హైదరాబాదీ హలీమ్‌కు ఫిదా అయిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం... ఈ టీమ్ మెన్యూలో ఇంకా ఏమేం ఉన్నాయి?

ఫొటో సోర్స్, RAMESH KUMAR
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్రికెట్ ప్రపంచ కప్ పోటీల కోసం భారత్ వచ్చిన పాకిస్తాన్ జట్టు శనివారం హైదరాబాద్‌లో పర్యటించింది. నగరంలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లి అక్కడి రుచులను ఆస్వాదించింది. పాకిస్తాన్ జట్టు ఆదివారం మూడు గంటల పాటు ప్రాక్టీస్‌లో పాల్గొంది.
హైదరాబాద్‌లో సరదాగా బయటకు వెళ్ళి రెస్టారెంట్‌లో వంటకాలు రుచిచూస్తున్న వీడియోను పాకిస్తాన్ క్రికెట్ టీమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులు శనివారం రాత్రి డిన్నర్ చేసేందుకు గోల్కొండ రిసార్ట్‌లోని జ్యూయల్ ఆఫ్ నిజామ్ రెస్టారెంట్‌కి వెళ్లారు. ఇది వారు బస చేస్తున్న హోటల్‌కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అంతకుముందే పాకిస్తాన్ జట్టు ఆ రిసార్ట్‌లో డిన్నర్ బుక్ చేసుకుంది. వారి కోసం రెస్టారెంట్ ప్రత్యేకమైన మెనూ కూడా సిద్ధం చేసింది.

ఫొటో సోర్స్, JEWEL OF NIZAM
పాకిస్తానీ ఆటగాళ్లు ''సికందరీ రాన్'' వంటకాన్ని బాగా ఇష్టపడ్డారని రిసార్ట్ మేనేజర్ రమేష్ కుమార్ బీబీసీతో చెప్పారు. పొట్టేలు తొడ మాంసంతో దీన్ని తయారు చేస్తారని ఆయన చెప్పారు.
అలాగే, 'పత్తర్ గోష్ట్'ని కూడా పాకిస్తానీ క్రికెటర్లు ప్రశంసించారని, దీనిని రాయిపై వండుతారని రమేష్ చెప్పారు.
హైదరాబాద్ హలీమ్‌ని కూడా ఎక్కువ మంది ఇష్టపడ్డారు.

ఫొటో సోర్స్, @BABARAZAM258
బాబర్ అజాం ఏం తిన్నారు?
పాకిస్తానీ క్రికెటర్లు హలీమ్‌పై మక్కువ చూపారని రమేష్ చెప్పారు. బాబర్ అజాం, రిజ్వాన్, షాహీన్ సహా మరికొందరు హలీమ్ తీసుకురావాలని మళ్లీ అడిగి తెప్పించుకున్నారని ఆయన తెలిపారు.
తెల్ల ఉల్లిపాయలతో చేసిన తియ్యని 'అనోఖి ఖీర్'ని పాకిస్తాన్ క్రికెట్ టీం సభ్యులు బాగా ఇష్టపడ్డారని రమేష్ చెప్పారు.
డిన్నర్ సందర్భంగా పాకిస్తానీ క్రికెటర్లు రెస్టారెంట్ సిబ్బందితో సరదాగా మాట్లాడారు. హైదరాబాద్ నిజాం నవాబు, ఆయన కుటుంబం గురించి తెలుసుకునేందుకు వారు ఆసక్తి చూపించారు.
నిజాం కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉంటోంది, ఏం చేస్తోందనే విషయాలపై ఆటగాళ్లు ఆరా తీశారు. డిన్నర్‌లో జోకులేసుకుంటూ సరదాగా గడిపారు.
పాకిస్తాన్ జట్టు డిన్నర్ ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో, రిసార్ట్‌లో ఉన్న కొద్దిమంది అతిథులు వారిని అడిగి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై ఇరుదేశాల క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
పాకిస్తాన్ జట్టుకు ఆతిథ్యమిచ్చిన రమేష్ కుమార్, అక్కడి సిబ్బంది కూడా ఈ విషయంలో అంతే ఉత్సాహంగా ఉన్నారు. అయితే, అతిథి జట్టుకు టీమిండియా గ్రౌండ్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని రమేష్, అక్కడి సిబ్బంది కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, RAMESH KUMAR
ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా భారత్
ఇటీవలి వరకూ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. అయితే, ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో దిగజారింది.
దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటన కోసం సెప్టెంబర్ 27న హైదరాబాద్ చేరుకున్న పాక్ జట్టుకు ఘన స్వాగతం లభించింది.
భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకూ మూడు యుద్ధాలు జరిగాయి. ఇరుదేశాల మధ్య ఎప్పుడూ పోటీ నెలకొని ఉంటుంది. క్రికెట్‌లోనూ అదే స్థాయిలో పోటీ ఉంది.
ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. మ్యాచ్ దగ్గరపడేకొద్దీ వాతావరణం కూడా వేడెక్కుతూ ఉంటుంది.
పాకిస్తాన్ జట్టు ఎప్పుడు భారత్ వచ్చినా, ఆ జట్టుకు సంబంధించిన విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. దానితో పాటు మ్యాచ్‌పై ఉత్కంఠ కూడా పెరుగుతుంది.

ఫొటో సోర్స్, RAMESH KUMAR
'భారత్ గెలవాలి'
డిన్నర్ సమయంలో పాకిస్తానీ క్రికెటర్లు భారత్‌తో మ్యాచ్ గురించి ఏమైనా మాట్లాడుకున్నారా? అనే ప్రశ్నకు రమేష్ సమాధానమిస్తూ, క్రికెట్ గురించి చాలా తక్కువగా మాట్లాడుకున్నారని, వంటకాల గురించే ఎక్కువగా మాట్లాడారని చెప్పారు.
పాక్ జట్టు సభ్యులు హుందాగా నడుచుకున్నారని రమేష్ చెప్పారు. అయితే, మ్యాచ్‌లో భారత్ గెలవాలని ఆయన కోరుకుంటున్నారు.
అతిథులకు గ్రౌండ్‌లో ఓటమి రుచి చూపించాలని ఆయన కోరుకుంటున్నారు. పాక్ జట్టుకు వంట చేసి పెట్టిన చెఫ్ కోరిక కూడా అదే.
పాక్ క్రికెటర్లు షాహిన్ అఫ్రీది, బాబర్ అజాంకి అభిమాని అయిన రమేష్ వారితో ఫోటోలు తీసుకున్నారు. అందుకు వారు అడ్డుచెప్పలేదు.
జ్యూయల్ ఆఫ్ నిజామ్ రెస్టారెంట్ అందించిన మెనూలో బీఫ్ వంటకాలు లేవు. ఫిష్, చికెన్, మటన్ వంటకాలే ఎక్కువగా ఉన్నాయి. మంసాహార వంటకాలపై పాకిస్తానీ క్రికెటర్లు ఆసక్తి చూపించారు.
ప్రపంచ కప్ కోసం భారత్ వచ్చే ఏ జట్టు మెనూలోనూ బీఫ్ వంటకాలు ఉండవని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
రెస్టారెంట్‌లో డిన్నర్‌కి ముందు ఫలానా వంటకం కావాలని పాకిస్తాన్ జట్టు ప్రత్యేకంగా ఏదీ అడగలేదు. అయితే, ప్రాన్స్, ఇతర సీఫుడ్ వంటకాలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.
హైదరాబాద్ ఫుడ్ స్పైసీ అయినప్పటికీ, పాకిస్తాన్ జట్టు కోసం చేసిన వంటకాల్లో మాత్రం మసాలాలను కాస్త తగ్గించారు.
ఇవి కూడా చదవండి:
- అజిత్ అగార్కర్: 2023 వరల్డ్ కప్ టీం ఎంపిక చేయనున్న ఈ చీఫ్ సెలక్టర్ 2003 ప్రపంచ కప్ జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడలేకపోయాడు
- మీ ఇంటికి పావురాలు వస్తున్నాయా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే..
- అంతరిక్షంలో ఏడాది గడిపితే శరీరానికి ఏమవుతుంది?
- ‘‘చంపేసినా సరే పాకిస్తాన్‌లోనే ఉంటాం..’’ అని ఈ భారతీయులు ఎందుకు అంటున్నారు
- రోహిత్ శర్మ: 35 ఏళ్ల ఈ ‘డాడీస్ ఆర్మీ’ కెప్టెన్‌ను తీసేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు















