‘స్పందన’ ఫిర్యాదుతో అంతర్జాతీయ బెట్టింగ్ ముఠాను విశాఖ పోలీసులు ఎలా పట్టుకున్నారు?

డీసీపీ శ్రీనివాస రావు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, బెట్టింగ్ కేసుపై మీడియాతో మాట్లాడుతున్న డీసీపీ శ్రీనివాసరావు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

‘స్పందన’ కార్యక్రమంలో వచ్చిన ఒక ఫిర్యాదుతో విశాఖపట్నంలో ఒక ఇంటర్నేషనల్‌ బెట్టింగ్‌ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాకు సంబంధించిన 11 మందిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు.

ఈ కేసులో దినేశ్ అలియాస్‌ మోను, వాసుదేవరావు ప్రధాన నిందితులుగా పోలీసులు తేల్చారు. అనకాపల్లికి చెందిన సూరిబాబు అనే వ్యక్తి ఈ బెట్టింగ్‌ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

సూరిబాబు బెట్టింగ్‌లు పెట్టడంతో మొదలెట్టి, బుకీగా మారిపోయాడని, ఇంటర్నేషనల్‌, ఐపీఎల్‌ బెట్టింగులు నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

బెట్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

63 బ్యాంక్‌ అకౌంట్లతో రూ.367 కోట్ల లావాదేవీలు

సూరిబాబు ప్రతి మ్యాచ్‌కు నాలుగు లక్షల రూపాయల దాకా వెనకేసేవాడని, ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకూ సంపాదించేవాడని పోలీసులు చెప్పారు.

ఈ లావాదేవీలపై అనుమానం రాకుండా టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ యజమాని దినేశ్‌కు డబ్బు పంపేవాడని తెలిపారు.

ఈ ఇంటర్నేషనల్‌ బెట్టింగ్‌ ముఠా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో 63 బ్యాంక్‌ అకౌంట్ల ద్వారా రూ.367 కోట్ల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. 32 అకౌంట్లలో 75 లక్షల రూపాయలు ఉండటంతో వాటిని ఫ్రీజ్‌ చేయించారు.

బెట్టింగ్

‘స్పందన’లో బాధితుడి ఫిర్యాదు

ఈ బెట్టింగ్‌ ముఠాపై ఎర్ర సత్తిబాబు అనే వ్యక్తి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. తను ఆ ముఠా ద్వారా మోసపోయానని తెలిపాడు.

దీనిపై సీపీ రవిశంకర్‌ దర్యాప్తుకు ఆదేశించారు. బాధితుడు సత్తిబాబు బ్యాంక్‌ అకౌంట్స్‌ ద్వారా దర్యాప్తు చేయగా అసలు దొంగలు దొరికారు.

సూరిబాబు అనే బుకీ ఖాతాకు సత్తిబాబు ఎనిమిది లక్షల రూపాయలు పంపించినట్లు తేలింది. సూరిబాబు బ్యాంక్ అకౌంట్‌ను ట్రేస్‌ చేయగా, అసలు సూత్రదారి దినేశ్ వివరాలు బయటపడ్డాయి.

బెట్టింగ్

ఫొటో సోర్స్, Getty Images

బెట్టింగ్‌ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

ఎందుకు ఇలా భారీగా డబ్బులు బెట్టింగ్‌లో పెడుతున్నారనే విషయంపై సైకాలజిస్టు రెడ్డి సాయిబాబా నాయుడుతో బీబీసీ మాట్లాడింది. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం లాంటిదని ఆయన చెప్పారు.

‘‘చాలా మంది అప్పుడప్పుడు బెట్టింగ్ ఆడుతుంటారు. ఇలాంటి వారితో పెద్ద సమస్య ఏమీ ఉండకపోవచ్చు. కానీ, కొందరు మాత్రం ‘ప్రాబ్లమ్ గ్యాంబ్లర్లు’గా మారతారు. ఇలాంటి వారి జీవితం గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ల వల్ల చాలా ప్రభావితం అవుతుంది. వారి కుటుంబ సభ్యులు కూడా దీని పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆయన చెప్పారు.

దీన్ని ఒక మానసిక సమస్యలా చూడాలని ఆయన అన్నారు.

‘‘ఎందుకంటే గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఆడేవారిలో యాంక్సైటీ, స్ట్రెస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి బాగా గెలిచినప్పుడు ఒక ‘హై’ వస్తుంది. దాన్ని మళ్లీ చూసేందుకు ఎంతదూరమైనా వెళ్తారు. ఎంత డబ్బునైనా పెట్టేందుకు వెనుకాడరు’’అని ఆయన వివరించారు.

‘‘కొంత మంది గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌లతోపాటు డ్రగ్స్, అతిగా మద్యం తాగడం లాంటి వ్యసనాలకు కూడా అలవాటు పడుతుంటారు. వీరు ఇలాంటి అలవాట్ల నుంచి బయటపడటం మరింత కష్టం’’ అని ఆయన చెప్పారు.

దీని నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్‌తోపాటు మందులు కూడా కొన్నిసార్లు అవసరం అవుతాయని తెలిపారు.

వీడియో క్యాప్షన్, క్యాసినో పెట్టాలంటే ఏయే అనుమతులు కావాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో క్యాసినో పెట్టొచ్చా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)