పువ్వును కాయగా మార్చే యంత్రం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నటాలీ లిస్బోనా
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్, టెల్ అవీవ్
ఉదయం పూట ఎండలో చేతిలో చిన్న యంత్రంతో అవకాడో చెట్లను శుభ్రం చేస్తూ వెళ్తున్నారు థాయ్ సేడ్. ఆయన వాటిని కృత్రిమ పరాగ సంపర్కానికి సిద్ధం చేస్తున్నారు.
సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని సామూహిక వ్యవసాయ క్షేత్రం మోషావ్ కేంద్రంగా పనిచేస్తున్న బ్లూమ్‌ఎక్స్ టెక్ సంస్థ వ్యవస్థాపకులు థాయ్ సేడ్. తేనెటీగల తరహాలో యాంత్రికంగా మొక్కల పరాగసంపర్కానికి తమ కంపెనీ ఒక మార్గాన్ని కనుగొన్నట్లు ఆయన చెప్పారు.
"మేము తేనెటీగలను భర్తీ చేయడం లేదు... దానికి బదులు, రైతులకు మరింత సమర్థవంతమైన పరాగసంపర్క పద్ధతులను అందించి, అద్దె తేనెటీగలపై ఆధారపడడాన్ని తగ్గిస్తున్నాం," అని అన్నాడు.
ప్రపంచవ్యాప్తంగా మానవులు వినియోగిస్తున్న పండ్లు లేదా విత్తనాల ఉత్పత్తి కోసం పండించే ప్రతి నాలుగు పంటల్లో, మూడు పరాగ సంపర్కంపైనే ఆధారపడి ఉంటాయి. ఈ పరాగసంపర్క భారాన్ని తేనెటీగలు మోస్తున్నాయి. అవి పెంచిన తేనెటీగలు కావొచ్చు, లేదా దాదాపు 20 వేల కంటే ఎక్కువ రకాలున్న బంబుల్ జాతి తేనెటీగలు కావొచ్చు.
అమెరికాలో పండే పండ్లు, కాయలు, కూరగాయల మొక్కల సంపర్కంలో తేనెటీగల వాటా 75 శాతం ఉంటుంది. యూరప్‌లోనూ అన్ని తేనెటీగల వాటా దాదాపు అంతే ఉంటుంది. కందిరీగలు, సీతాకోకచిలుకలు, ఇతర కీటకాలు మిగిలిన వాటాను భర్తీ చేస్తున్నాయి.
రైతుల దురదృష్టం కొద్దీ తేనెటీగల సంఖ్య తగ్గిపోతోంది. వాతావరణ మార్పులు, వాటి నివాస ప్రదేశాలు తగ్గిపోవడం, పురుగుమందుల వాడకం వంటి కారణాల వల్ల తేనెటీగలు కనుమరుగువుతున్నాయి. పరాన్నజీవి వర్రోవా డిస్ట్రక్టర్ అనే పురుగు కారణంగా యూరోప్‌లోనూ తేనెటీగలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఫొటో సోర్స్, BLOOMX
బ్లూమ్‌ఎక్స్ ప్రస్తుతం బ్లూబెర్రీస్, అవకాడో పంటలపై యాంత్రిక పరాగసంపర్క టెక్నాలజీని ఉపయోగిస్తోంది. స్థానికంగా తేనెటీగల సంఖ్య తక్కువగా ఉన్నా, ఈ సాంకేతికత వల్ల వాటి పరాగసంపర్కానికి ఎలాంటి సమస్యా ఉండదు.
సంస్థ ఉత్పత్తి చేసిన ప్రధాన యంత్రం "రోబీ". ఇది చూడడానికి పెద్ద లాన్‌మూవర్‌లా కనిపిస్తుంది. దీనికి రెండువైపులా చేతుల్లాంటి ఏర్పాట్లు ఉంటాయి.
వైబ్రేట్ అవుతూ ఉండే రోబీ చేతులు బ్లూబెర్రీ మొక్కలను బ్రష్ (శుభ్రం) చేస్తాయి. దానివల్ల వాటి నుంచి పుప్పొడి విడుదలవుతుంది. బ్లూబెర్రీ మొక్కల పరాగ సంపర్కానికి అనుకూలంగా తేనెటీగలు ఏస్థాయిలో మొక్కలను కంపిస్తాయో(వైబ్రేట్), అదే తరహాలో, అదే కంపన స్థాయి ఉండేలా రోబీ చేతులను రూపొందించారు.
బ్లూమ్‌ఎక్స్ రూపొందించిన మరో యంత్రం "క్రాస్‌బీ’’. చేతితో ఆపరేట్ చేసే ఈ సాధనం అవకాడో చెట్ల మధ్య అంటుకున్న పుప్పొడి రేణువులను సేకరించి, వ్యాప్తి చేస్తుంది. ఈ యంత్రాలను ప్రస్తుతం దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, అమెరికా, ఇజ్రాయెల్‌లలో ఉపయోగిస్తున్నారు. వాటి వల్ల పండ్ల దిగుబడి 30% పెరుగుతుందని బ్లూమ్‌ఎక్స్ చెబుతోంది.
ఈ రెండు పరికరాలనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ని మొబైల్ ఫోన్ యాప్‌తో అనుసంధానం చేసి నియంత్రించొచ్చు. వాటికి అమర్చిన జీపీఎస్ సాధనాల సాయంతో పొలంలో ఏయే ప్రాంతాల్లో పరాగ సంపర్కం జరిగిందో పొలంలో పనిచేస్తున్నవారు తెలుసుకోవచ్చు.
మనకు కావలసిన రోజులలో పరాగసంపర్కం జరిగేలా వాటికి సెన్సార్లను కూడా అమర్చుకోవచ్చు.

ఫొటో సోర్స్, BLOOMX
కాలిఫోర్నియాలో బాదం చెట్ల పెంపకం భారీ వ్యాపారం. ప్రపంచంలోని బాదం పప్పులో 80% ఈ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతోంది. కాలిఫోర్నియా బాదం పరిశ్రమ విలువ ఏడాదికి దాదాపు 86 వేల కోట్ల రూపాయలు ఉంటుంది.
కాలిఫోర్నియాలోని 13 లక్షల ఎకరాల్లో సాగవుతున్న బాదం చెట్లు మొగ్గతొడిగే సీజన్‌లో అమెరికా నలుమూలల నుంచి ట్రక్కుల్లో తేనెటీగలను అక్కడికి తరలిస్తారు. అమెరికాలోని వాణిజ్య (అద్దె) తేనెటీగల్లో 70 శాతం తేనెటీగలను అందుకోసమే ఈ రాష్ట్రానికి తరలిస్తారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దీని వల్ల మిగిలిన ప్రదేశాల్లో ఇతర పంటలకు తేనెటీగల కొరత ఏర్పడవచ్చని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ ఉద్యానవన శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ లీసా వాస్కో డీవెటర్ అంటారు. కృత్రిమ పరాగసంపర్కం ఈ కొరతను తీర్చడంలో సహాయపడొచ్చు.
"రవాణా వల్ల తేనెటీగలపై ఒత్తిడి పెరిగి, వాటి నివాస ప్రదేశాలు తగ్గే అవకాశముంది. అయితే, బాదంపువ్వులకు పరాగసంపర్కం చేసే వ్యాపారంతో తేనెటీగల పెంపకందారుల ఆదాయం పెరిగి, ఆర్థికంగా లాభపడే అవకాశం మాత్రం ఉంది" అని ఆమె అన్నారు.
"అయితే, కాలిఫోర్నియా బాదం సమయంలోనే ఇతర పంటలు కూడా పరాగసంపర్కానికి వస్తే తేనెటీగల కొరత వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.''
బాదం తోటల్లో తేనెటీగల మరణాల రేటు అధికంగా ఉందని, పురుగు మందులు, వేల కిలోమీటర్ల దూరం రవాణా చేయడం వల్ల వాటిపై పడుతున్న ఒత్తిడే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు.
''అలా అద్దె తేనెటీగలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్థానికంగా ఉండే తేనెటీగలు, ఇతర కీటకాలకు ఆహారం కోసం పోటీ పెరిగి కొత్త వ్యాధులకు గురవుతున్నాయని, దాని వల్ల వాటి ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది'' అని సేడ్ తెలిపారు.

ఫొటో సోర్స్, LISA WASKO DEVETTER
బాదం తోటల్లో కృత్రిమ పరాగసంపర్కం ఈ సమస్యలకు పరిష్కారం చూపించొచ్చు. "నిజజీవితంలో అవి ఉండకూడని ప్రదేశాల్లోకి మనం తేనెటీగలను బలవంతంగా నెట్టేస్తున్నాం'' అని ఐలమ్ ర్యాన్ కూడా అభిప్రాయపడ్డారు.
ఇజ్రాయెల్‌కి చెందిన మరో కృత్రిమ పరాగసంపర్క టెక్నాలజీ సంస్థ 'ఎడెట్' చీఫ్ ర్యాన్.
ఎడెట్ కంపెనీ పుప్పొడిని పాడవకుండా చాలా ఏళ్లు నిల్వ చేయడంపై పనిచేస్తోంది. అందుకోసం పుప్పొడిని సేకరించి, ఆ తర్వాత దాన్ని వినియోగించుకునేలా యంత్రాలను అభివృద్ధి చేసింది.
"పువ్వు గర్భం దాల్చేందుకు ( ఫలదీకరణం ) సరైన సమయంలో, అత్యుత్తమ పుప్పొడిని అందిస్తాం" అని ర్యాన్ తెలిపారు. "ఆపిల్, చెర్రీస్, బాదం, పిస్తాలలో కూడా ఇలా చేయగలం. మా యంత్రాలు చాలా కచ్చితంగా ఫలదీకరణం చేస్తాయి" అని చెప్పారు.
ఎడెట్ టెక్నాలజీని కాలిఫోర్నియాలోని పిస్తా తోటల్లో ఇప్పటివరకూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు బాదం తోటలపై కూడా ప్రారంభించారు.
తేనెటీగలకు ఇది శుభవార్తని ర్యాన్ అన్నారు. "ఒకే పంట సాగు చేయడం కీటకాల వృద్ధికి మంచిది కాదు. అది వాటిని అంతం చేస్తోంది."
''తేనెటీగలను వాటికి ఇష్టంలేని పంటలపైకి వదలకుండా ఉండడం వల్ల వాటిపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో అవి వాటికి ఇష్టమైన పంటలపైకి వెళ్తాయి. వాటితో పాటు మన పండ్లు, కూరగాయల అవసరాలు కూడా తీరతాయి'' అని ఆయన వివరించారు.
"తేనెటీగల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా చూస్తే, ఈ కృత్రిమ పరాగసంపర్కం టెక్నాలజీ భారీస్థాయిలో అవసరం లేదు" అని బ్రిటీష్ బీ కీపర్స్ అసోసియేషన్ (BBKA)కు చెందిన డయాన్ డ్రింక్‌వాటర్ అంటున్నారు.
"పువ్వుల్లోని తేనె మినహా మరే ఖర్చు లేకుండానే తేనెటీగలు లక్షల ఏళ్ల నుంచి ఉచితంగా పరాగసంపర్కానికి సహాయపడుతున్నాయి'' అని ఆమె అన్నారు.
"అయితే, భారీ స్థాయిలో సాగయ్యే పంటలు ఈ వలస పరాగసంపర్కం ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి. ఇది తేనెటీగల పెంపకందారుల జీవనోపాధికి ఉపయోగపడుతుంది.’’
"బీబీకేఏ అన్ని పరాగసంపర్క కీటకాలు, ముఖ్యంగా తేనెటీగలకు ప్రాధాన్యం ఇస్తుంది. పంటల ప్రారంభ సమయంలోనే పరాగసంపర్కం చేయడం ద్వారా దిగుబడులు పెరిగేందుకు కారణమవుతాయి. అలాగే, తేనెటీగలు తమ సంతతి పెంచుకోవడానికి, శీతాకాలంలో ఆహారం కోసం పరాగసంపర్కం సమయంలో సేకరించే తేనె, పుప్పొడి కీలకం'' అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌లో కూరగాయల ధరలు పెరిగిపోవడానికి కారణం ఇదేనా
- నేపాల్ మీదుగా భారత్‌లోకి టమాటాల స్మగ్లింగ్, ఇది ఎలా జరుగుతోందంటే....
- జాజికాయ, జాపత్రి: కాకినాడలో ఖరీదైన సుగంధ ద్రవ్యాలు పండిస్తున్న రైతు ఏమంటున్నారు?
- టమోటాలు భారత్‌కు ఎలా వచ్చాయి? వీటిని తింటే చనిపోతారని ఒకప్పుడు ఎందుకు భయపడేవారు
- పలాస జీడి పప్పు: మార్కెట్లో మంచి ధర ఉన్నప్పటికీ రైతుకు మాత్రం నష్టం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














