పాకిస్తాన్ టీవీ డిబేట్‌లో‌ గెస్టుల పిడిగుద్దులు.. అసలేం జరిగింది?

పాకిస్తాన్ టీవీ డిబేట్

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

    • రచయిత, ఇమాద్ ఖాలిక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తానీ టీవీ చానెల్ ‘ఎక్స్‌ప్రెస్ న్యూస్’ ప్రైమ్ ‘టాక్ షో’లో కొట్లాటకు సంబంధించిన ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా చర్చ జరుగుతోంది.

టీవీ స్టూడియోలో చర్చ జరుగుతుండగానే అక్కడ కూర్చున్న ఇద్దరు గెస్టులు పిడిగుద్దులు కురిపించుకున్నట్లు ఈ వైరల్ వీడియోలో కనిపిస్తోంది.

ఆ ఇద్దరు గెస్టుల్లో ఒకరు పీఎంఎల్-ఎన్ సెనేటర్ డాక్టర్ అఫనానుల్లా ఖాన్ కాగా, రెండో వ్యక్తి పీటీఐ పార్టీ కోర్ కమిటీ మెంబర్, న్యాయవాది షేర్ అఫ్జల్ ఖాన్ మారవాత్.

అయితే, ఈ ప్రోగ్రామ్ లైవ్ టెలికాస్ట్ కాదు. దీన్ని బుధవారం రికార్డు చేశారు.

స్టూడియోలో ఈ కొట్లాట జరగడంపై సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మరికొందరు దీనిలో యాంకర్ పాత్రను కూడా తప్పుపడుతున్నారు.

యాంకర్ జావెద్ చౌధరి షోలోనే ఇలాంటి కొట్లాటలు ఎందుకు జరుగుతుంటాయి? ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోరా? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

పాకిస్తాన్ టీవీ డిబేట్

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

అసలేం జరిగింది?

పీఎంఎల్-ఎన్ నాయకుడు డాక్టర్ అఫనానుల్లా ఖాన్, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ నాయకుడు షేర్ అఫ్జల్ ఖాన్ మారవాత్‌లు ఆ షోలో ఒకరి నాయకత్వ పటిమ గురించి మరొకరు విమర్శలు చేసుకుంటూ మొదట తిట్టుకున్నారు.

వారి మధ్య జోక్యం చేసుకునేందుకు యాంకర్ జావెద్ చౌధరి ప్రయత్నించారు.

అయితే, కొంత సమయం తర్వాత అఫ్జల్ ఖాన్ మారవాత్ తన కుర్చీలోంచి లేచి డాక్టర్ అఫనానుల్లా ఖాన్‌ చెంప మీద కొట్టారు. ఆ తర్వాత ఇద్దరూ కుస్తీలు పట్టారు.

ఈ షోను బుధవారం రాత్రి రికార్డు చేశారు, టీవీలో కూడా ప్రసారం చేశారు. అయితే, ఆ కొట్లాటను టీవీలో చూపించలేదు. కానీ, సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేశారు.

అయితే, సీనియర్ జర్నలిస్టు, యాంకర్ జావెద్ చౌధరి షోలో ఇలా కొట్లాట జరగడం ఇదేమీ తొలిసారి కాదు.

2021 జూన్‌లోనూ ఆయన కార్యక్రమంలో అప్పటి పీటీఐ నాయకుడు ఫిర్‌దౌస్ అషిక్ అవాన్.. పీపీపీ నాయకుడు కాదిర్ మండుఖేల్‌కు చెంప దెబ్బ కొట్టారు.

పాకిస్తాన్ టీవీ డిబేట్

ఫొటో సోర్స్, Getty Images

వారిద్దరూ ఏం చెబుతున్నారు?

ఈ కొట్లాటకు సంబంధించి ఎక్స్‌ప్రెస్ టీవీ హోస్ట్ జావెద్ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అఫ్జల్ ఖాన్ మారవాత్ అంటున్నారు.

‘‘వారు వదంతులు సృష్టిస్తున్నారు. నా ప్రత్యర్థి ఒక సూపర్‌మ్యాన్ అని అంటున్నారు. అఫనానుల్లా స్టూడియో నుంచి పరారై, ఒక గదిలో తలదాచుకున్నారనే విషయం గురించి వారు అసలు మాట్లాడటం లేదు. నేను ఆ గొడవ తర్వాత ఏడు నిమిషాలు అక్కడే ఉన్నాను’ అని మారవాత్ అన్నారు.

మరోవైపు పీఎంఎల్ సెనేటర్ అఫనానుల్లా మాట్లాడుతూ.. ‘‘టాక్ షో మధ్యలోనే మారావత్‌ నాపై దాడిచేశారు. నేను అహింసను పాటిస్తాను. కానీ, నేను నవాజ్ షరీఫ్ సైనికుడిని. ఆ విషయం మరిచిపోకూడదు. మారవాత్ చేసిన ఆ పని పీటీఐకు ఒక పాఠం కావాలి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్‌కు. ఇప్పుడు ఆయన మీడియాకు ఎలా ముఖం చూపించుకుంటారు?’’ అని ఆయన అన్నారు.

పాకిస్తాన్ టీవీ డిబేట్

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

సోషల్ మీడియాలో ఏం అంటున్నారు?

టీవీ చర్చలో చోటుచేసుకున్న ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది స్పందిస్తున్నారు.

అహ్మద్ అనే యూజర్ ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ‘‘ఇద్దరు ప్రజాప్రతినిధులు ఇలా టీవీ చర్చలో పాల్గొంటున్నారు’’ అని రాసుకొచ్చారు.

మరో సోషల్ మీడియా యూజర్ జోయా హాష్మీ స్పందిస్తూ.. ‘‘మీరు ఇలాంటి కొట్లాటల ద్వారా ప్రజలకు ఏం సందేశం పంపించాలని అనుకుంటున్నారు? ఇప్పటికే విభేదాలతో సతమతం అవుతున్న మన సమాజంలో వీరు ఏకంగా టీవీ చర్చల్లోనే కొట్టుకుంటున్నారు. ఇలాంటి రాజకీయాలను పాకిస్తాన్ ఏ మాత్రం తట్టుకునే పరిస్థితిలో లేదు’’ అని జోయా అన్నారు.

మరోక యూజర్ సోనమ్ బలూచ్ స్పందిస్తూ.. ‘‘ఇది సిగ్గుచేటు ఘటన. పాకిస్తాన్‌లో చర్చలు ఇలా నడుస్తున్నాయి. పీఎంఎల్-ఎన్ నాయకుడు అఫనానుల్లా ఖాన్, పీటీఐ నాయకుడు షేర్ అఫ్జల్ పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

జావెద్ చౌధరి

ఫొటో సోర్స్, JAVED CH/FACEBOOK

జావెద్ చౌధరి ఏం అంటున్నారు?

ఈ అంశంపై ప్రోగ్రామ్ యాంకర్, సీనియర్ జర్నలిస్టు జావెద్ చౌధరి కూడా స్పందించారు.

‘‘ఇది ఖండించాల్సిన ఘటన. ఇలా జరిగుండకూడదు. అసలు ఇలా జరుగుతుందని మేం అనుకోలేదు. ఒక్కసారిగా లేచి కాఫీ కప్పు విసిరేసి, కొట్లాటకు దిగుతారని ఎవరు ఊహిస్తారు?’’ అని ఆయన అన్నారు.

‘‘ఒక మనిషి ఏం చేస్తాడో ఊహించగలిగే లేదా చెప్పే మెషీన్లు ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేదు. నేను ఇప్పటివరకూ 3072 షోలు చేశాను. ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే’’ అని ఆయన అన్నారు.

‘‘నేను మళ్లీ చెబుతున్నాను. ఇలా జరిగుండకూడదు. ఈ విషయంలో నేను పశ్చాత్తప పడుతున్నాను. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా నేను జాగ్రత్త వహిస్తాను’’ అని ఆయన చెప్పారు.

సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడానికి ఆ ఇద్దరు నాయకులే కారణమని జావెద్ చౌధరి అన్నారు.

‘‘బుధవారం రాత్రి ఆ షో తర్వాత.. షేర్ అఫ్జల్ ఖాన్ మారవాత్ వసీమ్ బదామీ షోకు వెళ్లారు. మా షోలో ఏం జరిగిందో అక్కడ పూసగుచ్చినట్లు ఆయన వివరించారు. తనను అఫనానుల్లా ఖాన్ కొట్టారని చెప్పారు’’ అని జావెద్ చెప్పారు.

‘‘ఆ తర్వాత పీఎంఎల్-ఎన్ నాయకుడైన అఫనానుల్లా కూడా దీనిపై మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత రెండు పార్టీలు వరుసగా దీనిపై ట్వీట్లు చేశాయి. అలా సోషల్ మీడియాలో గొడవ మొదలైంది’’ అని ఆయన వివరించారు.

‘‘నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ఇలాంటివి పాకిస్తాన్‌లోనే కాదు, అమెరికా లాంటి దేశాల్లోనూ చిచ్చు పెడుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.

పాకిస్తాన్ చర్చ

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

యాంకర్ ఏం చేయాలి?

అసలు పరిస్థితి ఇంతలా దిగజారకుండా చూసేందుకు యాంకర్ ఏం చేసుండాలి? ఈ ప్రశ్నపై జర్నలిస్టు ఆస్మా షీరాజీ బీబీసీతో మాట్లాడారు.

‘‘చర్చ పక్కదారి పట్టకుండా యాంకర్ చూసుకోవాలి. అసలు ఇలాంటి తిట్లు, గొడవలు మొదలయ్యే సూచనలు కనిపించిన వెంటనే, చర్చను ఆపేయాలి. గెస్టులను వెళ్లిపోవాలని సూచించాలి’’ అని ఆస్మా అన్నారు.

‘‘చాలాసార్లు హోస్టు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, గెస్టులు దాన్ని పట్టించుకోరు. అలాంటప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. కానీ, ఇలాంటి ఘటనలు పదేపదే జరిగితే.. అసలు సమస్య ఎక్కడుందో ముందు యాంకరే ఆలోచించుకోవాలి’’ అని ఆస్మా చెప్పారు.

వీడియో క్యాప్షన్, దేశ విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలను కలుపుతున్న ఓ పాకిస్తానీ యూట్యూబర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)