హైదరాబాద్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎలాంటి భోజనం వడ్డిస్తున్నారు? సోషల్ మీడియాలో చర్చకు కారణం ఏంటి?

ఫొటో సోర్స్, THINKSTOCK
- రచయిత, మీర్జా ఏబీ బేగ్
- హోదా, బీబీసీ ఉర్దూ, దిల్లీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టింది. సెప్టెంబర్ 27న హైదరాబాద్‌కు చేరుకున్న పాక్ క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది.
కానీ, ఆశించినట్లుగా న్యూజీలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 345 పరుగులు చేసింది.
వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ సెంచరీ చేయగా... కెప్టెన్ బాబర్ ఆజమ్, సాద్ షకీల్ అర్ధసెంచరీలు నమోదు చేశారు.
న్యూజీలాండ్ 44 ఓవర్లలోనే సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది.
కేన్ విలియమ్సన్, డరైల్ మిచెల్, మార్క్ చాప్‌మన్ అర్ధసెంచరీలతో 5 వికెట్లు కోల్పోయి న్యూజీలాండ్ 346 పరుగులు చేసింది.
రచిన్ రవీంద్ర 97 పరుగులు చేశాడు.
సోషల్ మీడియాలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ గురించి చర్చ జరుగుతోంది. దీనితో పాటు పాకిస్తాన్ క్రికెటర్లకు భారత్‌లో లభించిన స్వాగతం, వారి భోజనం గురించి కూడా విపరీతమైన చర్చ జరిగింది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతా కూడా వీటి గురించి ట్వీట్ చేసింది. పాకిస్తాన్ టీమ్‌కు భారత్‌లో ఎలాంటి భోజనం అందుతుందో ట్వీట్‌లో వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ జట్టు మెనూ ఏంటి?
ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చే ఏ జట్టుకు కూడా బీఫ్, పెద్ద జంతువుల మాంసంతో కూడిన ఏ ఆహారాన్ని ఇవ్వడం లేదు.
వార్తా ఏజెన్సీ పీటీఐ ప్రకారం, భోజన జాబితా (మెనూ)లో బీఫ్ లేదు. కానీ, అన్ని జట్ల కోసం వివిధ రకాల ఆహార జాబితాలను తయారు చేశారు. వాటిలో అనేక రకాల ఆహారపదార్థాలను చేర్చారు.
‘‘పాకిస్తాన్ క్రికెటర్లకు అవసరమైన రోజూవారీ ప్రోటీన్ కోసం చికెన్, మటన్, చేపలతో కూడిన ఆహారపదార్థాలు ఉంటాయి. టీమ్ కోసం వైవిధ్యమైన మెనూను సిద్ధం చేశారు.’’
ఈ మెనూలో ప్లేయర్ల కోసం అనేక రకాల రుచికరమైన వంటకాలను ఉంచారు.
అందులో జ్యూసీ గ్రిల్డ్ ల్యాంబ్, ఆయిలీ-ఫ్లేవర్‌ఫుల్ మటన్ కర్రీ, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బటర్ చికెన్‌తో పాటు, అవసరమైన ప్రోటీన్‌ను అందించే గ్రిల్డ్ ఫిష్ వంటకాలను ఆటగాళ్ల కోసం అందుబాటులో ఉంచారు.
పాకిస్తాన్ జట్టు కోసం మెనూలో బాస్మతీ రైస్‌ను కూడా చేర్చినట్లు పీటీఐ కథనం తెలిపింది.
ఒకవేళ ఆటగాళ్లు, తేలికైన ఆహారాన్ని కోరుకుంటే వారి కోసం స్పాగెటీ, వెజిటేబుల్ పులావ్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఇవే కాకుండా, ఆటగాళ్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు , హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ అందుబాటులో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
భోజనం గురించి చర్చ ఏంటి?
భారత్‌లో ఆవును పవిత్రంగా భావిస్తారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో గోహత్యను నిషేధించారు. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో బీఫ్ తింటారు. మార్కెట్‌లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్‌లో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మెనూపై ట్విటర్‌లో మాస్టర్ వీజేఎన్ అనే ఖాతాదారు స్పందించారు.
‘‘పాకిస్తాన్ సంస్కృతిలో ఎక్కువ భాగం ఇప్పటికీ బీఫ్ తింటారు. భారత్ నుంచి ఇప్పటికీ పెద్ద మొత్తంలో ఇది ఎగుమతి అవుతుంది. భారత్‌లో కూడా దీన్ని తింటారు. దీన్ని ఇతర క్రికెట్ టీమ్‌లకు అందించే ఆహార జాబితా నుంచి తొలగించడం అభద్రతా భావానికి పరాకాష్టగా చెప్పొచ్చు’’ అని రాశారు.

ఫొటో సోర్స్, Twitter
దీనికి ఒక యూజర్ స్పందిస్తూ, ‘‘దీని ప్రకారం, మీరు కేరళకు వెళ్లినప్పుడు అక్కడి సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పరాఠాతో బీఫ్ తినండి’’ అని ట్వీట్ చేశారు.
దీనికి జవాబుగా మరో యూజర్ ఇలా రాశారు. ‘‘ఇది కేవలం కేరళకు మాత్రమే కాదు, దక్షిణ భారతం అంతటికీ వర్తిస్తుందని అనిపిస్తుంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
జర్నలిస్ట్ ఫరీద్ ఖాన్ ఈ అంశంపై ట్వీట్ చేశారు.
‘‘వరల్డ్ కప్ సందర్భంగా భారత్‌లో బీఫ్ వడ్డించకపోవడంలో ఎలాంటి ఆశ్యర్యం లేదు. కేవలం పాకిస్తాన్ జట్టుకే కాదు అన్ని జట్లకు ఇది వర్తిస్తుంది’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER
అన్షుమన్ సింగ్ పేరుతో ఉన్న భారతీయ యూజర్ స్పందిస్తూ, ‘‘పాకిస్తాన్ టీమ్ వద్ద వారి న్యూటీషనిస్ట్ ఉంటారు. ఆటగాళ్లకు అందించే భోజనం విషయంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. అతిథుల డిమాండ్లను నెరవేర్చడానికి హోటల్ వారు ప్రయత్నిస్తారని నా గట్టి నమ్మకం’’ అని ఆయన రాసుకొచ్చారు.
2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత తొలిసారి పాకిస్తాన్ జట్టు ఇప్పుడే భారత్‌కు వచ్చింది. ఆ జట్టులోని ఇద్దరు మినహా మిగతా అంతా మొదటిసారిగా భారత్‌కు వచ్చారు.
పాకిస్తాన్ అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది.
అక్టోబర్ 6న ప్రపంచకప్‌లో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొంటుంది. తర్వాత అక్టోబర్ 10 శ్రీలంకతో రెండో మ్యాచ్ ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లూ హైదరాబాద్‌లోనే జరుగుతాయి.
అక్టోబర్ 14న భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం హైదరాబాద్ వదిలి అహ్మదాబాద్‌కు పాక్ జట్టు వెళ్తుంది. అప్పటివరకు, అంటే రెండు వారాల పాటు సంస్కృతితో పాటు భోజనానికి ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్‌లోనే పాక్ జట్టు బస చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














