అగ్నిపర్వతం వైపు టూరిస్టులతో వెళ్లి కనిపించకుండా పోయిన హెలికాప్టర్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయెల్ గింటో
- హోదా, బీబీసీ ప్రతినిధి
జపాన్‌లోని అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన మౌంట్ అసో సమీపంలో ముగ్గురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ టూరిస్ట్ హెలికాప్టర్ ‘అదృశ్యమైంది’.
ఈ హెలికాప్టర్ మంగళవారం 10- నిమిషాల టూర్ కోసం స్థానిక కాలమానం ప్రకారం 10:52 గంటలకు టేకాఫ్ అయిందని అధికారులు చెప్పారు.
అయితే అది మళ్లీ తిరిగి రాలేదని పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియా తమ కథనాల్లో తెలిపింది.
మౌంట్ అసోకు చెందిన ఐదు శిఖరాల్లో ఒకటైన నకడాకే వద్ద క్రేటర్ (గొయ్యి వంటిది)లో హెలికాప్టర్‌ను పోలిన ఓ వస్తువును సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పోలీసు హెలికాప్టర్ గుర్తించింది.
అయితే, అది కనిపించకుండా పోయిన హెలికాప్టరా కాదా అనేది అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ హెలికాప్టర్ పైలట్‌కు 40 ఏళ్ల అనుభవం ఉంది. 64 ఏళ్ల ఆ పైలట్‌తో పాటు హెలికాప్టర్‌లో మరో పురుషుడు, ఓ మహిళ ఉన్నారు.
వాళ్లిద్దరూ తైవాన్‌కు చెందినవారు.
కనిపించకుండా పోయిన హెలికాప్టర్ అమెరికాలో తయారు చేసిన రాబిన్‌సన్ ఆర్-44. ఇది ఆ రోజు మూడోసారి ట్రిప్ కోసం బయల్దేరి కనిపించకుండా పోయింది.
అంతకుముందు రెండు ప్రయాణాల్లో ఈ హెలికాప్టర్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తలేని హెలికాప్టర్ ఆపరేటర్ తకుమి ఎంటర్‌ప్రైజ్ తెలిపింది.
మంగళవారం సాయంత్రం మబ్బులతో కూడిన వాతావరణం ఉండటంతో.. సెర్చ్ ఆపరేషన్స్‌ను నిలిపివేశారు.
జీజీ న్యూస్ ఏజెన్సీ ప్రకారం… ఈ ఘటన తర్వాత తమ అన్ని హెలికాప్టర్ల ప్రయాణాలను తకుమి ఎంటర్‌ప్రైజ్ సంస్థ నిలిపివేసింది.
నైరుతి జపాన్‌లోని కుమామోటో ప్రిఫెక్చర్(రాష్ట్రం వంటిది)లో మౌంట్ అసోలోని అగ్నిపర్వత ల్యాండ్‌స్కేప్‌లపైన హెలికాప్టర్ టూర్‌లు.. పర్యాటకులను ప్రధానంగా ఆకర్షించే వాటిల్లో ఒకటి.
2024లో మౌంట్ అసోపై ఎగురుతున్న తకుమి ఎంటర్‌ప్రైజ్‌కు చెందిన ఓ హెలికాప్టర్.. అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లోని ముగ్గురికి గాయాలయ్యాయి.
మౌంట్ అసో 2021 అక్టోబర్‌లో విస్ఫోటనం చెంది, ఆకాశంలోకి భారీ ఎత్తున పొగను వెదజల్లింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














