‘హర్‌దీప్ సింగ్ హత్య కేసులో ఆధారాలు ఉంటే ఇవ్వండి. పరిశీలిస్తాం’ -కెనడాను కోరిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఏవైనా నిర్దిష్టమైన ఆధారాలను అందిస్తే, వాటిని పరిశీలిస్తామని కెనడాకు భారత్ స్పష్టంచేసింది.
కెనడాలో గత జూన్‌లో హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు. ఈ విషయంపై భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా మాట్లాడారు.
ఈ హత్య వెనుక భారత్ హస్తముందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
అయితే, కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది.
ఈ హత్యకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు భారత్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎస్ జైశంకర్ చెప్పారు. అయితే, దీని వెనుక భారత్ ప్రమేయం లేదని ఆయన పునరుద్ఘాటించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగించే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఇలా చట్టాలను చేతుల్లోకి తీసుకొని హత్య చేయడాన్ని భారత ప్రభుత్వం అసలు సహించదని మేం కెనడియన్లకు స్పష్టంచేశాం. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఏదైనా నిర్దిష్టమైన సమాచారం లేదా ఆధారాలు ఉంటే ఇవ్వండి, వాటిపై మేం దర్యాప్తు చేపడతామని కూడా చెప్పాం’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, SIKH PA
గత జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలోని ఒక ప్రార్థనా మందిరం బయట హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను కొందరు కాల్చిచంపారు. 2020లోనే అతడిని టెర్రరిస్టుగా భారత్ గుర్తించింది. అయితే, ఆయనపై భారత్ చేసిన ఆరోపణలను ఆయన అనుచరులు ఖండించేవారు.
‘ఖలిస్తాన్’ పేరుతో తమకు ప్రత్యేక దేశం కావాలని పశ్చిమ దేశాల్లో సిక్కు వేర్పాటువాదులు చేసే డిమాండ్లను భారత్ ఎప్పటికప్పుడే తీవ్రంగా ఖండిస్తుంది.
1980లలో భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం కేంద్రంగా ఖలిస్తాన్ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. అయితే, ప్రస్తుతం సిక్కులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమం అంత బలంగా లేదు. కానీ, సిక్కు ప్రజలు ఎక్కువగా ఉండే కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఈ డిమాండ్ అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
కెనడా నుంచి పనిచేస్తున్న వేర్పాటువాద బృందాలు, సంస్థల గురించి ఇప్పటికే ఆ దేశానికి చాలా ఆధారాలు, సమాచారాన్ని సమర్పించామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు.
‘‘ఇక్కడ ఏ కేసుకు ఆ కేసు విడిగా చూడకూడదు. గత కొన్ని ఏళ్లుగా కెనడాలో వేర్పాటువాద నాయకులు, సంస్థలు చాలా హింస, ఆందోళనలకు కారణమయ్యారు. తాజా ఘటనలు కూడా దానిలో భాగమే’’ అని ఆయన అన్నారు.
‘‘వేర్పాటువాద నాయకులను అప్పగించాలని భారత్ చాలా అభ్యర్థనలు పెట్టుకుంది. మరోవైపు తీవ్రవాదులుగా గుర్తించిన నాయకులు కూడా అక్కడ ఉన్నారు’’ అని ఎస్ జైశంకర్ చెప్పారు.
నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయంపై కెనడా నిఘా సంస్థలు దర్యాప్తు చేపడుతున్నాయని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వెల్లడించడంతో తాజా వివాదం మొదలైంది.
కెనడా ఆరోపణల అనంతరం భారత్ కూడా ఘాటుగా స్పందించింది. ‘‘కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలపై మేం ఆందోళన వ్యక్తంచేస్తున్నాం. భారత దౌత్యవేత్తలపైనా అక్కడ హింస జరుగుతోంది’’ అని భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆ తర్వాత రెండు దేశాలూ దౌత్యవేత్తలను బహిష్కరించాయి. గత గురువారం కెనడాలో వీసా సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
నిజ్జర్ హత్యకు సంబంధించి ఐదు దేశాల (అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) నిఘా విభాగం ‘ఫైవ్ ఐస్’ను కూడా ఏదైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరినట్లు జైశంకర్ చెప్పారు.
గత వారం కెనడాలోని అమెరికా దౌత్యవేత్త కూడా ఈ హత్యకు సంబంధించి కొంత సమాచారాన్ని సభ్య దేశాలకు ‘ఫైవ్ ఐస్’ షేర్ చేసిందని, దీని ఆధారంగానే కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారని చెప్పారు.
అయితే, ‘‘ఫైవ్ ఐస్‌లో మాకు సభ్యత్వం లేదు. ఎఫ్‌బీఐతోనూ మాకు సంబంధం లేదు’’ అని ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎస్ జైశంకర్ సమాధానం చెప్పారు.
కెనడా ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని అమెరికా కోరుతోంది. ‘‘ఈ విషయంలో కెనడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడుతుందని మేం భావిస్తున్నాం. దీనికి భారత ప్రభుత్వం కూడా సహకరించాలి’’ అని అమెరికా విదేశాంగ విభాగం అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















