‘‘చంపేసినా సరే పాకిస్తాన్‌లోనే ఉంటాం..’’ అని ఈ భారతీయులు ఎందుకు అంటున్నారు

ఫొటో సోర్స్, SHUMAILA KHAN
- రచయిత, నియాజ్ ఫరూఖీ, షుమాయిలా ఖాన్
- హోదా, బీబీసీ కోసం
ఇద్దరు భారతీయులు పాకిస్తాన్‌లో ఆశ్రయం కోరుతున్నారు.
భారత్‌లో సామాజిక కార్యకర్త, జర్నలిస్టు అయిన మొహమ్మద్ హసనైన్, ఆయన కుమారుడు ఇషాక్ అమీర్‌తో కలిసి ఇటీవల పాకిస్తాన్ చేరుకున్నారు. తండ్రీ కొడుకులిద్దరూ అప్గానిస్తాన్ మీదుగా అక్రమ మార్గంలో పాకిస్తాన్ వెళ్లారు.
తమకు పాకిస్తాన్‌లో ఆశ్రయం కల్పించాలంటూ ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు.
‘‘భారత దేశంలో మత విద్వేషాన్ని, వేధింపుల్ని ఎదుర్కొంటున్నానని.. ఇకపై ఆ దేశానికి వెళ్లనని చంపేసినా, జైల్లో పెట్టినా పాకిస్తాన్‌లోనే ఉంటాన’’ని మొహమ్మద్ అంటున్నారు.
వీళ్లిద్దరూ కరాచీలోని అంచౌలీ ప్రాంతంలో ఉంటున్నారు. వారు ఉండే ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించడంతోపాటు కాపలాగా ఇద్దరు పోలీసులను పెట్టారు.
‘‘సెప్టెంబర్ 5న దిల్లీ నుంచి అబుదాబీ వెళ్లాం. అక్కడ నుంచి అఫ్గానిస్తాన్ వెళ్లేందుకు వీసాలు తీసుకున్నాం. కాబూల్ నుంచి కాంధహార్ చేరుకున్న తర్వాత అక్కడ కొంతమందికి డబ్బులిచ్చి పాకిస్తాన్ సరిహద్దుల్లోని చమన్‌లోకి ప్రవేశించాం.
ఒక టాక్సీవాలాకు పదివేల రూపాయలు ఇచ్చి చమన్ ముంచి క్వెట్టా వచ్చాం. అదే టాక్సీకి మరో 50వేలు చెల్లించి క్వెట్టా నుంచి కరాచీ చేరుకున్నాం.
గుర్తింపు కార్డులేవీ లేకపోవడంతో హోటల్‌లో రూమ్ దొరకలేదు. అందుకే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ అధికారులను కలిసి మా గోడు చెప్పుకుని పాకిస్తాన్‌లో ఆశ్రయం కావాలని కోరాను’’ అని హసనైన్ బీబీసీకి చెప్పారు.
దీంతో పోలీసులు వాళ్లిద్దర్నీ ఎడి అనే స్వచ్చంధ సంస్థ నిర్వహిస్తున్న హోమ్‌కు తరలించారు.
తాను దిల్లీలో జర్నలిస్టుగా పని చేసే వాడినని, చార్జ్‌షీట్ పేరుతో ఎనిమిది పేజీల వారపత్రిక నడిపేవాడినని, తర్వాతి రోజుల్లో పత్రిక పేరుని ‘ద మీడియా ప్రొఫైల్’ అని మార్చాను అని ఆయన తెలిపారు.

భారతదేశంలో ఎక్కడ?
జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్ నగరంలో 1957లో మొహమ్మద్ హసనైన్ పుట్టారు. అయితే చాలా కాలంగా దిల్లీలోనే ఉంటున్నారు. 1989లో పెళ్లయింది. నాలుగేళ్ల తర్వాత భార్యతో విడిపోయారు. ఆయన ఇద్దరు పిల్లల్లో ఒకరు చనిపోయారు.
ఆయనకు అక్క, చెల్లి కూడా ఉన్నారు. అక్క జైబున్నిసా జెంషెడ్‌పూర్‌లో చెల్లెలు లఖనవూలో ఉంటున్నారు.
తాను ఖురాన్ నేర్చుకునేందుకు మదర్సాకు వెళ్లేవాడినని ఇషాక్ అమీర్ చెప్పాడు. తండ్రి తననొక మత విశ్వాసకుడిగా, న్యాయవాదిగా చూడాలనుకున్నారని... అయితే తాను ఇంటర్ పాసైన తర్వాత ఉద్యోగం చేయడంతో చదువు కొనసాగించలేకపోయానని చెప్పారు.
2014 నుంచి 2019 వరకూ ఇషాక్, డీన్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలో పని చేశారు. 2021 ఏప్రిల్ నుంచి అదే ఏడాది అక్టోబర్ 15 వరకూ దుబాయ్‌లోని ఓ కంపెనీలో సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసినట్లు ఇషాక్ చెప్పారు. ఆరు నెలలు పని చేసిన తర్వాత దుబాయ్ నుంచి భారత్ వచ్చేశారు.
తనకు అబుదాబిలోని ఓ సంస్థలో ఉద్యోగం వచ్చిందని నెలకు నాలుగు వేల దిర్హమ్‌లు జీతమని ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి ఉద్యోగంలో చేరాలని సంస్థ చెప్పినట్లు ఇషాక్ తెలిపారు. ఉద్యోగం వచ్చిందని తెలిసిన తర్వాత భారత దేశం వదిలేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
“వాలిద్ సాహెబ్ కూడా ఈ దేశంలో ఉండవద్దని చెప్పడంతో సెప్టెంబర్ 5న టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. ఒకసారి ప్రయత్నించి చూద్దామని నాన్న కూడా అన్నారు. అఫ్గానిస్తాన్ వెళ్లి అక్కడ నుంచి అబుదాబి వెళదాం. ఏదైనా జరుగుతుందేమో చూద్దామని నాన్నగారు అన్నారని” ఇషాక్ వెల్లడించారు.

రెచ్చగొట్టే ప్రకటనలున్న పోస్టర్లు అంటించారనే ఆరోపణలు
దిల్లీలో పత్రిక నిర్వహించడంతో పాటు లా కోర్సు చేయాలనుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించేందుకు కోచింగ్ సెంటర్ నిర్వహించేవారు మొహమ్మద్ హసనైన్. తనను తాను సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఆయన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలోనే ఆయనపై రెచ్చగొట్టేలా పోస్టర్లు అంటించారనే ఆరోపణలతో పాటు మరి కొన్ని ఆరోపణల్లోనూ కేసులు నమోదయ్యాయి.
ఆయన తన కుమారుడితో కలిసి 15 ఏళ్లుగా దిల్లీలోని జఫ్రాబాద్ ప్రాంతంలో అద్దెకు ఉండేవారు. చివరి సారిగా గౌతమ్‌పురిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, GOOGLE STREET VIEW
ఆశ్చర్యపోయిన స్నేహితులు
ఆయనతో సన్నిహితంగా ఉండే ముగ్గురు స్నేహితులు తండ్రీ కొడుకులు పాకిస్తాన్ వెళ్లారని తెలిసి ఆశ్చర్యపోయారు. మీడియా ద్వారానే తమకు ఆ విషయం తెలిసిందన్నారు.
ఇషాక్ అమీర్‌కు దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో వాళ్లిద్దరూ అక్కడకు వెళ్లారని తాము భావిస్తున్నట్లు పొరుగింటి వారు చెప్పారు. పోలీసులు వచ్చి విచారించడంతో తమకు ఈ విషయం తెలిసిందన్నారు.
డబ్బులు లేకపోవడంతో హసనైన్ ఐదేళ్ల క్రితమే పత్రిక మూసి వేశాడని, ఆయన పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన స్థానిక నాయకుడొకరు చెప్పారు. పార్టీ ఆఫీసుని కూడా ఎప్పుడో మూసివేశారని ఆఫీసు చుట్టుపక్కల ఉండేవారు చెప్పారు. హసనైన్ స్థాపించిన పార్టీ ఆఫీసు అడ్రస్సు, పత్రిక కార్యాలయం గూగుల్ స్ట్రీట్ వ్యూలో కనిపిస్తున్నాయి.
ఉర్దూ, హిందీలో ప్రచురించిన ఆయన పత్రిక కాపీలు ఫేస్‌బుక్‌లో ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల, కష్టాల గురించిన వార్తలు ఎక్కువగా ఉన్నాయి.

పాకిస్తానే ఎందుకు ఎంచుకున్నట్లు?
“ ఇదేమీ హఠాత్తుగానో లేకపోతే ఆలోచన లేకుండానో తీసుకున్న నిర్ణయం కాదు. అక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం” అని హసనైన్ బీసీకి వివరించారు.
బాబ్రీ మసీదు విధ్వంసం విషయంలో కోర్టు తీర్పు, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో నరేంద్రమోదీ మరోసారి గెలుస్తారనే అంచనాలు తనను ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాయన్నారు.
ఆయన పోటీ చేసిన పార్లమెంటరీ నియోజకవర్గంలో 2020లో మత ఘర్షణలు జరిగాయని అందులో 50 మంది చనిపోయారని, వారిలో ఎక్కువ మంది ముస్లింలేనని ఆయన చెప్పారు.
ఏదైనా పండుగ వస్తే హిందూ సోదరులు నుదుట బొట్టు పెట్టుకుని వీధుల్లోకి వస్తారు. అప్పుడు హిందువులెవరో, ముస్లింలెవరో తేలిగ్గా తెలిసిపోతుంది. చిన్న దాన్ని కూడా పెద్ద గొడవగా మార్చేస్తారు. తిడతారు. దాంతో ఘర్షణ మొదలవుతుంది” అని హసనైన్ అన్నారు.
“ఇలాంటివి మా అబ్బాయికి కూడా జరిగాయి. అందుకే ఈ దేశం వదిలేయాలని అనుకున్నాం. మీరు ఆఫీసుకెళ్లండి, రోడ్ల మీదకు వెళ్లండి, మెట్రోలో వెళ్లండి. ఎక్కడకు వెళ్లినా సరే. ఏదో దోచేస్తారనే భయం లేదు. కానీ నినాదాలు, ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకుని చంపేయండి అనే నినాదాలు” ఇదే మా సమస్యని అన్నారాయన.
మరి అలాంటప్పుడు ఏదో ఒక దేశం వెళ్లవచ్చు కదా. పాకిస్తానే ఎందుకు వచ్చారని మేము అడిగాం. దానికాయన “ మేము డబ్బున్నోళ్లం కాదు. 10-15 కోట్లు ఖర్చు పెట్టి పౌరసత్వం కొనుక్కోవడానికి. మాకున్న ప్రత్యామ్నాయం పాకిస్తాన్ ఒక్కటే. ఇక్కడ మాలాంటి వాళ్లే ఉన్నారు. మా పూర్వీకులు ఈ దేశం ఏర్పడేందుకు పోరాడారు” అని ఆయన చెప్పారు
తనకు పాకిస్తాన్‌లో బంధువులు ఎవరూ లేరని, అందుకే పాక్ రావడానికి వీసా దొరకలేదన్నారు.

పాకిస్తాన్ పౌరసత్వం రాకపోతే, ఆశ్రయం లభించకపోతే...
హసనైన్, ఇషాక్ అమీర్ తాము భారతదేశం వెళ్లే ప్రసక్తే లేదని గట్టిగా చెబుతున్నారు. అయితే వారికి ఆశ్రయం ఇచ్చేందుకు పాకిస్తాన్ అంగీకరించకపోతే పరిస్థితి ఏంటి?
‘‘మాకు ఆశ్రయం కావాలని మాత్రమే అడుగుతున్నాం. ఉద్యోగం, ఇల్లు కావాలని అడగడం లేదు. నేను యువకుడినే. డ్రైవింగ్ చెయ్యగలను, వంట చెయ్యగలను, ఇంకా అనేక పనులు చెయ్యగలను.
మా నాన్న పాఠాలు చెప్పగలరు, నేను కూడా ఖురాన్ బోధించగలను, నాకు ఖురాన్ అంతా గుర్తుంది. నాకు ఆశ్రయం కావాలి. నేను భారత దేశం వెళ్లను” అని అమీర్ అంటున్నారు.
‘‘కాల్చేయండి, జైల్లో మగ్గిపోయేలా చేయండి, మమ్మల్ని ఉంచుకోవడం ఇష్టం లేకపోతే భారతదేశం మాత్రం పంపవద్దు. ఇక్కడే జైల్లో ఓ మూలన పడేయండి. లేకపోతే ఎక్కడైనా బంధించండి. అది కూడా మాకు ఇష్టమే’’ అని తండ్రీ కొడుకులిద్దరూ అంటున్నారు.
“నేనిక్కడకు బతికేందుకు రాలేదు. ప్రశాంతంగా చచ్చిపోవడానికి వచ్చాను. నాకు బతకాలనే ఆశ కూడా లేదు” అని హసనైన్ తెలిపారు.
సీమా హైదర్ కేసుని ఉదహరిస్తూ “భారత ప్రభుత్వం సీమాను అంగీకరించినప్పుడు, మేంపాకిస్తాన్‌లో ఉండేందుకు ప్రపంచంలో ఏ శక్తి ఆపగలదు” అని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంలో ఏడాది గడిపితే శరీరానికి ఏమవుతుంది?
- ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు: నాలుగేళ్లలో రెండు సార్లు కొత్త సిలబస్, ఇప్పుడు ‘ఐబీ’.. మరి టీచర్ల సంగతేంటి?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














