వాఛాతీ: 30 ఏళ్ళనాటి ఈ రేప్ కేసులో అసలేం జరిగింది? పోలీసులకు వేసిన శిక్షలపై హైకోర్టు ఏం చెప్పింది?

- రచయిత, గీతా పాండే, ప్రమీలా కృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మూడు దశాబ్దాల క్రితం తమిళనాడులోని వాఛాతీ గ్రామంలో గిరిజనులను వేధించడంతోపాటు 18 మంది మహిళలను రేప్ చేసిన ప్రభుత్వ అధికారులకు విధించిన శిక్షలను ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.
శిక్ష పడినవారిలో పోలీసులతోపాటు, అటవీ, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు.
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కు వాఛాతీ గ్రామ గిరిజనులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ 1992 జూన్లో అధికారులుపై వీరిపై దాడులు చేశారు.
గ్రామంలో పురుషులపై దాడులు చేశారు. మహిళలను రేప్ చేశారు. ఇళ్ళను ధ్వంసం చేశారు. పశువులను చంపేశారు.
వాఛాతీ గ్రామంలో జరిగిన ఈ ఘోరం తరువాత కాలంలో వాఛాతీ కేసుగా ప్రసిద్ధి చెందింది.

ఈ కేసులో మొత్తం 269మంది నిందితులు తమపై మోపిన అభియోగాలను వ్యతిరేకించారు. కానీ 2011లో ట్రయల్ కోర్టు.. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ కింద వీరందరూ నేరం చేసినట్టుగా నిర్థారిస్తూ జైలు శిక్ష విధించింది. వీరిలో 17మందిని మహిళలను రేప్ చేసిన కేసులో నిందితులనూ గుర్తించి శిక్ష వేసింది.
అయితే వీరిలో 54 మంది విచారణ సమయంలోనే చనిపోయారు. మిగిలిన 215 మందికి ఏడాది నుంచి 10 ఏళ్ళ మధ్యన జైలు శిక్ష పడింది. అయితే వీరంతా మద్రాసు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
‘‘రేప్ కేసులో శిక్షపడిన 17మందిని మినహాయిస్తే, మిగిలినవారిలో చాలామంది జైలులో ఎక్కువకాలం లేరు’’ అని బాధితుల పక్షాన వాదించిన లాయర్ బీబీసీకి చెప్పారు.
బాధితులందరికీ ఒకొక్కరికీ పదిలక్షల రూపాయల నష్టపరిహారం, సముచిత ఉద్యోగం ఇవ్వాల్సిందిగా జస్టిస్ పి.వేల్‌మురుగన్ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించినట్టు లీగల్ వెబ్‌సైట్ లైవ్‌లా రిపోర్ట్ చేసింది.
అప్పటి జిల్లా సీనియర్ అధికారులు, అటవీ అధికారులు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుపై కఠినచర్యలు తీసుకోవాలని కూడా కోర్టు తీర్పు పేర్కొన్నట్టు ఆ రిపోర్ట్ లో చెప్పింది.
మార్చి నెలలో జస్టిస్ వేల్‌మురుగన్ ధర్మపురి జిల్లాలో కనువిందుచేసే సిథేరి కనుమల పాదపీఠాన ఉండే వాఛాతీ గ్రామాన్ని సందర్శించారు.

వాఛాతీలో అసలేం జరిగింది?
1990లలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకునేందుకు పోలీసులు తరచూ ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతుండేవారు. వంద హత్యలు, కిడ్నాప్ లు, స్మగ్లింగ్, అపహరణలతో వీరప్పన్ క్రూరమైన బందిపోటుగా పేరుపడ్డాడు. ( ఎట్టకేలకు 2004లో వీరప్పన్‌ను పోలీసులు హతమార్చారు)
వీరప్పన్ కు వాఛాతీ గ్రామ ప్రజలు సహకరిస్తూ గంధపు చెక్కల స్మగ్లింగ్‌లోనూ పాల్గొంటున్నారంటూ అధికారులు తరచూ ఈ గ్రామానికి వస్తుండేవారు.
1992 జూన్ 20న వాఛాతీ గ్రామ ప్రజలకు, అటవీ అధికారుల మధ్య జరిగిన గొడవలో ఓ అధికారి గాయపడ్డాడు.
కొన్ని గంటల తరువాత 155 మంది అటవీ ఉద్యోగులు, 108 మంది పోలీసులు, ఆరుగురు రెవెన్యూ అధికారులు ఈ గ్రామానికి వచ్చినట్టు కోర్టు డాక్యుమెంట్లు చెపుతున్నాయి.
అయితే అప్పటికే గ్రామంలోని పురుషులందరూ సమీపంలోని కొండల్లోకి పారిపోయారు. వారు అక్కడే కొన్ని నెలలపాటు దాక్కున్నారు. అధికారులకు కేవలం గ్రామంలోని మహిళలు, పిల్లలు వృద్ధులు మాత్రమే కనిపించారు.
గ్రామంలోకి వచ్చిన అధికారులు కనిపించినవారిని నిర్థాక్షిణ్యంగా చావబాదారు. ఇళ్ళను ధ్వంసం చేశారు. పశువులను చంపారు. 18మంది మహిళలను పదేపదే రేప్ చేశారు.

వందమందికిపైగా మహిళను, పిల్లలను కస్టడీలోకి తీసుకుని, నెలల కొద్దీ తప్పుడు ఆరోపణలపై జైల్లోనే ఉంచారు. దురుద్దేశంతోనే అధికారులు ఈ పనిచేశారని 20 ఏళ్ళ తరువాత ఈ కేసులను ముగిస్తూ హైకోర్టు వ్యాఖ్యానించింది.
వాఛాతీ గ్రామం నడిబొడ్డున ఉండే పెద్ద మర్రిచెట్టు ఆ నాటి దారుణానికి సాక్ష్యంగా నిలుస్తోంది.
గ్రామంలోని ఆడ,మగ వారితోపాటు పిల్లలను ఈ మర్రిచెట్టు దగ్గర గుమిగూడేలా చేసి, తీవ్రంగా కొట్టారని గ్రామస్థులు ఇటీవల బీబీసీ తమిళ్ కు చెప్పారు.
ఇలా గుమిగూడిన గ్రామస్థుల నుంచి 18మంది యువతులను వేరు చేసి, సమీపంలోని చెరువు వద్దకు తీసుకువెళ్ళి పలుసార్లు రేప్ చేశారు.
రేప్ బాధితుల్లో 13 ఏళ్ళ బాలిక కూడా ఉంది. తాను స్కూలుకు వెళ్ళే బాలికనని, తనను వదిలేయాలని ఆ బాలిక ఎంతగా ప్రాథేయపడినా పట్టించుకోలేదని ఆ బాలిక వివరించింది.
‘‘వారు మమ్మల్ని చెరువుకు సమీపంలో రేప్ చేశారు. మమ్మల్ని బాగా కొట్టారు. ఊళ్ళో ఉన్నవారి రోదనలు కూడా మాకు వినిపించాయి’’ అని వివరించింది.
‘‘మమ్మల్ని రేప్ చేశాకా పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్ళారు. ఆ రాత్రంతా మమ్మల్ని నిద్రపోనీయలేదు.నన్ను కూడా మా అమ్మ, అక్క, మావయ్య, అత్తయ్యతోపాటు జైలుకు తీసుకువెళ్ళారు’’ అని బాలిక తెలిపింది.
కొన్ని వారాల తరువాత వీరు జైలు నుంచి తిరిగి వచ్చేసరికి ఇళ్లలోని సామాన్లు అన్నీ బయటపడేసి ఉన్నాయి. తిండి గింజలను బయట పారపోశారు. బట్టలన్నింటినీ కాల్చేశారు. పశువులన్నీ కళేబరాలుగా బావిలో తేలుతూ కనిపించాయి.

న్యాయం కోసం సుదీర్ఘ పయనం
వాఛాతీ గిరిజనులు న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. ప్రతిచోటా వారికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి.
‘‘చాలా మంది మహిళలు దీని గురించి మాట్లాడటానికి భయపడేవారు. కోర్టులో మెజిస్ట్రేట్ ముందు నోరు విప్పొద్దని వారిని భయపెట్టారు. జీవితాంతం జైలులోనే మగ్గిపోవాల్సి ఉంటుందని బెదిరించారు. అయితే, మేం ఇలాంటి అక్రమ సోదాలకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు చేపట్టాం. దీంతో అక్కడి మహిళలకు కాస్త ధైర్యం వచ్చింది. మేం మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు.. వందల మంది అధికారులు అలా ప్రవర్తించి ఉండరని మా పిటిషన్‌ను తోసిపుచ్చారు’’అని బాధితుల తరఫున పోరాడిన సీపీఎం నాయకుడు పీ షణ్ముగం చెప్పారు.
దీంతో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పుడు ఈ రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని మద్రాసు హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. పౌరహక్కుల కార్యకర్తలు, కమ్యూనిస్టు నాయకుల ప్రచారం వలన ఈ కేసు సీబీఐకి అప్పగించారు. అనంతరం ఈ కేసులో 269 మంది అధికారులపై అభియోగాలతో సీబీఐ ఒక అభియోగపత్రం దాఖలు చేసింది. 20ఏళ్ల విచారణ సమయంలో 54 మంది అధికారులు మరణించారు.
అధికారులు అత్యుత్సాహం చూపారని, పురుషులు, మహిళలు, చిన్నపిల్లలను కొట్టారని, గుడిసెలను నేలమట్టం చేశారని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది.
ఈ కేసులో ట్రయల్ కోర్టు 2011లో 215 మంది అధికారులను దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు నిచ్చింది. వీరిలో 12 మందికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. మిగతవారికి రెండు నుంచి పదేళ్ల మధ్య జైలు శిక్ష విధించారు.
దోషులుగా నిరూపితమైన 215 మంది అధికారుల్లో కొందరు తమకు ఏ పాపమూ తెలియదని కోర్టులో చెప్పారు. ‘‘మేం మా డ్యూటీ చేస్తుండగా, వీరప్పన్ ముఠాలో భాగమైన కొందరు గ్రామస్థులు మమ్మల్ని అడ్డుకున్నారు. మేం దానికి ప్రతిస్పందించాం’’అని చెప్పారు. అలా 43 మంది దోషులు హైకోర్టులో తీర్పును సవాల్ చేశారు.
మొత్తం మీద వాఛాతీ కేసులో బాధితుల పట్టుదల యాక్టివిస్టుల మద్దతే అంతిమంగా న్యాయం జరగడానికి దోహదపడ్డాయి.

గ్రామం ఇప్పుడెలా ఉంది?
1992 జూన్ నాటి పరిస్థితులను దాటి వాఛాతీ గ్రామం చాలా ముందుకు వచ్చింది. నేడు అక్కడ పూరిళ్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లలందరూ స్కూలుకు వెళ్తున్నారు.
కొన్ని జనరల్ స్టోర్‌లు కూడా కనిపిస్తున్నాయి. గ్రామ యువత కొత్త కొత్త బైక్‌లపై తిరుగుతూ కనిపిస్తున్నారు. గ్రామంలో చాలా మందికి సెల్‌ఫోన్లు ఉన్నాయి. దాదాపు అందరి ఇళ్లలోనూ టీవీలు కనిపిస్తున్నాయి.
దగ్గర్లోని నూలు మిల్లులో చాలా మంది పనిచేస్తున్నారు. మరోవైపు గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు పోలీసు విభాగంలో ఇటీవల చేరారు.
1992 జూన్‌నాటి దారుణాలను చూసిన అదే మర్రిచెట్టు కింద నేడు కొందరు మహిళలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
వాఛాతీ అత్యాాచారం ఘటన:
ఎప్పుడు జరిగింది: 1992 జూన్ 20
గిరిజన బాధితుల సంఖ్య: 217
మహిళలు: 94, పిల్లలు: 28
రేప్ బాధితులు: 18 మంది మహిళలు
దోషులుగా నిరూపితమైన అధికారులు: 269 మంది
రేప్ కేసు దోషులు: 17 మంది
విచారణ సమయంలో మరణించిన అధికారులు: 54 మంది
ఎఫ్ఐఆర్ నమోదు: 1995
ట్రయల్ కోర్టు ఏర్పాటు: 1995
ట్రయల్ కోర్టు తీర్పు: 2011
మద్రాసు హైకోర్టు తీర్పు: ట్రయల్ కోర్టు తీర్పుకు సమర్థన, బాధితులకు ఉద్యోగాలు, 10 లక్షల నష్టపరిహారం - 2023
ఇవి కూడా చదవండి
- అంతరిక్షంలో ఏడాది గడిపితే శరీరానికి ఏమవుతుంది?
- ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు: నాలుగేళ్లలో రెండు సార్లు కొత్త సిలబస్, ఇప్పుడు ‘ఐబీ’.. మరి టీచర్ల సంగతేంటి?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















