స్టెమ్ సెల్స్‌తో గుండె జబ్బుతో పుట్టిన బిడ్డను బతికించారు

- రచయిత, మాథ్యూ హిల్స్
- హోదా, బీబీసీ హెల్త్ కరస్పాండెంట్
తల్లి గర్భంలోని ప్లాసెంటా నుంచి సేకరించిన మూలకణాల(స్టెమ్‌సెల్స్)సాయంతో ప్రపంచంలోని తొలిసారి ఒక బిడ్డ ప్రాణాలు కాపాడగలిగామని ఒక గుండె శస్త్రచికిత్స నిపుణుడు వెల్లడించారు.
బ్రిస్టల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ మాసిమో క్యాపులో ఈ చికిత్స చేశారు.
బాబు ఫిన్లే గుండెలో లోపం ఉన్నట్లు ఆయన గుర్తించారు.
దీన్ని సరిచేసేందుకు ఒక స్టెమ్‌సెల్ పట్టీని ఆయన అభివృద్ధి చేశారు. ఇది మెరుగ్గా పనిచేసిందని ఆయన చెప్పారు.
పుట్టుకతోనే పిల్లలకు వచ్చే గుండె జబ్బులను ఆపరేషన్లు అవసరం లేకుండానే నయంచేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.

ప్రస్తుతం ఫిన్లే వయసు రెండేళ్లు. అతడు ఆరోగ్యంగా ఎదుగుతున్నాడని మాసిమో చెప్పారు.
పుట్టినప్పుడు గుండెలోని ప్రధాన రక్తనాళాలు ఉండాల్సిన చోటుకు బదులుగా వేరే ప్రాంతంలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
నాలుగు రోజుల వయసున్నప్పుడే బ్రిస్టల్ రాయల్ హాస్పిటల్‌లో అతడికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు.
అయితే, ఆ సర్జరీ వల్ల అతడి గుండె సమస్య నయం కాలేదు.
దీంతో క్రమంగా గుండె పనితీరు మందగించింది. ఎడమవైపు గుండె భాగాలకు రక్త ప్రసరణ కూడా తగ్గిపోయింది.
‘‘మొదట్నుంచీ ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళనతో మేం ఉండేవాళ్లం’’అని విల్ట్‌షైర్‌లో జీవించే ఫిన్లే తల్లి మెలీసా చెప్పారు.
‘’12 గంటల తర్వాత సర్జరీ నుంచి ఫిన్లేను బయటకు తీసుకొచ్చారు.
కానీ, గుండె, ఊపిరితిత్తులు పనిచేయడానికి బైపాస్ మెషీన్ అవసరం పడుతుందని చెప్పారు.
ఆ తర్వాత అతడి గుండె పనితీరు నెమ్మదిగా మందగించింది’’అని ఆమె వివరించారు.

మందులతోనే..
రెండు వారాలపాటు ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచిన తర్వాత ఫిన్లే గుండెను సంప్రదాయ విధానంలో కాపాడలేమనే నిర్ధారణకు వైద్యులు వచ్చారు.
అతడి గుండె సవ్యంగా పనిచేసేందుకు ఔషధాలు రోజు వేయాలని వైద్యులు సూచించేవారు.
అప్పుడే ప్లాసెంటా బ్యాంక్‌లోని స్టెమ్‌సెల్స్‌తో కొత్త చికిత్సను ప్రయత్నించాలనే ప్రతిపాదన వచ్చింది.
ఈ మూలకణాల పట్టీని నేరుగా ఫిన్లే గుండెలోకి డాక్టర్ మాసిమో ఇంజెక్ట్ చేశారు.
దెబ్బతిన్న రక్తనాళాలను ఇవి బాగుచేయడంలో తోడ్పడతాయని వైద్యులు భావించారు.
‘‘ఎలోజెనిక్ సెల్స్’’గా పిలిచే ఈ మూలకణాలను లండన్‌లోని రాయల్ ఫ్రీ హాస్పిటల్ నిపుణులు ప్రత్యేకంగా ల్యాబ్‌లో పెంచేవారు.
ఇలాంటి లక్షల కొద్దీ కణాలను ఫిన్లే గుండె కండరాల్లోకి పంపించారు.
ఎలోజెనిక్ సెల్స్‌కు కండరాలుగా పెరిగే సామర్థ్యం ఉంటుంది.
అయితే, ఫిన్లే గుండె కూడా వీటిని తిరస్కరించలేదు. దీంతో దెబ్బతిన్న గుండె కండరాలు మళ్లీ ఇక్కడ పెరిగాయి.
‘‘మేం అతడికి ఇచ్చే మందులన్నీ మేం ఆపేశాం. వెంటిలేషన్ కూడా తీసేశాం’’అని ప్రొఫెసర్ మాసిమో చెప్పారు.
‘‘ప్రస్తుతం అతడిని ఐటీయూ నుంచి డిశ్చార్జి చేశాం. అతడు ఆరోగ్యంగా పెరుగుతున్నాడు’’అని ఆయన వివరించారు.
ఏం చేశారు?
మొదటగా దెబ్బతిన్న రక్తనాళాలను బాగుచేసేందుకు బయోప్రింటర్ ద్వారా మూలకణాల సాయంతో ఒక కండరాల్లాంటి పట్టీని తయారుచేశారు. దీన్ని నేరుగా ఫిన్లే గుండెలోకి ఇంజక్ట్ చేశారు.
నిజానికి పిల్లల గుండె సమస్యలకు సర్జరీల్లో కృత్రిమ కణజాలాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ, ఇవి చాలాసార్లు విఫలం అవుతాయి. కొన్నిసార్లు ఇవి గుండెతో సమానంగా పెరగవు. అందుకే పిల్లలు పెరిగినప్పుడు మరిన్ని ఆపరేషన్లు అవసరం అవుతాయి.
ఈ పట్టీలపై క్లినికల్ ట్రయల్స్ మరో రెండేళ్లలో జరిగే అవకాశముందని ప్రొఫెసర్ మాసిమో చెప్పారు.

చాలా మందిలో ఆశలు
పుట్టుకతోనే గుండె సమస్య లుండే పిల్లల్లో ఈ స్టెమ్‌సెల్ పట్టీలు ఆశలు చిగురింపచేస్తున్నాయి. వేల్స్‌కు చెందిన లూయిస్‌కు గుండెలో చాలా లోపాలు ఉన్నాయి.
ప్రస్తుతం లాయిస్ వయసు 13 ఏళ్లు. అయితే, అతడికి రెండు వారాల వయసున్నప్పుడే తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. అప్పుడు ఏర్పాటుచేసిన కృత్రిమ కండరాలను సరిచేసేందుకు నాలుగేళ్ల వయసులో మరోసారి సర్జరీ చేశారు.
అయితే, ఆపరేషన్లలో ఉపయోగించే కండరాలు కృత్రిమమైనవి కావడంతో, గుండెతోపాటు ఇవి పెరగడం లేదు. దీంతో అతడు పెరిగేకొద్దీ మళ్లీమళ్లీ ఆపరేషన్లు నిర్వహించాల్సి వస్తోంది.
ఒక్క బ్రిటన్‌లోనే రోజూ ఇలాంటి 13 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ తెలిపింది.
ఒక్కోసారి ఆపరేషన్లలో ఉపయోగించే కృత్రిమ కండరాలను చిన్నారి రోగ నిరోధక వ్యవస్థ తిరస్కరిస్తుంటుంది. అప్పుడు గుండె కండరాలు దెబ్బతింటాయి. దీని వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. ఆ తర్వాత నెలలు లేదా సంవత్సరాలకు గుండె పనితీరు పూర్తిగా మందగిస్తుంది.
అలా ఒక్కో చిన్నారికి ఆపరేషన్లు చాలాసార్లు అవసరం అవుతాయి. అయితే, తాజా స్టెమ్‌సెల్ పట్టీతో తనలాంటి చిన్నారుల గుండె సమస్యకు పరిష్కారం లభిస్తుందని లూయిస్ భావిస్తున్నారు.
‘‘మళ్లీ మళ్లీ ఆపరేషన్లు చేయించుకోవడం నాకు అసలు నచ్చదు’’అని లూయిస్ చెప్పాడు.
ఈ స్టెమ్‌సెల్ ప్యాచ్‌లతో ఒక్కో ఆపరేషన్‌పై 30,000 పౌండ్లు (రూ.30 లక్షలు) ఆదా అవుతుందని, మొత్తంగా చూసుకుంటే కోట్లలో డబ్బులను ఆదా చేసుకోవచ్చని మాసిమో వివరించారు.
తాజా పరిశోధనపై ఎస్ఎల్ఎం బ్లూ స్కైస్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్‌కు చెందిన టెక్నాలజీ నిపుణుడు డాక్టర్ స్టీఫఎన్ మింగెర్ ప్రశంసలు కురిపించారు.
‘‘నేడు స్టెమ్‌సెల్స్‌తో పెద్దలపై జరుగుతున్న పరిశోధనలు అంతంత మాత్రంగానే ఫలితాలు ఇస్తున్నాయి’’అని ఆయన చెప్పారు. ఈ కొత్త పట్టీని మెరుగ్గా పనిచేయాలని ఆశిస్తున్నామని వివరించారు.
‘‘త్వరగా దీనికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి. అప్పుడే ఇది ఎంత మెరుగ్గా పనిచేస్తుందో మనకు పూర్తి అవగాహన వస్తుంది’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















