నిఖత్ జరీన్: ‘చల్.. శక్తి హై.. ఔర్ జాన్ లగా’ అంటూ ఈ అమ్మాయి బాక్సింగ్‌లో ఎలా ఎదిగిందంటే..

ఫొటో సోర్స్, @Media_SAI
ఏషియన్ గేమ్స్‌లో భారత బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కాంస్య పతకం సాధించింది.
నిఖత్ జరీన్ 12 ఏళ్ల వయసులో తెలంగాణలోని నిజామాబాద్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొన్నారు. అప్పుడు ఆమె యువ రన్నర్.
కానీ, ఆమె కళ్లు మరో ఆటపై పడ్డాయి. అప్పుడే పక్కనున్న తన తండ్రితో
"నాన్న, బాక్సింగ్ కేవలం అబ్బాయిల కోసమేనా? వాళ్లే చేస్తారా?" అని అడిగింది చిన్నారి నిఖత్.
ఈ అమాయకమైన ప్రశ్నతోనే నిఖత్‌కు బాక్సింగ్‌తో బంధం మొదలైంది.
అప్పటినుంచి ఆటలో అంచెలంచెలుగా ఎదిగిన ఈ నిజామాబాద్ అమ్మాయి, వరుసగా రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది.
మహిళల బాక్సింగ్ సీనియర్ విభాగంలో దిగ్గజ మేరీ కోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ ఘనత సాధించింది.
నిజామాబాద్‌లో పుట్టిపెరిగిన నిఖత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు.
నిఖత్ తండ్రి క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆ ఆసక్తే ఆయన నలుగురు కూతుళ్లలో ఇదర్ని క్రీడాకారిణులుగా తయారు చేసేలా చేసింది.
నిఖత్ ఇద్దరు అక్కలు ఫిజియోథెరపిస్టులు కాగా, చెల్లి బ్యాడ్మింటన్ ఆడతారు. క్రీడల్లో శిక్షణకు అనుకూలంగా ఉండడం కోసం వారు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు.

ఫొటో సోర్స్, @NIKHAT_ZAREEN
బాక్సింగ్ ప్రస్థానం మొదలైందిలా
నిజామాబాద్ పట్టణంలో కలెక్టరేట్ గ్రౌండ్‌లో 100, 200, 300 మీటర్ల పరుగు ప్రాక్టీస్ చేసేది నిఖత్. ఆమెను గొప్ప అథ్లెట్‌గా తీర్చిదిద్దాలన్నది తండ్రి జమీల్ కల.
రోజూ గ్రౌండ్ తీసుకెళ్లి, తీసుకువస్తుండేవారు తండ్రి. స్ప్రింట్ ప్రాక్టీస్ చేస్తోన్న నిఖత్ అదే గ్రౌండ్‌లో జరుగుతోన్న బాక్సింగ్ ట్రైనింగ్ కూడా గమనించేది. అక్కడ చాలా మంది అబ్బాయిలు శిక్షణ తీసుకుంటున్నారు. ఒకరోజు ఆ శిక్షణ సాగుతున్నపుడు తాను బాక్సింగ్ నేర్చుకుంటాను అని అడిగింది తండ్రిని.
''ఆమె అడిగిన తరువాత నేను బాక్సింగ్ గురించి ఆలోచించాను. దానికి చాలా ధైర్యం కావాలి. అది మగ పిల్లల ఆట. రఫ్ గేమ్. నేను అదే విషయం మా అమ్మాయికి చెప్పాను. దెబ్బలు తగులుతాయి. దెబ్బల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి (పరోక్షంగా పెళ్లి ప్రస్తావిస్తూ). చాలా పవర్ కావాలి అని చెప్పాను.
తను మాత్రం కష్టపడతాను అంది. అప్పటికే కొన్ని రోజులుగా గమనించిందేమో, బాక్సింగ్ నేర్చుకుంటాను అని చెప్పింది. నేను వెంటనే ఒప్పుకున్నాను. 'బాక్సింగ్ ఎందుకు? ఆమెను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?' అని బంధువులూ, బయటి వారు కూడా అన్నారు.
కానీ ఆమెను క్రీడల్లోకి పంపాలన్నది నా నిర్ణయం. నేను పట్టుదలతో ఉన్నాను. ఏదో ఒకరోజు ఆమె ఒలింపిక్స్ ఆడాలని నా ప్రణాళిక. కచ్చితంగా అక్కడ కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ముస్లిం కుటుంబం కావడం వల్ల నిక్కరు, టీషర్టులో అమ్మాయిని గ్రౌండుకు తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉండేది’’ అంటూ నిఖత్ బాక్సింగ్ ప్రస్థానం మొదలైన విధానాన్ని వివరించారు ఆమె తండ్రి జమీల్.

ఫొటో సోర్స్, Facebook/Nikhat Zareen
ఏడాది శిక్షణతోనే జాతీయ స్థాయిలో పతకాలు
నిఖత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ తన కుమార్తెను బాక్సింగ్‌లో ప్రోత్సహించి స్వయంగా తనే ఒక ఏడాది పాటు శిక్షణ ఇచ్చారు.
తరువాత 2009లో విశాఖపట్నానికి చెందిన ద్రోణాచార్య అవార్డీ ఐవీ రావు దగ్గర ఆమె శిక్షణ పొందింది.
కట్ చేస్తే, ఏడాది తిరిగేలోగానే బాక్సింగ్‌లో మంచి నైపుణ్యంతో జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది నిఖత్ జరీన్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌కి ఎంపిక అయింది.
2010లో జాతీయ స్థాయి పోటీల్లో కాంస్యం, స్వర్ణ పతకాలను సాధించింది. ఆ మరుసటి ఏడాదే తుర్కియేలోని అంటాల్యాలో జరిగిన అంతర్జాతీయ విమెన్స్ యూత్ అండ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలవడం ఆమె కెరీర్‌లో తొలి పెద్ద అడుగు.
అదే జోరులో 2022లో తొలిసారి, 2023లో రెండోసారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
సవాళ్లు
2011లో జూనియర్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌గా నిలిచిన నిఖత్ జరీన్... 2022లో మహిళా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించారు. 2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఫ్లై వెయిట్ కేటగిరీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. భారత్‌లో నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో కూడా బంగారు పతకాన్ని నెగ్గి 2022 ఏడాదిని అత్యంత విజయవంతంగా ముగించారు.
2023 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌కు అత్యంత కఠినమైన సవాళ్లు ఎదురయ్యాయి.
నిఖత్ తను పోటీ చేస్తున్న వెయిట్ కేటగిరీని 52 కేజీల నుంచి 50 కేజీలకు మార్చుకుంది. ఈ వెయిట్ కేటగిరీ విభాగంలో ఆమె అన్ సీడెడ్ ప్లేయర్.
అయినప్పటికీ నిఖత్ వరుసగా రెండో ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కి చేరింది. సెకండ్ రౌండ్‌లో ప్రత్యర్థి విసిరిన పంచ్‌కి నిఖత్ పైపెదవికి గాయమైనా పోరాడింది.
''పై పెదవి నుంచి రక్తం కారుతోంది. అలాంటి సమయంలో డాక్టర్‌ను పిలవాల్సి ఉంది. గేమ్‌ను కూడా కొద్దిసేపు ఆపాల్సి ఉంటుంది. కానీ, నేను రిస్క్ తీసుకోవాలనుకోలేదు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నా. చల్ నిఖత్, శక్తి హై.. ఔర్ జాన్ లగా అని నాకు నేనే చెప్పుకున్నా. ఇదే చివరి మ్యాచ్. నాకు ఊపిరి ఉంటే ఏం చేయాలనుకుంటున్నానో అదే చేశాను" అని మ్యాచ్ పూర్తయిన తర్వాత నిఖత్ అన్నారు.
ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ వెనుదిరిగి చూసుకోలేదు. విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.
నిఖత్ జరీన్ వరుసగా రెండుసార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఒకప్పుడు బాక్సింగ్ బాయ్స్ కేనా అని తండ్రిని అమాయకంగా అడిగిన నిఖత్, ఇంతకంటే మంచి సమాధానం ఏం ఇస్తుంది.?

ఫొటో సోర్స్, NIKHAT_ZAREEN/TWITTER&GETTYIMAGES
మేరీ కోమ్‌తో బాక్సింగ్ వివాదం
తన కెరీర్ తొలినాళ్లలో మేరీ కోమ్ ప్రభావంతో నిఖత్‌కు అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ తనకు వచ్చిన అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ రాటుదేలింది.
2000వ సంవత్సరంలో మేరీ కోమ్ రాష్ట్రస్థాయి చాంపియన్ అయ్యేప్పటికి నిఖత్ నాలుగేళ్ల చిన్నారి. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఇద్దరూ ఒకే బాక్సింగ్ రింగులో తలపడ్డారు.
ఒలింపిక్స్ ఎంపిక విషయంలో తనకూ సమాన అవకాశం ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసింది నిఖత్. తనకు ఆదర్శం మేరీ కోమ్ అని చెప్పింది. అదే సందర్భంలో క్రీడల్లో ఫెయిర్ చాన్స్ ఇవ్వాలని కోరింది. చివరకు మ్యాచ్ ఏర్పాటు చేశారు. మేరీ చేతిలో నిఖత్ ఓడిపోయింది.
ఆ మ్యాచ్ విషయంలో కూడా వివాదాలు వచ్చాయి. మ్యాచ్ అయ్యాక నిఖత్‌కి హగ్, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మేరీ. ఆమెను గౌరవించాలంటే, ముందు ఆమె ఇతరులను గౌరవించాలని మీడియాతో వ్యాఖ్యానించారు మేరీ కోమ్.
మీద పడింది. కానీ ఆమెకు అత్యంత కఠినమైన సవాళ్లు ఎదురయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- మహిళా రిజర్వేషన్ : 'ఒక స్త్రీ ఎదుగుతుంటే ఏ పురుషుడూ సహించడు'
- తెలంగాణ: '10 నెలలుగా మాకు జీతాల్లేవ్, నాన్న వికలాంగ పెన్షనే మాకు దిక్కు’ అంటున్న ఉత్తమ ఉద్యోగి..
- పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకొని కాలి నడకన భారత్ చేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కథ..
- రైలు ప్రమాదాలు: బాధితులకు పరిహారాన్ని 10 రెట్లు పెంచిన రైల్వే బోర్డు.. నిబంధనలు ఇవీ
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














