ఏలియన్లను ఎప్పుడు కనిపెడతాం? వారికి ఇంకెంత దూరంలో ఉన్నాం?

ఫొటో సోర్స్, ESA
- రచయిత, పల్లబ్ ఘోష్
- హోదా, సైన్స్ కరస్పాండెంట్
విశ్వంలో ఏలియన్లు ఉన్నారా అనే ప్రశ్నను ఖగోళ నిపుణులు ఇప్పుడు అడగడం లేదు. ప్రస్తుతం వారి మెదళ్లలో ఉన్న ప్రశ్న ఏమిటంటే.. ‘‘ఎప్పుడు వారిని కనిపెడతాం?’’
మన జీవితం కాలంలోనే గ్రహాంతరవాసులను కనిపెడతామని చాలా మంది ఆశాభావంతో ఉన్నారు. మరికొందరైతే మరికొన్నేళ్లలో వారిని కనిపెట్టొచ్చని అంటున్నారు.
బృహస్పతి (జూపిటర్) గ్రహంపై పరిశోధన చేపడుతున్న బృందానికి నేతృత్వం వహిస్తున్న ఓ ఖగోళ శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘‘బృహస్పతి చంద్రుళ్లలో జీవం జాడ కనిపించకపోతేనే మనం ఆశ్చర్యపోవాలి’’ అన్నారు.
సౌర వ్యవస్థకు వెలుపలి ఓ గ్రహం మీద జీవుల మనుగడ ఉండొచ్చనే సంకేతాలను ఇటీవల నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) కూడా కనిపెట్టింది.
శాస్త్రీయ పరిశోధనల్లోనే అతిపెద్ద ప్రయోగంగా చెప్పుకునే ఈ గ్రహాంతర వాసుల అన్వేషణ కోసం చాలా మిషన్లను ప్రస్తుతం చేపడుతున్నారు. మరికొన్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు.
‘‘మనం అనంత విశ్వంలో జీవిస్తున్నాం. ఇక్కడ లెక్కలేనన్ని నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. కాబట్టి మనం మాత్రమే ఈ విశ్వంలో జీవిస్తున్నామని అనుకోవడం పొరపాటే అవుతుంది’’ అని స్కాట్లండ్ ఆస్ట్రానమర్ రాయల్‌కు చెందిన ప్రొఫెసర్ క్యాథరీన్ హేమన్స్ చెప్పారు.
‘‘ప్రస్తుతం మన దగ్గర టెక్నాలజీ ఉంది. కనిపెట్టే శక్తి కూడా ఉంది. ఈ విశ్వంలో మనలా ఇంకెవరైనా ఉన్నారో లేదో కనిపెట్టేందుకు ఇదే సరైన సమయం’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, NASA
‘‘గోల్డీలాక్స్ జోన్’’
సుదూర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల వాతావరణాన్ని ప్రస్తుతం టెలిస్కోప్‌లు విశ్లేషించగలుగుతున్నాయి. భూమిపై కేవలం జీవులు మాత్రమే ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను కూడా కనిపెట్టగలిగే శక్తి మనకు ఉంది.
అయితే, ఈ అసాధారణ అన్వేషణకు సంబంధించిన కొన్ని సంకేతాలు సెప్టెంబరు నెల మొదట్లో మనకు అందాయి. భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో కే2-18బీగా పిలిచే ఓ గ్రహం వాతావరణంలో ఓ గ్యాస్ సంకేతాలు కనిపించాయి. భూమిపై కేవలం కొన్ని సముద్రపు జీవులు మాత్రమే ఈ గ్యాస్‌ను ఉత్పత్తి చేయగలవు.
ఆ గ్రహం పైగా ‘గోల్డీలాక్స్ జోన్’లో ఉంది. అంటే తాను తిరుగుతున్న నక్షత్రానికి మరీ అంత దగ్గరగా లేదు. అలానే దూరంగా లేదు. ఈ జోన్‌లో తిరిగే గ్రహాలపై ఉష్ణోగ్రతలు ద్రవరూపంలో నీరు ఉండేందుకు అనుకూలంగా ఉంటాయి. జీవం మనుగడకు ఇది చాలా ముఖ్యం.
ప్రస్తుతం కనిపించిన ఆ సంకేతాలను ధ్రువీకరించుకునేందుకు ఒక ఏడాది వరకూ సమయం పట్టొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ నిక్కు మధుసూధన్ మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ అక్కడ జీవాన్ని కనిపెడితే మనం ఏలియన్ల కోసం చేపడుతున్న అన్వేషణలో విప్లవాత్మక మార్పులు రావచ్చు’’ అని చెప్పారు.
‘‘మనం పరిశోధన చేపడుతున్న తొలి గ్రహం మీదే జీవం సంకేతాలు కనిపెడితే, విశ్వంలో చాలా గ్రహాలపై జీవం ఉండొచ్చనే వాదన మరింత బలపడుతుంది’’ అని ఆయన అన్నారు.
రానున్న ఐదేళ్లలో ఈ పరిశోధనలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, విశ్వంపై మన అవగాహన కూడా మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు.
ఒకవేళ కే2-18బీపై వారికి జీవం కనపడకపోతే గోల్డీలాక్స్ జోన్‌లో తిరుగుతున్న మరో పది గ్రహాలపై వారు దృష్టిసారిస్తారు. ‘‘ఒకవేళ అక్కడ కూడా జీవం కనిపించకపోయినా.. ఇతర గ్రహాలపై జీవం ఉందోలేదో కనిపెట్టేందుకు అవసరమైన పరిజ్ఞానం, అవగాహన మనకు వస్తాయి’’ అని మధుసూధన్ అన్నారు.
విశ్వంలో జీవుల కోసం అన్వేషణ చేపడుతున్న చాలా మిషన్లలో మధుసూధన్ నేతృత్వంలో చేపడుతున్న ప్రాజెక్టు కూడా ఒకటి. వీటిలో కొన్ని మన సౌర వ్యవస్థలోని గ్రహాలపైనే జరుగుతున్నాయి. మరికొన్నింటిలో మాత్రం విశ్వంలోని సుదూర ప్రాంతాలపై అన్వేషణ చేపడుతున్నారు.

ఫొటో సోర్స్, NASA
నాసాకు చెందిన జేడబ్ల్యూఎస్‌టీ శక్తిమంతమైనప్పటికీ. దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. భూమికి పరిమాణంతోపాటు సూర్యుడికి దగ్గరగా ఉండటంతో జీవం మనుగడ సాధ్యమైంది. కానీ, భూమి లాంటి చిన్న గ్రహాలు విశ్వంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్నా లేదా తమ మాతృ నక్షత్రానికి ఆ గ్రహం దగ్గరగా ఉన్నా.. వాటిపై జీవం మనుగడ కనిపెట్టడం జేడబ్ల్యూఎస్‌టీ కష్టం అవుతుంది. ఇక్కడ ఆ నక్షత్రం నుంచి వచ్చే కాంతి టెలిస్కోప్‌కు ప్రధాన అవరోధంగా నిలుస్తుంది.
అందుకే హ్యాబిటబుల్ వరల్డ్స్ అబ్జర్వేటరీ (హెచ్‌డబ్ల్యూవో) పేరుతో 2030 నాటికి మరో టెలిస్కోప్‌ను పంపాలని నాసా భావిస్తోంది. హైటెక్ సన్‌షీల్డ్ టెక్నాలజీతో దీన్ని తయారుచేస్తున్నారు. ఆ నక్షత్రం నుంచి వచ్చే కాంతి ప్రభావం టెలిస్కోప్‌పై అంతగా కనిపించదు. అప్పుడు ఆ గ్రహాలపై వాతావరణాన్ని పరిశీలించేందుకు మనకు అవకాశం లభిస్తుంది.
మరోవైపు ఈ దశాబ్దం చివర్లో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ఈఎస్‌వో)కు చెందిన ఎక్స్‌ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ (ఈఎల్‌టీ)లను భూమిపై ఏర్పాటుచేస్తారు. 39 మీటర్ల వ్యాసం గల ఈ టెలిస్కోప్ ఇతర గ్రహాలపై వాతావరణాన్ని పరిశీలించేందుకు వీలుపడుతుంది.
వందల ఏళ్ల నుంచి రసాయన శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఆధారంగానే ఈ మూడు టెలిస్కోప్‌లూ పనిచేస్తాయి. అంటే కాంతి వల్ల అక్కడి పదార్థాలు ఎలా స్పందిస్తున్నాయో విశ్లేషిస్తాయి.
ఇవి చాలా కచ్చితత్వంతో పనిచేస్తాయి. వంద కాంతి సంవత్సరాల దూరంలోని ఆ గ్రహంపై వాతావరణంలో కాంతిని విశ్లేషించడం ద్వారా ఇవి ఫలితాలను ఇస్తాయి.

ఫొటో సోర్స్, ESA
మనకు దగ్గరగా ఉండేవాటిపై..
కొంత మంది పరిశోధకులు సుదూరంలోని గ్రహాలపై అన్వేషణ చేపడుతున్నారు. మరికొందరు మాత్రం మన సౌర వ్యవస్థలోని గ్రహాలపైనే దృష్టి సారిస్తున్నారు.
మన సౌర వ్యవస్థలో అతి దగ్గరగా జీవం ఉండే అవకాశమున్న ప్రాంతమంటే బృహస్పతి చంద్రుడైన యూరోపా. దీని ఉపరితలంపై కొన్ని పగుళ్లు కనిపిస్తున్నాయి. మంచుతో గట్టకట్టిన దీని ఉపరితలం కింద సముద్రాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
నాసా క్లిప్పర్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (జ్యూస్) మిషన్లు 2030 నాటికి అక్కడికి చేరుకోనున్నాయి.
2012లో జ్యూస్ మిషన్‌కు ఆమోదం లభించినప్పుడు ప్రొఫెసర్ మిషెల్ డఘెర్టీతో నేను మాట్లాడాను. అప్పుడు యూరోపియన్ మిషన్‌కు ఆమె ప్రధాన సైంటిస్టు. అక్కడ మీకు ఏదైనా జీవం కనిపిస్తుందని అనుకుంటున్నారా? అని ప్రశ్నించాను. ‘‘అక్కడ జీవం లేకపోతేనే ఆశ్చర్యపోవాలి’’ అని ఆమె సమాధానం ఇచ్చారు.
మరోవైపు నాసా కూడా డ్రాగన్‌ఫ్లై పేరుతో ఓ వ్యోమనౌకను శని గ్రహ చందమామ టైటాన్‌పై దించేందుకు ఒక మిషన్ చేపడుతోంది. కార్బన్ రసాయనాలతో అక్కడ చెరువులు, మేఘాలు ఉన్నాయి. నీటితోపాటు ఆ రసాయనాలు జీవం మనుగడలో ప్రధాన పాత్ర పోషించొచ్చు.
ప్రస్తుతం అంగారకుడిపై జీవం ఉండే అవకాశమే లేదు. కానీ, ఒకప్పుడు ఇక్కడ జీవుల మనుగడకు అవసరమైన పరిస్థితులు ఉండి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
అక్కడ నదులు ప్రవహించి ఉండేవా అనేది కనుక్కునేందుకు నాసా పర్సీవరెన్స్ రోవర్‌ను అక్కడికి పంపించారు. మరోవైపు అక్కడి శిలలను తీసుకొచ్చేందుకు 2030నాటికి మరో మిషన్‌ను కూడా చేపట్టనున్నారు.
కొంతమంది దీన్ని సైన్స్ ఫిక్షన్‌గా భావిస్తున్నారు. కానీ, ఏలియన్ రేడియో సిగ్నల్స్ కోసం దశాబ్దాల నుంచి సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ (ఎస్ఈటీఐ) లాంటి సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
అయితే, విశ్వం అనంతమైనది. మనం గాలించాల్సిన ప్రాంతాలు చాలా ఉంటాయి. కానీ, జేడబ్ల్యూఎస్‌టీ లాంటి టెలిస్కోప్‌లతో మనం ఎక్కడ దృష్టి సారించాలనే అవగాహన కాస్త మెరుగుపడింది. ఫలితంగా ఎస్‌ఈటీఐ లాంటి సంస్థల పరిశోధకు ఒక మార్గం చూపినట్లయింది.
కొత్త టెలిస్కోప్‌లతో తమ పరిశోధనల్లో చాలా మార్పులు వచ్చాయని ఎస్ఈటీఐకి చెందిన ‘కార్ల్ సాగన్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ లైఫ్ ఇన్ ద యూనివర్స్’ డైరెక్టర్ డాక్టర్ నటాలీ కార్బోల్ చెప్పారు.
‘‘జీవుల మనుగడకు సంబంధించి ఏదైనా సిగ్నల్ కోసం వెతకడానికి మన దగ్గర ప్రస్తుతం చాలా మార్గాలు ఉన్నాయి. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. మనం అర్థం చేసుకోగలిగే సిగ్నల్ కూడా రావచ్చేమో’’ అని కార్బోల్ అన్నారు.
30 ఏళ్ల క్రితం ఇతర నక్షత్రాల చుట్టు తిరిగే గ్రహాల గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ, 5,000కుపైగా అలాంటి గ్రహాల గురించి ఇప్పుడు మనకు తెలుసు.
అలానే ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనను మలుపుతిప్పే విషయాలు కనుక్కొనేందుకు అంతా సిద్ధమైందని కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సుబ్రజిత్ సర్కెర్ చెప్పారు.
‘‘మనకు జీవానికి సంబంధించిన సంకేతాలు లభిస్తే సైన్స్‌లో ఇదొక భారీ, విప్లవాత్మక ఘటన అవుతుంది. విశ్వాన్ని మనం చూసే కోణం కూడా మారుతుంది’’ అని సుబ్రజిత్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎలాంటి భోజనం వడ్డిస్తున్నారు? సోషల్ మీడియాలో చర్చకు కారణం ఏంటి?
- తెలంగాణలో పసుపు బోర్డ్ ఏర్పాటైతే రైతులకు కలిగే లాభమేంటి?
- Sexual Health: సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- ‘సెక్స్ కోరికలు పెంచే ఆ హార్మోన్ తీసుకున్నాక నాకు కొడుకు పుట్టాడు’
- పువ్వును కాయగా మార్చే యంత్రం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















