ధన్యవాదాలు
ఇక్కడితో ఈ రోజు అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ తాజా వార్తలతో కలుద్దాం.
మహబూబాబాద్ జిల్లాలో మూడేళ్ల క్రితం దీక్షిత్ రెడ్డి (9)ని అపహరించి, హత్య చేసిన కేసులో నిందితుడు మంద సాగర్‌కు మరణ శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.
ఇక్కడితో ఈ రోజు అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ తాజా వార్తలతో కలుద్దాం.

ఫొటో సోర్స్, UGC
మహబూబాబాద్ జిల్లాలో మూడేళ్ల క్రితం దీక్షిత్ రెడ్డి (9)ని అపహరించి, హత్య చేసిన కేసులో నిందితుడు మంద సాగర్‌కు మరణ శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.
2020 అక్టోబర్ 18న కుసుమ వసంత, రంజిత్ రెడ్డిల కుమారుడైన దీక్షిత్‌ను సాగర్ హత్య చేసినట్లు రుజువైంది.
డబ్బు కోసం దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి మెడకు టీషర్టు బిగించి హత్య చేసినట్లు తేలింది.
కోర్టు తీర్పుపై దీక్షిత్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దీక్షిత్ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేశారు.
ఈ కేసుపై 2020 అక్టోబరులో బీబీసీ న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ ప్రసారం చేసింది. ఆ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.

ఫొటో సోర్స్, SPORTS AUTHORITY OF INDIA
ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ మెరుపులు మెరిపించారు.
50 కేజీల విభాగంలో జోర్డాన్‌కు చెందిన నాజర్ హనన్‌పై ఆమె విజయం సాధించారు. దీంతో నిఖత్ సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు.
సెమీస్‌లో థాయిలాండ్‌కు చెందిన రక్సత్‌తో నిఖత్ తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో ఒకవేళ ఆమె ఓడినా కాంస్య పతకం వస్తుంది.
తాజా విజయంతో 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కూడా నిఖత్ అర్హత సాధించారు.

ఫొటో సోర్స్, Nara Lokesh
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్టోబర్ 4 వరకు నారా లోకేశ్‌ను అరెస్టు చేయొద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణను హైకోర్టు వచ్చే అక్టోబర్ 4కు వాయిదా వేసింది. అప్పటి దాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, ISMAIL SASOLI
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో చోటుచేసుకున్న భారీ పేలుడులో 50 మందికిపైగా మరణించారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
మస్తుంగ్ నగరంలో శుక్రవారం ప్రార్ధనల సమయంలో ఓ మసీదుకు సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుంది.
ఇది ఆత్మాహుతి దాడి అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు అనంతరం అత్యయిక స్థితిని అధికారులు ప్రకటించారు.
ఇప్పటివరకూ ఈ దాడి చేపట్టింది తామేనని ఏ సంస్థా ప్రకటించలేదు.

ఫొటో సోర్స్, Twitter/Naralokesh
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు 41(ఏ) నోటీసులిస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సీఐడీ చెప్పింది.
ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది.
లోకేశ్‌కు 41 (ఏ) నోటీస్ ఇస్తున్నారా అని అడ్వకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్‌ను న్యాయమూర్తి అడగగా, తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని, ఆ నోటీసు ఇస్తామని ఆయన సమాధానమిచ్చారు.
ఇదే సందర్భంలో దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని లోకేశ్‌కు సూచించాలని కోర్టును ఏజీ కోరారు.
దీంతో దర్యాప్తుకు సహకరించాలని లోకేశ్‌కు ఆదేశాలిస్తూ, న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగించింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న లోకేశ్‌కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు దిల్లీ బయలుదేరారు.
హైకోర్టులో మరో రెండు పిటిషన్లు
స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో కూడా హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని నారా లోకేశ్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.

ఫొటో సోర్స్, Twitter/Media_SAI
చైనాలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో గురువారం భారత్ ఎనిమిదో స్వర్ణం సాధించింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు చెందిన పాలక్ స్వర్ణం సాధించింది. ఇదే పోటీలో మరో భారత ప్లేయర్ ఈషా సింగ్ రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకుంది.
అంతకుముందు 50 మీటర్ల రైఫిల్ విభాగంలో స్వప్నిల్ కుశాలే, ఐశ్వర్య్ ప్రతాప్ సింగ్, అఖిల్ షెరాన్ టీం స్వర్ణం సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఈషా సింగ్, పాలక్, దివ్య తాడిగోల్ త్రయం రజతం సాధించింది.
ఇప్పటివరకు భారత్ 8 స్వర్ణాలు, 11 రజతాలు, 11 కాంస్యాలతో 30 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, VIVEK2024.COM
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే జన్మ హక్కుగా పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలుకుతానని అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.
''ఎలాంటి పత్రాలు లేకుండా యూఎస్‌లో ఉంటున్న వలసదారులకు పిల్లలు పుడితే పౌరసత్వం ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ పిల్లల తల్లిదండ్రులు అమెరికా చట్టాలను ఉల్లంఘించారు'' అని ఆయన తెలిపారు.
2015లో ఇదే విషయాన్ని ప్రతిపాదించారు డొనాల్డ్ ట్రంప్.
వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/Media_SAI
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో భారత్ టెన్సిస్‌లో రజతం సాధించింది.
భారత డబుల్స్ జోడీ సాకేత్ మైనేనీ, రామ్‌కుమార్ రామ్‌నాథన్ ఈ పతకం గెలిచింది.
భారత జోడీపై 6-4, 6-4 తేడాతో చైనీస్ తైపీ జంట గెలిచి స్వర్ణం సాధించింది.
సాకేత్ మైనేని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందినవారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు.
సాకేత్ మైనేనీ 11 ఏళ్ల వయసు నుంచే టెన్నిస్ ఆడటం మొదలుపెట్టాడు. టెన్నిస్ నేర్చుకోవడానికే ఆయన హైదరాబాద్ వెళ్లారు.
సాకేత్ 2014లో భారత్ తరఫున డేవిస్ కప్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చారు.
అలబామా యూనివర్సిటీ నుంచి ఆయన డిగ్రీ పట్టా పొందారు.
సాకేత్ వింబుల్డన్, ఆస్ట్రేలియన్, యూఎస్, ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ టోర్నీలు కూడా ఆడారు.
టెన్నిస్‌లో విశేష ప్రతిభ కనబరిచినందుకుగానూ సాకేత్‌కు 2017లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు బహూకరించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్ నగరంలో గురువారం జరిగిన జంట కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. 32 ఏళ్ల దుండగుడు మొదట ఓ ఇంటిపై దాడి చేసి, అక్కడ తల్లీ కూతుళ్లను కాల్చి చంపేశాడు.
అనంతరం ఎరాస్మస్ మెడికల్ సెంటర్ లెక్చరర్ (43)ను చంపాడు. మృతుల్లో 14 ఏళ్ల బాలిక ఉంది. దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ఎరాస్మస్ వర్సిటీ పూర్వ విద్యార్థి. ఆ సాయుధుడు తమకు తెలుసునని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.