రూపాయిని వెనక్కి నెట్టిన అఫ్గానీ.. పేదరికం, ఆకలితో బాధపడుతున్న దేశంలో ఇదెలా సాధ్యం?

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

బ్లూమ్‌బర్గ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఈ త్రైమాసికానికి గానూ అఫ్గానిస్తాన్ కరెన్సీ టాప్ ర్యాంకులో నిలిచింది.

పేదరికం, ఆకలితో అలమటిస్తున్న దేశంలో ఇలా జరగడం నిజంగా ఆశ్యర్యకరం.

2021 ఆగస్టు 15న తాలిబాన్లు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే అఫ్గాన్ రాజధాని కాబూల్‌‌లోకి ప్రవేశించారు. పశ్చిమ దేశాల మద్దతు ఉన్న అష్రఫ్ ఘనీని అధికారం నుంచి దించేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

అఫ్గాన్‌ నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కూడా హడావిడి చేశాయి. అందుకోసం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దేశం విడిచి వెళ్లిపోయేందుకు వేలాది మంది అఫ్గాన్లు కూడా విమానాశ్రయాలకు తరలివెళ్లారు.

దేశంలో గందరగోళ పరిస్థితుల నెలకొనడంతో పాటు కాబూల్ విమానాశ్రయం కూడా గందరగోళంగా మారింది.

ఏదేమైనప్పటికీ, నాటకీయ పరిణామాల తర్వాత తాలిబాన్లు రెండోసారి దేశంలో అధికారం చేపట్టారు. కానీ, ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు లేకుండా పాలన సాగించడం అంత సులువు కాదు.

తాలిబాన్లకు మద్దతుదారులుగా పేరుపొందిన పొరుగు దేశాలు కూడా ఇప్పటికీ అఫ్గానిస్తాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు.

అంతర్జాతీయంగా గుర్తింపు లేకపోయినప్పటికీ, నిరంతరాయంగా ఎగుమతి, దిగుమతులు లేకపోయినప్పటికీ అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలపడింది. ఈ ప్రభుత్వానికి ఇదెలా సాధ్యమైంది?

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

పేదరికం ఉన్నా బలపడిన అఫ్గానీ

ప్రపంచంలోని పేద దేశాల్లో అఫ్గాన్ కూడా ఒకటి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. కనీస మౌలిక వసతులు లేకపోవడం, నిరక్షరాస్యత, నిరుద్యోగంతో అఫ్గానిస్తాన్ సతమతమవుతోంది.

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, దాదాపు 34 మిలియన్ల (3.4 కోట్లు) మంది పేదరికం అనుభవిస్తున్నారు. 2020లో ఆ సంఖ్య కేవలం 1.5 కోట్లు. నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఇది చాలా పెద్ద సంఖ్య.

ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అఫ్గానిస్తాన్ కరెన్సీ అఫ్గానీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్లామ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ఈ త్రైమాసికంలో అఫ్గాన్ అఫ్గానీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

ఈ లెక్కల ప్రకారం, ఒక అఫ్గాన్ అఫ్గానీ 3.72 పాకిస్తాన్ రూపాయలతో సమానం. గత మూడు నెలల్లో అఫ్గాన్ కరెన్సీ 9 శాతం బలపడింది. అదే సమయంలో, ఒక డాలర్‌కి 79 అఫ్గానీలు చెల్లించాల్సి ఉంటే, భారత్‌లో డాలర్ విలువ 80 రూపాయలకు పైగా ఉంది.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

కారణమేంటి?

రెండేళ్ల కిందట అధికారం చేపట్టిన నాటి నుంచి అఫ్గానిస్తాన్‌ను బలోపేతం చేసేందుకు తాలిబాన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. డాలర్లు, పాకిస్తానీ రూపాయల్లో చెల్లింపులను పూర్తిగా నిలిపేసింది.

ఆన్‌లైన్ ట్రేడింగ్‌ చట్టవిరుద్ధమని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని జైళ్లలో వేసింది.

కరెన్సీపై పూర్తి నియంత్రణ సాధించడంతో ఈ క్వార్టర్‌లో అఫ్గాన్ అఫ్గానీ 9 శాతం బలపడిందని, అంతర్జాతీయ ఆర్థిక సాయం, బకాయి చెల్లింపులతో ఇది సాధ్యమైందని బ్లూమ్‌బర్గ్ డేటా విశ్లేషిస్తోంది.

''దేశంలో చెలామణీలో ఉన్న కరెన్సీపై తాలిబాన్లు పూర్తిగా నియంత్రణ సాధించారు. అయితే, ఆర్థిక, సామాజిక, రాజకీయ అనిశ్చితి కరెన్సీ బలోపేతాన్ని స్వల్పకాల ప్రయోజనంగా మార్చేస్తుంది'' అని వాషింగ్టన్‌‌‌కి చెందిన సౌత్ ఏసియన్ వ్యవహారాల నిపుణులు కమ్రాన్ బుఖారి బ్లూమ్‌బర్గ్‌తో చెప్పారు.

అఫ్గానిస్తాన్‌ సంపదలో ఎక్కువ భాగం అంతర్జాతీయ సాయం కింద వస్తున్న నిధులే. ఈ సాయంలో ఎక్కువ శాతం ఐక్యరాజ్యసమితి ద్వారా అందుతోంది.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఐక్యరాజ్యసమితి నిధుల సాయం

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, అఫ్గానిస్తాన్‌కు ఈ ఏడాది 3.2 బిలియన్ల యూఎస్ డాలర్ల (26,619 కోట్ల రూపాయలు) సాయం అవసరమవుతుందని అంచనా. అందులో ఇప్పటి వరకూ దాదాపు 1.1 బిలియన్ డాలర్ల (9,147 కోట్ల రూపాయలు) సాయం అందింది.

నిరుడు ఐక్యరాజ్యసమితి నాలుగు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది.

2021లో అఫ్గానిస్తాన్‌లో అధికార మార్పిడి జరిగిన తర్వాత, ఐక్యరాజ్యసమితి దాదాపు 5.8 బిలియన్ డాలర్ల (48,231 కోట్ల రూపాయలు) సాయం అందించింది. ఈ ఏడాది నుంచి ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడం తగ్గిపోయి, 2025 నాటికి రెండు నుంచి మూడు శాతం వృద్ధి సాధించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

బలమైన కరెన్సీ ఆర్థిక వ్యవస్థను బలోపేతోం చేయడంతో పాటు ద్రవ్యోల్బణాన్నీ నియంత్రణలో ఉంచుతుంది.

అయితే, మహిళల అణచివేతకు నివేదికల నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌కు ఆర్థిక సాయం తగ్గించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

మనీమార్కెట్, హవాలా ట్రేడింగ్

అఫ్గానిస్తాన్‌లో ఫారిన్ ఎక్స్ఛేంజ్ బిజినెస్ (విదేశీ మారక వ్యాపారం) డబ్బు మార్పిడి చేసేవారి ద్వారా జరుగుతుంది. వారిని మనీలెండర్స్‌గా పిలుస్తారు. అక్కడి బులియన్ మార్కెట్లలో కుప్పలుగా నగదు పోగవుతుంది. అఫ్గాన్‌లో గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకూ ఇలాంటి మార్కెట్లు ఉన్నాయి.

కాబాల్‌లోని సరాయ్ షహజాదా బజార్ ప్రస్తుతం అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారింది. ప్రతిరోజూ ఇక్కడ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. విదేశీ మారకంపై ఆ దేశ సెంట్రల్ బ్యాంకు కూడా ఎలాంటి పరిమితులు విధించలేదు.

అఫ్గానిస్తాన్‌లో ఆర్థిక సేవలపై ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేదని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

''ఎలాంటి నియంత్రణా లేకపోవడంతో చాలా వరకూ నగదు లావాదేవీలు హవాలా మార్గంలో జరుగుతున్నాయి. తాలిబాన్లు వచ్చిన తర్వాత చాలా మంది దేశం వదిలి వెళ్లిపోతున్నారు. ఆ దేశ సెంట్రల్ బ్యాంకు (ది అఫ్గానిస్తాన్ బ్యాంక్)‌లో నిపుణులు కొరత ఉంది. దీని కారణంగా అఫ్గాన్‌లో టెర్రర్ ఫండింగ్, మనీలాండరింగ్ ముప్పు ఉంది'' అని నమూజ్ జహీర్ ప్రపంచ బ్యాంకు బ్లాగ్‌లో రాశారు.

పాకిస్తాన్ నుంచి స్మగ్లింగ్ ద్వారా వస్తున్న డాలర్లు తాలిబాన్ల పాలనకు కీలకంగా మారాయి.

అఫ్గానీ

ఫొటో సోర్స్, Getty Images

ఖనిజ వనరులు

ఐక్యరాజ్యసమితి ఆర్థిక సాయానికి తోడు లిథియం వంటి విలువైన సహజ వనరులు అఫ్గాన్‌లో ఉన్నాయి. దేశంలో దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల (దాదాపు 2,49,48,225, 00,00,000 రూపాయలు) విలువైన లిథియం నిల్వలు ఉన్నట్లు అంచనా.

ఈ భారీ నిల్వలపై చైనా ఓ కన్ను వేసినట్లు బ్రూకింగ్ ఇన్‌స్టిట్యూట్ చెబుతోంది.

అఫ్గానిస్తాన్‌లోని ఇనుము, బంగారు గనుల తవ్వకాలకు సంబంధించి చైనా, బ్రిటన్, తుర్కియే దేశాలతో దాదాపు 6.5 బిలియన్ డాలర్ల (54,054 కోట్ల రూపాయలు) మైనింగ్ ఒప్పందాలు జరిగాయి.

చమురు అన్వేషణకు సంబంధించి జనవరిలో చైనాతోనూ తాలిబాన్లు ఒప్పందం చేసుకున్నారు.

ఇవే కాకుండా, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా అఫ్గాన్‌లో మౌలిక సదుపాయాల కోసం గణనీయంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 27 బుధవారం మధ్యాహ్నానికి ఒక్క అమెరికా డాలర్ 83.21 రూపాయలకి సమానంగా ఉంటే, 78.39 అఫ్గానీలు ఒక డాలర్‌తో సమానంగా ఉంది.

దీనర్థం భారత రూపాయిని కూడా అఫ్గాన్ అఫ్గానీ వెనక్కి నెట్టింది. అయితే, బలమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది జరగలేదు. ఇతర కారణాల వల్ల అఫ్గానీ బలపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)