హైకున్: చైనా నుంచి తైవాన్‌ను ఈ సబ్‌మెరైన్ కాపాడగలదా?

తైవాన్ సబ్‌ మెరైన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తైవాన్ సబ్‌ మెరైన్
    • రచయిత, టెస్సా వాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన "హైకున్ " జలాంతర్గామిని ప్రపంచానికి పరిచయం చేసింది తైవాన్ . చైనా దాడిని ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారనుందని తైవాన్ భావిస్తోంది.

తైవాన్ పోర్టు సిటీ కౌషియోంగ్‌లో తైవాన్ అధ్యక్షురాలు త్సై ఇంగ్ వెన్ ఈ జలంతర్గామిని ఆవిష్కరించారు.

చైనా బలగాలు రానున్న రోజుల్లో తైవాన్ మీద దాడి చేయవచ్చని అమెరికన్ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.

తైవాన్ నాయకత్వం తమది స్వతంత్ర, సార్వభౌమ దేశమని చెబుతోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని, ఏదో ఒక రోజు చైనాలో కలిపేస్తామని బీజింగ్ నాయకత్వం అంటోంది.

అయితే, చైనాకు తైవాన్ మీద ఇప్పటికిప్పుడు దాడి చేసే ఆలోచన లేదని, శాంతియుతంగానే ఈ ద్వీపాన్ని తమ దేశంలో కలుపుకోవాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అదే సమయంలో తైవాన్ తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడాన్ని, అందుకు విదేశాల మద్దతు తీసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది.

తైవాన్ జలసంధి ప్రాంతంలో తరచుగా సైనిక విన్యాసాలు నిర్వహించడం ద్వారా చైనా ఆ దేశ నాయకత్వం మీద ఒత్తిడి తెస్తోంది. ఇటీవల నిర్వహించిన సైనిక విన్యాసాలు కూడా అందులో భాగమే.

త్సై ఇంగ్ వెన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, తైవాన్ అధ్యక్షురాలు త్సై ఇంగ్ వెన్

హైకూన్ పేరు వెనుక కథ

‘‘ చరిత్ర ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మేము దేశీయంగా సబ్‌ మెరైన్ తయారు చేయడం అసాధ్యం అన్నారు. కానీ మేము సాధించాం’’ అని తైవాన్ జెండా చిహ్నం ముఖంగా కనిపిస్తున్న ఎత్తైన సబ్ మెరైన్‌‌ను ఆవిష్కరించిన సమయంలో తైవాన్ అధ్యక్షురాలు త్సై ఇంగ్ వెన్ అన్నారు.

స్వదేశీ పరిజ్ఞానంతో సబ్‌‌మెరైన్‌ను తయారు చేయడమనేది తైవాన్ నాయకుల ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి. అధ్యక్షురాలైన తర్వాత బడ్జెట్‌లో రక్షణ రంగానికి నిధుల్ని రెట్టింపు చేశారు త్సై ఇంగ్ వెన్.

సుమారు 12,455 కోట్ల రూపాయల ఖర్చుతో తయారు చేసిన ఈ జలాంతర్గామి డీజిల్ ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తుంది. దీనికి మరికొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చే ఏడాది నేవీకి అప్పగిస్తారని సైన్యాధికారులు తెలిపారు.

ఈ సబ్‌‌మెరైన్‌కు చైనా సాహిత్యంలో ఎగిరే చేపగా ప్రసిద్ధిగాంచిన 'హైకున్' పేరు పెట్టారు.

ఇది కాకుండా మరో జలాంతర్గామి కూడా తయారీలో ఉంది. ఈ సంఖ్యను ఒక్కొక్కటిగా పెంచుతూ మొత్తం పది జలంతర్గాముల ఫ్లీట్‌ను తయారు చేసే ఆలోచనలో ఉంది తైవాన్ నాయకత్వం. వీటితో పాటు క్షిపణులు అమర్చిన రెండు పాత డచ్ బోట్లు కూడా తైవాన్ నేవీ వద్ద ఉన్నాయి.

చైనా తమ దేశాన్ని ఆక్రమించుకోవాలని భావించినా, తైవాన్ జలసంధిలో నౌకల రాకపోకల్ని అడ్డుకున్నా.. ఎదురు దాడి చేస్తామని సబ్ మెరైన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న అడ్మిరల్ హంగ్ షు కంగ్ గతవారం మీడియాతో అన్నారు.

తమకు అమెరికా, జపాన్ బలగాల మద్దతు లభించేవరకు ఈ సబ్ మెరైన్ వ్యవస్థ అండగా ఉంటుందని ఆయన అన్నారు.

చైనా- తైవాన్ ఉద్రిక్తతలు
ఫొటో క్యాప్షన్, చైనా- తైవాన్ ఉద్రిక్తతలు

‘తైవాన్‌వి పగటికలలు’

"ఇదంతా అర్థరహితం. పసిఫిక్‌లో మా సైనిక చర్యలను ఆపేందుకు జరుగుతున్న ప్రయత్నం" అని చైనా రక్షణశాఖ ఆధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.

"తైవాన్‌లోని అధికారిక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కొనుగోలు చేస్తున్న ఆయుధాలు కానీ, తయారు చేస్తున్న ఆయుధాలు కానీ, తైవాన్‌ను చైనాలో కలపకుండా ఆపలేవు" అని అన్నారు.

తైవాన్ పగటి కలలు కంటోందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ గతవారం ఒక కథనాన్ని ప్రచురించింది. తాము తైవాన్ చుట్టూ మల్టీ డైమన్షనల్ యాంటీ సబ్ మెరైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆ కథనంలో పేర్కొంది.

ఇప్పటికే చైనా మిలటరీ తైవాన్ ద్వీపం చుట్టూ బహుముఖ సబ్ మెరైన్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా ఆ వార్తా కథనం పేర్కొంది.

కొత్త సబ్ మెరైన్‌లతో తైవాన్ రక్షణ వ్యవస్థ బలోపేతం అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

చైనాతో పోలిస్తే తైవాన్ జలాంతర్గాముల వ్యవస్థ ఏ మూలకూ సరిపోదు. చైనా వద్ద ప్రస్తుతం 60 సబ్ మెరైన్లు ఉన్నాయి. అవి కూడా అణ్వాయుధాలను అమర్చినవి. వీటితో పాటు త్వరలో మరికొన్ని చైనా నేవీలో భాగం కానున్నాయి.

అపరిమిత వనరులు, అతిపెద్ద సైన్యం ఉన్న చైనాను ఎదుర్కోవాలంటే, తైవాన్ అసమాన యుద్ధ వ్యూహాలతోపాటుగా చురుకైన రక్షణ దళాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

"చైనాతో పోలిస్తే తైవాన్ సైన్యం చిన్నదిగా కనిపించినా, ఈ జలాంతర్గాములతో ప్రత్యర్థి ఊహలకు అందని రీతిలో గెరిల్లా తరహా దాడులు చేయడం సాధ్యం’’ అని తైవాన్ లోని ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రీసెర్స్‌లోని మిటలరీ పరిశోధకులు విలియమ్ చుంగ్ అన్నారు.

చైనాతో ఘర్షణ యుద్ధంగా మారితే, తైవాన్‌తో పాటు ఫిలిప్పీన్స్, జపాన్ దీవులను కలుపుతున్న ఫస్ట్ ఐలండ్ చైన్‌గా పిలిచే వివిధ జలసంధులు, కాలువల్ని కాపాడుకునేందుకు ఈ జలాంతర్గాముులు ఉపయోగపడతాయని ఆయని అన్నారు.

సబ్ మెరైన్లతో దాడులు చేయడంలో చైనా నేవీ బలహీనంగా ఉందని, తైవాన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

యుద్ధం ఎక్కడ జరుగుతుంది?

సబ్‌మెరైన్లు ప్రభావంతంగా పనిచేసే తైవాన్ తూర్పు తీరప్రాంతంలోని లోతైన సముద్ర జలప్రాంతాలలో చైనా, తైవాన్ నావికాదళాలు తలపడకపోవచ్చని మాజీ యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ అధికారి, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ విజిటింగ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో డ్య్రూ థాంప్సన్ విశ్లేషించారు.

కానీ చైనా భూభాగానికి ఎదురుగా ఉండే పశ్చిమ తీర ప్రాంతంలో లోతులేని సముద్రజలాలే వీటి పోరాటానికి ప్రధాన వేదిక అవుతాయని తెలిపారు.

"సబ్ మెరైన్లు చైనా సైనిక చర్యలను క్లిష్టతరం చేసే ప్రభావాన్ని చూపించగలవే కానీ, ఇవే నిర్ణయాత్మకమైనవి కావు అని, తైవాన్ సబ్ మెరైన్లను ఎలా మోహరిస్తుందనేదానిపైనే వాటి ప్రభావం ఆధారపడి ఉంటుందని విశ్లేషించారు.

తైవాన్ సబ్ మెరైన్లు దాడుల నిరోధక వ్యవస్థగా పనిచేయడమే కాక, చైనా నౌకలపై మెరుపుదాడులు చేయడం, పోర్టుల విధ్వంసం, సముద్రజలాల్లో నూనె సరఫరాకు ఆటంకం కలిగించడం, చైనా తీరప్రాంతాలలో కీలక వసతులను ధ్వంసం చేయడానికి కూడా ఉపయోగించవచ్చని తైవానీస్ థింక్ ట్యాంక్ నేషనల్ పాలసీ ఫౌండేషన్ లోని డిఫెన్స్ పరిశోధకుడు చియ్ చుంగ్ విశ్లేషించారు.

తైవాన్ తన సొంత సబ్ మెరైన్‌ను డిజైన్ చేసుకుని రూపొందించుకోవడం అతి ముఖ్యమైన విషయమని ఆయన పేర్కొన్నారు.

'హైకూన్' సబ్ మెరైన్ అమెరికా డిఫెన్స్ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించిన యుద్ధ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది. అయితే ఈ విషయమేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే అమెరికా తైవాన్‌కు స్నేహహస్తం అందిస్తోన్న కీలక దేశం. అమెరికా, యూకెలతోపాటు కనీసం ఆరుదేశాలు తైవాన్‌కు విడిభాగాలు, సాంకేతికత, మేథోసాయం చేయడానికి ముందుకు వచ్చాయని రాయ్‌టర్స్‌ రిపోర్ట్ చేసింది.

తాను వ్యక్తిగతంగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఇండియాలోని మిలటరీ అధికారులను కలిసి సాయం కోరినట్లు నిక్కీ ఆసియా మీడియాతో తైవాన్ అడ్మిరల్ హౌంగ్ చెప్పారు. కానీ ఏ దేశం ఇందుకు అంగీకరించిందనే విషయం స్పష్టంగా చెప్పలేదు.

"తైవాన్ మిలటరీ విస్తరణకు కావాల్సిన వాటిని సరఫరా చేయడానికి దేశాలుకానీ, కంపెనీలు కానీ భయపడటం లేదనేది నిజం. భౌగోళిక రాజకీయాలలో వస్తున్న మార్పుకు ఇది సంకేతం" అని థాంప్సన్ చెప్పారు.

అంతర్జాతీయ సమాజంలోని కొందరికి చైనాపై ఉన్న సందేహాలు, అసంతృప్తికి ఇదో తార్కాణంతోపాటు చైనా అశాంతికి కారణమైందని చుయ్ విశ్లేషించారు.

తైవాన్ సబ్ మెరైన్ ఆవిష్కరణ జరిగిన ఒకరోజు తరువాత తైవాన్, వేర్పాటు వాదుల అహంకారానికి గట్టి బదులు ఇచ్చేలా ఈ నెలలో సైనిక విన్యాసాలు చేస్తామని బీజింగ్ వెల్లడించింది.

చైనా ఇటీవలే తైవాన్ జలాల్లో యుద్ధనౌకల ప్రదర్శనతోపాటు తైవాన్ ద్వీప గగనతలంలోనూ వైమానిక విన్యాసాలు చేసింది.

తైవాన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 2021 అక్టోబర్ 10న జరిగిన తైవాన్ జాతీయ దినోత్సవ వేడుకలు

2027లోనే తైవాన్ ఆక్రమణ?

యూఎస్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు చైనా తైవాన్‌ను ఆక్రమించే అవకాశం ఉందంటూ పలు సమయాలను పేర్కొంటున్నారు.

వీటిలో 2027 నాటికల్లా తైవాన్‌ను ఆక్రమించుకునేలా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని మిలటరీ విభాగాన్ని అదేశించారన్న సమాచారం కూడా ఒకటి.

దీనిని బట్టి తైవాన్‌ను ఆక్రమించుకోవాలని జిన్ పింగ్ నిర్ణయించినట్లుగా అనుకోకూడదని సీఐఏ డైరెక్టర్ విలియమ్ బర్న్స్ అన్నారు. ఈ విషయంలో చైనా విజయం సాధిస్తుందా లేదా అనే సందేహం తనకు ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)