ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న: దేశ వ్యవసాయ రంగం రూపురేఖలు మార్చిన హరిత విప్లవ పితామహుడు

ఫొటో సోర్స్, getty images
భారత దేశ హరిత విప్లవ పితామహుడని పిలిచే ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న అవార్డు ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఎక్స్ (ట్విటర్) ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
డాక్టర్ స్వామినాథన్ దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా దేశం ఆహార భద్రత, శ్రేయస్సుకు హామీ ఇచ్చిందని మోదీ కొనియాడారు.
1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో స్వామినాథన్ పుట్టారు.
దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు, అభివృద్ధికి ఆయన విశేషమైన కృషి చేశారు.
ఎక్కువ దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను వృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషి దేశ వ్యాప్తంగా తక్కువ ఆదాయం పొందుతున్న ఎంతో మంది రైతుల జీవితాలను మార్చేసింది.

ఫొటో సోర్స్, getty images
కీలక బాధ్యతలు
తన జీవితకాలంలో స్వామినాథన్ చాలా పదవులు నిర్వహించారు.
1961-72 మధ్య కాలంలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
1972-79 మధ్యకాలంలో ICAR డైరక్టర్ జనరల్‌గా పనిచేశారు.
1979-80లో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
1980-82 మధ్యకాలంలో ప్లానింగ్ కమిషన్ సభ్యుడు (సైన్స్ అండ్ అగ్రికల్చర్)గా, డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారు.
1982-88 మధ్యకాలంలో ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్ జనరల్‌గా పనిచేశారు.
2004లో దేశంలోని రైతుల ఆత్మహత్యలు, ఇబ్బందులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన నేషనల్ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యారు స్వామినాథన్.
ఈ కమిటీ దేశంలోని రైతుల ఆర్థిక స్థితిగతులు, ఆత్మహత్యలు, ఒత్తిళ్లపై అధ్యయనం చేసి 2006లో నివేదిక సిద్ధం చేసింది.
సాగు సగటు ఉత్పత్తి వ్యయంలో కనీసం 50% ఉండేలా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని కమిటీ ఈ సందర్భంగా సూచించింది.
1987లో ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ పురస్కారాన్ని అందుకున్నారు.
1988లో ఎం.ఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్ (MSSRF)ను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేశారు. ఈ సంస్థ వ్యవసాయ పరిశోధనలతో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని రైతులకు సాయం చేస్తోంది.
జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు
స్వామినాథన్ దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు.
హెచ్‌కె ఫిరోడియా అవార్డ్, ది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, ఇందిరాగాంధీ ప్రైజ్ వంటి అవార్డులతోపాటు అంతర్జాతీయ అవార్డులైన రామన్ మెగసెసె, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులు అందుకున్నారు.
టైమ్ మ్యాగజైన్ ఆసియాలోని అత్యంత ప్రభావశీలురైన తొలి 20 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. వారిలో స్వామినాథన్ కూడా ఒకరు.
స్వామినాథన్ 98 ఏళ్ల వయసులో 2023 సెప్టెంబర్ 23న చెన్నైలోని స్వగృహంలో మరణించారు.
ఆయన భార్య మీనా 2022లో చనిపోయారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు సంతానం.
ఇవి కూడా చదవండి:
- ఖమ్మం రాజకీయాలు: పాలేరు మీదే అందరి చూపు ఎందుకు?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














