గుండెపోటు: చిన్న అబ్బాయికి స్టంట్ వేయాలంటే వైద్యులే చలించిపోయారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల కాలంలో చిన్న వయసులో గుండెపోటుతో చనిపోతున్నారన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
ఇలా చనిపోతున్న వారిలోనూ తక్కువ వయసు వారే ఉంటుండటం ఆందోళన కలిగించే విషయంగా మారింది.
28 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్టుతో అకస్మాత్తుగా కుప్పకూలడం.. 18 ఏళ్లకే గుండెపోటుతో నిద్రలోనే చనిపోవడం.. జిమ్ చేస్తూ 26 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే పడిపోవడం.. ఇలా వరుసగా యుక్త వయసులోనే గుండె ఆగిపోయి చనిపోతున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీ, తెలంగాణలో వరుస ఘటనలు..
గుండెపోటుతో తక్కువ వయసులో చనిపోతున్న ఘటనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇటీవల బాగా వినిపిస్తున్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో 17 ఏళ్ల యువకుడు నిద్రలోనే గుండెపోటు వచ్చి చనిపోయాడు.
- తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 18 ఏళ్లు ఉన్న మరో యువకుడు డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడు.
- తెలంగాణలోని మేడ్చల్ వద్ద సీఎంఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి గుండెపోటు కారణంగా చనిపోయాడు.
- బోయిన్ పల్లిలో జిమ్ చేస్తుండగా పోలీసు కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

ఫొటో సోర్స్, Getty Images
గుండె పోటు కేసులు పెరిగాయా..?
ఇటీవల 18 ఏళ్ల వయసున్న యువకుడు హార్ట్ అటాక్ తో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి వచ్చాడు.
పల్మనరీ యాంజీయోగ్రామ్ చేస్తే త్రాంబస్ (రక్తనాళంలో రక్తం గడ్డ కట్టుకోవడం) ఉన్నట్లు తేలింది. అంత చిన్న వయసులో స్టంట్ వేయాలంటే బాధగా అనిపించిందని వైద్యులు చెప్పారు.
ఇలా చిన్న వయసులో తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో వస్తున్న కేసులు పెరిగాయని కొందరు వైద్యులు చెబుతున్న మాట.
ఈ విషయంలో కార్డియాక్ డాక్టర్స్ కమ్యూనిటీలో కొంత భిన్నాభిప్రాయాలున్నాయి. ‘‘తక్కువ వయసులో గుండెపోటు మరణాలు గతంలోనూ జరిగాయి. కానీ, ఇప్పుడు మీడియా కవరేజీ కారణంగా ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. అటాప్సీ(టాక్సీకాలజీ స్టడీ) చేస్తేనే గుండెపోటా.. లేదా మరేదైనా కారణమా.. అని తెలుసుకోవచ్చు. సడెన్‌గా కుప్పకూలిపోతుండటంతో గుండెపోటుగా భావిస్తున్నాం’’ అని యశోద ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎ.రవికాంత్ బీబీసీతో చెప్పారు.
ఇదే సమయంలో వయసుల వారీగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్యను కచ్చితంగా చెప్పలేమని కూడా వైద్యులు చెబుతున్నారు.
కార్డియాక్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ప్రతినిధులతో బీబీసీ మాట్లాడినప్పుడు.. గుండెపోటు మరణాలపై ప్రత్యేకంగా అధ్యయనాలు లేదా పరిశోధన తక్కువ కావడంతో లెక్కించడం కష్టమని చెప్పారు. గుండెపోటుతో చనిపోతున్న వారిపై అధ్యయనం చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు వైద్యులు.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ జర్నల్లో 2021 నవంబరులో ప్రచురితమైన అధ్యయనం గుండె కవాటాల్లో పేరుకుపోతున్న కాల్షియం స్కోర్ గుండె వ్యాధులకు కారణమవుతోందని చెబుతోంది. దీన్ని కాగిత కృష్ణ చంద్, పోతినేని రమేష్ బాబు సంయుక్తంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 108 మందిపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. ఇందులో 40 ఏళ్లలోపు వయసు వారు 31 శాతం మంది ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ ప్రభావమే కారణమా..?
కోవిడ్ తర్వాత గుండె సంబంధిత సమస్యలు తీవ్రం అయ్యాయని వైద్యులు చెబుతున్నారు.
దీనిపై నిమ్స్ కార్డియాలజీ విభాగం వైద్యురాలు ఎన్.రమాకుమారి బీబీసీతో మాట్లాడారు. నిమ్స్ ఆసుపత్రికి గుండె సంబంధిత వ్యాధులతో వచ్చే ఓపీ కేసులు రోజుకు 160కు పెరిగాయని చెప్పారు. వీటిల్లో సీరియస్ కేసులు ఉంటున్నాయంటున్నారు. కోవిడ్‌కు మునుపు ఈ స్థాయిలో కేసులు చూడలేదని చెబుతున్నారు. కోవిడ్ ప్రభావం పడినవారే ఎక్కువ ఉంటున్నారని చెబుతున్నారు.
‘‘కోవిడ్ తర్వాత గుండె జబ్బులతో బాధపడే వారు పెరిగారు. కరోనా వైరస్ గుండెలోని ఎండో థిలియం కణజాలంపైనా ప్రభావం చూపిస్తోంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా 18 ఏళ్ల వయసులోనూ గుండెపోటుకు గురవుతున్నారు. గుండెలో ఎపికార్డియం, మయోకార్డియం, ఎండో కార్డియం అనే మూడు రకాల కండరాలు ఉంటాయి. మయో కార్డిటిస్ కేసులు పెరుగుతున్నాయి. గుండె కండరాల వాపుతో గుండె పరిమాణం పెరిగి.. హార్ట్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నారు. పోస్ట్ కోవిడ్‌లో ఈ తరహా సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం’’ అని డాక్టర్ రమాకుమారి బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మిగిలిన కారణాలూ ఉన్నాయా..?
తక్కువ వయసులోనే గుండెపోటు, కార్డియాక్ అరెస్టు చనిపోవడం వెనుక కరోనా వైరస్ కారణంతోపాటు అసింప్టమాటిక్ కరోనరీ అర్టినరీ డిసీజ్ అనేది ప్రధాన కారణంగా చెప్పవచ్చని మరికొందరు వైద్యులు అంటున్నారు.
ఈ తరహా కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేకుండా నేరుగా చనిపోతున్నారని చెబుతున్నారు విజయవాడ రమేష్ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు.
ఈ విషయంపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో 50 ఏళ్లలోపు వయసు ఉన్న వ్యక్తులలో హార్ట్ అటాక్‌లు పెరిగిపోతున్నాయి. 25 శాతం గుండెపోటు మరణాలల్లో 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
గత రెండు, మూడేళ్లలో సబ్ క్లినికల్ ఎథిరోక్లిరోసిస్ పెరిగింది. ఇప్పుడు వస్తున్న గుండెపోటు 70 శాతం మందిలో సబ్ క్లినికల్ ఎథిరోక్లిరోసిస్ ఉంటోంది. ఈ తరహా కేసులల్లో 80 నుంచి 90 శాతం బ్లాక్ ఉన్నప్పటికీ, ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. మారథాన్‌లు చేయగలుగుతున్నారు. కానీ సడెన్‌గా చనిపోతుంటారు. ప్రస్తుత 50 శాతం మరణాల్లో కనీస లక్షణాలు కనిపించడం లేదు’’ అని డాక్టర్ రమేష్ బాబు చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
ముందే ఎలా గుర్తించవచ్చు?
గుండె సంబంధిత పరీక్షలు చేయించుకునే విషయంలో ఎన్నో అపోహలు ఉన్నాయని వైద్యులు చెప్పేమాట. లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలని అందరూ అనుకుంటారు.
ప్రస్తుత పరిస్థితులలో 50-60 మందికి కాల్షియం స్కోర్ లేదా కొలెస్ట్రాల్ బ్లాక్ తెలియకుండానే ఉంటోంది. అందుకే లక్షణాలు వచ్చే వరకు వేచి చూడకుండా ముందే పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
నేషనల్ లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ప్రతిపాదనల ప్రకారం.. కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ టెస్టు పుట్టిన ఆరు నెలలకే చేయించాలి. తర్వాత 7 నుంచి 11 ఏళ్ల మధ్య, 17-21 ఏళ్ల మధ్య రెండోసారి కొలెస్ట్రాల్ లెవల్స్ టెస్టు చేయించుకోవాలి.
గుండె వ్యాధుల గుర్తింపు పరీక్షలపై డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘25 ఏళ్లు దాటితే కాల్షియం స్కోర్, ట్రెడ్ మిల్ టెస్టు చేయించుకోవడం మంచిది.
రిస్క్ ఫ్యాక్టర్ బట్టి అంటే.. కుటుంబంలో గతంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ రావడం, అధిక కోలెస్ట్రాల్, డయాబెటిస్, హైబీపీ ఉంటే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవాలి.
ప్రతి ఐదేళ్లకోసారి టెస్టు రిపీట్ చేయాలి.
సాధారణంగా కార్డియాక్ కమ్యూనిటీలో గుండెవ్యాధులకు నిద్రలేమి, ఒత్తిడి వంటివి కారణమని భావిస్తుంటారు. కరోనరీ ఆర్టరీ డిసీజెస్‌లో మాత్రం వీటి పాత్త తక్కువనే చెప్పాలి. కాల్షియం స్కోర్ ఆధారంగా సమతుల ఆహారం, యోగా, బ్రిస్క్ ఎక్సర్ సైజులు చేయాలి’’ అని డాక్టర్ రమేష్ బాబు చెప్పారు.
ఇదే విషయంపై డాక్టర్ రమాకుమారి మాట్లాడుతూ డయాబెటిస్, బీపీ, హైపర్ టెన్షన్ ఫెయిల్యూర్‌ను ఇంకా ఎక్కువ చేస్తాయి. ఎకో, ఈసీజీ, కార్డియాక్ ఎంఆర్ఐ, పల్మనరీ యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. ఇవన్నీ చేయించుకున్నాకే జిమ్ వంటి వాటికి వెళ్లడం మేలు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మగవారిలోనే ఎందుకు ఎక్కువ
గుండెపోటు మరణాలు ఎక్కువగా మగవారిలోనా.. మహిళలలోనా.. అంటే మగవారిలోనే అని చెబుతున్నారు వైద్యులు.
దీనిపై యశోద ఆసుపత్రి సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎ.రవికాంత్ బీబీసీకి కారణాలను విశ్లేషించారు.
‘‘మగవారిలో సాధారణంగా 20-25 ఏళ్ల మధ్య హార్ట్ ఎటాక్ కేసులు చూస్తున్నాం. 25-30 వయసులో కాస్త ఎక్కువగా చూస్తుంటాం. 30-40 మధ్యలో ఇంకా ఎక్కువగా చూస్తాం. ఈ వయసులో మహిళలలోనూ గుండెపోటు ఘటనలు చూస్తుంటాం. కానీ, మగవారి కంటే మహిళలు తక్కువగా ఉంటారు.
40-50 ఏళ్ల మధ్యలో చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఈ వయసులోనూ మగవారిలో వచ్చే కేసులే ఎక్కువగా ఉంటాయి.
50-60 ఏళ్ల మధ్య బాగా ఎక్కువగా గుండెపోటు కేసులు వస్తుంటాయి. ఈ వయసులో మగవారు, మహిళలు కాస్త సమంగా ఉంటారు.
60 ఏళ్లపైబడిన తర్వాత మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ వయసులో మహిళలు, మగవారికి సమానంగా గుండెపోటు వస్తుంటుంది.
యుక్త మహిళల్లో గుండెపోటు తక్కువగా రావడానికి కారణంగా మెనోపాజ్ దశలో వచ్చే హార్మోన్ల ప్రభావంగా చెప్పవచ్చు.
మహిళలలో హార్మోన్ల కారణంగా ఎథిరోస్కిరోసిస్ (గుండె రక్త నాళాలు ధమనల గోడలలో పూడిక ఏర్పడటం) తక్కువగా ఉంటుంది. అందుకే గుండెపోటు తక్కువగా చెప్పవచ్చు. ఇది ఎన్నో అధ్యయనాలలో తేలింది’’ అని డాక్టర్ రవికాంత్ బీబీసీతో అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు అంటూ తమ్మారెడ్డి వ్యాఖ్యలు.. నాగబాబు కౌంటర్
- క్యాంపా కోలా: త్వరలో మార్కెట్లోకి 'రీ ఎంట్రీ' ఇవ్వబోతున్న ఈ భారతీయ శీతల పానీయం చరిత్ర ఏంటి?
- చైల్డ్ ఫ్రీ లైఫ్: ‘మాకు పిల్లలు వద్దు.. కుక్కలు, పిల్లులు ముద్దు’ అంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.. ఎందుకు?
- ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఈ ఇంట్లో 18 ఓట్లు ఉన్నాయి... కానీ వారెవరో ఇంట్లో వాళ్లకు తెలియదు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














