లండన్‌కు వెళ్లిన విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో..

ఫొటో సోర్స్, HANDOUT
- రచయిత, తరాహ్ వెల్ష్
- హోదా, బీబీసీ లండన్
బంగ్లాదేశ్ నుంచి లండన్ వచ్చినప్పుడు నజ్ముష్ షాహదత్‌కి ఎక్కడ ఉండాలో తెలియదు.
ఆయనకు లా కోర్సులో చేరేందుకు అడ్మిషన్ దొరికింది కానీ, యూనివర్సిటీలో వసతి సదుపాయం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. ఆయనకు బయట కూడా ఎక్కడా ఇల్లు దొరకలేదు.
కొద్దిరోజుల్లోనే పరిస్థితులు దారుణంగా మారిపోయాయని, ఒక డబుల్ బెడ్రూం ఫ్లాట్‌లో 20 మందితో కలిసి ఉండాల్సి వచ్చిందని షాహదత్ చెప్పారు.
''అలాంటి చోట ఉండాల్సి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. అది ఇంకా నాకు గుర్తుంది'' అన్నారు.
ఒక్కో గది బెడ్‌లతో కిక్కిరిసిపోయి ఉండేది. వేర్వేరు షిఫ్టుల్లో పనిచేసే కార్మికులు వస్తూపోతూ ఉండేవారు. నల్లులు విపరీతంగా కుట్టేవి. వాటి వల్ల అస్సలు నిద్రపట్టేది కాదు.
''మొదట్లో ఇంటికి వీడియో కాల్ కూడా చేసేవాడిని కాదు. నేను ఎలాంటి చోట ఉంటున్నానో మా వాళ్లకి తెలియకూడదని అనుకున్నా'' అని ఆయన అన్నారు.
షాహదత్ ప్రస్తుతం మరికొందరితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అందులో ఆయనకు ప్రత్యేకంగా ఒక గది ఉంది.
విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులకు లండన్‌లో ఇల్లు అద్దెకు తీసుకోవడం చాలా కష్టమైన పని అని ఆయన చెబుతున్నారు. విద్యార్థులకు ఇక్కడ తెలిసిన వాళ్లెవరూ ఉండరు. వారి వద్ద పే స్లిప్‌లు కూడా ఉండవని ఆయన అన్నారు.
ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బును చాలా మంది ఫీజుల కోసం వెచ్చిస్తారు. తన మూడేళ్ల కోర్సు ఫీజు 39 వేల పౌండ్లు (దాదాపు 39 లక్షలు) అని ఆయన చెప్పారు.
''నా కలలు, నా తల్లిదండ్రుల కలలు నెరవేర్చేందుకు నా కుటుంబం దాచుకున్న డబ్బులు ఖర్చు చేసి ఇక్కడకు వచ్చాను'' అని షాహదత్ చెప్పారు.

యూకేలోని ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకునేందుకు విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా కృషి చేస్తోంది.
హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ(హెచ్‌ఈఎస్‌ఏ) లెక్కల ప్రకారం, 2015-16లో 1,13,015 మంది విదేశీ విద్యార్థులు లండన్‌లో ఉండగా, 2020-21 నాటికి ఆ సంఖ్య 59 శాతం పెరిగి 1,79,425కి చేరింది.
ప్రస్తుతం లండన్‌లోని కొన్ని విద్యాసంస్థల్లో స్థానికుల కంటే, విదేశీ విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు.
భారత్‌కు చెందిన రషవ్ కౌశిక్ కూడా లా చదువుతున్నారు. కొంతమంది స్నేహితులతో కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆయన మరొకరితో తన బెడ్రూంను షేర్ చేసుకుంటున్నారు.
ఆ ఇంటి కోసం 16 వేల పౌండ్లు (సుమారు 16 లక్షల రూపాయలు) అడ్వాన్స్ చెల్లించడంతో పాటు మరొకరు హామీగా ఉండాల్సి వచ్చిందని, అది తమకు చాలా భారంగా మారిందని ఆయన చెప్పారు.
''అధిక ఫీజులు దండుకునేందుకు యూనివర్సిటీలు వీలైనంత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు అవకాశం ఉన్న దానికంటే ఎక్కువ మందిని చేర్చుకుంటున్నాయి'' అని నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్(ఎన్‌యూఎస్)కి చెందిన నేహాల్ బజ్వా అన్నారు.
ఇళ్ల అద్దెలను నియంత్రించాలని ఎన్‌యూఎస్ కోరుతోంది. ఈ అద్దెల కారణంగా, ముఖ్యంగా విదేశీ విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని చెబుతోంది.
''మీ హక్కుల గురించి మీకు తెలియకపోవడంతో వాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు'' అని బజ్వా చెప్పారు.
విదేశీ విద్యార్థులు ఎలాంటి కాంట్రాక్ట్ (ఒప్పందం) లేకుండానే ఇళ్లు అద్దెకు తీసుకోవాల్సి రావడంతో పాటు, పెద్ద మొత్తంలో అడ్వాన్స్ చెల్లించాల్సి వస్తోందని, వాళ్లు పెట్టే నిబంధనలు ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వస్తోందని ఆమె చెప్పారు.
''ఇల్లు లేకపోతే ఎక్కడ ఉండాలి? అనే ఆలోచన వల్ల తొందరపడే అవకాశం ఉంది. ఎందుకంటే, ఉండడానికి ఇల్లు లేకపోవడం నిజంగా కష్టమే'' అని ఆమె అన్నారు.
ఇటలీకి చెందిన 19 ఏళ్ల గియులియా టార్టారిసీ ఫిల్మ్ కోర్సు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం తన స్నేహితులు మైసీ, లిడియాతో కలిసి ఉంటున్నారు. అయితే, లండన్‌లో వసతి కోసం గతేడాది ఆమె చాలా ఇబ్బందిపడ్డారు.
''అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ముందుగా ఎలాంటి వసతి అవకాశాలు చూసుకోకుండానే నిరుడు నేను ఇక్కడికి వచ్చా. ఇల్లు వెతుక్కునే ముందు నెల రోజులు నా స్నేహితుడి రూమ్‌లో ఉన్నా. అప్పుడు కాస్త ఒత్తిడికి గురయ్యా'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, HANDOUT
అయితే, ఇది కేవలం విదేశీ విద్యార్థులకు మాత్రమే ఎదురవుతున్న ఇబ్బంది కాదని, తమకు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని యూకేకి చెందిన విద్యార్థులు కూడా బీబీసీతో చెప్పారు. ఇల్లు వెతుక్కోవడం ఒక్కటే కాకుండా, ఇంటి నుంచి యూనివర్సిటీకి వెళ్లేందుకు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.
లండన్‌లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి భవనాల్లో (పర్సస్ బిల్ట్ స్టూడెంట్ అకామడేషన్) ఒక్కో బెడ్‌కు 3.8 మంది విద్యార్థుల పోటీ ఉందని, యూకేలో సగటున 2.9గా ఉందని సావిల్స్ అధ్యయనం పేర్కొంది.
విద్యార్థులకు అందుబాటు ధరల్లో వసతి సౌకర్యం అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా అంత ఆర్థిక స్తోమత లేనివారికి, విదేశాల నుంచి వచ్చిన వారు, లేదా ఇక్కడి పరిస్థితులు తెలియని వారికి యూనివర్సిటీల్లోనే అలాంటి సౌకర్యం అందుబాటులో ఉండాల్సిన అవసరముందని విద్యార్థి స్వచ్ఛంద సంస్థ యూనిపోల్ అభిప్రాయపడింది.
''ఒక ఇంట్లో ఒక గది అద్దె కంటే, యూనివర్సిటీల్లో వసతి సౌకర్యానికి దాదాపు 35 శాతం అదనంగా ఖర్చవుతుంది. అందువల్ల విద్యార్థులు ఇళ్లు అద్దెకు తీసుకుని షేర్ చేసుకుంటున్నారు. దాని ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు'' అని ఆ సంస్థ సీఈవో మార్టిన్ బ్లేకీ అన్నారు.
అయితే, చాలా మంది వద్ద ఇల్లు వెతుక్కోవడానికి ముందే డబ్బులు అయిపోతున్నాయి. దీంతో చాలా మంది విదేశీ విద్యార్థులు మిగిలిన సొమ్మును ఆహారానికి వెచ్చిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఇంటికి తిరిగి వెళ్లాల్సి రావొచ్చు.
''నిజంగా అది చాలా కఠినమైన పరిస్థితి. దాని వల్ల చాలా మంది కలలు కూలిపోతున్నాయి'' అని మార్టిన్ చెప్పారు.
''ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి తెలివైన విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు రావడం యూనివర్సిటీలకు చాలా మంచిది. అది అభివృద్ధికి కారణమవుతుంది.
అందుకు అనుగుణంగా, విద్యార్థుల వసతి అవసరాలను తీర్చేలా యూనివర్సిటీలు, వసతి సేవలు అందిస్తున్న ప్రైవేట్ వారిని ప్రోత్సహిస్తున్నాం'' అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీఎఫ్‌ఈ) అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
'' వసతి సదుపాయాల కొరత కేవలం విద్యార్థులకే కాదు. యూకే వ్యాప్తంగా అలాంటి పరిస్థితి ఉంది. సాధ్యమైనంత మేర తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం.
యూనివర్సిటీలు విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వసతి సదుపాయం వెతుక్కున్న తర్వాత విద్యార్థులు ఇక్కడికి వస్తే మంచిదని సూచిస్తున్నాం. వసతి దొరక్క ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వారు యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన అకామడేషన్ టీమ్‌లను సంప్రదిస్తే వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు'' యూకే యూనివర్సిటీలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- విద్యా లక్ష్మి: చదువుకునేందుకు సులువుగా రుణాలిచ్చే ఈ పోర్టల్ గురించి తెలుసా?
- పిల్లల ఉన్నత విద్య ఖర్చుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- Kerala: NEET పరీక్ష రాయాలంటే అమ్మాయిలు లోదుస్తులు తొలగించాల్సిందేనన్న నిర్వాహకులు.. పోలీసులకు ఓ తండ్రి ఫిర్యాదు
- వీసాలు లేకుండా భారతీయులు అమెరికాలో ఎలా అడుగుపెడుతున్నారు?
- ‘మా దేశం నుంచి వెళ్లిపోండి’.. భారతీయ విద్యార్థులకు కెనడా హెచ్చరిక.. వారి అడ్మిషన్లు ఫోర్జరీవంటూ ఆరోపణలు















