాధించడంతో తెలంగాణ ప్రజా సమితి ప్రభావం దీర్ఘకాలం లేకుండా పోయింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఎన్నికలలో కాంగ్రెస్ తరువాత అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలిచినప్పటికీ కొద్ది కాలానికి తెలంగాణ ప్రజాసమితిని చెన్నారెడ్డి రద్దు చేయడంతో అందులోని చాలా మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు.

అనంతుల మదన్ మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేరారు.

అనంతరం ఒక దశలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయిలో ఉన్నప్పటికీ ఆ పదవి చేపట్టలేకపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)