హిందూ మహా సముద్రం మీద చైనా ఆధిపత్యం భారత్‌కు సవాల్ విసురుతుందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
హిందూ మహా సముద్రంలో చైనా నౌకాదళ కార్యకలాపాలు పెరుగుతున్న తీరుపై భారత ప్రభుత్వం, రక్షణ రంగ నిపుణులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
2020లో గాల్వన్ లోయ దగ్గర భారత్- చైనా సైనికులు ఘర్షణ పడినప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతోంది.
హిందూ మహా సముద్రం మీద ఆధిపత్యం కోసం భారత్- చైనా పోటీ పడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
కొన్ని దశాబ్ధాలుగా చైనా తన నేవీని వేగంగా ఆధునీకరిస్తూ వస్తోంది. చైనా నౌకాదళంలో యుద్ధ విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, అణ్వాయుధాలను అమర్చిన సబ్ మెరీన్లు ఉన్నాయి.
చైనా నేవీ పరిమాణం పెరిగింది: జైశంకర్

ఫొటో సోర్స్, GETTY IMAGES
“మనం 20, 25 ఏళ్లుగా చూసినట్లయితే హిందూ మహా సముద్రంలో చైనా కార్యకలాపాలు నిరంతరాయంగా పెరుగుతూ వస్తున్నాయి. చైనా నేవీ పరిమాణం చాలా వేగంగా పెరుగుతోంది. మీ పొరుగున అంత పెద్ద నావికా బలం ఉన్నప్పుడు దాని కార్యకలాపాలు మీ పక్కన ఎప్పుడో అప్పుడు కనిపిస్తూనే ఉంటాయని” అన్నారు విదేశాంగమంత్రి జై శంకర్.
చైనా ఓడ రేవు కార్యకలాపాలను ప్రస్తావిస్తూ పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టు, శ్రీలంకలో హంబన్‌టోటా నౌకాశ్రయాల విషయంలో గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.
“ చాలా విషయాల్లో చెప్పినట్లే ఒక్కసారి చరిత్రలోకి చూద్దాం. ఆ సమయంలో ఉన్న ప్రభుత్వం, పాలకులు విదేశాల్లో చైనా ఓడ రేవుల్ని నిర్మించడాన్ని, తద్వారా తలత్తే భవిష్యత్ పరిణామాలను తక్కువగా అంచనా వేసి ఉంటారు. వాటి వల్ల మన దేశ భద్రతపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దాన్ని మనం అందరం ఇప్పుడు జాగ్రత్తగా గమనించాల్సి ఉంది” అని జై శంకర్ అన్నారు.
“స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్” వ్యూహం

ఫొటో సోర్స్, AFP
హిందూ మహా సముద్రంలో చైనా అనుసరిస్తున్న వ్యూహాన్ని ‘స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్’గా చెబుతున్నారు.
హిందూ మహాసముద్రం చుట్టు ఉన్న దేశాలలో వ్యూహాత్మక నౌకాశ్రయాలు నిర్మించడం, చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం, అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం.
ఇంధన ప్రయోజనాలు, భద్రత లక్ష్యాలను కాపాడుకునేందుకు మధ్య ప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకూ ఉన్న సముద్ర మార్గాల్లలో వ్యూహాత్మ సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో చైనా నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది.
ఆఫ్రికాలోని జిబౌటీ, పాకిస్థాన్‌లోని గ్వాదర్‌లో చైనా ఓడరేవులను నిర్మిస్తోంది. శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టును 99 ఏళ్ల లీజుకు తీసుకుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకాదళ పరిధిని పెంచుకోవడానికి ఈ పోర్టులు చైనాకు ఉపయోగపడుతున్నాయి.
‘‘చైనా నుంచి సవాళ్లు ఎప్పటికీ ఉంటాయి’’

ఫొటో సోర్స్, GETTY IMAGES
రక్షణ రంగ నిపుణుడు సి. ఉదయ్ భాస్కర్ భారతీయ నౌకా దళంలో ఉన్నత అధికారిగా పదవీ విరమణ పొందారు. ఆయనిప్పుడు దిల్లీలోని సొసైటీ ఆఫ్ పాలసీ స్టడీస్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు.
హిందూ మహా సముద్రంలో చైనా విస్తరిస్తున్న తీరుతో భారత్‌కు ఎలాంటి ముప్పు ఉందని ఆయన్ను అడిగాం.
“ప్రమాదం అనే కంటే ఇదొక శాశ్వత సవాలు లాంటిదని నేను అంటాను. ఓడ రేవుల నిర్మాణం, మౌలిక వసతుల ద్వారా ఇప్పుడు హిందూ సముద్రంలో తన అస్థిత్వాన్ని బలంగా చూపించేందుకు చైనాకు సత్తా ఉంది. సముద్రాల మీద చైనాకున్న బలం ప్రత్యక్షంగా కనిపిస్తోంది.
ఇది పోర్టుల నిర్మాణం, మౌలిక వసతులు సమస్య కాదు. వాటి ఉద్దేశం ఏంటన్నది ముఖ్యం. వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారు. అక్కడ నౌకల్ని నిలుపుతారా లేకపోతే వాటిని భారత ప్రయోజనాలను దెబ్బ తీసేందుకు ఉపయోగిస్తారా? ఈ అంశాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనించాలి. ఇప్పుడే కాదు, భవిష్యత్‌లో కూడా” అని ఉదయ్ భాస్కర్ చెప్పారు.
అయితే చైనా ఉద్దేశం ఏంటి? అని అడిగినప్పుడు ‘‘చైనా ఉద్దేశం స్పష్టంగా ఉంది. హిందూ మహా సముద్రంలో తన బలాన్ని చూపించాలని అనుకుంటోంది’’ అని ఆయన అన్నారు.
‘‘ఇబ్బంది లేదు’’

ఫొటో సోర్స్, GETTY IMAGES
హిందూ మహా సముద్రంలో చైనా నౌకా బలం పెరుగుతున్న సమయంలో అది భారత్‌కు ఎంత ప్రమాదకరం? చైనా నేవీతో పోలిస్తే ఇండియన్ నేవీ ఎక్కడుంది? అనే కీలక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
“నౌకాదళ సామర్థ్యం పెంచుకోవడం అనేది నిదానంగా జరిగే ప్రక్రియ. యుద్ధ విమాన వాహక నౌకలు రెండు వచ్చి చేరితే సరిపోదు. నీటి లోపల నుంచి దాడి చేసే సామర్థ్యం పెంచుకోవడం, నిఘా అనేవి చాలా విస్తృతమైనవి. అందుకే ఒకటి రెండు విజయాలతో సరిపోదు” అని ఉదయ భాస్కర్ చెప్పారు.
వైస్ అడ్మిరల్ అనుప్ సింగ్, భారత తూర్పు తీర నావికాదళంలో కమాండర్ ఇన్ చీఫ్‌గా పని చేసి రిటైర్ అయ్యారు.
“చైనా దగ్గర 500 ఓడలు ఉన్నా ఇబ్బందేమీ లేదు. అయితే సముద్రంలో పరిస్థితుల్ని ఎదుర్కోవడం, వాళ్ల నావికుల్లో నైపుణ్యం పెంచేందుకు చైనా చేయాల్సింది చాలా ఉంది. అందుబాటులో ఉన్న క్షిపణులు కూడా ముఖ్యమే. అలాగే హిందూ మహా సముద్రంలో ఆయుధాలు, ఇతర సామాగ్రి రవాణా కూడా కీలకమే ” అని ఆయన అన్నారు.
‘చైనా పెద్ద సంఖ్యలో ప్రయాణ నౌకలను తయారు చేసిందని, అయితే చమురు, రేషన్, నీరు మోసే సహాయక నౌకలు వారి వద్ద అంతగా లేవని అనూప్ సింగ్ తెలిపారు.
ఇంకా ఆయనేమన్నారంటే "భారత నౌకాదళంలో 138 నౌకలు ఉన్నప్పటికీ, కొత్త నౌకల చేరిక కంటే తొలగిస్తున్న వాటి సంఖ్య ఎక్కువగా ఉంది. భారతదేశం ఒక ద్వీపకల్ప దేశంగా అత్యధిక సంఖ్యలో నౌకలను కలిగి ఉంది. దీని వలన దేశం మూడు వైపులా ఉన్న సముద్రాలపై ఆధిపత్యం చలాయిస్తోంది"
‘‘తప్పించుకోవడం అసాధ్యం’’

ఫొటో సోర్స్, GETTY IMAGES
హిందూ మహాసముద్రంలో భారతీయ నౌకాదళం కనుసన్నల్లో నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని, నీటి అడుగున నడిచే సబ్ మెరీన్లను కూడా భారత నేవీ కనిపెట్టగలదని వైస్ అడ్మిరల్ అనూప్ సింగ్ చెప్పారు.
ఒక జలంతర్గామి జలసంధిని దాటాలంటే అది నీటి ఉపరితలం మీదకు రావాలని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ చెబుతోంది. చైనా వాళ్లు అలా చేయకపోయినా కూడా ఇండియన్ నేవీ కనిపెట్టగలదు. వాళ్లకు ఎలాంటి అవకాశం ఇవ్వదన్నారాయన.
"చైనాకు జిబౌటిలో అడుగు పెట్టే అవకాశం దొరికింది. రానున్న రోజుల్లో వాళ్లు గ్వాదర్ కూడా రావచ్చు. అయినప్పటికీ వాళ్లు భారతదేశానికి చాలా దూరంగా ఉన్నారు"అని అనూప్ సింగ్ చెప్పారు.
చైనా నేవీలో చేరిన చాలా మంది నావికులు నిర్బంధం వల్ల చేరారు. వాళ్లలో నైపుణ్యం అంతగా లేకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. చైనాకు చెందిన ప్రతీ ఓడలోనూ కొద్ది మాత్రమే సీనియర్లు ఉన్నారు. వాళ్లకే కొంత వరకూ నైపుణ్యం ఉంది" అని ఆయన చెప్పారు.
గూఢచర్యం ఆందోళనలు

ఫొటో సోర్స్, GETTY IMAGES
గతేడాది ఆగస్టులో చైనా నౌకాదళానికి చెందిన యువాన్ వాంగ్ 5 అనే నౌక శ్రీలంకలోని హంబన్‌టోట నౌకాశ్రయానికి చేరుకుని వారం రోజులు అక్కడే ఉంది.
శ్రీలంకకు నిత్యావసర వస్తువుల సరఫరా, అంతర్జాతీయ నియమావళికి అనుగుణంగా సముద్రలో పరిశోధన కోసమే ఆ నౌక వచ్చినట్లు చైనా అప్పట్లో ప్రకటించింది.
అయితే ఇది గూఢచర్యం చేస్తోందని భారత దేశం ఆందోళన చెందింది. ఇది హంబన్ టోట నౌకాశ్రయంలో వారం రోజులు ఉండటం వల్ల ఈ నౌక ద్వారా చైనా భారత దేశం గురించిన ఏవైనా వివరాలు సేకరించిందా?. వాటి వల్ల భారత భద్రతకు ఏమైనా ముప్పు పొంచి ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.
హంబన్‌టోట నుంచి చెన్నై, కొచ్చి, విశాఖపట్నం ఓడరేవులు 900 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉండటమే భారతదేశం ఆందోళనకు కారణం. దీంతోపాటు భారత అంతరిక్ష కార్యక్రమాల వేదిక ఇస్రో ఈ నౌకకు 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నావికాదళం కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ, భారత్ లాంటి పెద్ద దేశాలకు గూఢచర్యానికి సంబంధించిన ఆందోళనలు పెరగడం కూడా సహజం.
"పరిశోధన, గూఢచర్యం మధ్య చక్కటి గీత ఉంది. వీటిని యునైటెడ్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అనుమతించిన చట్టబద్ధమైన పరిశోధన కార్యకలాపాలని చెప్పవచ్చు. ఇది క్లిష్టమైన వ్యవహారం. వీటిని పర్యవేక్షించే సత్తా ఆయా దేశాలకు ఉండాలి” అని రక్షణ రంగ నిపుణడు సి. ఉదయ్ భాస్కర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










