శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక కండోమ్ లేకుండా సెక్స్ చేశారనే కేసులో కోర్టు ఏం చెప్పిందంటే..

ధనుష్క గుణతిలక

ఫొటో సోర్స్, EPA

సిడ్నీకి చెందిన యువతిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ-20 ప్రపంచకప్ సమయంలో (నవంబర్ 6న) 32 ఏళ్ల ధనుష్క గుణతిలక అరెస్టయ్యారు.

ధనుష్క మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని ఓబేరే హౌస్ సమీపంలోని యువతి ఇంటికి వెళ్లి, ఆమె అంగీకారంలేకుండా శృంగారంలో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.

దీంతో ఆస్ట్రేలియా పోలీసులు ధనుష్కను అరెస్టు చేశారు. దీంతో శ్రీలంక బోర్డు అతన్ని సస్పెండ్ చేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఈ కేసుపై విచారణ జరిగింది. తుది తీర్పు గురువారం వెలువడింది.

ధనుష్క గుణ తిలక

ఫొటో సోర్స్, Getty Images

అసలేం జరిగింది?

ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన అమ్మాయి ఇంటికి ధనుష్క గుణతిలక వెళ్లారు.

అయితే, సురక్షిత శృంగారంలో పాల్గొనాలని చెప్పినప్పటికీ ఆయన కండోమ్ లేకుండా సెక్స్ చేశాడని యువతి ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.

ధనుష్క కండోమ్ లేకుండా సెక్స్ చేయడం గమనించలేదని, సెక్స్ తర్వాత కండోమ్ కిందకు విసిరినట్లు మాత్రమే చూసినట్లు ఆ యువతి న్యూ సౌత్ వేల్స్ కోర్టులో తెలిపారు.

అయితే, యువతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ధనుష్క తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.

ధనుష్క గుణతిలక

ఫొటో సోర్స్, NCA NEWSWIRE/GAYE GERARD

విచారణలో ఏం తేలింది?

ఇరువురి కలయిక యువతి ఆశించినదానికి, కోరుకున్న దానికి భిన్నంగా ఉందని ప్రాసిక్యూటర్ గాబ్రియేల్ స్టెడ్‌మాన్ కోర్టులో వాదించారు.

యువతి డిమాండ్లు లేదా అభ్యంతరాలను ధనుష్క గౌరవించలేదన్నారు.

మహిళ ఇష్టానికి విరుద్ధంగా సెక్స్ సమయంలో కండోమ్‌ తీసివేయడమనేది ఆమె డిమాండ్‌ను గౌరవించకపోవడమేనని ప్రాసిక్యూటర్ వాదించారు.

బెడ్‌రూమ్‌లో సెక్స్‌కు ముందు సేఫ్టీ ప్రొసీజర్‌ల గురించి చర్చించారని, ఆ తర్వాత తనకు కండోమ్‌ వాడటం ఇష్టం లేదని ధనుష్క చెప్పారని లాయర్ కోర్టుకు తెలిపారు.

అయితే, ఆ మహిళను సంతృప్తి పరిచేందుకు మొదట కండోమ్‌ ఉపయోగించి, తర్వాత తీసేశారని ఆమె తరఫు లాయర్ ఆరోపించారు. కలయిక సమయంలో కండోమ్ తొలగించడాన్ని ఆమె గమనించలేదని వివరించారు.

మరోవైపు యువతి ఆరోపణలను ధనుష్క గుణతిలక ఖండిస్తూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. సంభోగం సమయంలో రెండు కండోమ్‌లు వాడానని, మొదటిది సరిగ్గా ఉపయోగించలేకపోయానని ఆయన తెలిపారు.

ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ధనుష్కను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.

సదరు యువతి తన ప్రకటనలో పరస్పర విరుద్ద అభిప్రాయాలను వ్యక్తం చేశారని న్యాయమూర్తి అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)