మాల్దీవుల ఎన్నికలు - ఇండియా, చైనా: ఇంత చిన్న దేశంలో పట్టు కోసం అంత పోటీ ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సహజ సిద్ధమైన బీచ్‌లు, పగడపు దీవులు, వైవిధ్యమైన సముద్ర జీవులకు నెలవైన మాల్దీవుల్లో భౌగోళిక రాజకీయ వైరం చివరి దశకు చేరుకుంది.
ఈ చిన్న ద్వీపదేశం విస్తీర్ణం 300 చదరపు కిలోమీటర్లు. దీని పరిధిలో దాదాపు 1200 పగడపు దీవులున్నాయి.
హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న మాల్దీవుల అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్, ప్రతిపక్ష అభ్యర్థి మహహ్మద్ మయిజ్జు పోటీపడుతున్నారు.
సెప్టెంబర్ 30న రెండో దశ ఎన్నిక జరగనుంది.
ఈ ఎన్నికల్లో ఇండియా, చైనా మధ్య కూడా పోటీ నెలకొంది.
తూర్పు, పశ్చిమ దేశాల నౌకామార్గంలో కీలకంగా ఉన్న ఈ దీవులపై వ్యూహాత్మక ఆధిపత్యం సాధించేందుకు రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి.
మాల్దీవ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దీవుల మధ్య విమానాలు, నౌకల్లో హడావిడిగా తిరుగుతున్నారు. ఆసియాలో బలమైన రెండు శక్తులకు ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2018లో అనూహ్య రీతిలో విజయం సాధించిన మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) అభ్యర్థి సోలిహ్ భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. సాంస్కృతికంగా, ఆర్థికంగా బలమైన సంబంధాలను ఏర్పరుచుకున్నారు.
ప్రతిపక్ష ప్రోగ్రెసివ్ అలయెన్స్ కొయలిషన్‌కు చెందిన మహహ్మద్ మయిజ్జు, చైనాతో సత్సంబంధాలపై అనుకూలంగా ఉన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో సోర్స్, GETTY IMAGES
సోలిహ్‌పై 'ఇండియా ఫస్ట్' విమర్శలు
ఈ నెల మొదటి వారంలో జరిగిన తొలిరౌండ్ ఎన్నికల్లో సోలిహ్‌కి కేవలం 39 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఒకవైపు చైనా ఆర్థిక సాయం చేస్తుంటే, భారత్‌కే తొలి ప్రాధాన్యం ‘ఇండియానే ఫస్ట్’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రస్తుత అధ్యక్షుడు సోలిహ్‌పై విమర్శలున్నాయి.
అయితే, ఈ వాదనలను సోలిహ్ కొట్టిపారేస్తున్నారు.
''ఒక దేశంతో సంబంధాలు ఉపయోగకరమా, కాదా అనే ప్రాతిపదికన ఉండవు. ఒక దేశంతో సత్సంబంధాలు, మరొకరిని ప్రభావితం చేయొచ్చు'' అని ఆయన బీబీసీకి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
2010, 2013లో భారత్ రెండు హెలికాప్టర్లు, 2020లో ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను బహుమతిగా ఇవ్వడం మాల్దీవుల్లో ఆగ్రహానికి కారణమైంది. దీని కారణంగా ఇండియా ఫస్ట్ విధానం ప్రజాదరణ పొందలేకపోయింది.
సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లతో పాటు వైద్య సాయం కోసమే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను క్రాఫ్ట్‌ను అందజేసినట్లు భారత్ తెలిపింది.
అయితే, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం ఇండియన్ మిలిటరీకి చెందిన 75 మంది భద్రతా సిబ్బంది మాల్దీవుల్లో ఉన్నారని 2021లో మాల్డీవియన్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.
ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ 'ఇండియా ఔట్' ప్రచారం మొదలుపెట్టింది. భారత సైన్యం దేశం విడిచివెళ్లిపోవాలని డిమాండ్ చేసింది.
వాళ్లు ఇక్కడ ఉండడం దేశ భద్రతకు ముప్పు అని ప్రతిపక్ష పార్టీ వాదించింది.
ఇది ఎన్నికల్లో కీలక అంశంగా మారింది. ఇవన్నీ అనవసర భయాలని సోలిహ్ అంటున్నారు.
''ప్రస్తుతం దేశంలో విదేశీ సైనికులు ఎవరూ లేరు. భారత భద్రతా సిబ్బంది మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ ఆపరేషనల్ కమాండ్ ఆధ్వర్యంలో ఉన్నారు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రుణాలు, గ్రాంట్లతో దౌత్యం
2013 నుంచి 2018 వరకూ అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యమీన్, చైనాకు దగ్గరయ్యారు. చైనా, ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య రోడ్డు, రైలు, సముద్ర మార్గాల ఏర్పాటు కోసం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేపట్టిన భారీ ప్రాజెక్టు ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’లో చేరారు.
దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని భారత్ సహా పశ్చిమ దేశాలు రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపడంతో, ఎలాంటి నిబంధనలు లేకుండా చైనా నిధులు ఇస్తామనడంతో ఆయన అటు వైపు మొగ్గారు.
అవినీతి కేసుల్లో అబ్దుల్లా యమీన్ 11 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుండడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకున్నారు. యమీన్‌కు ప్రత్యామ్నాయంగా మయిజ్జు మారారు.
యమీన్‌కు భారత్‌తో సత్సంబంధాలు లేకపోవడంతో ప్రతిపక్షం చైనా వైపు మొగ్గక తప్పని పరిస్థితి.
మాల్డీవ్స్ రాజధాని మాలేకి, మరో దీవిలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ 2.1 కిలోమీటర్ల మేరు నిర్మించిన నాలుగు లైన్ల వంతెనకు చైనా నిధులిచ్చింది. దాదాపు రూ.1,664 కోట్లతో నిర్మించిన ఈ వంతెన 2018లో ప్రారంభించారు. అప్పటికి యమీన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
చైనాకు దీటుగా భారత్ కూడా గత కొన్నేళ్లలో రుణాలు, గ్రాంట్ల రూపంలో దాదాపు 2 బిలియన్ డాలర్లు(16,664 కోట్లు) సాయం చేసింది. అయితే, భారత్ సాయంపై మాల్దీవుల ప్రజల్లో అనుమానాలు కలిగాయి. భారత్ పరోక్షంగా ఆధిపత్యం సాగించేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు ఉన్నాయి.
ఇండియా, చైనా మధ్య హిమాలయాల ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతల ప్రభావం మాల్దీవులపై పడే ప్రభావం ఉందన్న ఆందోళన కూడా ఉంది.
''భారత్‌తో సహా ఏ దేశంతోనూ తమకు వ్యూహాత్మక సంబంధాలు ఉండకూడదనే సెంటిమెంట్ ఇక్కడి ప్రజల్లో ఉంది'' అని మాల్దీవ్స్ విశ్లేషకులు, యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా లెక్చరర్ అజీమ్ జహీర్ అన్నారు.

మరికొద్దిరోజుల్లో రెండో రౌండ్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన చిన్న పార్టీల మద్దతు కూడగట్టలేకపోయారు సోలిహ్. దీంతో ఈ ఎన్నిక ఆయనకు కష్టతరంగా మారనుంది.
ఇండియా ఔట్ భావన పెరగకుండా నియంత్రించడంలో అధికార ఎండీపీ వెనకబడడంతో ప్రతిపక్షాల కూటమి ముందంజ వేసింది.
ప్రస్తుత ప్రభుత్వం భారత్‌పై ఎక్కువగా ఆధారపడడం వల్ల సార్వభౌమాధికారం క్షీణించిందని ప్రతిపక్ష కూటమి ఉపాధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్ షరీఫ్ అన్నారు.
దేశంలోని ప్రతి ప్రాజెక్ట్ భారత్ నిధులతోనే జరుగుతోందని, భారత్‌కు చెందిన కంపెనీలదే వాటిలో కీలకపాత్ర అని ఆయన అన్నారు.
"ఇండియా ఔట్" ప్రచారం ఉధృతంగా ఉన్నప్పటికీ, మాల్దీవులకు చెందిన చాలా మంది యువత పెరిగిన ఖర్చు, నిరుద్యోగం, వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతున్నారు.
"యువతకు ఉపాధి అవకాశాల గురించి ఆందోళన చెందుతున్నాం. దేశానికి సేవ చేయాలని వారిలో ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో వలస వెళ్లాలనుకుంటున్నారు'' అని మాల్దీవ్స్ నేషనల్ యూనివర్సిటీ విద్యార్థిని ఫాతిమత్ రాయా షరీఫ్ బీబీసీతో చెప్పారు.
అయితే, ఈ అంతర్గత సమస్యలు అంత ప్రభావం చూపించకపోవచ్చు.
ఎన్నికల్లో విజేతను బట్టి ఈ కీలకమైన ప్రాంతంలో భారత్, చైనాల్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆధారపడి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















