క్రికెట్ వరల్డ్ కప్ : 1983 లాగే ఈసారి కూడా భారత్‌ను పేస్ బౌలింగ్ గెలిపిస్తుందా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సురేష్ మీనన్
- హోదా, స్పోర్ట్స్ రైటర్
1983లో భారత్ మొదటిసారి ప్రపంచకప్ గెలిచినప్పుడు, టీమ్‌లోని బౌలర్లందరూ ఆల్ రౌండర్లే. వారిలో చాలామందిని 'బిట్స్ అండ్ పీసెస్' క్రికెటర్లుగా పిలిచేవారు. అంటే కొంచెం బౌలింగ్, కొంచెం బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవారు.
కానీ, కెప్టెన్ కపిల్ దేవ్ దీనికి మినహాయింపు.
జట్టులో మదన్‌లాల్, రోజర్ బిన్నీ, సందీప్ పాటిల్, మొహిందర్ అమర్‌నాథ్‌లతో పాటు కేవలం ఇద్దరు మీడియం పేస్ స్పెషలిస్ట్ బౌలర్లు బల్విందర్ సందూ, సునీల్ వాల్సన్ ఉండేవారు. జట్టులోని ఏకైక స్పిన్నర్ రవిశాస్త్రి ఫైనల్ మ్యాచ్ ఆడలేదు.
ఈ మ్యాచ్‌లో భారత్ ఆరుగురు బౌలర్లను బరిలోకి దింపింది. పాటిల్ అవసరం కనిపించలేదు. అలాగే ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా. కానీ తరువాత కాలంలో కృష్ణమాచారి శ్రీకాంత్ తన ఆఫ్ స్పిన్‌తో న్యూజిలాండ్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. మదన్ లాల్ జెంటిల్ పేస్ తో సెమీస్‌లోనూ, ఫైనల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
40 ఏళ్ళ కిందట వన్డే క్రికెట్ కొంచెం భిన్నంగా ఉండేది. అప్పట్లో వికెట్లు తీయడంపై ఎక్కువగా దృష్టి ఉండేది కాదు. కానీ కాలం గడిచే కొద్ది బ్యాటర్లను ఔట్ చేయడం ముఖ్యమైన విషయంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు పరుగులు ఇవ్వని బౌలర్ల కంటే వికెట్లు తీసేవారి అవసరమే పెరిగింది.
భారత్ 2011 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, సురేష్ రైనా ఇలా అందరూ బౌలింగ్ చేయగలిగినవారే. కాకపోతే కోహ్లీతో కలిపి సచిన్, యువరాజ్ మాత్రమే ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్ చేశారు.
ఈ టోర్నమెంట్లో మొత్తం 12 మంది బౌలర్లు రాణిస్తే, వీరిలో ఏడుగురు బౌలర్లు మీడియం పేసర్లే కావడం విశేషం. వీరిలో భారత్ నుంచి జహీర్ ఖాన్ పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ షాహిద్ అఫ్రీదీలానే 21 వికెట్లు తీశాడు.
అప్పటి భారత జట్టులో జహీర్ ఖానే కాకుండా, ఎస్.శ్రీశాంత్, మునాఫ్ పటేల్, ఆశీష్ నెహ్రా, ప్రవీణ్ కుమార్ లాంటి మీడియం పేసర్లతోపాటుగా హర్బజన్ సింగ్,పీయూష్ చావ్లా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలర్లున్నారు. ఈ ఏడాదిలానే అప్పట్లో కూడా పేస్ బౌలింగ్ పైనే దృష్టిసారించారు.

ఫొటో సోర్స్, AFP
1983 బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్లు ఓ విధంగా 2023 స్పెషలిస్టులకు దారిచూపారు. భారత క్రికెట్ జట్టులో మొదటి సగం మందిలో ఒక్క బౌలరు కూడా కనిపించరు. కానీ మిగిలిన సగంలో బౌలర్లు కనిపిస్తారు. అయితే వీరు కూడా బ్యాటింగ్ చేయాలని ఆశించడం అత్యాశే అవుతుంది.
ఇది స్వాభావికంగా వన్డే క్రికెట్ తీరుకు విరుద్ధమనే చెప్పాలి. కాకపోతే ఆటగాళ్ళందరూ అన్నీ చేయాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తుంటారు.

ఫొటో సోర్స్, AFP
భారత్ బలం పేసా? స్పిన్నా?
జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యాల లైన్-అప్ భారత జట్టు పేస్ బలాన్ని చూపుతోంది. ప్రత్యేకంగా అత్యుత్తమంగా బౌలింగ్ చేసే బుమ్రా వెన్నుముక గాయం నుంచి కోలుకొని, జట్టులోకి రావడంతో పేస్ బలం పెరిగింది. జట్టులో బుమ్రా కీలక పాత్ర పోషించనున్నాడు.
ఇక ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ తన వీరోచిత ప్రదర్శనతో అందరికంటే ముందున్నాడు. కాకపోతే మూడో మీడియం పేసర్ కోసం షమీ, ఠాకూర్‌ల మధ్య పోటీ ఉంది.
ఫ్రపంచ కప్ కోసం ఎలాంటి వికెట్లు ( 2011 టోర్నమెంట్ మార్చి ఏప్రిల్ మాసాల మధ్యన జరిగింది) తయారుచేసినా ప్రాథమికంగా ఫాస్ట్ బౌలర్లు కీలకపాత్ర పోషిస్తారని భావించడం తప్పు కాకపోవచ్చు.
మ్యాచ్‌లు జరిగే కొద్దీ పిచ్ స్పిన్‌కు సహకరించడం మొదలవుతుంది. కాకపోతే రెండోసారి బౌలింగ్ చేసే టీమ్ స్పిన్నర్లకు మంచు అడ్డంకిగా మారుతుంటుంది.
స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. సాయంత్రం దీపాలు వెలిగే లోపే పేసర్లకు బాల్‌ను స్వింగ్ చేసేందుకు సమయం దొరుకుతుంది. అయినా పరిస్థితులకు తగినట్టుగా బౌలింగ్ చేయడం అవసరం. భారత జట్టుకు ఆ శక్తి ఉంది కూడా.

ఫొటో సోర్స్, AFP
ప్రస్తుతం కులదీప్ యాదవ్ వన్డేలలో అగ్రశ్రేణి స్పిన్నర్‌గా ఎదుగుతున్నాడు. గాయపడిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన అశ్విన్‌తో జట్టులో ఉత్తమ స్పిన్ కాంబినేషన్ కనిపిస్తోంది. వీరికి రవీంద్ర జడేజా కూడా తోడవడంతో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో కనువిందైన ఆటను చూపనుంది.
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు మార్క్ ఉడ్, క్రిస్ ఓక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, శామ్ కర్రాన్‌లతో కూడిన కూడా అద్భుతమైన పేస్ జట్టు ఉంది.
ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్ ఉడ్, పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్ ఉన్నారు.
నసీమ్ షా గాయంతో పాకిస్తాన్ జట్టులో మార్పులు కనిపిస్తున్నా షాహీన్ అఫ్రీదీ, హరిస్ రౌఫ్, హసన్ అలీ, మహ్మద్ వసీమ్ తో పేస్ జట్టు ఆకట్టుకునేలాగే కనిపిస్తోంది.
వరల్డ్ కప్ మ్యాచ్‌లను పేస్ బౌలర్ల మధ్య పోరులా చూడటం అభిమానులకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇలా చూస్తే, తొలి వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు భారత జట్టులో క్రమంగా చోటుచేసుకున్న మార్పులు కూడా చాలా ఆసక్తిగా అనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి..
- కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- అంతరిక్షంలో ఏడాది గడిపితే శరీరానికి ఏమవుతుంది?
- ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు: నాలుగేళ్లలో రెండు సార్లు కొత్త సిలబస్, ఇప్పుడు ‘ఐబీ’.. మరి టీచర్ల సంగతేంటి?
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... ఈ బిల్లు గురించి తెలుసుకోవాల్సిన 6 కీలక అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













