40 ఏళ్ల వరకు గుండెజబ్బు రాకూడదంటే ఏంచేయాలి?

గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

ఆధునిక జీవన శైలి వల్ల అన్ని వర్గాల ప్రజల జీవితాల్లోనూ చాలా మార్పులు వస్తున్నాయి. రక్తపోటు, మధుమేహం, హృద్రోగాలు, ఊబకాయం లాంటి వ్యాధులతో బాధపడేవారే సంఖ్య కూడా ప్రస్తుతం పెరుగుతోంది.

జీవన శైలిలో మార్పుల వల్ల వచ్చే వ్యాధుల్లో కొన్ని మానసిక రుగ్మతలు కూడా ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత జీవన శైలి వ్యాధుల సంఖ్య మరింత పెరుగుతోంది.

ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలోనే హృద్రోగ సమస్యలు కనిపించేవి. కానీ, నేడు చాలా మంది యువత కూడా హృద్రోగాల బారిన పడుతున్నారు.

ఇలాంటి గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న యువత ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

యువతలో హృద్రోగాలతో సంభవించే అకాల మరణాలకు జీవన శైలి మార్పులు, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం లాంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇవన్నీ చేసేటప్పటికీ గుండె జబ్బులు, ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయనేమీ లేదు.

ఈ అకాల మరణాలకు కారణం ఏమిటో ప్రభుత్వం లోతైన అధ్యయనం చేపట్టాల్సిన అవసరముందని, అప్పుడే దీని వెనుక వాస్తవాలు బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

చాలా కారణాలు..

గుండె పోటుతో సంభవించే మరణాల వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. సాధారణంగా రక్త నాళాల్లో కొవ్వు పేరుకోవడంతో రక్త సరఫరా నిలిచిపోయి గుండె పోటు వస్తుంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమయంలో ఆ పేరుకున్న కొవ్వును తొలగించడం చాలా ముఖ్యం. లేకపోతే రక్త సరఫరా నిలిచిపోతుంది. దీని వల్ల గుండె నొప్పి వస్తుంది. ఇదే ప్రాణాపాయ పరిస్థికి దారితీస్తుంది.

అయితే, కొన్నిసార్లు అసిడిటీ, కడుపులో గ్యాస్ పేరుకోవడం వల్ల ఛాతీ నొప్పి వస్తుంది. అందుకే చాలా మంది గుండె నొప్పిని కూడా ఛాతీ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.

ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే ఛాతీ నొప్పి అని చెప్పినప్పుడు వైద్యులు ఈసీజీ చేయించుకోవాలని సూచిస్తారు.

గుండె జబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం’’

చిన్న వయసులోనే గుండె పోటు ఎక్కువగా ఎందుకు వస్తుందనే అంశంపై అహ్మదాబాద్‌లోని చౌధరి హాస్పిటల్‌కు చెందిన ముఖేశ్ చౌధరి బీబీసీతో మాట్లాడారు. ‘‘ఇక్కడ ఆహారపు అలవాట్లు, జీవన శైలి ప్రధాన పాత్ర పోషిస్తాయి’’ అని ఆయన చెప్పారు.

‘‘చాలాసార్లు మన ఆహారంలో విటమిన్ల లోపం కూడా గుండె జబ్బులకు దారితీస్తాయి. సకాలంలో ఈ జబ్బులను గుర్తించకపోవడం అనేది అకాల మరణానికి అతిపెద్ద ముప్పు. ఎందుకంటే అసలు వ్యాధినే గుర్తించకపోతే చికిత్స చేయడం ఆలస్యం అవుతుంది’’ అని ఆయన తెలిపారు.

‘‘చాలాసార్లు కార్డియోగ్రామ్‌లో అన్నీ సవ్యంగానే ఉన్నట్లు కనిపిస్తాయి. అప్పుడే ఆంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

‘‘కొన్నిసార్లు గుండె పోటు తీవ్రంగా వస్తుంది. ఇలాంటి కేసుల్లో ఆంజియోగ్రఫీ చేయడానికి కూడా సమయం ఉండదు. అందుకే సకాలంలోనే ఈ జబ్బులను మనం చూపించుకోవాలి’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, గుండె మార్పిడి చికిత్స: ఆగిన గుండెను కొట్టుకునేలా చేసే సాధనం

30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

గుండె జబ్బులు రాకుండా అడ్డుకునేందుకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు వచ్చినవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరు జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ముంబయిలోని వోఖార్ట్ హాస్పిటల్‌లో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ గుల్షన్ రోరా బీబీసీతో మాట్లాడారు.

‘‘కుటుంబంలో ఎవరికైనా మధుమేహం, రక్తపోటు లేదా గుండె జబ్బులు ఉంటే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. మరోవైపు ధూమపానం, మద్యపానం, కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి కూడా గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి’’ అని ఆయన చెప్పారు.

‘‘రోగుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో ఈసీజీ, 2డీ ఎకో, కరోనరీ ఆంజియోగ్రఫీ లాంటి టెస్టులతో తెలుసుకోవచ్చు. అందుకే ఈ పరీక్షలను ఆలస్యం చేయకూడదు’’ అని ఆయన సూచించారు.

గుండె జబ్బులను అడ్డుకోవడంలో జీవన శైలి మార్పులు ప్రధాన పాత్ర పోషిస్తాయని డాక్టర్ రోరా చెప్పారు. ‘‘ఇంటిలో ఎవరికైనా జన్యుపరమైన వ్యాధులు ఉన్నాయేమో మొదట తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్లు మానేయాలి. అందరూ తప్పకుండా వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ అయినా చేయాలి. సంతులిత ఆహారం తీసుకోవడం, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం లాంటివి మరచిపోకూడదు. అన్నింటికంటే ముఖ్యమైనది ఒత్తిడికి దూరంగా ఉండాలి’’ అని డాక్టర్ రోరా చెప్పారు.

‘‘30ల నుంచే ఆహారపు అలవాట్లు, జీనవశైలిలో మార్పులను పాటిస్తే గుండె జబ్బులు వచ్చే ముప్పు నుంచి 10 నుంచి 15 ఏళ్ల వరకూ దూరంగా ఉండొచ్చు. మహిళలు కూడా ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి’’ అని డాక్టర్ రోరా చెప్పారు.

వీడియో క్యాప్షన్, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రాణాలు తీస్తోంది?

కొన్ని కేసుల్లో గుండెపోటు ఒక్కసారిగా ఎందుకు వస్తుందో బాంబే హాస్పిటల్ కార్డియాలజిస్టు డాక్టర్ లక్ష్మణ్ ఖేరాడే బీబీసీతో మాట్లాడారు. ‘‘రక్తంలో బీ12 స్థాయిలు తగ్గిపోతే గడ్డలు ఏర్పడతాయి. ఈ గడ్డలు గుండె వరకూ చేరితే, ఒక్కసారిగా గుండెపోటు రావచ్చు. ఫలితంగా రోగి చనిపోయే ముప్పుంటుంది’’ అని ఆయన చెప్పారు.

ఒక్కోసారి ఈ రక్తంలో గడ్డలు తల వరకూ చేరుకుంటాయి. ఫలితంగా పక్షవాతం వచ్చే ముప్పుంటుంది.

‘‘తమకు గుండె జబ్బులు ఉన్నాయని కూడా కొంతమందికి తెలియదు. ఇలాంటి కేసుల్లో క్రమంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఒక్కసారిగా గుండెపోటు రావచ్చు’’ అని ఖేరాడే తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)