అమృత్‌పాల్ సింగ్: భింద్రన్‌వాలే సొంత ఊరిలోనే అరెస్ట్, ఎలా చిక్కారంటే...

ఫొటో సోర్స్, RAVINDER
పరారీలో ఉన్న 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్, ఖలిస్తాన్ అనుకూల అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 18 నుంచి ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు.
అనంతరం పంజాబ్ పోలీసులు ఆయన్ను బఠిండాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తీసుకెళ్లారు, అక్కడి నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలిస్తున్నారు.
పంజాబ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఐజీ సుఖ్‌చేన్ సింగ్ గిల్ దీనిపై విలేఖరులతో మాట్లాడుతూ అమృతపాల్ సింగ్‌ను పంజాబ్‌లోని మోగా జిల్లాలోని రోడ్ గ్రామంలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
కాగా ఒకప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్‌లో మరణించిన భింద్రన్ వాలే సొంతూరు కూడా రోడ్ గ్రామమేనని చెప్పారు బీబీసీ హిందీ అసోసియేట్ జర్నలిస్ట్ రవీందర్ సింగ్ రాబిన్.
ఈ గ్రామంలోనే గత ఏడాది అమృత్‌పాల్‌ను వారిస్ పంజాబ్ దే సంస్థకు అధ్యక్షుడిగా ప్రకటించారు.
అమృత్‌పాల్ తన అరెస్ట్‌కు ముందు అయిదు కకారాలు(కేశ్-జుత్తు, కృపాణ్-కత్తి, కంఘా-దువ్వెన, కడా-కంకణం, కచ్ఛా-లాగు)ను గురుద్వారాలోని గ్రంథీ(గురుగ్రంథ్ సాహిబ్ పఠించే వ్యక్తి) నుంచి తీసుకుని వాటిని ధరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించినట్లు రవీందర్ సింగ్ చెప్పారు.
తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆయన ఈ సందర్భంగా ప్రజలతో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే పోలీసులు ఆయనను గురుద్వారా వెలుపల అరెస్ట్ చేశారు.

అరెస్ట్ సమయంలో అక్కడే ఉన్న భింద్రన్ వాలే సోదరుడి కుమారుడు
అకాల్ తఖ్త్ మాజీ జతేదార్, జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు జస్బీర్ సింగ్ రోడే అమృతపాల్ సింగ్ అరెస్ట్ అనంతరం బీబీసీతో మాట్లాడారు. ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్ రోడ్ గ్రామంలో ఉన్నారని, ఆయన్ను అరెస్ట్ చేయాలని శనివారం రాత్రి పోలీసులు తనతో చెప్పారని జస్బీర్ సింగ్ తెలిపారు.
అందువల్ల తాను రోడ్ గ్రామానికి వచ్చినట్లు ఆయన చెప్పారు.
‘అమృతపాల్ సింగ్ మొదట ‘నిత్‌నేమ’(సిక్‌ల శ్లోకాలు) పఠించారు. అనంతరం, అక్కడున్నవారిని ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం గురుద్వారా బయటకు వెళ్లగా అక్కడే పోలీసులు అయన్ను అరెస్ట్ చేశారు’ అని జస్బీర్ సింగ్ చెప్పారు. కాగా ఇంతకుముందు అమృతపాల్ సింగ్ తనతో టచ్‌లో లేరని కూడా జస్బీర్ సింగ్ తెలిపారు.
అజ్నాలా పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో మార్చి 18న జలంధర్‌లోని శాహ్‌కోట్-మల్సియాన్ రోడ్డులో పోలీసులు అమృత్‌పాల్, ఆయన అనుచరులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు.

పంజాబ్ పోలీసులు ఏం చెప్పారు?
అమృత్‌పాల్‌ను ఆదివారం ఉదయం 6.45 గంటలకు అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.
పోలీసులు రోడ్ గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టారని.. ఆ సమయంలో అమృతపాల్ సింగ్ గురుద్వారా సాహిబ్‌లో ఉన్నారని పంజాబ్ పోలీస్ ఐజీ సుఖ్‌చేన్ సింగ్ గిల్ చెప్పారు.
‘గురుద్వారా అత్యంత గౌరవప్రదమైనది.. ఆ గౌరవానికి భంగం కలగకుండానే గురుద్వారా చుట్టూ పోలీసులు మోహరించారు. తప్పించుకోవడానికి మార్గంలేదని అమృత్‌పాల్‌కు సందేశం పంపించాం’ అని గిల్ చెప్పారు.
పంజాబ్ పోలీసులు, పంజాబ్ పోలీస్ ఇంటిలిజెన్స్ విభాగం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇదని గిల్ తెలిపారు.
జాతీయ భద్రత చట్టం కింద అమృత్‌పాల్ సింగ్‌పై జారీ అయిన అన్ని వారంట్లు ఆదివారం ఉదయం అమలయ్యాయి అని గిల్ చెప్పారు.
ఈ సందర్భంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా సహకరించిన ప్రజలకు గిల్ కృతజ్ఞతలు చెప్పారు.
కాగా అమృత్‌పాల్
అమృత్‌పాల్‌పై జాతీయ భద్రత చట్టం సహా మొత్తం 16 కేసులు నమోదయ్యాయి.
సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, హత్యాయత్నం, పోలీసులపై దాడి, ప్రభుత్వ ఉద్యోగుల పనికి విఘాతం కలిగించడం వంటి అభియోగాలతో ఆయనపై, ఆయన అనుచరులపై కేసులు నమోదయ్యాయి.
కాగా పరారీలో ఉన్న కాలంలో అమృత్‌పాల్ మారువేషాలలో వివిధ నగరాలలో తిరుగుతున్నట్లు కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో ప్రచారమయ్యాయి. అయితే, పోలీసులు వాటిని ధ్రువీకరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదంతా ఎక్కడ మొదలైంది?
ఫిబ్రవరి 23న 'వారిస్ పంజాబ్ దే' మద్దతుదారులు పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలోని అజ్నాలాలో పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు.
అమృత్‌పాల్ ముఖ్య అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్‌ను విడిపించుకుని వెళ్లేందుకు వారంతా తుపాకులు, కత్తులు, ఇతర ఆయుధాలతో పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో పోలీసులు, అమృత్‌పాల్ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒక పోలీస్ అధికారి సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు.
అజ్నాలా పోలీస్ స్టేషన్ ముట్టడిలో అమృత్‌పాల్ సింగ్ కూడా ఉన్నారు.
అమృత్‌పాల్ మద్దతుదారులు వేలాదిమంది స్టేషన్‌ను ముట్టడించడంతో పోలీసులు నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సి వచ్చింది. అంతేకాదు..లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేసేందుకూ వారు అంగీకరించారు.

ఫొటో సోర్స్, THEWARISPANJABDE/INSTAGRAM
అమృత్‌పాల్ సింగ్ ఎవరు?
పంజాబ్ రాజకీయాలలో కొన్నాళ్లుగా అమృత్‌పాల్ పేరు వినిపిస్తోంది. ఖలిస్తాన్ మద్దతుదారుగా ఆయన పేరు పంజాబ్‌లో నానుతోంది. గత ఏడాది నటుడు, ఖలిస్తాన్ మద్దతుదారు దీప్ సింగ్ సిద్ధూ మరణం తరువాత అమృత్‌పాల్ దుబయి నుంచి భారత్ వచ్చారు. దీప్ సింగ్ సిద్ధూ నెలకొల్పిన సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ బాధ్యతలు చేపట్టారు.
పంజాబీ నటుడు దీప్‌సింగ్ సిద్ధూ రైతుల ఉద్యమకాలంలో వారకి మద్దతిచ్చారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు.
అమృత్‌సర్‌లోని జల్లుపూర్‌లో జన్మించినట్లు అమృత్‌పాల్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2023 ఫిబ్రవరి 10న ఆయనకు వివాహమైంది.
తన భార్య, కుటుంబం గురించి ఎక్కువగా వివరాలు చెప్పని ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించరాదని గతంలో మీడియాను కోరారు.
పాఠశాల విద్య తరువాత ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొన్నారు.
తనకు ఎక్కువ మంది స్నేహితులు లేరని, తాను మనుషులతో ఎక్కువగా కలవలేనని కూడా చెప్పారు.
దుబయిలో ఉన్నకాలంలో అక్కడి గొప్పగొప్ప కట్టడాలను కూడా తాను చూడలేదని అమృత్‌పాల్ చెప్పుకొచ్చారు.
మూడేళ్లు ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదివానని, కానీ ఇంజినీరింగ్ పట్టా పొందలేకపోయానని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మారణహోమానికి పాల్పడ్డారు, కానీ ఇప్పుడు ఆ విషయమే మాట్లాడనివ్వడం లేదు’
‘మనల్ని ఊచకోత కోశారు. కానీ, ఆ ఊచకోత గురించి మాట్లాడడం కూడా ఆపేయాలనుకుంటాం’ అని ఓ ఇంటర్వ్యూలో అమృత్‌పాల్ అన్నారు.
తన ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ.. ‘ఎదిరించాల్సిందే’ అన్నారు ఆయన .
పాత సంస్థలు కొత్త వ్యక్తులకు, ముఖ్యంగా స్వతంత్ర ఆలోచనలకు చోటు ఇవ్వవని ఆయన ఓ సందర్భంలో అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
అకాలీదళ్ విషయంలో..
అకాలీదళ్ సిక్ మతానికి చెందినదని, దానిని తిరిగి మతానికే అప్పగించాలని.. సిక్ మతం ఏ పార్టీ గుర్తింపుపై ఆధారపడి లేదని అన్నారు అమృత్ పాల్.
దేశంలో ప్రతిష్టను పోగొట్టుకున్నవారు మళ్లీ సేవామార్గంలో పయనించాలని, అలా చేయడం వల్ల కనీసం క్షమాపణ కోరే అవకాశమైనా దక్కుతుందని అన్నారు.
ప్రపంచం మూర్ఖమైనదని, మతం దేనినీ అర్థం చేసుకోదని ఎవరైనా అనుకుంటే దానిపై తమకు అభ్యంతరం ఉందని అమృత్‌పాల్ చెప్పారు.
‘అకాలీదళ్ అనేది దానికది సొంతంగా ఒక మతం కాదు. ఏ ఒక్క కుటుంబమో అకాలీదళ్ కానేరదు’ అన్నారు.
‘సిక్ సార్వభౌమాధికారం సాధ్యమే. మేం దానికి మద్దతు ఇస్తున్నాం. సిక్ మాతృభూమి సాధనకు ప్రధాన అడ్డంకి అసలు ఆ డిమాండ్‌నే బూచిగా చూపించడం. సిక్కులుగా సొంతంగా పాలించుకోలేరన్న దుష్ప్రచారం కూడా చేస్తున్నారు’ అంటూ ఆయన ఓ సందర్భంలో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















