ఎలుగుబంట్లను హడలెత్తిస్తున్న రోబో తోడేళ్లు, ఇక పంటలు భద్రమేనా?

- రచయిత, డెరెక్ కై
- హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్
నిప్పు కణికల్లా మెరుస్తున్న ఎర్రటి కళ్లు, వెన్నులో వణుకు పుట్టించేలా ఊలల అరుపులతో కనిపిస్తున్న ‘తోడేళ్లలను’ చూసి ఎలుగుబంట్లు కూడా పరుగులు పెడుతున్నాయి. నిజానికి అవి నిజమైన తోడేళ్లు కాదు, రోబో తోడేళ్లు.
ఇప్పుడు జపాన్‌లో అవే చాలా ముఖ్యం అయిపోయాయి.
గతంలో జపాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో అడవి జంతువులు పంటపొలాలపై దాడులు చేసి, పంటను నాశనం చేస్తుండేవి.
వాటి బారి నుంచి పంటను రక్షించుకోవడం కోసం ఈ రోబో తోడేళ్లను వాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం నగరాల్లో కూడా వాడుతున్నారు.
ఎలుగుబంట్లు జనావాసాల్లోప్రవేశించి, మనుషులపై దాడి చేయకుండా నిలువరించేందుకు, శివారు ప్రాంతాల్లో రోబో తోడేళ్ల సేవలను ఉపయోగించుకుంటోంది జపాన్ ప్రభుత్వం.
ఈ రోబో తోడేళ్లను తయారుచేస్తున్న ‘వూల్ఫ్ కాముయ్’ సంస్థ అధ్యక్షులు మొటోహిరో మియాసకా మాట్లాడుతూ- ఈ రోబో తోడేళ్లను 2020లో తొలిసారిగా టకికావా నగరంలో వినియోగించారన్నారు. ఆ తరువాత వీటి వినియోగం బాగా పెరిగిందని, స్థానిక అధికారులు వీటిని ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలుగుబంట్లు నగరాల్లోకి ఎందుకొస్తున్నాయి?
జపాన్‌లో ఇటీవలి కాలంలో ఎలుగుబంట్ల దాడుల సంఖ్య బాగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
సాగు ఎక్కువగా ఉండే గ్రామాల్లోని యువత వ్యవసాయాన్ని వదిలివేసి పట్టణాలు, పెద్ద నగరాలకు వలసవెళ్లడం వల్ల క్రమంగా గ్రామాలు ఖాళీ అవుతున్నాయని, వీటి వల్ల ఆహారం వెతుక్కుంటూ ఎలుగుబంట్లు నగరాల్లో చొరబడుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఎలుగుబంట్ల దాడులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు.
“పర్వత శివారు ప్రాంతాల్లో సాగు ఆధారిత గ్రామాలు తగ్గిపోయాయి. ఇవే ఒకప్పుడు బఫర్ జోన్‌లుగా ఉపయోగపడేవి. ఇప్పుడు అవి కనుమరుగయ్యాయి” అని ప్రొఫెసర్ షిన్‌సుకె కొయికె అన్నారు.
ఫారెస్ట్ ఎకో సిస్టమ్, జీవ వైవిధ్యం, ఎలుగుబంట్ల జీవనంపై పరిశోధనలు చేస్తున్న టోక్యో యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలో కొయికె ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
“బఫర్ జోన్‌లు తగ్గిపోవడం వల్ల ఎలుగుబంట్లు అడవులను వదిలి, మైదాన ప్రాంతాలు, ప్రజల నివాసానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో నివసించడానికి అలవాటు పడ్డాయి. ప్రకాశవంతమైన దీపాలు, భారీ శబ్దాలకు అలవాటు పడి, మనుషులంటే భయం కూడా తగ్గిపోయింది” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తగ్గుతున్న జనాభా, పెరుగుతున్న ఎలుగుబంట్లు
ఇటీవలి కాలంలో ఎలుగుబంట్లు పర్వత ప్రాంతాలను వదిలి జనావాసాల్లో సంచరించడం సర్వసాధారణంగా మారిపోయింది.
హొక్కైడో ఉత్తర ప్రాంతాన బ్రౌన్ ఎలుగుబంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అలాగే దాడులు కూడా పెరుగుతున్నాయి. హొక్కైడో ప్రాంతంలో గడిచిన 60 ఏళ్లలో సుమారు 150కి పైగా ఎలుగుబంట్ల దాడులు జరిగాయి.
2021లో ఏకంగా ఎలుగుబంట్ల దాడుల్లో నలుగురు చనిపోగా, 10మందికి పైగా గాయపడ్డారు. రికార్డుల్లో ఇదే అత్యథికం.
జపాన్‌లోని మిగిలిన ప్రాంతాల్లో ఆసియా నల్ల ఎలుగుబంట్లు కనిపిస్తాయి. ఛాతీపై చంద్రవంక లాంటి గుర్తుతో కనిపిస్తాయివి. అంత దూకుడుగా ఉండవు కానీ ప్రమాదకరమే.
ఓవైపు జపాన్ జనాభా తగ్గుతూ, వృద్ధుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు ఎలుగుబంట్ల సంఖ్య మాత్రం పెరుగుతోంది. హొక్కైడోలో సుమారు 12,000 బ్రౌన్ ఎలుగుబంట్లు ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో 10,000 ఏషియన్ బ్లాక్ ఎలుగుబంట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
వీటి సంచారం ఏప్రిల్ నెలలో మొదలవుతుంది. ఆ సమయంలో అవి నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చి ఆహారం కోసం వేట మొదలుపెడతాయి. శీతాకాలంలో శరీరంలో కొవ్వు నిల్వలు పెంచుకోవడానికి అవసరమైన ఆహారం కోసం మళ్లీ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎక్కువగా సంచరిస్తాయి.
అయితే గణాంకాల ప్రకారం దాడుల సంఖ్య పెరుగుతోందంటే దాడుల్లో మరణించే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కొయికె అన్నారు.
వాతావరణ మార్పుల కారణంగా ఎలుగుబంట్ల ప్రధాన ఆహార వనరుగా పేర్కొనే ‘అకోర్న్’ దిగుబడి తగ్గిపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని ఆయన చెప్పారు.
ఓక్ వృక్షాల నుంచి వచ్చే ఈ అకోర్న్ పండ్లు ఎలుగుబంట్లతోపాటు ఇతర జీవులకు కూడా ప్రధాన ఆహార వనరుగా ఉన్నాయి.
దాడులు పెరగడానికి కారణాలు
అకోర్న్ పండ్ల సాగు ప్రధానంగా 'బ్లూమ్ అండ్ బస్ట్'గా పిలిచే వాతావరణ చక్రానికి అనుగుణంగా ఉంటుంది. కానీ అతివృష్టి, వాతావరణ మార్పుల వల్ల పంటలు నాశనమయ్యాయి. దీనికితోడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓక్ చెట్లు కూడా తగ్గిపోయాయి.
2015లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం వాతావరణంలో వేడి పెరగడం వలన పరాగ సంపర్కంపై ప్రభావం పడి అక్రోన్ లాంటి చిన్న పంటల చిన్న పంటల దిగుబడి తగ్గిపోయింది.
ఓక్ చెట్ల నుంచి ఈ సమయంలోనే పూత మొదలవుతుంది. పరాగ సంపర్కం మూలంగా ఎక్కువ సంఖ్యలో అక్రోన్ పండ్ల దిగుబడి సాధ్యం అవుతుంది.
కొవెంట్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన టిమ్ స్పార్క్స్ అధ్యయనం ప్రకారం- గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి, పూతలో ఆలస్యం జరుగుతుంది. ఫలితంగా పండ్ల కాపు కూడా 20% మేర తగ్గిపోతుంది.
దీనికి తోడు క్రమంగా తగ్గుతున్న సాగు వల్ల ఎలుగుబంట్లు ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తున్నాయి.
“ఇప్పుడు మనం చేయాల్సిందల్లా వాటిని తిరిగి పర్వతాల్లోకి ఎలా పంపాలనే విషయంపై ఆలోచించడమే” అన్నారు కొయికె. కానీ సరైన పరిష్కారమైతే ఇంకా దొరకలేదు.
ఈ సమస్యపై స్థానిక మీడియాతో హొక్కైడో రీసర్చ్ ఆర్గనైజేషన్‌కు చెందిన పరిశోధకులు త్సుటోము మనో మాట్లాడుతూ.. చాలా కొద్ది మంది అధికారులకు మాత్రమే వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్‌పై అవగాహన ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో వారి మధ్య సమన్వయం అంతగా లేదని చెప్పారు.
"ఎలుగుబంటి ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో ప్రజలకు అవగాహన కల్పించడం మినహా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అధికారులకు తెలియడంలేదు" అని కొయికా అన్నారు.
“గతంలో ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిన సమయంలో ఎక్కువగా ఎలుగుబంట్ల దాడులు జరిగేవి. ఇప్పుడు మాత్రం అవే జనావాసాల్లోకి వచ్చి దాడులు చేసేలా పరిస్థితి మారింది. ఇది కొత్త సమస్య. దీనిని పరిష్కరించడానికి వారు శక్తికొద్దీ ప్రయత్నిస్తున్నారు” అని కొయికె అన్నారు.
ఇవి కూడా చదవండి..
- జ్యోతి యర్రాజీ: ఆసియన్ గేమ్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో విశాఖ అథ్లెట్‌కు సిల్వర్ మెడల్
- నిఖత్ జరీన్: ‘చల్.. శక్తి హై.. ఔర్ జాన్ లగా’ అంటూ ఈ అమ్మాయి బాక్సింగ్‌లో ఎలా ఎదిగిందంటే..
- మీ ఇంటికి పావురాలు వస్తున్నాయా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే..
- పాము కాటేసే ముందు హెచ్చరిస్తుందా... అలాంటప్పుడు ఏం చేయాలి?
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... ఈ బిల్లు గురించి తెలుసుకోవాల్సిన 6 కీలక అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













