పీవీ సింధు: ఆసియన్ గేమ్స్‌లో ఈ తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ మెరుపులు మెరిపిస్తారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సి.వెంకటేశ్
- హోదా, క్రీడా విశ్లేషకులు, బీబీసీ కోసం...
ఆమె బిందువుగా మొదలై సింధువుగా మారింది. ఇప్పుడామెను 'సింధు మహా సముద్రం' అనొచ్చునేమో. క్రీడల్లో మరే భారత మహిళ అందుకోని అత్యున్నత శిఖరాలను మన షటిల్ క్వీన్ పీవీ సింధు అందుకుంది.
ఒలింపిక్ స్వర్ణం, ఆల్ ఇంగ్లండ్ సింగిల్స్ టైటిల్ మినహా బాడ్మింటన్ క్రీడకు సంబంధించిన అన్ని ముఖ్యమైన ట్రోఫీలు సింధు కప్‌బోర్డులో ఉన్నాయి.
క్రికెట్ చుట్టూ పరిభ్రమిస్తున్న భారత క్రీడారంగంలో బాడ్మింటన్‌కు బోలెడంత గ్లామర్ తీసుకొచ్చిన ఘనత ఆమెకే దక్కుతుంది.
‘‘హైదరాబాద్ నగరం నీళ్లలో ఏదో మహిమ ఉంది, అందుకే అక్కడి నుంచి ఆరితేరిన మహిళా అథ్లెట్లు పుట్టుకొస్తున్నారు’’ అని సునీల్ గవాస్కర్ ఒకసారి అన్నారు. నిజమే, మిథాలి రాజ్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధు తమ తమ క్రీడల్లో ప్రపంచ స్థాయిలో కీర్థి ప్రతిష్ఠలు సాధించి హైదరాబాద్ నగరానికి వన్నె తెస్తున్నారు.
వీరు నలుగురు చార్‌మినార్‌కున్న నాలుగు స్థంభాల లాంటి వారు. తమ స్వయం ప్రతిభతో, పట్టుదలతో పురుషాధిక్య సమాజంలోని అనేక కంచుకోటల్ని బద్దలు కొట్టి తమ మార్గం సుగమం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విజయపరంపర
జూనియర్ స్థాయిలోనే అంతర్జాతీయ స్థాయిలో రాణించిన సింధు, 21 సంవత్సరాల వయసులోనే 2016 ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచి మొత్తం దేశం దృష్టిని ఆకర్షించి ఒక్కసారిగా సూపర్‌స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది.
ఒలింపిక్స్‌లో వెండి పతకం గెలుచుకున్న తొలి భారత మహిళగా చరిత్రకెక్కింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు.
2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుని మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. పురుషుల విభాగంలో కూడా మన దేశం నుంచి ఆమె కంటే ముందు ఎవరూ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించలేదు.
2020 ఒలింపిక్స్‌లో సింధు కాంస్య పతకం సాధించి రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన ఏకైక భారత మహిళయింది. క్రితం ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కూడా స్వర్ణ పతకం సాధించింది. ఇవి కాక స్విస్ ఓపెన్, హాంకాంగ్ ఓపెన్ లాంటి అనేకానేక బాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్స్ కూడా సింధు తన ఖాతాలో వేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
అవార్డులకు కొదవ లేదు....
అర్జున అవార్డుతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, అత్యున్నత క్రీదా పురస్కారం ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న ఆమెను వరించాయి. 2019 లో సింధు ' బిబిసి స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్' గా కూడా ఎంపికయింది.
సింధు విజయపరంపర వెనుక చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి ఆమె చేసిన నిరంతర సాధన ఉంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి ఆమె బాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులు (వాలీబాల్ ప్లేయర్లు) కావడం ఆమెకు బాగా కలిసొచ్చింది.
రోజూ 50 కిలోమీటర్లు ప్రయాణించి గోపీచంద్ ఎకాడెమీలో కోచింగ్ తీసుకునేది. తండ్రికి ఏదైనా పని ఉండి ఒక్కరోజు ప్రాక్టీసుకి తీసుకెళ్ళకపోయినా నానా గొడవ చేసేదట. కోచ్ గోపీచంద్ కూడ ఆమె టాలెంట్‌ను ముందుగానే గుర్తించి ప్రత్యేక దృష్టితో శిక్షణ ఇచ్చాడు. ముఖ్యంగా, 2016 ఒలింపిక్స్ ముందు చాలా కఠోర సాధన చేయించాడు. సింధు మొబైల్ ఫోను లాగేసుకున్నాడు. ఆమె డైట్‌లో బిర్యానీ, ఐస్‌క్రీం లాంటివి నిషేధించాడు. అవన్నీ సత్ఫలితాలనిచ్చాయి.
కిందటేడాది కాలికి గాయం కావడంతో సింధు జైత్రయాత్రకు చిన్న బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత మళ్ళీ ఆట ప్రారంభించినా ఆమె ప్రపంచ ర్యాంక్ 15కు పడిపోయింది. మళ్ళీ సింధు టాప్ ఫామ్ అందుకుని వచ్చే ఏడాది ఒలింపిక్ స్వర్ణం కూడా సాధించాలని ఆశిద్దాం.
ఇవి కూడా చదవండి:
- పార్లమెంట్లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’
- యాంటీ బయాటిక్స్ వేసుకోవడం ప్రమాదకరమా,పేగు మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి?
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















