ఐఫోన్ 15: సీటైప్ చార్జర్‌తో వస్తున్న ఈ ఫోన్ విప్లవం సృష్టిస్తుందా... ధర ఏ రేంజ్‌లో ఉండవచ్చు?

ఐఫోన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, జోయ్ క్లెయిన్మన్
    • హోదా, టెక్నాలజీ ఎడిటర్

నేడు రాత్రి 10.30 గంటలకు యాపిల్ ఈవెంట్ జరగనుంది.

ప్రతి ఏడాది ఈ ఈవెంట్‌లో కొత్త ప్రాడక్ట్స్‌ను రిలీజ్ చేస్తుంది యాపిల్. ఈ ఏడాది ఐఫోన్ 15 విడుదల కానుంది. ఇది 16వ జనరేషన్ డివైస్.

2007లో తొలిసారి మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్, స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త విప్లవాన్ని సృష్టించింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్‌కు చాలా క్రేజ్ ఉంది.

పూర్తి వివరాలు తెలియకపోయినా ఐఫోన్ 15 అంటే చాలా ఆన్‌లైన్ ప్రపంచంలో చాలా ఆసక్తి కనిపిస్తోంది. ‘iphone 15’ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే సుమారు 534 కోట్ల రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఐఫోన్ 15 ఫీచర్ల మీద ఊహాగానాలు, ‘లీకులు’ వంటి కథనాలు బోలెడు కనిపిస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం ఐఫోన్ 14 వంటి మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్ 15 కాస్త తేలికగా ఉండనుంది. అడ్వాన్స్‌డ్ చిప్, మంచి బ్యాటరీ లైఫ్, మరింత స్పష్టమైన కెమెరాలతో పాటు టైటానియంతో బాడీని తయారు చేశారని ఆ కథనాలు చెబుతున్నాయి.

అయితే, ఐఫోన్‌లో టెక్నాలజీ ఫీచర్లను అప్‌డేట్ చేయడంలో యాపిల్ కాస్త నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు తక్కువగా ఉండటానికి అదొక కారణమనే విమర్శ కూడా ఉంది. లేటెస్ట్ మోడల్స్‌లో కొత్త ఫీచర్లు లేకపోవడం వల్ల ఉన్న ఐఫోన్లనే ఎక్కువ కాలం వాడేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. ఐఫోన్ల ఖరీదు ఎక్కువ కావడం కూడా దీనికొక కారణం.

అందువల్ల ఈ సారి విడుదల చేసే ఐఫోన్ 15లో కూడా టెక్నాలజీ పరంగా పెద్దగా మార్పులు ఏమీ ఉండకపోవచ్చని టెక్ నిపుణులు అంటున్నారు.

‘‘నేడు జరిగే యాపిల్ ఈవెంట్‌లో విప్లవాత్మక మార్పులను ఉండకపోవచ్చు’’ అని సీసీఎస్ ఇన్‌సైట్స్‌కు చెందిన ఎనలిస్ట్ బెన్ ఉడ్ అన్నారు.

కానీ యూరప్‌ కస్టమర్లు మాత్రం ఒక కొత్త ఫీచర్ చూడనున్నారు. అదే యూఎస్‌బీ-సి చార్జింగ్ కేబుల్ పాయింట్. యురోపియన్ యూనియన్ నిబంధనల ప్రకారం ఐఫోన్ 15కు సీ టైప్ చార్జింగ్ పాయింట్ ఉండనుంది.

యూఎస్‌బీ సీ, లైట్‌నింగ్ చార్జింగ్ కేబుల్స్

ప్రస్తుతం ఐఫోన్లకు తన సొంత చార్జింగ్ కేబుల్ పాయింట్‌ అయిన ‘లైట్‌నింగ్’ వాడుతోంది యాపిల్. అందువల్ల వేరే చార్జర్లు దీనికి ఫిట్ కావు. ఉదాహరణకు మీ వద్ద ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నాయి అనుకుందాం. ఆండ్రాయిడ్ ఫోన్ చార్జర్‌తో ఐఫోన్‌ను చార్జ్ చేయలేం. అలాగే ఐఫోన్ చార్జర్ ఆండ్రాయిడ్ ఫోన్‌కు పనికి రాదు.

క్రియేటివిటీ, ఇన్నోవేషన్‌కు విభిన్నమైన ప్రోడక్ట్స్ బాటలు వేస్తాయని యాపిల్ వాదిస్తూ వస్తోంది. వైర్‌లెస్ చార్జింగ్‌ను ఒక ఆల్టర్‌నేటివ్ టెక్నాలజీగా ముందుకు తీసుకొచ్చింది యాపిల్. ఐఫోన్ 8 నుంచి అన్ని మోడల్స్ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తున్నాయి.

2024 డిసెంబర్ నాటికి అన్ని డివైస్‌లు యూనివర్సల్ చార్జర్‌కు అనుకూలంగా ఉండాలని యురోపియన్ యూనియన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సి-టైప్ కేబుల్స్‌ను యూనివర్సల్ చార్జర్‌గా వాడుతున్నారు. ఒకవేళ తన సొంత టెక్నాలజీ చార్జింగ్ కేబుల్ ‘లైట్‌నింగ్’ను యాపిల్ ఇస్తామన్నా తీసుకోవడానికి ఇతర కంపెనీలు ముందుకొచ్చేవి కావు.

సెండ్ హ్యాండ్ ఐఫోన్లకు ఆఫ్రికా వంటి మార్కెట్లలో మంచి ఆదరణ కనిపిస్తోందని బెన్ ఉడ్ అంటున్నారు. కొత్త ఫోన్లను కొనలేని వారు వాడేసిన వాటిని కొనడానికి మొగ్గు చూపుతున్నారని, అందువల్ల పాత ఐఫోన్ చార్జర్లకు డిమాండ్ ఉంటుందని ఆయన చెబుతున్నారు.

ఐఫోన్ల మీద ఆంక్షలు విధిస్తున్నది యురోపియన్ యూనియన్ మాత్రమే కాదు. భద్రతా కారణాలతో ప్రభుత్వకార్యాలయాల్లో ఐఫోన్లు వాడొద్దంటూ చైనా ఆదేశించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధంలో దీన్ని భాగంగా చూడొచ్చు. చైనాలో మెజారిటీ ప్రజలు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడతారు. కానీ ఖరీదైన ఫోన్ల అమ్మకాల్లో ఇప్పటికీ అక్కడ ఐఫోన్ టాప్‌లో ఉంది.

తమ దేశంలోనే తయారవుతున్న ఐఫోన్లను చైనా నిషేధించడం కాస్త విచిత్రంగాను ఉంటుంది. చైనాను వీడేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. భారత్‌లో ఐఫోన్ 14‌ను అసెంబుల్ చేయడం మొదలు పెట్టింది. కానీ చైనా ఫ్యాక్టరీలు, అక్కడి కంపెనీల అవసరం ఇంకా యాపిల్‌కు ఉంది.

దీని ప్రారంభ ధర భారత్‌లో సుమారు రూ. 80 వేలు ఉండనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)