జంజీరా కోట: ఛత్రపతి శివాజీ కూడా జయించలేకపోయిన ఈ కోట కథేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జైదీప్ వసంత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జంజీరా కోట, శత్రు దుర్భేద్యమైనది. 22 ఎకరాల్లో, 22 రక్షణ స్థావరాలతో కూడిన ఈ కోటను నిర్మించడానికి 22 ఏళ్లు పట్టింది.
ఛత్రపతి శివాజీ, ఆయన కుమారుడు శంభాజీలతో పాటు పోర్చుగీస్, ఫ్రెంచ్, బ్రిటీష్ వారు జంజీరా కోటను జయించడానికి ప్రయత్నించారు.
కానీ, వారెవరూ ఈ కోటలో పాగా వేయలేకపోయారు. ఇలా 350 ఏళ్లకు పైగా ఇది శత్రుదుర్భేద్యంగా మిగిలిపోయింది.
జంజీరా కోటను దక్కించుకోవడానికి దానికి సమీపంలో శివాజీ మరో కోటను కట్టారు. కానీ, ఏం చేసినా ఇది ఆయన వశం కాలేదు.
పటిష్టమైన నిర్మాణం, ఇంజనీరింగ్‌లో పారిశ్రామిక సాంకేతికతను వాడటం, అందమైన ఆర్చిటెక్చర్ ఈ కోట సొంతం. ముంబయి నగరానికి దక్షిణాన 165 కి.మీ దూరంలో సముద్రం మీద ఉన్న ఈ కోటకు వెళ్లడం అంత సులభం కాదు.
మురుద్ జంజీరా కోట మీద ఎన్నో దాడులు జరిగాయి. అయినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొని అది అజేయంగా నిలిచిపోయింది.
జంజీరా కోట ప్రత్యేకతల గురించి ‘‘ ఎ మార్వెల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆన్ ఇండియాస్ వెస్ట్ కోస్ట్’’ పేరిట బీబీసీ ఒక ప్రత్యేక వీడియోను రూపొందించింది.
అరేబియా సముద్రానికి సరిహద్దుల్లో ఉన్న రాయ్‌గఢ్ జిల్లాలో మురుద్ అనే గ్రామం ఉంది. మురుద్ గ్రామం అరేబియా సముద్రం అంచున ఉంటుంది. ఈ గ్రామానికి పశ్చిమాన సముద్రంలోని ఒక ద్వీపం మీద జంజీరా కోట ఉంది. మురుద్ గ్రామానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో రాజ్‌పురి అనే మరో ఊరు ఉంటుంది.
జంజీరా కోటను సిద్ధులు నిర్మించారు.
అరబిక్ పదం ‘జజీరా’ నుంచి జంజీరా అనే పేరును పెట్టారు. జజీరా అంటే ద్వీపం అని అర్థం.


అద్భుతమైన ఆర్కిటెక్చర్
జంజీరా కోట 22 ఎకరాల్లో విస్తరించి ఉంది. కోట చుట్టూ 40 అడుగుల ఎత్తైన ప్రాకారం ఉంటుంది. రాళ్ల మధ్య ఇసుక, సున్నం, బెల్లం, కరిగించిన సీసం మిశ్రమాన్ని ఉపయోగించి కోటను కట్టారని స్థానికులు చెబుతుంటారు.
ముంబయిలోని కేజే సౌమయ్యా కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గౌరవ్ గాడ్గిల్ ఈ కోట గురించి బీబీసీతో మాట్లాడారు.
‘‘జంజీరా కోటను విశ్వంలోనే అత్యుత్తమ సృష్టిగా భావిస్తారు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ కోట అలాగే ఉంది. దీన్ని జయించడానికి ఎంతో మంది పాలకులు చేసిన దాడులను ఎదుర్కొని చెక్కు చెదరకుండా నిలిచింది. మీరు కోట నిర్మాణాన్ని పరిశీలిస్తే, దాని బలానికి గల కారణాలు అర్థం అవుతాయి’’ అని ఆయన అన్నారు.
‘‘దూరం నుంచి కోట ప్రవేశ ద్వారం ఎక్కడ ఉందో కూడా మీరు గుర్తించలేరు. ఒకవేళ మీకు కోట ద్వారం ఎక్కడుందో తెలిసినా, పడవల ద్వారా అక్కడికి చేరుకోవడం కష్టం. ఎందుకంటే అక్కడ పడవలు ఆగే స్థలం కూడా ఉండదు. మీరు నేరుగా కోట ద్వారం మెట్ల మీదకు వెళ్లాల్సి ఉంటుంది.
శత్రువులు ఈ కోటను చేరుకోవడాని కంటే ముందే, ఈ కోటలో నుంచి దూసుకొచ్చే ఫిరంగులను ఎదుర్కోవాల్సి ఉండేది. కోటలో అనేక బురుజులు (టవర్లు) ఉన్నాయి. ప్రతీ బురుజు వద్ద ఫిరంగులు ఏర్పాటు చేసి ఉండేవి. వాటిలో కొన్ని ఫిరంగులు 10 కి.మీ దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలవు’’ అని ఆయన వివరించారు.
ఆ ఫిరంగుల్లో ఒకదాని పేరు ‘‘కలాల్‌బాంగ్డి’’. బాంగ్డి అంటే కంకణం అని అర్థం. కలాల్‌బాంగ్డిని ఉపయోగించినప్పుడు కలిగే కంపనం వల్ల దాని చుట్టూ ఒక వృత్తాకార వలయం ఏర్పడుతుంది. చూడటానికి అది ఒక కంకణంలా కనిపిస్తుంది.
కలాల్‌బాంగ్డి, సుదూర లక్ష్యాలను ఛేదించే ఫిరంగి.

ఫొటో సోర్స్, Getty Images
అదే సమయంలో, ఈ కోట పరిరక్షణలో ప్రకృతి పాత్ర కూడా ఉంది. కోట చుట్టూ ఎప్పుడూ కనీసం 30 అడుగుల లోతు నీరు ఉండేది. ఇది కోట భద్రత మరింత పెరగడానికి దోహదపడింది.
కోటలోని ఇంజనీరింగ్ నైపుణ్యాలే కాదు, అంతర్గత భద్రత కూడా అత్యంత పటిష్టంగా ఉండేది. కోటలోని ఎవరైనా అంతర్గత భద్రత నియమాలను ఉల్లంఘిస్తే వారికి శిక్ష మరణదండనే.
జంజీరా కోటలోని భద్రత గురించి బీబీసీతో సిద్ధి వంశస్థుడు, కోటకు గైడ్‌గా వ్యవహరించే ముయిన్ కోఖేదార్ మాట్లాడారు.
‘‘కోట నుంచి ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు వారి చేతి మీద ఒక ప్రత్యేకమైన ముద్రను వేసేవారు. ఆ ముద్రను చూపిస్తేనే తిరిగి కోటలోకి అనుమతించేవారు. ఒకవేళ ఎవరైనా ఆ ముద్రను పోగొట్టుకున్నా, లేదా చూపించకపోయినా మరో మాట లేకుండా నేరుగా చంపేసేవారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
తమ పాలనా కాలంలో సిద్ధిలు చాలా కఠినమైన నియమాలు, పటిష్టమైన వ్యవస్థలను రూపొందించారు.

ఫొటో సోర్స్, Getty Images
బానిసలుగా వచ్చి...
భారతదేశానికి ఏడో శతాబ్దంలో సిద్ధిలు వచ్చినట్లుగా భావిస్తారు. సిద్ధీల పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని బంటు తెగకు చెందినవారు. సిద్ధీలు, అరబ్ వ్యాపారులతో బానిసలుగా భారత్‌కు వచ్చారు.
సన్నని, బలమైన దేహదారుఢ్యంతో పాటు సిద్ధీలులకు ఉండే ధైర్యం, విధేయతా లక్షణాలు నచ్చిన భారత రాజులు వారిని పనిలో పెట్టుకోవడం మొదలుపెట్టారు.
అహ్మద్‌నగర్‌కు నిజాంషా హోదాలో కూడా సిద్ధీలు పనిచేశారు. వారిలో ఒకరైన సుబేదార్ పీరమ్ ఖాన్‌కు జంజీరా కోటను స్వాధీనం చేసుకునే బాధ్యతను నిజాం అప్పగించారు.
‘‘హిస్టరీ ఆఫ్ జంజీరా స్టేట్’’ అనే పుస్తకాన్ని శరద్ చిట్నీస్ రాశారు. అందులో జంజీరా చరిత్ర 1490ల కాలం నాటిదని ఆయన పేర్కొన్నారు.
1636లో అహ్మద్‌నగర్ పతనం అయినప్పుడు జంజీరాకు చీఫ్‌గా అంబర్ సిద్ధీ ఉన్నారు. నిజాంషాహీని పడగొట్టిన తర్వాత, ఆయన బీజాపూర్ సుల్తానులకు విధేయుడిగా మారిపోయారు. తర్వాత జంజీరాకు చీఫ్ హోదాలో ఆయన ఆ మార్గంలో వెళ్లే వ్యాపారులు, తీర్థయాత్రికుల భద్రతకు బాధ్యతలు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శివాజీ ప్రయత్నాలు
జంజీరా కోట ప్రాధాన్యం గురించి తెలుసుకున్న ఛత్రపతి శివాజీ ఆ కోటను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. మొదటగా 1657లో రఘునాథ్ బల్లాల్ నాయకత్వంలో ఈ కోటను దక్కించుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
తర్వాత 1669 మే నెలలో జంజీరా కోటను హస్తగతం చేసుకునేందుకు స్వయంగా శివాజీ బరిలోకి దిగారు. ఆ సమయంలో జంజీరాకు చీఫ్‌గా ఫతే ఖాన్ ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో మరో 7 కోటలు కూడా ఉండేవి. మరాఠాలు ఈ ఏడు కోటలను ఆక్రమించుకున్నారు.
ఫతేఖాన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు గ్రహించిన శివాజీ, జంజీరాను తనకు అప్పగించాలని ఫతేఖాన్‌కు అడిగారు. దీనికి బదులుగా పరిహారం ఇవ్వడంతో పాటు తన రాజ్యంలో సముచిత గౌరవం ఇస్తానని ఫతేఖాన్‌కు ఆశ కల్పించారు. శివాజీ ప్రతిపాదనకు ఫతేఖాన్ కూడా అంగీకరించారు. కానీ, అప్పుడే ఫతేఖాన్‌పై తిరుగుబాటు చెలరేగింది. ఆయన జైలు పాలయ్యారు. ఫతేఖాన్ స్థానంలో జంజీరా కోట బాధ్యతలను సిద్ధీ సంబుల్ చేపట్టారు.
ఆయన నేరుగా ఔరంగజేబు సహాయాన్ని కోరారు. సంబుల్‌కు సహాయం చేయడం కోసం సూరత్ నుంచి ఔరంగజేబు తన సైన్యాన్ని పంపిచారు. దీంతో కోటను దక్కించుకోవాలనే శివాజీ ప్రయత్నం మరోసారి విఫలమైంది.

దీని తర్వాత సిద్ధీని ‘‘యాకుత్ ఖాన్’’ అనే బిరుదుతో ఔరంగజేబు సత్కరించారు.
కోటకు ఉన్న నౌకాదళ శక్తి, రక్షణ సామర్థ్యాలను గ్రహించిన శివాజీ రెండేళ్ల తర్వాత అంటే 1671లో మరోసారి దాడి చేశారు. ఈ సారి కూడా ఆయన ఓడిపోయారు.
తర్వాత, జంజీరా కోటకు సమీపంలో ‘‘పద్మదుర్గం’’ అనే ఒక కొత్త కోటను కట్టే పనిలో పడ్డారు శివాజీ. కానీ, జంజీరా కోట నుంచి వచ్చే తూటాల వాన ఈ పనికి అడ్డంకిగా మారింది.
పట్టాభిషేకం తర్వాత, శివాజీ 1676లో మోరోపంత్ నేతృత్వంలో జంజీరా కోటపై మరోసారి దాడి చేయాలని నిర్ణయించారు. జంజీరా ఒడ్డున నిచ్చెనలు వేసి తన సైన్యాన్ని దించాలనే సాహసోపేత పథకాన్ని రచించారు. కానీ, పథకంలో ఏదో పొరపాటు కారణంగా ఈసారి కూడా శివాజీ విఫలమయ్యారు.
శివాజీ తర్వాత శంభాజీ మహరాజ్ కూడా 1682లో జంజీరాను వశం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీనికోసం సముద్రంలో వంతెన నిర్మించేందుకు కూడా ప్రయత్నించారు. జంజీరాపై శంభాజీ పథకం రచిస్తున్న సమయంలోనే హసన్ అలీ నేతృత్వంలో 40 వేల మందిని ఔరంగజేబు పంపించారు. దీంతో శంభాజీ మహారాజ్ తన ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకోవాల్సి వచ్చింది.

కోటలో పాడుబడిన ఇళ్లు
ఈ ద్వీపంలో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నలువైపులా సముద్రం ఉన్నప్పటికీ ఇక్కడ మంచినీరు అందుబాటులో ఉంటుంది.
ఇక్కడ రెండు మంచినీటి సరస్సులు ఉన్నాయి. ఈ నీటిని వ్యవసాయానికి వాడొచ్చు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఈ కోటలో 550 కుటుంబాలు నివసించేవి.
ఇక్కడి నివసించిన వారి వంశస్థుల కథనం ప్రకారం, కోటలోని ప్రజలు వ్యవసాయం చేసేవారు. వారికి దుస్తులు, ఆహారాన్ని పాలకులు అందించేవారు. ఇక్కడ పాఠశాల కూడా ఉండేది. అందులో మరాఠీ, ఉర్దూ భాషల్లో విద్యాబోధన జరిగింది.
స్వాతంత్ర్యం వచ్చాక సిద్ధీలు ఈ కోటను భారత ప్రభుత్వానికి అప్పగించారు. వారు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్లి స్థిరపడ్డారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన కార్యదర్శి వి.పి. మీనన్ రాసిన 'ది స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్' అనే పుస్తకంలో ఇలా రాశారు.
“జంజీరా కోటను బొంబాయి ప్రావిన్స్ ప్రభుత్వానికి అప్పగించారు. మొత్తం వ్యవస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఒప్పందంపై సంతకం చేయమని నవాబును కోరాం. ఇందుకు ఆయన అంగీకరించారు.
దక్కన్ ప్రావిన్స్ 1948 మార్చి 8న భారతదేశంలో విలీనం అయింది. మొత్తం 815 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల ప్రాంతాన్ని భారత్‌లో చేర్చారు. ఇక్కడ నివసించే పౌరుల సంఖ్య దాదాపు 17 లక్షలు ఉంటుంది’’ అని పుస్తకంలో రాశారు.
ఆ తర్వాత కోటలో నివాసం ఉండటం అక్కడి ప్రజలకు కష్టంగా మారింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ఆశ్రయం పొందారు.
ఆ రోజుల్లో సాయంత్రం తర్వాత సముద్ర ప్రయాణం చాలా కష్టం. వర్షాకాలంలో వాతావరణం మరింత దారుణంగా ఉంటుంది.
ఈ కారణాలతో కోట నుంచి ప్రజలు బయటకు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. కోట నుంచి వెళ్లిపోయేటప్పుడు వారు కట్టుకున్న ఇళ్లను స్వయంగా పడగొట్టేసి వెళ్లిపోయేవారు.
1980 నాటికి ఇక్కడి పౌరులందరూ కోట నుంచి ప్రధాన భూభాగంలోని వివిధ గ్రామాలకు వచ్చారు. కాలక్రమేణా, ఈ కోట నిర్జన ప్రదేశంగా మారింది. అక్కడి పాడుబడిన ఇళ్లు ఇందుకు నిదర్శనంగా మారాయి.
జంజీరా కోట ప్రస్తుతం 'ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా' ఆధీనంలో ఉంది. అనుమతి లేకుండా ఎవరూ కోటలోకి ప్రవేశించకూడదని అక్కడ ఒక నోటీసును అంటించారు. గత కొద్ది రోజులుగా ఈ కోటను పర్యాటకులు సందర్శిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














